పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?

నులి పురుగులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఓంకార్ కర్మ్‌బేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పేగుల్లో పురుగులు చేరడం అనేది ఒక ప్రధాన సమస్య. కలుషిత ఆహారం, నీరుతో పాటు ఇతర కారణాల వల్ల కూడా శరీరంలోకి పురుగులు సంక్రమిస్తాయి.

మలంలో పొడవైన పురుగులు కనిపించడం, పొత్తికడుపు నొప్పి, మలద్వారం వద్ద దురద వంటివి వీటి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలను పరిశీలించిన తర్వాత రోగనిర్ధరణ చేస్తారు.

కడుపులో కనిపించే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని కూడా అంటారు. వీటిలో ఏలిక పాములు (రౌండ్ వార్మ్స్), పట్టీ పురుగులు (ఫ్లాట్ వార్మ్స్), నారికురుపు పురుగులు (టేప్ వార్మ్స్) అనే రకాలు ఉంటాయి.

వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలు కలిగి ఉంటుంది. మన ఆరోగ్యంపై అవి చూపించే ప్రభావాలు, వాటి జీవిత చక్రాలు కూడా వేర్వేరు.

మట్టి ద్వారా ఏలిక పాములు, కొరడా పురుగులు, కొంకి పురుగులు కడుపులోకి చేరతాయి.

వాట్సాప్ చానల్
నులి పురుగులు

ఫొటో సోర్స్, Getty Images

పురుగులు ఎలా సంక్రమిస్తాయి?

క్రిముల గుడ్లు ఉన్న ఉపరితలాలను తాకడం, చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల తరచుగా వార్మ్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

క్రిముల గుడ్లు ఉండే మట్టిని తాకడం, ఇలా కల్తీ అయిన ఆహారం, పానీయాలను తీసుకోవడం వల్ల పొట్టలోకి పురుగులు చేరతాయి.

మురుగునీటి నిర్వహణ సరిగా లేని ప్రాంతాలు, అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల కూడా ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. సరిగ్గా ఉడకని మాంసం, పురుగులు పట్టిన చేపలు తినడం వల్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. కొన్నిసార్లు పెంపుడు జంతువులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు.

చాలా మంది పిల్లల్లో నులిపురుగుల (థ్రెడ్ వార్మ్) ఇన్‌ఫెక్షన్ చూడొచ్చు. పొడవైన తాడులా ఉండే ఈ పురుగుల గుడ్లు పొట్టలోకి చేరడంతో ఇబ్బంది మొదలవుతుంది. తర్వాత ఇవి మలద్వారం వద్ద గుడ్లు పెడతాయి. దురద కలిగించడంతో పాటు చేతులకు అంటుకుంటాయి.

దుస్తులు, ఆటబొమ్మలు, టూత్ బ్రష్‌లు, వంటగది, బాత్రూం నేల, పడక గది, ఆహారంలోకి ఈ గుడ్లు వ్యాప్తి చెందుతాయి.

ఈ వస్తువులను, ఉపరితలాలను తాకిన తర్వాత అదే చేతిని నోటిలో పెట్టుకోవడం వల్ల ఇవి శరీరంలోకి చేరతాయి. నులిపురుగుల గుడ్లు దాదాపు రెండు వారాల వరకు జీవించగలవు.

పొట్టలోకి గుడ్లు చేరిన తర్వాత లార్వాగా ఏర్పడతాయి. ఒకటి లేదా రెండు నెలల్లో అవి పొడవైన క్రిములుగా మారుతాయి.

నులి పురుగులు

ఫొటో సోర్స్, Getty Images

వీటికి ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత పిల్లలు మరోసారి అలాంటి ఉపరితలాలను తాకితే మళ్లీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారు.

కాబట్టి పిల్లలు తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వారికి చేతులు కడుక్కునే అలవాటు చేయాలి.

నులిపురుగుల నిర్మూలనకు ఇలా చేయాలి

  • ప్రతీ ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి, గోళ్లు కత్తిరించుకోవాలి.
  • తినడానికి ముందు, టాయ్‌లెట్‌కు వెళ్లిన తర్వాత, పిల్లలకు న్యాపీలు మార్చాక చేతుల్ని శుభ్రపరుచుకోవాలి.
  • పిల్లలకు తరచుగా చేతుల్ని కడుక్కునే అలవాటు చేయాలి. ప్రతిరోజూ స్నానం చేయాలి.
  • పళ్లు తోమడానికి ముందు, తర్వాత బ్రష్‌లను శుభ్రంగా కడగాలి.
  • వేడినీళ్లతో టవళ్లు, బెడ్‌షీట్లను ఉతకాలి. ఆటబొమ్మలను శుభ్రంగా ఉంచాలి.
  • వంటగది, బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఈ పురుగుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

నులి పురుగులు

ఫొటో సోర్స్, Getty Images

యునైటెడ్ కింగ్‌డమ్ ఆరోగ్య సేవల సంస్థ ‘ఎన్‌హెచ్‌ఎస్’ ఈ అంశంపై కొన్ని సూచనలు జారీ చేసింది.

  • దీని ప్రకారం, ఏదైనా తినేముందు మనం చేతుల్ని తప్పకుండా శుభ్రపరుచుకోవాలి. మట్టిని తాకిన తర్వాత, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడగాలి. నీరు పరిశుభ్రంగా లేదని అనిపించిన చోట ప్యూరిఫైడ్ లేదా బాటిల్డ్ వాటర్‌ను తాగడానికి ప్రయత్నించండి.
  • బాగా కడిగిన తర్వాతే కూరగాయలు, పండ్లు తినాలి. పెంపుడు జంతువులకు వేళకు క్రిమి నిరోధక ఔషధాలను ఇవ్వాలి. వీలైనంత త్వరగా వాటి వ్యర్థాలను తీసి పడేయాలి.
  • కుక్క-పిల్లి వ్యర్థాలకు సమీపంలో పిల్లలను ఆడుకునేందుకు అనుమతించకూడదు. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు అధికంగా ఉన్న చోట అంటే అపరిశుభ్ర ప్రదేశాల్లోని పండ్లు, కూరగాయల్ని కొనకూడదు.
  • అపరిశుభ్రంగా ఉన్న చోట చెప్పుల్లేకుండా నడవకూడదు.

కడుపులోని పురుగుల్ని ఎలా గుర్తించాలి?

  • పొట్టలో పురుగులు చేరిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
  • పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు అవుతాయి.
  • చాలా మందికి డయేరియా వస్తుంది. కొంతమంది మాత్రం మలబద్ధకానికి గురవుతారు.
  • ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • బలహీనంగా మారడంతో తీవ్రంగా అలసటకు గురవుతారు.
  • మలద్వారం వద్ద దురద, నిద్రలేమి ఎదురవుతాయి. పెద్దల్లో పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. కొందరు రోగులు అనీమియాకు గురవుతారు.
డాక్టర్ రోహిత్

ఫొటో సోర్స్, RK

పొట్టలోని క్రిములను ఎందుకు నిర్మూలించాలి?

మన శరీరంలోని వివిధ రకాల క్రిములు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. చాలా రకాల సమస్యలు, ఇబ్బందులకు దారి తీస్తాయి.

అనీమియాతో పాటు పిల్లల్లో ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదంతో పాటు, అవయవాలకు నష్టం కలిగిస్తాయి.

వీటి నుంచి తప్పించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచుగా డీవార్మింగ్ (క్రిములను తొలగించుకోవడం) చేసుకోవాలని సిఫార్సు చేసింది.

ఈ క్రిములను ఎలా తొలగించుకోవాలనే అంశాన్ని బీబీసీకి డోంబివ్లీలోని మధుసూదన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ కాకు వివరించారు.

పొట్టలో క్రిములను తొలగించడానికి 12-23 నెలల శిశువులకు, ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సున్న పిల్లలకు, 5-12 ఏళ్ల బాలబాలికలకు ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ప్రివెంటివ్ కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

క్రిముల్ని ఎలా తొలగించాలి?

క్రిముల కారణంగా పిల్లల్లో, పెద్దల్లో అనేక రకాల వ్యాధుల వస్తాయని డాక్టర్ రోహిత్ చెప్పారు.

‘‘కాబట్టి ఏడాదికి రెండుసార్లు వైద్యుల సలహా మేరకు క్రిమి నివారణ మందులను తీసుకోవాలి. చిన్నారులకు రెండేళ్లు దాటినప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టొచ్చు. ఈ ప్రక్రియలో శరీరంలోని పరాన్నజీవి బయటకు వెళ్లిపోతుంది’’ అని రోహిత్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)