చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?

పురుగు చిత్రం

ఫొటో సోర్స్, BBC REEL/POMONA PICTURES

ఫొటో క్యాప్షన్, ఈ పురుగులు గాయాలకు వైద్యం చేస్తాయి
    • రచయిత, డాక్టర్ ఎరికా మెక్‌అలిస్టర్
    • హోదా, బీబీసీ రీల్ కోసం

చెంఘిజ్‌ ఖాన్‌కి, అమెరికా అంతర్యుద్ధానికి, బ్రిటన్ ఆరోగ్య విభాగానికి ఉమ్మడిగా ఉన్న అంశం ఏమిటి?

ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం.. పురుగులు.

అవును. పురుగులే.

చాలా కీటకాల తరహాలోనే ఈగలు కూడా గుడ్డు నుంచి పెరిగి ఈగగా మారటానికి లార్వా, ప్యూపా దశల నుంచి ప్రయాణిస్తుంది.

చాలా ఈగ జాతులు.. లార్వా దశలో అవి క్రిముల ఆకారంలో ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా డింభకాలు (మాగట్స్) అని పిలుస్తారు.

వాటికి శరీరం వెలుపల అవయవాలేవీ ఉండవు. వాటి ప్రధాన లక్ష్యం తాము తినగలిగనదల్లా తినటం, గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పటికన్నా 100 రెట్లు పెరగటం.

ఇక్కడ మనం.. బ్లో ఫ్లైస్, ఫ్లెష్ బ్లో ఫ్లైస్, బ్లూ ఫ్లైస్, గ్రీన్ ఫ్లైస్ అనే జాతులకు చెందిన పెద్ద ఈగల లార్వాల గురించి మాట్లాడుతున్నాం.

ఈ ఈగలు చాలా వరకూ కుళ్లిపోయిన మాంసం మీద, జంతువుల మలం మీద ముసురుతూ కనిపిస్తాయి.

కానీ ఈ ఈగల్లో కొన్ని జాతులు ఏమాత్రం హానికరం కాకపోగా.. వైద్యపరంగా అద్భుతంగా ఉపయోగపడతాయి.

చెంఘిజ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చెంఘిజ్ ఖాన్ 1206 నుంచి 1227 వరకూ పరిపాలించాడు

యుద్ధ గాయాలు

ఈ ఈగ పురుగులు మన గాయాల మీద పాకుతుండటమనే ఆలోచన ఏమాత్రం బాగుండకపోవచ్చు. కానీ, గాయాలను నయం చేయటానికి ఈగ లార్వాలను వైద్యంలో ఉపయోగించటం అనాది కాలంగా ఆచరణలో ఉంది.

చరిత్రలో అతిపెద్ద అవిచ్ఛిన్న సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంఘిజ్ ఖాన్.. యుద్ధంలో గాయపడిన తన సైనికులకు సాయం చేయటం కోసం ఒక బండి నిండా ఇలాంటి పురుగులను నింపుకుని ఆసియా అంతా సంచరించాడని కథలుగా చెప్తారు.

సైనికుల గాయాల మీద ఈ పురుగులను వదిలిపెడతారు. అవి ఆ గాయాల మాంసాన్ని భుజిస్తాయి. కానీ అవి సజీవ కణజాలాన్ని తినవు. దానిచుట్టూ పాడైపోయిన, నశిస్తున్న కణజాలాన్ని తింటాయి.

ఈ పురుగులు చెడు మాంసాన్ని తినటమే కాదు, ఆ మాంసాన్ని తినేసిన తర్వాత గాయాలను శుభ్రం చేస్తాయని చెంఘిజ్ ఖాన్‌కు, ఆయన సైన్యానికి తెలుసునని చరిత్రకారులు భావిస్తారు.

ఈ విషయం తెలిసింది కేవలం మంగోలులకు మాత్రమే కాదు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్ ప్రాంతంలోని ప్రాచీన ఆదివాసీ తెగవారైన ఎన్గియాంపాలు, మియన్మార్ ఉత్తర ప్రాంతంలోని గిరిజనులు, సెంట్రల్ అమెరికాలోని మాయా ప్రజలు కూడా ఈ డింభకాలను ఉపయోగించారని చెప్పటానికి ఆధారాలు ఉన్నాయి.

శరీరంలో పాడైపోయిన మాంసాన్ని పురుగుల సాయంతో తొలగించటం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది.

అమెరికా అంతర్యుద్ధం డ్రాయింగ్

ఫొటో సోర్స్, BBC REEL/POMONA PICTURES

అయితే, ఈ విషయాన్ని ప్రధాన స్రవంతి వైద్యశాస్త్రం చాలా కాలం పాటు పట్టించుకోలేదు.

అది మన దృష్టిని ఆకర్షించటానికి మరొక మహా యుద్ధం అవసరమైంది.

అమెరికా అంతర్యుద్ధ సమయంలో డాన్‌విల్‌లోని ఒక ఆస్పత్రిలో పనిచేసిన జాన్ ఫోర్నీ జఖరియాస్ అనే ఒక శస్త్రకారుడు ఈ అంశం మీద దృష్టి పెట్టటం ప్రారంభించారు.

ఆధునిక కాలంలో మనుషుల గాయాల మీద పాడైపోయిన మాంసాన్ని తొలగించటానికి ఉద్దేశపూర్వకంగా క్రిములను ఉపయోగించిన మొట్టమొదటి వైద్యుడు ఆయనే. దానితో అద్భుత ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు.

గాయాల మీద బ్యాక్టీరియాను కూడా ఈ క్రిములు శుభ్రం చేసినట్లు ఆయన గుర్తించారు.

కానీ రాబర్ట్ కోచ్, లూయిస్ పాశ్చర్ వంటి శాస్త్రవేత్తల కారణంగా జాన్ ఫోర్నీ కృషి ఆగిపోయింది.

గాయాల విషయంలో చాలా పరిశుభ్రత అవసరమని వారు బలంగా చెప్పే విషయానికి.. ఆ గాయాల మీద పురుగులను ఉపయోగించటం విరుద్ధంగా ఉన్నట్లు కనిపించింది.

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను ఆవిష్కరించటంతో.. పురుగుల ప్రయోగం చరిత్రకు పరిమితమైంది. ఓ చిన్న మందుబిళ్లతో కావలసిన పని జరుగుతున్నపుడు గాయాల మీద పురుగులు పాకటాన్ని ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు?

వీడియో క్యాప్షన్, చనిపోయిన వారిని బతికించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకు డెడ్‌బాడీ భద్రపరచడం ఎలా

సమర్థంగా పనిచేసే యాంటీబయాటిక్స్ 1980లలో ఒక కొత్త సైన్యంతో యుద్ధంలో ఓడిపోతున్నాయి. మెతిసిలిన్ రెసిస్టెంట్ స్టఫిలోకాకస్ ఆరియస్ (ఎంఆర్‌ఎస్ఏ) అనే బ్యాక్టిరియాను యాంటీబయాటిక్స్ ఓడించలేకపోతున్నాయి.

ఆస్పత్రిలో తయారైన ఆ సూపర్ బ్యాక్టీరియా మీద యుద్ధం చేయటానికి సరికొత్త ఆయుధం అవసరమైంది. దాంతో ఈగ పురుగులు మళ్లీ రంగంలోకి దిగాయి.

ఈ పురుగులు, గాయాల మీద పాడైపోయిన మాంసాన్ని భుజించి తొలగించటమే కాదు.. ఆ గాయాల మీదకు చేరిన ఎంఆర్ఎస్ఏ వంటి దుష్ట బ్యాక్టీరియాను కూడా ఆరగించి తమ కడుపులో అరాయించుకుంటాయి.

అవి చాలా వేగంగా పనిచేస్తాయి. చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

కాబట్టి.. బ్రిటన్ వంటి దేశాల్లో ఆ పురుగులు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి ఆరోగ్య విభాగాల ద్వారా ఈ పురుగుల సేవను అందిస్తున్నారు.

ఈ పురుగులు తమ గాయాల మీద పారాడటం చూసి తట్టుకోలేని వాళ్లకోసం.. వీటిని చిన్నపాటి టీ బ్యాగ్‌ల తరహాలో ప్యాక్ చేసి మరీ పెడుతున్నారు. ఇంతకన్నా సౌకర్యం ఏముంటుంది?

ఇవి కూడా చదవండి: