Johnson & Johnson: ఇక జాన్సన్స్ బేబీ పౌడర్ టాల్కమ్ అమ్మకాలు ఉండవు.. మొక్కజొన్న పిండితో పౌడర్ తయారీకి నిర్ణయం

జాన్సన్&జాన్సన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, పీటర్ హాస్కిన్స్
    • హోదా, బీబీసీ న్యూస్

చిన్న పిల్లలున్న ప్రతీ ఇంట్లో చాలా వరకు జాన్సన్ & జాన్సన్ ఉత్పత్తులు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది చిన్నారులకు బహుమతులుగా జాన్సన్ కంపెనీ షాంపూలు, పౌడర్లు, సబ్బులు బహుమతులుగా కూడా ఇస్తూ ఉంటారు.

జాన్సన్ సంస్థ 130 ఏళ్లుగా అమ్ముతున్న బేబీ పౌడర్ అమ్మకాలను వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలుపుచేస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికాలో ఈ అమ్మకాలను ఆపేసి రెండేళ్లు అయింది.

జాన్సన్ సంస్థ అమ్ముతున్న పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఉందని ఆరోపిస్తూ నమోదు చేసిన కొన్ని వేల లా సూట్లను ఎదుర్కొంటోంది.

కానీ సంస్థ మాత్రం "కొన్ని దశాబ్దాల పాటు జరిగిన పరిశోధనలు ఈ ఉత్పత్తులు వాడకానికి సురక్షితం అని తేల్చాయి" అని చెబుతూ వస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ ఉత్పత్తులను విశ్లేషించి సంస్థ అమ్మే పౌడర్‌ను మొక్కజొన్న పిండి ఆధారిత పౌడర్‌గా మార్చేందుకు వ్యాపారపరమైన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో మొక్కజొన్న పిండితో తయారు చేసిన పౌడర్‌ను వాడుతున్నట్లు చెప్పారు.

అదే సమయంలో సంస్థ ఉత్పత్తి చేసే బేబీ పౌడర్ వాడకానికి సురక్షితం అని చెబుతూ వస్తోంది.

"ఈ పొడి సురక్షత గురించి సంస్థ చెబుతున్న అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదు" అని చెప్పింది.

వీడియో క్యాప్షన్, మగధీర సినిమా చూసి, గుర్రమంటే ఇష్టం పెంచుకున్న జోషిత్ ఛత్రపతి

"కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు స్వతంత్రంగా శాస్త్రీయ విశ్లేషణ చేసి జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితం అని తేల్చారు. ఇందులో ఆస్బెస్టాస్ లేదు. ఇది క్యాన్సర్ రావడానికి కారణం కాదు" అని పేర్కొంది.

బేబీ పౌడర్ సురక్షత పట్ల జరిగిన తప్పుడు ప్రచారం, కోర్టు కేసుల నేపథ్యంలో సంస్థ 2020లో బేబీ పౌడర్ అమ్మకాలను యూఎస్, కెనడాలో నిలుపు చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే, యూకే, ఇతర దేశాల్లో సంస్థ అమ్మకాలు కొనసాగుతాయని తెలిపింది.

జాన్సన్ బేబీ పొడర్‌లో ఉన్న ఆస్బెస్టాస్ క్యాన్సర్ కారకంగా మారుతోందంటూ అనేక మంది వినియోగదారులు బాధితులు సంస్థకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారు.

పౌడర్ లో వాడే టాల్క్‌ను భూమి నుంచి తవ్వి తీస్తారు. ఇందులో ఉన్న ఆస్బెస్టాస్ వల్ల క్యాన్సర్ వస్తోందని ఆరోపించారు.

జాన్సన్ ఉత్పత్తి చేస్తున్న టాల్క్‌లో ఆస్బెస్టాస్ ఉన్నట్లు జాన్సన్ సంస్థకు ఎప్పటి నుంచో తెలుసని 2018లో రాయిటర్స్ వార్తా సంస్థ చేసిన పరిశోధన చెప్పింది.

సంస్థ రికార్డులు, కేసుల్లో ఇచ్చిన సాక్ష్యాలు, ఇతర ఆధారాలను బట్టి 1971 నుంచి 2000 ప్రారంభం వరకు చేసిన పరీక్షల్లో జాన్సన్ టాల్క్‌లో, పౌడర్‌లో కొంత మొత్తంలో ఆస్బెస్టాస్ ఉన్నట్లు తేలిందని రాయిటర్స్ పేర్కొంది.

అయితే, కోర్టులో, మీడియా నివేదికల్లో వచ్చిన ఈ వివరాలను మాత్రం సంస్థ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.

జాన్సన్ & జాన్సన్ టాల్క్ తయారీకి సంబంధించి ఎల్‌‌టీఎల్ మేనేజ్మెంట్‌ను బాధ్యత చేస్తూ అక్టోబరులో ఒక అనుబంధ సంస్థను సృష్టించింది.

తర్వాత ఈ సంస్థ దివాలా తీసినట్లు ప్రకటించింది. దీంతో, కోర్టులో ఉన్న కేసులు ముందుకు సాగలేదు.

ఈ దివాలా పిటిషన్ నమోదు చేయడానికి ముందు సంస్థ కోర్టు కేసుల కోసం 3.5 బిలియన్ డాలర్లను కోల్పోయింది. ఇందులో 22 మంది మహిళలకు 2 బిలియన్ డాలర్లకు పైగా పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది.

ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా బేబీ పొడి అమ్మకాలను నిలిపివేయాలని ఒక షేర్‌హోల్డర్ ఇచ్చిన పిలుపు విఫలమయింది.

చిన్న పిల్లల ఉత్పత్తులకు జాన్సన్ సంస్థ ఉత్పత్తులు ఒక చిహ్నంగా మారాయి. చిన్నారులకు న్యాపీ ర్యాష్ పోగొట్టేందుకు, చర్మం పొడిగా ఉండేందుకు బేబీ పౌడర్ వాడుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)