లక్షలాది భక్తులు, పర్యటకులు సందర్శించే జోషీమఠ్‌లో ఇళ్లు పగిలిపోతున్నాయి ఎందుకు? - గ్రౌండ్ రిపోర్ట్

బీటలు, పగుళ్లను చూపిస్తున్న సునయన
ఫొటో క్యాప్షన్, బీటలు, పగుళ్లను చూపిస్తున్న సునయన
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బద్రీనాథ్, ఔలీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ వంటి ప్రదేశాలను సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది ప్రజలు భారత్-చైనా సరిహద్దులో ఉన్న జోషీమఠ్‌ పట్టణానికి చేరుకుంటారు. అయితే, ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో కొంతకాలంగా ఇళ్లు భూమిలోకి కుంగిపోతున్నాయని, పగుళ్లు వస్తున్నాయని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

భారతదేశంలో అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతం జోన్-5లో జోషీమఠ్‌ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ సుమారు 4,000 ఇళ్లలో 17,000 మంది నివసిస్తున్నారు. కానీ, రాను రాను ఇక్కడి జనాభా పెరుగుతోంది.

జోషీమఠ్ నుంచి కొంచెం దూరంలో, కొండ వాలులో సునీల్ అనే గ్రామం ఉంది. వాలు నుంచి కిందకు దిగి వస్తుంటే, సునయన సక్లానీ పరిచయం అయ్యారు. మమ్మల్ని వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు.

అక్కడ ఒక గది చూపించారు. నీలి రంగులో ఉన్న ఆ గది గోడలు బీటలు వారాయి. పగుళ్లు చాలా లోతుగా ఉన్నాయి. అక్కడ నిలబడడం కూడా సురక్షితం కాదు అనిపించింది.

కొన్నేళ్ల క్రితం వరకు సునయన. ఆమె చెల్లెళ్లు ఈ గదిలోనే ఉండేవారు. రెండు మంచాలు, మరో పక్క అల్మారాలో పుస్తకాలు పెట్టుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ గది పడిపోతుందేమోనన్న భయంతో మూసివేశామని ఆమె చెప్పారు.

"గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు ఇక్కడ పగుళ్లు రావడం మొదలైంది. మొదటి రోజు మామూలుగా అనిపించినా, రెండో రోజు పగుళ్లు చూడగానే చాలా భయమేసింది. క్రమంగా పగుళ్లు బాగా పెరిగిపోయాయి. ఒక్క నెలలోనే గది మొత్తం పాడైపోయింది" అని సునయన చెప్పారు.

అంజు సక్లానీ
ఫొటో క్యాప్షన్, అంజు సక్లానీ

సునయన చిన్నాన్న, పిన్ని పక్క ఇంట్లోనే ఉంటున్నారు. అక్కడా ఇదే పరిస్థితి. గోడలు, పైకప్పులో పగుళ్లు చూసి వాళ్లు చాలా భయపడుతున్నారు.

వాళ్ల చిన్నాన్న కూలి పనులు చేస్తుంటారు. 20 ఏళ్లకు పైగా ఆ ఇంట్లోనే ఉంటున్నారు.

"ఈ గదుల్లో ఉండలేం. మీరే చూసారు కదా ఎంత పగుళ్లు వచ్చాయో! కానీ, ఇంకెక్కడికి వెళ్లగలం? మరో చోట ఇల్లు కట్టుకోమని చాలామంది సలహాలు ఇస్తుంటారు. కానీ, డబ్బెక్కడుంది? పని సరిగ్గా దొరకట్లేదు. ఈ ఇల్లు కూడా లోన్ తీసుకుని కట్టుకున్నాం. అదే ఇంకా పూర్తవలేదు. ఇంకో ఇల్లు ఎలా కట్టుకోగలం?" అని సునయన పిన్ని అంజు సక్లానీ వాపోయారు.

ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకుని సహాయం అర్థించామని, మీడియాకు కూడా తమ బాధను తెలియజేశామని, కానీ ఎవరూ తమ మాట వినిపించుకోలేదని అంజు చెప్పారు.

"పెద్ద వర్షం పడితే, పిల్లలతో పాటు అందరం బయటికొచ్చి నిల్చుంటాం. ఈ గోడలు, పైకప్పు ఎప్పుడు పడిపోతాయో తెలీదు. ఇప్పుడు చలి పెరుగుతోంది. మంచు భారాన్ని పైకప్పు ఎంతవరకు మోయగలదో తెలీదు" అని అంజు సక్లానీ అన్నారు.

జోషీమఠ్‌లో, చాలా ఇళ్లకు ఇదే పరిస్థితి దాపురించింది. తమ బాధ ఉన్నత స్థాయికి చేరుతుందన్న ఆశతో, చాలామంది మాకు వాళ్ల ఇళ్లను చూపించారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవట్లేదని వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ సమస్యపై ఉత్తరాఖండ్‌లోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ డాక్టర్ రంజిత్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, "అలా కాదు. మేమంతా వారి బాధను వింటున్నాం. ప్రభుత్వం వింటోంది. ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు" అని చెప్పారు.

"వాళ్లు ఉండడానికి చుట్టుపక్కల ఎక్కడైనా అనువైన స్థలం దొరికితే చూడమని జిల్లా మెజిస్ట్రేట్‌ను కోరాం. రెండవది, వాళ్ల ఇళ్లకు ఇంకా ఎక్కువ నష్టం జరగకూడదు. ఆ దిశగా మేం పని చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

త్వరలో చర్యలు తీసుకుంటామని డాక్టర్ సిన్హా చెబుతున్నారుగానీ, జోషీమఠ్ ప్రజలకు దినదినగండంగా ఉంది.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ డా. రంజిత్ కుమార్ సిన్హా
ఫొటో క్యాప్షన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ డా. రంజిత్ కుమార్ సిన్హా

నేల ఎందుకు కుంగిపోతోంది?

సమీపంలోని రవిగ్రాంకు చెందిన సుమేధా భట్ పదేళ్ల క్రితం ఆ ఇల్లు కొనుక్కున్నారు. ఇంటిపై రూ. 20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. పగిలిన గోడల గుండా పాములు, తేళ్లు ఇంటి లోపలికి వచ్చేస్తాయన్న భయంతో మరమ్మత్తులు చేయించారు. కానీ, ఏమీ లాభం లేకపోయింది.

నేలపై పగుళ్లు, వంటింత్లో గోడల్లో పగుళ్లు వచ్చేశాయి. ఒకసారి పగుళ్ల గుండా పాము పిల్ల పాకుతూ కనిపిస్తే, ఫినాయిల్ పోశారు.

"నేల కుంగిపోతుంటే, ద్వారబంధాలు కూడా కుంగిపోతున్నాయి. తలుపులు మూతపడట్లేదు. గడియలు పడట్లేదు. వర్షం పడితే చాలా భయమేస్తోంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేం ఎక్కడికి పోగలమ?" అంటూ సుమేధ ఆవేదన వ్యక్తం చేశారు.

చాలామంది భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారని గ్రామస్థులు చెప్పారు.

గత ఏడాది అక్టోబర్ 17, 19 మధ్య ఉత్తరాఖండ్‌లో వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. అక్టోబర్ 18న ఉదయం 8.30 గంటల నుంచి తదుపరి 24 గంటల్లో జోషీమఠ్‌లో 190 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఒక రిపోర్ట్ తెలిపింది.

గత సంవత్సరం ఫిబ్రవరిలో హిమానీనదం (గ్లేసియర్) విరిగిపడిందని, మార్చి నుంచి పగుళ్లు కనిపించడం ప్రారంభించాయని సుమేధా భట్ చెప్పారు. హిమానీనదం విరిగిపడడం వలన ఉత్తరాఖండ్‌లో 200 మందికి పైగా మరణించారు.

జొషీమఠ్‌లో నేల కుంగిపోవడం కొత్త విషయం కాదు. 1976 నాటి మిశ్రా కమిటీ నివేదికలో కూడా ఇక్కడి నేల కుంగిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు.

కొన్నేళ్ల పాటు జోషీమఠ్‌లో నేల కుంగిపోవడం ఆగిపోయిందని, గత అక్టోబర్‌లో వరదల తరువాత మళ్లీ ఇది మొదలైందని స్థానిక ఏక్టివిస్ట్ అతుల్ సతి అంటున్నారు. అయితే, ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఉత్తరాఖండ్‌
ఉత్తరాఖండ్‌: జోషీమఠ్‌లో ఇళ్లు పగిలిపోతున్నాయి ఎందుకు? - గ్రౌండ్ రిపోర్ట్

పెరుగుతున్న వ్యాపారీకరణ

1970లలో పెరుగుతున్న జనాభా, భవన నిర్మాణాల నేపథ్యంలో, కొండచరియలు విరిగిపడడం, నేల కుంగిపోవడం మొదలైనవాటిపై ఫిర్యాదులు వచ్చాయి. ఆ తరువాత మిశ్రా కమిటీ ఏర్పాటైంది.

ఈ కమిటీ నివేదిక ప్రకారం, జోషీమఠ్ విరిగిన కొండచరియపై ఏర్పడిన పట్టణం. పర్వతం నుంచి విరిగిపడిన పెద్ద పెద్ద ముక్కలు, మట్టితో కూడిన అస్థిరమైన కుప్పపై ఈ ఊరు ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో విరిగిపడిన గ్లేసియర్ శిథిలాలు ఈ కుప్పను ఢీకొట్టడంతో ఇక్కడి నేల మరింత అస్థిరంగా మారిందని ఒక అంచనా. కానీ, ఈ వాదన శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.

పెరుగుతున్న జనాభా, నిర్మాణాలు, వర్షం, హిమనీనదాలు విరిగినప్పుడు వచ్చే ప్రవాహం, లేదా మురుగు నీరు భూమిలోకి వెళ్లి మట్టిని తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం.. ఇవన్నీ జోషీమఠ్‌లో నేల మరింతగా కుంగిపోవడానికి కారణాలని నిపుణులు అంటున్నారు.

"జోషీమఠ్ ప్రాంతంలో చాలా ఏజెన్సీలు సహజ అడవులను నిర్దాక్షిణ్యంగా నాశనం చేశాయి. జోషీమఠ్ సుమారు 6,000 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ, చెట్లు 8,000 అడుగులు వెనక్కి వెళ్లాయి. చెట్లు లేకపోవడం వలన నేల కోతకు గురై, కొండచరియలు విరిగిపడటానికి దారితీసింది. ఖాళీ పర్వతాలు ప్రకృతి వైపరీత్యాలుకు గురవుతాయి. పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడితే ఆపడానికి ఏమీ ఉండదు" అని 1976 నివేదికలో పేర్కొన్నారు.

భారీ నిర్మాణ పనులను నిషేధించాలని, రోడ్డు మరమ్మతులు, ఇతర నిర్మాణ పనుల కోసం పెద్ద పెద్ద రాళ్లను తవ్వడం, బ్లాస్టింగ్ చేయడం నిలిపివేయాలని, చెట్లు నాటేందుకు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాలని, పక్కా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని ఈ నివేదికలో పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లోనే కాక, హిమాలయాలను ఆనుకుని ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ నేల కుంగుబాటు సమస్య ఉందని ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ డాక్టర్ రంజిత్ కుమార్ సిన్హా అంటున్నారు.

జోషీమఠ్‌
ఇంతకీ, 1976 నివేదికల సిఫార్సులు ఏమయ్యాయి?

ఇంతకీ, 1976 నివేదికల సిఫార్సులు ఏమయ్యాయి?

"రిపోర్ట్ అందించిన సూచనలు, హెచ్చరికలను ఎవరూ పాటించలేదు. వాస్తవానికి, దానికి విరుద్ధంగా జరిగింది. బండరాళ్లను తవ్వవద్దని రిపోర్ట్ సూచించింది. కానీ ఇక్కడ రాళ్లని బ్లాస్టింగ్ చేసి విరగ్గొట్టారు. జోషీమఠ్ నిరంతరం విస్తరిస్తోంది. పట్టణీకరణ చోటుచేసుకుంటోంది. జనాభా పెరుగుతోంది. కానీ, దానికి తగ్గట్టు సౌకర్యాలు లేవు, మురుగునీటి వ్యవస్థ లేదు. ఇవన్నీ పతనానికి దారితీశాయి. ఈ సమస్య చాలా తీవ్రమైనది" అని ఏక్టివిస్ట్ అతుల్ సతి అభిప్రాయపడ్డారు.

2022 సెప్టెంబర్‌లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, నిపుణుల తయారుచేసిన మరో నివేదిక కూడా "అభివృద్ధి నియంత్రణ" గురించి ప్రస్తావించింది.

జోషీమఠ్‌లో 100కి పైగా హోటెల్స్, రిసార్టులు, హోం-స్టేలు ఉన్నాయని, సందర్శకులు పెరిగారని అతుల్ సతి చెప్పారు.

అతుల్ సతి
ఫొటో క్యాప్షన్, అతుల్ సతి

జోషీమఠ్ ఎంత కుంగిపోతోంది?

1962 నుంచి జోషీమఠ్‌లో భారీ భవనాల నిర్మాణం పెరిగిందని మిశ్రా కమిటీ పేర్కొంది.

అతుల్ సతి కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. 1962 చైనాతో యుద్ధం తరువాత రోడ్లు వేగంగా అభివృద్ధి చెందాయని, ఆ ప్రాంతంలో సైన్యం స్థిరపడడం ప్రారంభమైందని, హెలిప్యాడ్‌లు నిర్మించారని చెప్పారు. సైన్యం కోసం భవనాలు, బ్యారక్‌లు నిర్మించడం ప్రారంభమైందని చెప్పారు.

నేడు పతనం ఏ స్థితికి వచ్చింది?

డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన జియాలజిస్ట్ డాక్టర్ స్వప్నమిత వైదీశ్వరన్ ఉపగ్రహ చిత్రాల ఆర్కైవ్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

జోషీమఠ్ వాలుపై వేల పాయింట్లను ఎంచుకున్నారు. ఉపగ్రహ చిత్రాల సహాయంతో ఈ పాయింట్లను రెండు సంవత్సరాలకు పైగా ట్రాక్ చేశారు.

"పూర్తి స్థానభ్రంశం అంటే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు లెక్కేస్తారు. వేగం సంవత్సరానికి మిల్లీమీటర్లలో కొలుస్తారు. రవిగ్రాం ఏటా 85 మిమీ వేగంతో కుంగిపోతోందని గమనించాం. అంటే, ఇది ఏదో ఒక కొండచరియ విరిగి పడిన ప్రభావం కాదు. ప్రతి సంవత్సరం 85 మిమీ వేగంతో కుంగిపోతోంది. ఇది చాలా ఎక్కువ. అయితే, కొన్ని పాయింట్ల వద్ద భూమి స్థిరంగా ఉంది" అని డాక్టర్ స్వప్నమిత చెప్పారు.

డాక్టర్ స్వప్నమిత వైదీశ్వరన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ స్వప్నమిత వైదీశ్వరన్

2022 సెప్టెంబర్ నివేదిక తయారీలో స్వప్నమిత పాలుపంచుకున్నారు.

జోషీమఠ్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్వప్నమిత అంటున్నారు.

ఉత్తరాఖండ్‌లో స్పిరిచ్యువల్ స్మార్ట్ సిటీ, అన్ని కాలాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం గురించి చర్చ జరుగుతోంది.

"పర్వతాలపై పెద్ద పెద్ద నగరాలు ఎలా అభివృద్ధి చేయగలరన్నది చూడాలి. దీని కోసం సరైన చట్టాలు ఉండాలి. చిన్న గ్రామాలు లేదా పట్టణాలు ఏవైనా సరే, వాటి పెరుగుదలను నియంత్రించాలి" అని డాక్టర్ స్వప్నమిత అన్నారు.

పర్వతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, భారీ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆమె సూచిస్తున్నారు.

జోషీమఠ్‌లో ఎన్ని ఇళ్లకు పగుళ్లు ఉన్నాయి, ఏ ఇళ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాల్సిన పరిస్థితుల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి తదితర సర్వేలను ప్రభుత్వం చేపట్టాలని అతుల్ సతి కోరుతున్నారు.

ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ గృహాల ఏర్పాటు చేస్తుందని సక్లానీ కుటుంబం సహా ఈ పర్వతాలలో నివసించే ప్రజలు ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వ్యర్థాల సమస్యను మహమ్మారి మరింత పెంచిందంటున్న ఓ అధ్యయనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)