సూర్యకుమార్ యాదవ్ భార్య పెట్టిన 'రూల్' ఏంటి, దాన్ని పాటించడం వల్లే అతడు ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడా?

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, DANIEL POCKETT-ICC/ICC VIA GETTY IMAGES

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత జట్టు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుంది. పెర్త్‌ వెళ్లే ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అంతకు ముందు సాయంత్రమే టీమిండియా నెదర్లాండ్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 51 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

బోర్డింగ్ టైం అయింది. తన కూతురి చేయి గట్టిగా పట్టుకుని క్యూలో నిల్చున్నాడు. సెల్ఫీ కోసం వచ్చినవారికి నవ్వుతూ ఫోజులిస్తున్నాడు.

"ఇన్నింగ్స్ చాలా బాగా ఆడావు సూర్య" అన్నాను.

"అరె..బాగా ఆడడానికే కదా వచ్చాను" అన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో ఉన్న భారత్ అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది.

బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మూడింటిలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. అవి కూడా మామూలు ఇన్నింగ్స్ కాదు, బ్యాట్ ఝళిపించాడు.

లెగ్ సైడ్ అయినా, ఆఫ్ సైడ్ అయినా సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లలో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్, బీబీసీతో మాట్లాడుతూ, "ఈ మధ్యకాలంలో సూర్యకుమార్ కంటే శక్తిమంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను చూడలేదు. అతడికి క్రికెట్ బాల్ ఫుట్బాల్ లాగ కనిపిస్తుంది కాబోలు" అన్నారు.

సూర్యకుమార్ తన బ్యాట్‌తో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. సాధారణంగా, క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ మొదలుపెట్టాక, రెండు-మూడు బంతులు సేఫ్‌గా ఆడతాడు. ఇక అప్పుడు ఒక బలహీనమైన బంతి కోసం వెయిట్ చేస్తాడు. చాలా షాట్లు లాఫ్టెడ్ లేదా 30-గజాల సర్కిల్‌ పైకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు.

బౌలర్ లయ చెడగొట్టడానికి ఇలాంటి బ్యాటింగ్ చేస్తే చాలు.

సూర్యకుమార్ యాదవ్

"స్క్రిప్ట్ రాసినట్టు ఇన్నింగ్స్"

"సూర్యకుమార్ బ్యాటింగ్ ఏదో స్క్రిప్ట్ రాసినట్టు ఉంటుందని" ఆస్ట్రేలియాలో ప్రముఖ వార్తాపత్రిక 'హెరాల్డ్ సన్'కు చెందిన క్రికెట్ రచయిత రాబ్ విటేకర్ అన్నారు.

"సూర్యకుమార్ తన కెరీర్‌లో ఏ దశలో ఉన్నాడంటే, బంతిని ఒక సెకండుకు ముందే అంచనా వేస్తున్నాడు. దాంతో, నచ్చిన షాట్ కొట్టడానికి పూర్తి సమయం దక్కుతుంది. అలాగే, మంచి టైమింగ్‌తో కొట్టవచ్చు" అని రాబ్ విటేకర్ అన్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక తరపున ఈ టోర్నమెంట్‌ను కవర్ చేస్తున్న దేవేంద్ర పాండే.. సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌ను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నారు.

"టూర్‌లో ఉన్నప్పుడు సూర్యకుమార్ భార్య కచ్చితంగా ఒక నియమాన్ని పాటిస్తారు. మ్యాచ్‌కు చాలాసేపటికి ముందే అతడి ఫోన్ తీసేసుకుంటారు. దానివల్ల అతడిపై అనవసర ఒత్తిడి ఉండదు. మానసికంగా అతడు మ్యాచ్ ఆలోచనలలో మునిగిపోతాడు. హాయిగా బ్యాటింగ్ చేస్తాడు" అని దేవేంద్ర పాండే రాశారు.

ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సూర్యకుమార్ నెట్స్‌లో కూడా ఉత్సాహంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సాధారణంగా, విరాట్ కోహ్లీ పక్క నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుంటాడు.

సిడ్నీలో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ సరదాగా మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ చేసేందుకు ఎవరికి ఎక్కువ అవకాశం వస్తుందో చూద్దాం అంటూ జోక్ చేశారు. అంతలోనే రాహుల్ ద్రవిడ్ వచ్చి నవ్వుతూ, ఇద్దరినీ రెస్ట్ తీసుకోమన్నాడు. దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్‌లను నెట్స్‌లోకి పంపాడు.

ఈ టూర్‌లో విరాట్ కోహ్లీకి ఎవరైనా పోటీగా నిలిచారంటే అది సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పుకోవాలి.

ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ స్ట్రైక్ రేట్, కోహ్లీ స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువగా ఉంది. అతడి షాట్‌లు కూడా చాలా పదునుగా ఉన్నాయి.

వసీం అక్రం

ఫొటో సోర్స్, TWITTER/WASIM AKRAM

ఫొటో క్యాప్షన్, వసీం అక్రం

వసీం అక్రం నమ్మకం

ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మాట్లాడుతూ, "నా పందెం సూర్యకుమార్ యాదవ్‌పైనే' అని చెప్పారు.

అదే జరిగింది. ఈ టోర్నీలో రోహిత్ శర్మ ఫామ్‌లో లేడు. కేఎల్ రాహుల్ కేవలం రెండు మ్యాచ్‌లలో బాగా బ్యాటింగ్ చేశాడు.

ఇన్నింగ్స్ హ్యాండిల్ చేస్తూ, స్కోర్‌ను నడిపించే బాధ్యత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ల భుజాలపై పడింది. ఇద్దరూ ఈ బాధ్యతను బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారు కూడా.

భారత బ్యాట్స్‌మెన్‌ల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు సూర్యకుమార్ పేరు టాప్‌లోనే వస్తుంది. 30 ఏళ్ల వయసులో టీంలో చేరిన తరువాత, మళ్లీ అతడు వెనక్కి తిరిగి చూడలేదు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)