అల్ ఖైదా: ఒసామా బిన్ లాడెన్‌ను వేటాడటానికి అమెరికా పంపిన గూఢచారి గారీ ష్క్రోయెన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్నార్డ్ డెబుస్మాన్ జూనియర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా మీద 2001 సెప్టెంబర్ 11 దాడులు చరిత్ర గతిని మలుపుతిప్పిన ఉదంతం. ఆ దాడి జరిగిన సరిగ్గా వారం రోజులకు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్ శిథిలాల నుంచి ఇంకా పొగలు వెలువడుతూనే ఉండగా.. 2001 సెప్టెంబర్ 19వ తేదీన.. సీఐఏ ఆఫీసర్ గారీ ష్క్రోయెన్ తన బాస్ గదిలోకి పిలుపు వచ్చింది.
అక్కడ అతడికి ఆదేశాలు అందాయి. అవేమిటంటే..: 'బిన్ లాడెన్‌ను బంధించి, చంపేసి, అతడి తలను ఐస్ బాక్సులో పెట్టి తీసుకురా'.
ఇక బిన్ లాడెన్ తర్వాతి అగ్ర నాయకులు అయ్‌మన్ అల్ జవహరి తదితర ముఖ్యుల 'తలలు నరికి ఈటెలకు గుచ్చండి' అనేవి ఇతర ఆదేశాలు.
కొద్ది రోజులకే గారీ, అతడితో పాటు పారామిలటరీ సిబ్బందితో కూడిన బృందం అఫ్గానిస్తాన్ చేరుకుంది. అమెరికాపై 9/11 దాడుల అనంతరం అఫ్గాన్‌లో పాదం మోపిన తొలి అమెరికన్లు వారు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం శాటిలైట్ ఫోన్లు మాత్రమే. అయితే.. కోట్లాది డాలర్ల డబ్బు కూడా వారు మోసుకొచ్చారు. అఫ్గాన్‌లో మిత్రులను తయారు చేసుకోవటం కోసం.
ఆ తర్వాత కొన్ని వారాలకు అక్టోబర్ 7వ తేదీన.. తాలిబాన్ పాలనలోని అఫ్గానిస్తాన్ మీద అమెరికా దండయాత్ర మొదలుపెట్టింది. అలా మొదలైన యుద్ధం దాదాపు 20 ఏళ్ల పాటు కొనసాగింది. 2021 ఆగస్టులో అది ముగిసింది.
అఫ్గాన్ మీద దండెత్తిన దశాబ్దం తర్వాత.. 2011లో బిన్ లాడెన్‌ను వేటాడి చంపారు. కానీ అల్ జవహరిని చంపటానికి మరో దశాబ్దం పట్టింది.
కాబూల్‌లో జవహరిని అమెరికా డ్రోన్ హతమార్చిన ఒక రోజు తర్వాత.. ఆగస్టు 1వ తేదీన గారీ ష్క్రోయెన్ మెదడు సంబంధ సమస్యలతో చనిపోయారు. ఆయన వయసు 80 సంవత్సరాలు.

ఫొటో సోర్స్, CENTRAL INTELLIGENCE AGENCY TWITTER
అమెరికా గూఢచార సంస్థ సీఐఏలో పని చేస్తున్న వారందరికీ.. ''గారీ ష్క్రయెన్ ఒక లెజెండ్.. ఒక స్ఫూర్తి'' అని సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ కొనియాడారు.
సీఐఏలో దశాబ్దాల తన కెరీర్‌లో గారీ.. 1980లు, 1990లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ రెండు దేశాలకూ 'స్టేషన్ చీఫ్'గా పనిచేశారు.
ఆ సమయంలో అఫ్గానిస్తాన్ మీద అమెరికా ప్రభుత్వానికి ఆసక్తేమీ లేదని ఆయన ఆ తర్వాతి కాలంలో పీబీఎస్ ఇంటర్వ్యూలో చెప్పారు.
''అక్కడ తాలిబన్లు ఉన్నారు. వాళ్లు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, వారి ప్రభుత్వం దారుణమైన ప్రభుత్వమైన, ప్రజలను భయంకరంగా అణచివేస్తోందని అందరికీ తెలుసు. కానీ ఈ విషయాల్లో వేటినీ అమెరికాలో నిజంగా ఎవరూ ఏమీ పట్టించుకోలేదు'' అని ఆయన పేర్కొన్నారు.
అయితే 1996 నాటికి సమీకరణాలు మారిపోయాయి. దానికి కారణం.. 1980లలో సోవియట్ల మీద గెరిల్లా యుద్ధం చేసిన జిహాదీవాది ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాల మీద అమెరికా నిఘా దృష్టి కేంద్రీకరించటమే. అప్పటికి లాడెన్ ఎవరనేది పెద్దగా ఎవరికీ తెలీదు.
సౌదీ దేశస్థుడైన లాడెన్ నుంచి ముప్పు ఉందని సీఐఏ కౌంటర్ టెర్రరిజం సెంటర్‌లోని ఒక చిన్న బృందం హెచ్చరించింది. ఆ బృందంలో గారీ కూడా ఉన్నారు. అంతకుముందు అఫ్గాన్ ప్రాంతంలో పనిచేసిన గారీ.. అక్కడి సైనిక కమాండర్లలో గతంలో తనకు పరిచయమున్న వారితో సంబంధాలను పునరుద్ధరించటం మొదలుపెట్టారు.
అప్పటి నుంచీ మూడేళ్ల పాటు.. గారీ మార్గదర్శకత్వంలోని సీఐఏ బృందం లాడెన్‌ను పట్టుకుని చంపటానికి పదే పదే ప్రయత్నించింది.
లాడెన్ కాన్వాయ్ మీద ఉచ్చుపన్ని దాడి చేయటం, అఫ్గానిస్తాన్‌లోని అతడి పొలం మీద ఆకస్మిక దాడులు చేయటం, అతడు లక్ష్యంగా క్రూయిజ్ మిసైళ్లు పేల్చటం, బాంబుదాడులు చేయటం వంటివన్నీ చేశారు.
చివరికి.. 1998లో కెన్యా, టాంజానియాల్లో అమెరికా రాయబార కార్యాలయాల మీద బాంబుదాడులకు బిన్ లాడెన్ కుట్ర పన్ని అమలు చేశాడు. అదే ఏడాది ఆగస్టులో.. అఫ్గాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో అల్ ఖైదా స్థావరాల మీద జరిగిన భారీ స్థాయి క్రూయిజ్ మిసైల్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆ తర్వాత మూడేళ్లకు.. 19 మంది అల్ ఖైదా హైజాకర్లు అమెరికా మీద 9/11 దాడులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ దాడి అనంతరం గారీ, మరో ఏడుగురు అమెరికన్లను 'ఆపరేషన్ జా బ్రేకర్' కార్యక్రమం మీద అఫ్గానిస్తాన్ పంపించారు. వారు.. అఫ్గాన్‌ను 1996 నుంచీ పరిపాలిస్తూ ఉన్న తాలిబాన్లతో పోరాడుతున్న పలు బృందాల సంకీర్ణం నార్తరన్ అలయన్స్‌తో జట్టుకట్టారు.
ఈ ఆపరేషన్ కోసం అఫ్గానిస్తాన్ వెళ్లాలంటూ గారీకి ఆదేశాలు అందేటప్పటికి ఆయన వయసు 59 సంవత్సరాలు. ఆయన పదవీ విరమణ చేసే దశకు చేరుకున్నారు. రిటైర్ కాబోయే సీఐఏ ఉద్యోగులకు అమలు చేసే ట్రాన్సిషన్ ప్రోగ్రామ్‌లో అప్పటికే 11 రోజులుగా ఉన్నారు గారీ. అంతలో.. లాడెన్‌ను వేటాడటానికి అఫ్గాన్ వెళ్లాలంటూ ఆదేశాలందాయి.
''నన్ను రంగంలోకి దిగాల్సిందంటూ పిలుస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. అయితే.. నార్తరన్ అలయన్స్‌లోని వ్యక్తులతో నాకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నన్ను ఎంపిక చేయటం సరైన నిర్ణయమేనని నేను అనుకుంటున్నా'' అని కొన్నేళ్ల తర్వాత గారీ పేర్కొన్నారు.
''2001 సెప్టెంబర్ 11కు ముందు అఫ్గానిస్తాన్‌లో ఆయనకు ఉన్న అనుభవం.. అఫ్గాన్ మీద మా దండయాత్ర తొలి దశ విజయాలు సాధించటానికి చాలా కీలకంగా నిలిచాయి. ఆ దండయాత్రలకు ఆయనే సారథ్యం వహించారు'' అని మాజీ సీఐఏ పారా మిలటరీ అధికారి, రక్షణ విభాగానికి ఉప మంత్రిగా కూడా పనిచేసిన మైఖేల్ 'మిక్' మల్రాయ్ బీబీసీతో చెప్పారు.
''అఫ్గానిస్తాన్‌లో అడుగు పెట్టిన తొలి బృందంగా.. ముందుండి నడిపించటమనే విధానానికి గారీ తిరుగులేని ఉదాహరణగా నిలిచారు'' అని మల్రాయ్ ప్రశంసించారు.
అఫ్గానిస్తాన్ మీద అమెరికా మిలటరీ ఆపరేషన్ అద్భుతంగా విజయవంతమైంది. 2001 డిసెంబర్ నాటికి తాలిబాన్‌ను అధికారం నుంచి కూలదోసి తరిమివేశారు. కానీ గారీ ప్రధాన లక్ష్యమైన బిన్ లాడెన్‌తో పాటు అల్ జవహరి వంటి అల్ ఖైదా ఇతర ముఖ్యనేతలు తప్పించుకున్నారు. మరోవైపు తాలిబాన్ మళ్లీ పుంజుకుని అమెరికాతో గెరిల్లా యుద్ధం కొనసాగించింది. దాని ఫలితంగా అమెరికా గత ఏడాది అఫ్గాన్ నుంచి వైదొలగింది.

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవటంలో, తమ ప్రధాన శత్రువులను బంధించటంలో అమెరికా వైఫల్యానికి ప్రధాన కారణం.. 2003లో ఇరాక్ మీద సైనిక దండయాత్ర చేపట్టటం వల్ల అఫ్గాన్‌లో సీఐఏ వనరులు, సైనిక వనరులు తరిగిపోవటమేనని గారీ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
అమెరికా మీద 9/11 దాడులకు ఇరాక్‌కు ఏదో సంబంధం ఉందని నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ ప్రభుత్వం తొలుత వాదించింది. అయితే.. ఆ దాడులకు, ఇరాక్‌కు ఏదైనా సంబంధం ఉందనేది తాను ఎన్నడూ నమ్మలేదని గారీ పేర్కొన్నారు.
''ఇక్కడ (అఫ్గాన్‌లో) మారుమూల ప్రాంతాల్లోని శిబిరాల్లో, స్థావరాల్లో ఉన్న సీఐఏ సిబ్బంది సంఖ్యను తగ్గించారు. ఇరాక్ మీద దండయాత్ర కోసం అక్కడ సిబ్బందిని పెంచాల్సిన అవసరం రావటం దీనికి కారణం. దానికి నిజంగా మేం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అప్పటివరకూ ఉన్న వేగాన్ని, పైచేయిని కోల్పోయాం'' అని గారీ 2005లో ఎన్‌పీఆర్‌తో మాట్లాడుతూ చెప్పారు.
అఫ్గాన్ దండయాత్ర తర్వాత కొన్నేళ్లకు గారీ పదవీ విరమణ చేశారు. అక్కడ ఆపరేషన్ గురించి 'ఫస్ట్ ఇన్' పేరుతో 2005లో ఒక పుస్తకం ప్రచురించారు.
ఆయన పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాల తర్వాత కూడా.. బిన్ లాడెన్ మిత్ర సంస్థలు గారీని ఒక టార్గెట్గానే పరిగణించాయి. 2013లో అతడిని తాము చంపామని సోమాలీ మిలిటెంట్ గ్రూప్ అల్-షాబాబ్ ట్విటర్‌లో చెప్పుకొచ్చింది. అయితే అలాంటి ప్రకటనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. గారీ ష్క్రోయెన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నరని అమెరికా అధికార వర్గాలు అప్పుడు ఎన్‌బీసీతో చెప్పాయి.
గారీ ష్క్రోయెన్ మిషన్ వర్జీనియాలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో సజీవంగా ఉంది. 2001 మిషన్‌లో ఆయన ఉపయోగించిన హెలికాప్టర్.. ఆయన మిషన్‌ను గుర్తుచూస్తూ సీఐఏ గ్రౌండ్స్‌లోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హరియాణా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 30 ఏళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా ఎలా దాక్కున్నాడు? చివరికి ఎలా చిక్కాడు?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











