బ్రెస్ట్ క్యాన్సర్: ఈ జబ్బు ఉందో లేదో ఇంట్లోనే టెస్టు చేసుకునే సాధనం ఇది. ఎలా వాడాలి?

ఇంట్లోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే సాధనానికి దక్కిన అరుదైన గౌరవం..

ఫొటో సోర్స్, JAMES DYSON AWARD

    • రచయిత, షియోనా మెకల్లమ్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడంలో సహకరించే ఒక సాధనానికి ప్రతిష్టాత్మక యూకే జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది.

మహిళలు ఇంట్లోనే రొమ్ము ఆరోగ్యాన్ని స్వయంగా చెక్ చేసుకోడంలో 'డాట్‌ప్లాట్' అనే ఈ సాధనం ఉపయోగపడుతుంది.

యూకేలోని క్యాన్సర్ మరణాల్లో రొమ్ము క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ చాలా మంది మహిళలు తరచుగా స్వీయ పరీక్షలు చేసుకోరు.

ఈ నేపథ్యంలో ఈ ఆవిష్కరణను వైద్య నిపుణులు స్వాగతించారు. అయితే, ఇది వైద్యునికి ప్రత్యామ్నాయం ఏమాత్రం కాదని హెచ్చరించారు.

మహిళలు ఛాతీ ప్రదేశంలో ఈ సాధనాన్ని ఉపయోగిస్తూ రొమ్ము పరిమాణం, ఆకారం, తదితర వివరాలను నమోదు చేస్తారు.

ప్రతీ నెలా ఈ సాధనంతో స్వీయ పరీక్షలు చేసుకోవాలి. కణజాలాల నిర్మాణాలను రికార్డ్ చేయడానికి ఇందులో శబ్ధ తరంగాలను వాడతారు. నెలకోసారి పరీక్షించేటప్పుడు రొమ్ము పరిమాణంలో, ఆకారంలో ఏదైనా తేడా కనబడినా లేదా ఏదైనా అసాధారణ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిస్తే వారు వైద్యులను సంప్రదించాల్సింది ఉంటుంది.

రొమ్ముల్లో గడ్డలు ఏర్పడిన మహిళలకు చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్, 50 ఏళ్లు పైబడిన మహిళలకు చేసే మమోగ్రామ్‌లలో ఉండే సాంకేతికతనే ఇది కూడా పోలి ఉంటుంది.

''కచ్చితంగా చెప్పాలంటే, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం డాక్టరుకు ప్రత్యామ్నాయం కాదు. దీనితో పూర్తి నిర్ధారణ జరగదు'' అని ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫ్రాంకీ జాక్సన్ స్పెన్స్ చెప్పారు.

ఇంట్లోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే సాధనానికి దక్కిన అరుదైన గౌరవం..

ఫొటో సోర్స్, JAMES DYSON AWARD

మనుగడ రేటు

ఎంత త్వరగా క్యాన్సర్ కణజాలాన్ని గుర్తిస్తే అంత మంచిది.

రొమ్ము క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే దాన్నుంచి బయటపడే అవకాశం 95 శాతం ఉన్నట్లు గత అయిదేళ్ల రికార్డు తెలుపుతుంది. క్యాన్సర్‌ను ఆలస్యం చేసి అది నాలుగో దశకు చేరుకున్న తర్వాత గుర్తిస్తే మనుగడ రేటు 25 శాతానికి పడిపోతుంది.

యూకేలో ప్రతీ ఏటా 11,500 రొమ్ము క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి.

యూకేలోని క్యాన్సర్ పరిశోధన సంస్థ చెప్పినదాని ప్రకారం 18-35 ఏళ్ల మహిళల్లో 64 శాతం మంది క్రమం తప్పకుండా రొమ్ము ఆరోగ్యాన్ని పరీక్షించడం లేదు.

''రొమ్ము భాగం మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించడం చాలా ముఖ్యం'' అని జాక్సన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, "నేను నా కొత్త చను మొనలుగా టాటూస్ చూసిన ఆ క్షణంలో...”

చనుమొనల స్రావాలు

రొమ్ములను పరీక్షించడం అంటే కేవలం కణతులు, గడ్డలు ఉన్నాయో లేదో చూడటం మాత్రమే కాదు.

''క్యాన్సర్‌కు సంబంధించిన ఇతర సంకేతాలను కూడా గుర్తించాలి. చనుమొనల నుంచి స్రావాలు, బ్రెస్ట్‌పై గుల్లలు, రొమ్ము చర్మం ముడతలు పడటం కూడా ఈ వ్యాధి లక్షణాలే. రొమ్ముల్లో ఏర్పడే గడ్డలతో సహా చాలా మార్పులను క్యాన్సర్‌గా భావించనక్కర్లేదు. కానీ, రొమ్ములో కొత్త లేదా అసాధారణమైన మార్పు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. క్యాన్సర్ కణతులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి'' అని బీబీసీతో చారిటీ బ్రెస్ట్ క్యాన్సర్ నౌ సంస్థ వెల్‌బీయింగ్ హెడ్ మన్వీత్ బస్రా చెప్పారు.

ఇంపీరియల్ కాలేజ్ లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు డెబ్రా బబలోలా, షెఫాలీ బోహ్రా ఈ పరికరం ఆవిష్కరణలో పనిచేశారు. వీరు 'డాట్‌ప్లాట్' సహవ్యవస్థాపకులు.

బ్రెస్ట్ క్యాన్సర్ అనేక మార్గాలలో గుర్తించవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేక మార్గాలలో గుర్తించవచ్చు

జిమ్‌లో వర్కవుట్ తర్వాత తన రొమ్ములో అసాధారణ మార్పును బోహ్రా గుర్తించారు. అయితే, దాని వల్ల ఎలాంటి హాని లేదని తర్వాత ఆమెకు తెలిసింది.

''మేం వైద్యులతో దీని గురించి మాట్లాడటం ప్రారంభించాం. చాలామంది మహిళలతో రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడాం. బ్రెస్ట్ ఆరోగ్య రక్షణకు ఏం చేయాలో చెప్పడం మాత్రమే కాకుండా బ్రెస్ట్‌ను తరచుగా ఎందుకు, ఎలా, పరీక్షించుకోవాలో వివరంగా చెప్పే మార్గం కోసం, సొంతంగా పరీక్షించుకునే మార్గం గురించి మహిళలు ఆలోచిస్తున్నట్లు మాకు అర్థమైంది'' అని బోహ్రా చెప్పారు.

''మేం వైద్య నిపుణులకు ప్రత్యామ్నాయంగా దీన్ని తయారు చేయలేదు. మహిళలు సొంతంగా రొమ్ము ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంలో సహకరిస్తున్నాం'' అని డెబ్రా అన్నారు.

జేమ్స్ డైసన్ అవార్డుతో డాట్‌ప్లాట్ ఇప్పుడు అంతర్జాతీ స్థాయికి చేరుకుంటుంది. నవంబర్ 16న అవార్డును ప్రదానం చేస్తారు.

వీడియో క్యాప్షన్, రొమ్ము క్యాన్సర్ సోకిన తర్వాత బిడ్డకు జన్మనివ్వొచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)