గత రెండేళ్లలో మనిషి సరాసరి ఆయుర్దాయం తగ్గింది, రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టెఫనీ హెగార్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆయుర్దాయం, విద్య, ఆర్థికాభివృద్ధి అంశాల్లో దశాబ్దాలుగా సాధించిన ప్రగతి కరోనా మహమ్మారి తరువాత తిరుగుముఖం పట్టిందని ఐక్యరాజ్య సమితి (యూఎన్) తాజా నివేదిక సూచిస్తోంది.
గత రెండేళ్లల్లో పదింట తొమ్మిది దేశాలు ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచికలో వెనక్కి జారిపోయాయి.
ప్రపంచాభివృద్ధి తిరుగుబాట పట్టడానికి ప్రధాన కారణాలు కోవిడ్ 19, యుక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పుల ప్రభావాలని చెబుతున్నారు.
అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచిక (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్)ను ప్రారంభించారు.
ఈ ఏడాది మానవ అభివృద్ధి సూచికలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 84 సంవత్సరాల ఆయుర్దాయం, సగటున 16.5 సంవత్సరాల విద్య, మధ్యస్థ (మీడియన్) జీతం 66,000 డాలర్ల (సుమారు రూ. 52,60,580)తో ఈ దేశం అగ్రస్థానంలో ఉంది.
ఈ సూచికకు మరో కొసన దక్షిణ సూడాన్ ఉంది. 55 సంవత్సరాల ఆయుర్దాయం, సగటున కేవలం 5.5 సంవత్సరాల విద్య, వార్షికాదాయం 768 డాలర్ల (సుమారు రూ. 61,214)తో అట్టడుగున ఉంది.
ఈ సూచికలో భాగమైన 191 దేశాలలో చాలావరకు 2016లో చూసిన అభివృద్ధి స్థాయిలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయుర్దాయంలో గణనీయమైన తరుగుదల కనిపిస్తోంది. 30 ఏళ్ల ట్రెండ్ రివర్స్ అవుతోంది.
ఉదాహరణకు, అమెరికాలో 2019 నుంచి బిడ్డ పుట్టినప్పటి ఆయుర్దాయం రెండేళ్ల కంటే ఎక్కువ తగ్గిపోయింది.

మానవ అభివృద్ధి సూచికను ప్రారంభించినప్పటి నుంచి, చాలా దేశాలు ఒడిదుడుకులు, సంక్షోభాలు ఎదుర్కున్నాయిగానీ, ప్రపంచాభివృద్ధి స్థిరంగా పైకి కదిలింది.
కానీ, గత ఏడాది, తొలిసారిగా ప్రపంచం మొత్తంగా ఈ సూచిక అధోముఖం పట్టింది. ఈ ఏడాది గణాంకాలు చూస్తే ఇదే ధోరణి కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది.
అయితే, కరోనవైరస్, యుక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పుల ప్రభావాలు అన్ని దేశాలపై ఒకేలా లేవు.
మూడింట రెండొంతుల సంపన్న దేశాలు గత ఏడాది పుంజుకోగా, మిగిలిన దేశాలు చాలావరకు క్షీణిస్తూనే ఉన్నాయి.
2021 నాటి డేటా ఆధారంగా ఈ ఏడాది సూచిక రూపొందిస్తారు.
"2022వ సంవత్సరం ధోరణి ఆందోళనకరంగానే ఉంది" అని అచిమ్ స్టైనర్ అన్నారు. స్టైనర్, యూఎన్ నివేదిక రూపొందించిన బృందంలో ఉన్నారు.
80 కంటే ఎక్కువ దేశాలు జాతీయ స్థాయి రుణాలు చెల్లించలేక సతమతమవుతున్నాయని స్టైనర్ తెలిపారు.
"80 దేశాలు సంక్షోభం అంచున ఉండడం చాలా తీవ్రమైన విషయం. లోతైన అగాధాలు గోచరిస్తున్నాయి. వీటి ప్రభావం రాబోయే కొన్నేళ్లల్లో కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐఫోన్-14, వాచ్ అల్ట్రా వచ్చేశాయి... వీటిలోని కొత్త ఫీచర్లు ఏంటంటే
- కశ్మీర్: సాధారణ ప్రజల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు, సైన్యం వాటిని ఎన్కౌంటర్లకు వాడుతోందా?
- బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో ఇంట్లోనే టెస్టు చేసుకునే సాధనం ఇది. ఎలా వాడాలి?
- బెంగళూరులో ఉబర్, ఓలా బోట్ ట్యాక్సీలు నడుస్తాయంటూ సోషల్ మీడియాలో ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- ‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











