COP27: ఈజిప్ట్‌లో వాతావరణ మార్పులపై సదస్సు.. ఏ అంశాలను చర్చించనున్నారు? ఇది ఎందుకింత ముఖ్యం?

COP27

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఎస్మే స్టాలార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈజిప్టులో జరగబోయే ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో వాతావరణ మార్పులు, పరిష్కారాలపై ప్రపంచ దేశాల నాయకులు చర్చించనున్నారు.

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టాయి. చాలా చోట్ల భారీ వర్షాలు, ఊహించని రీతిలో వరదలు రావడంతో పాటు పలుచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐరాస సదస్సు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది.

ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అంటే ఏమిటి?

ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సును ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ప్రపంచ స్థాయిలో వాతావరణ మార్పులను అరికట్టేందుకు, భూ ఉష్ణోగ్రతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలు చర్చించి, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు అవకాశం కల్పిస్తుందీ వేదిక.

వీటిని COP (కాప్) సదస్సులు అంటారు. COP అంటే 'కాంఫరెన్సె ఆఫ్ ది పార్టీస్'. ఇక్కడ పార్టీలు అంటే ఈ సదస్సుకు హాజరయ్యే దేశాలు. ఇవన్నీ కూడా 1992లో 'యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్' (యూఎన్ఎఫ్‌సీసీ)పై సంతకం చేసిన దేశాలు.

ఈ ఏడాది ఈజిప్ట్‌లో 27వ కాప్ వార్షిక సదస్సు జరగనుంది. ఇది నవంబర్ 6 నుంచి 18 వరకు షర్మ్ ఎల్-షేక్‌లో జరుగుతుంది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Reuters

COP సదస్సుల ఆవశ్యకత ఏమిటి?

భూమి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మానవులు ఉత్పత్తి చేసే ఉద్గారాలు. ప్రధానంగా చమురు, గ్యాస్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల విడుదల అవుతున్నవి.

భూ ఉష్ణోగ్రతలు 1.1C కి పెరిగాయి. 1.5C చేరుకునే దిశగా సాగుతున్నాయని 'ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్' (ఐపీసీసీ)లోని ఐరాస శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉష్ణోగ్రతలు 1850లలో నమోదైన స్థాయిని దాటి, 1.7 నుంచి 1.8C వరకు పెరిగితే, ప్రపంచ జనాభాలో సగం మంది ప్రాణాంతకమైన వేడి, ఉక్కపోతకు గురవుతారని ఐపీసీసీ అంచనా వేసింది.

ఈ పరిస్థితిని నిరోధించడానికి, 194 దేశాలు 2015లో పారిస్ ఒప్పందంపై సంతకం చేసాయి. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5C మించి పెరగకుండా చర్యలు తీసుకోవడమే దీని లక్ష్యం.

వీడియో క్యాప్షన్, వేల ఎకరాల్లో తగలబడుతున్న అడవులు- ఎండిపోతున్న నదులు

COP27 కు ఎవరెవరు హాజరవుతున్నారు?

ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా 200కు పైగా దేశాలకు ఆహ్వానం అందింది. అయితే, కొందరు పెద్ద దేశాల నాయకులు దీనికి హాజరు కాకపోవచ్చు.

బ్రిటన్ ప్రధాని రిషి సునక్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాప్27కు హాజరు కావడం లేదు. కానీ, ఈ దేశాల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు.

చైనా వంటి కొన్ని దేశాల నాయకులు ఈ సదస్సులో పాల్గొంటారో లేదో ఇంకా ధృవీకరించలేదు.

దేశాలు విభేదాలను పక్కనపెట్టి, "నాయకత్వాన్ని ప్రదర్శించాలని" ఆతిధ్య దేశమైన ఈజిప్ట్ పిలుపునిచ్చింది.

దేశాధినేతలతో పాటు పర్యావరణ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, థింక్ ట్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, మతపరమైన సంఘాలు కూడా ఈ సదస్సులో పాల్గొంటాయి.

COP27 ఈజిప్ట్‌లో ఎందుకు జరుగుతోంది?

ఆఫ్రికాలో కాప్ సదస్సు జరగడం ఇది అయిదవసారి.

కాప్27 సదస్సు ఆఫ్రికాలో వాతావరణ మార్పుల ప్రభావాలపై ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి సహకరిస్తుందని ఆఫ్రికాలోని ప్రాంతీయ ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి.

ప్రపంచంలో అత్యధిక ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలలో ఆఫ్రికా ఒకటని ఐపీసీసీ తెలిపింది. ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలో కరువు కారణంగా 1.7 కోట్ల ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని అంచనా.

అయితే, ఈ సదస్సుకు ఆఫ్రికాను వేదికాగా ఎంచుకోవడంపై కొన్ని వివాదాలు ముసురుకున్నాయి.

ప్రభుత్వ హక్కుల ఉల్లంఘన రికార్డులను ప్రశ్నిస్తున్నందున ప్రభుత్వం తమను ఈ సదస్సుకు హాజరుకాకుండా నిషేధించిందని కొన్ని మానవ హక్కుల సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

COP27

ఫొటో సోర్స్, Getty Images

COP27లో ఏ అంశాలు చర్చిస్తారు?

సమావేశానికి ముందే దేశాలు తమ జాతీయ ప్రణాళికలను సమర్పించాలని కోరారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 25 దేశాలు మాత్రమే వాటిని అందించాయి.

కాప్27లో ప్రధానంగా ఈ కింది మూడు అంశాలను చర్చిస్తారు.

  • ఉద్గారాలను తగ్గించడం
  • వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి దేశాలకు సహకారం అందించడం
  • ఈ కార్యకలాపాల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక మద్దతు, నిధులను అందించడం.

ఇది కాకుండా, కాప్26లో పరిష్కారానికి రాని కొన్ని సమస్యలను కూడా చర్చిస్తారు.

  • నష్టం, హానికి ఆర్థిక సాయం- వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి కోలుకోవడానికి దేశాలకు ఆర్థిక సాయం అందించడం
  • గ్లోబల్ కార్బన్ మార్కెట్‌ను వృద్ధి చేయడం - అంతర్జాతీయంగా వస్తువులు, సేవల ధరలకు ఉద్గారాల ప్రభావాలను జోడించడం
  • బొగ్గు వినియోగాన్ని తగ్గించే చర్యలను మరింత బలోపేతం చేయడం

ఇవే కాకుండా లింగ అసమానతలు, వ్యవసాయం, జీవవైవిధ్యం మొదలైన అంశాలకు ప్రత్యేకంగా కొన్ని సెషన్లు కేటాయిస్తారు.

ఈ సదస్సు నుంచి సత్ఫలితాలను ఆశించవచ్చా?

వాతావరణ మార్పులపై చర్చలలో ఆర్థిక సహకారం దీర్ఘకాలంగా ఉన్న సమస్య.

2009లో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులకు సిద్ధం కావడానికి 2020 నాటికి సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు ఇస్తామని అభివృద్ధి చెందిన దేశాలు వాగ్దానం చేసాయి.

అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు. దీన్ని 2023కి జరిపాయి.

మరోపక్క, తమకు ఎదురవుతున్న హాని, నష్టాన్ని భర్తీ చేసేందుకు నిధులు అందించాలని పేద దేశాలు పిలుపునిస్తున్నాయి.

ఈ ఏడాది జూన్‌లో జర్మనీలోని బోన్‌లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ పరిహారాన్ని అందించడానికి సంపన్న దేశాలు నిరాకరించాయి. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న భయంతో ధనిక దేశాలు దీన్ని పక్కకుపెట్టాయి.

దీనిపై కాప్27లో చర్చ జరిపేందుకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది.

వీడియో క్యాప్షన్, అస్సాం టీ తోటలపై వాతావరణ మార్పుల ప్రభావం.. తేయాకు తోటలు కనుమరుగవుతాయా?

ఈ సదస్సు విజయవంతమైందో లేదో మనకు ఎలా తెలుస్తుంది?

మీరు ఏ దేశంతో మాట్లాడుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

అధివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ నష్టానికి ఆర్థిక సహకారం అందించడం ప్రధాన చర్చాంశంగా ఉండాలని కోరుకుంటాయి. ఆర్థిక చెల్లింపులకు ఒక నిర్దిష్టమైన గడువును నిర్ణయించాలని కూడా ఒత్తిడి తేవచ్చు.

చైనా, భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు బొగ్గు వినియోగాన్ని తగ్గించే దిశలో తమ నిబద్ధతకు కట్టుబడి ఉండాలని ధనిక దేశాలు ఆశిస్తాయి.

గత ఏడాది అడవులు, బొగ్గు, మీథేన్ వంటి అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. వీటిపై మరిన్ని దేశాలు సంతకాలు చేయవచ్చు.

ఏది ఏమైనా, వాతావరణ మార్పులపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల నాయకులు చాలా ఆలస్యం చేశారని, కాప్27లో ఒప్పందాలు ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ ఉష్ణోగ్రతలను 1.5C కి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించలేమని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వేల ఎకరాల్లో తగలబడుతున్న అడవులు- ఎండిపోతున్న నదులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)