ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన రక్తాన్ని మనుషులకు ఎక్కించిన వైద్యులు.. ఈ రక్తం ఏంటి? ఎలా అభివృద్ధి చేస్తారు?

ఫొటో సోర్స్, NHSBT
- రచయిత, జేమ్స్ గళ్లఘర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ల్యాబ్‌లో పెంచిన మాంసం... ల్యాబ్‌లో రూపొందించిన అవయవాలు... ఈ జాబితాలో ఇప్పుడు రక్తం కూడా చేరుతోంది.
ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో రూపొందించిన రక్తాన్ని మనుషులకు ఎక్కించినట్లు తెలిపారు బ్రిటన్ పరిశోధకులు.
క్లినికల్ ట్రయిల్స్‌లో భాగంగా కొద్ది మొత్తంలో అంటే సుమారు రెండు స్పూన్ల రక్తాన్ని ఎక్కించారు. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన రక్తం శరీరంలోకి వెళ్లిన తరువాత ఎలా పని చేస్తుందో పరిశోధకులు గమనిస్తారు.
బ్రిటన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్‌కు చెందిన బృందంతోపాటు బ్రిస్టల్, కేంబ్రిడ్జ్, లండన్‌కు చెందిన బృందాలు ఈ ప్రాజెక్ట్ మీద కలిసి పని చేస్తున్నాయి.
ప్రస్తుతం రక్తం కావాలంటే దాతల మీద ఆధారపడటం తప్ప మరొక దారి లేదు.

ఫొటో సోర్స్, NHSBT
అరుదైన రక్త గ్రూపులు కావాలంటే కష్టం
'బాంబే బ్లడ్', 'AB-ve' వంటి అత్యంత అరుదైన గ్రూపులకు చెందిన రక్తం దొరకాలంటే చాలా కష్టమైన పని. ఇలాంటి గ్రూపులను ల్యాబ్‌లో అభివృద్ధి చేయాలనేది పరిశోధకుల ప్రధాన లక్ష్యం.
సికెల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులతో బాధపడే వారికి తరచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.
రోగి శరీరంలోని ఏ గ్రూపు రక్తం ఉందో అదే గ్రూపుకు చెందిన రక్తాన్ని ఎక్కించాలి. వేరే గ్రూపు రక్తం అయితే శరీరం ఒప్పుకోదు.
రక్తానికి సంబంధించిన కొన్ని గ్రూపులు 'చాలా చాలా అరుదుగా' ఉంటాయని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ప్రొ.యాస్లీ టోయి అన్నారు. కొన్ని గ్రూపులను అయితే 'ప్రపంచంలోని 10 మంది' మాత్రమే డొనేట్ చేయగలరు అని తెలిపారు.
ప్రపంచంలోని అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపుల్లో 'బాంబే బ్లడ్' ఒకటి. దీన్ని తొలిసారి బాంబేలో గుర్తించారు. ప్రస్తుతం బ్రిటన్ వ్యాప్తంగా ఈ రకం రక్తానికి సంబంధించి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ల్యాబ్‌లో రక్తాన్ని అభివృద్ధి చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, NHSBT
ల్యాబ్‌లో ఎలా అభివృద్ధి చేస్తారు?
ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే ఎర్రరక్త కణాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
- ముందుగా దాతల నుంచి సుమారు 470 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు.
- ఎర్రరక్త కణాలుగా మారగల శక్తి సామర్థ్యాలు ఉన్న మూల కణాలను మ్యాగ్నటిక్ బీడ్స్ సాయంతో రక్తం నుంచి సేకరిస్తారు.
- ల్యాబ్‌లో ఈ మూల కణాలను భారీ సంఖ్యలో అభివృద్ధి చేస్తారు.
- ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన మూల కణాలను ఎర్రరక్త కణాలుగా మారుస్తారు.
ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడు వారాలు పడుతుంది. ప్రస్తుతం 5 లక్షల మూల కణాల నుంచి 5,000 కోట్ల ఎర్రరక్త కణాలు వస్తున్నాయి. ఆ తరువాత అనేక దశల్లో వీటిని వడబోసి చివరకు 1,500 కోట్ల ఎర్రరక్త కణాలను సేకరిస్తారు.
ఈ 1,500 కోట్ల ఎర్రరక్త కణాలను రక్తంగా అభివృద్ధి చేస్తారు.
'రానున్న రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ రక్తం తయారు చేయాలని మేం భావిస్తున్నాం. ఒక పెద్ద మెషిన్ విరామం లేకుండా రక్తాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలన్నది నా కల' అని ప్రొ.యాస్లీ టోయి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సాధారణ రక్తం కంటే మెరుగు’
ప్రస్తుతం ఇద్దరు వాలంటీర్లకు ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన రక్తాన్ని ఎక్కించారు. ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 10 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులకు రక్తాన్ని అందిస్తారు. నాలుగు నెలలకొకసారి వీరికి 5-10 మిల్లీ లీటర్ల రక్తాన్ని ఎక్కిస్తారు. ఒకసారి సాధారణ రక్తం, మరొకసారి ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన రక్తాన్ని అందిస్తారు.
ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన రక్తంలోని కణాలను రేడియో యాక్టివ్ మెటీరియల్స్‌తో ట్యాగ్ చేస్తారు. తద్వారా శరీరంలో ఆ రక్తం ఎంత కాలం ఉంటుందో పరిశోధకులు గమనించగలుగుతారు.
సాధారణ రక్తం కంటే కూడా ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన రక్తం మరింత సమర్థవంతంగా పని చేస్తుందని భావిస్తున్నారు.
సాధారణంగా శరీరంలోని ఎర్రరక్త కణాలు దాదాపు 120 రోజుల్లో చనిపోతాయి. ఆ తరువాత వాటి స్థానంలో కొత్త వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. మనిషి నుంచి రక్తం సేకరించినప్పుడు అందులో యువ, ముసలి ఎర్రరక్త కణాలు కలిసి ఉంటాయి. అందువల్ల కొన్ని ఎర్రరక్త కణాలు చనిపోతాయి.
కానీ ల్యాబ్‌లో రూపొందించిన రక్తంలో అన్ని తాజా ఎర్రరక్త కణాలే ఉంటాయి. కాబట్టి 120 రోజుల పాటు అవి బతికి ఉంటాయి. అందువల్ల రక్తం ఎక్కువ సార్లు ఎక్కించాల్సిన అవసరం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ల్యాబ్‌లో రక్తం అభివృద్ధి చేయాలంటే ఆర్థిక, సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. బ్రిటన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్‌లో సాధారణంగా రక్తదానానికి సగటున 130 పౌండ్లు ఖర్చు అవుతోంది. కానీ ల్యాబ్‌లో అభివృద్ధి చేయాలంటే ఇంత కంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రక్తం నుంచి సేకరించిన మూల కణాలు త్వరగా చనిపోతాయి. అందువల్ల తగిన సంఖ్యలో ఎర్రరక్త కణాలను తయారు చేయలేరు. తద్వారా తక్కువ మొత్తంలోనే రక్తం అభివృద్ధి అవుతుంది. ఇది మరొక సవాలు. మానవ అవసరాలకు సరిపడా రక్తాన్ని తయారు చేయాలంటే ఇంకా ఎన్నో పరిశోధనలు చేయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- లాటరీలో రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టిన ఆటో డ్రైవర్‌కు ఊహకందని కష్టాలు
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














