అల్ జవహిరి: అల్ ఖైదా నాయకుడిని అమెరికా ఎలా వెతికి పట్టుకుంది? ఎక్కడ చంపింది

ఫొటో సోర్స్, AL SAHAB
అల్ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్ జవహిరి డ్రోన్ దాడిలో హతమైనట్టు అమెరికా వెల్లడించింది. అల్ ఖైదాకు ఇది పెద్ద దెబ్బే.
2011లో అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకుని, చంపిన తరువాత అల్ జవహిరి అల్ ఖైదా పగ్గాలు చేపట్టారు.
అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో అల్ జవహిరి మరణించినట్టు అమెరికా తెలిపింది.
అల్ జవహిరిని ఎలా పట్టుకున్నారు, ఆపరేషన్ ఎలా సాగింది, ఎప్పుడు ప్రారంభమైంది మొదలైన వివరాలను వివిధ న్యూస్ ఏజెన్సీలు, వార్తా సంస్థలు అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. బీబీసీ ప్రతినిధి లైస్ డౌసెట్ నివాసముంటున్న ప్రాంతానికి దగ్గర్లోనే ఈ దాడి జరిగింది.
ఆ కథనాల్లో ఏముందంటే...

ఫొటో సోర్స్, Reuters
ఆదివారం ఉదయం ఒక్కసారి బాంబులు పేలిన శబ్దంతో కాబుల్ నగరం ఉలిక్కి పడిందని బీబీసీ ప్రతినిధి లైస్ డౌసెట్ వెల్లడించారు. తాము నివాసం ఉంటున్న వీధి దగ్గర్లోనే ఈ శబ్ధాలు వినిపించాయని డౌసెట్ వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
అల్ జవహిరి మరణించినట్లు ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిన తర్వాత అసలు ఆ ఖాళీ ఇంటిపై ఎందుకు దాడి చేశారు, దాడి చేయడానికి అందులో ఎవరున్నారు అన్న సందేహాలు వినిపించాయి.
ఆ భవనంలో పని చేస్తున్న కొందరు పనివాళ్లు, అక్కడ ఎవరూ ఉండటం లేదని నాతో చెప్పారు. మేం వెళ్లి చూసే సమయానికి ఆ బాల్కనీ ప్లాస్టిక్ కవర్ తో కప్పేసి ఉంది. చుట్టుపక్కల షాపులను మూసేయాలని తాలిబాన్‌లు ఆదేశించారు.
అక్కడున్న జర్నలిస్టులను తాలిబాన్ గార్డులు వెనక్కి వెళ్లిపోవాలంటూ నెట్టేశారు.
ఆ ఇల్లు దగ్గర్లో ఉన్న వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఈ ఘటన, తాలిబాన్లకు, అమెరికాకు మధ్య 2020లో జరిగిన ఒప్పందాన్ని మరోసారి గుర్తు చేసింది.
ఆపరేషన్ ఎలా సాగిందంటే..
అల్ జవహిరి ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు అమెరికా తీవ్రవాద వ్యతిరేక, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ "జాగ్రత్తగా, ఓపికగా" వ్యవహరించిందని అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
గతంలో అల్ జవహిరి పాకిస్తాన్‌లో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నారని, అఫ్గానిస్తాన్ లోపల దాక్కున్నారని రకరకాల వదంతులు వచ్చాయి.
"అల్ జవహిరికి మద్దతు ఇచ్చే ఒక నెట్‌వర్క్ గురించి అమెరికాకు చాలా ఏళ్లుగా తెలుసు. గత ఏడాది, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కు మరలిన తరువాత, ఆ దేశంలో అల్ ఖైదా ఉనికికి సంబంధించిన సూచనలపై అధికారులు దృష్టి పెట్టారు" అని ఆ అధికారి తెలిపారు. ఆయన పేరు, వివరాలను గోప్యంగా ఉంచమని కోరారు.
ఈ ఏడాది అల్ జవహిరి కుటుంబం.. ఆయన భార్య, కుమార్తె, ఆమె పిల్లలు కాబూల్‌లో ఒక సురక్షిత ప్రాంతంలోని ఇంటికి మారినట్టు అధికారులకు సమాచారం అందింది. ఆ తరువాత అల్ జవహిరి కూడా అదే ఇంట్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
కొన్ని నెలల పాటు అధికారులు అల్ జవహిరి కదలికలను గమనిస్తూ ఉన్నారు. ఆయన అదే ఇంట్లో ఉంటున్నట్టు ధ్రువీకరించుకున్నారు. ఏప్రిల్‌లో ఈ సమాచారాన్ని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు అందించారు. తరువాత, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు జాక్ సుల్లివన్ ఈ సమాచారాన్ని జో బైడెన్‌కు అందించారు.
"మాకు వివిధ స్వతంత్ర సోర్సుల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఆపరేషన్‌కు అందించాం" అని ఆ అధికారి తెలిపారు.
అల్ జవహిరి కాబుల్‌లో ఇంటికి మారిన తరువాత, ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదని, చాలాసార్లు ఆ ఇంటి బాల్కనీలో కనిపించారని ఆయన చెప్పారు.
జవహిరి ఎక్కడున్నాడనే విషయం ఈ ఏడాది ఆరంభంలోనే ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయని బైడెన్ చెప్పిట్లు అల్‌జజీరా వార్తా సంస్థ వెల్లడించింది.
ఆ ఇంటి నిర్మాణాన్ని, స్వభావాన్ని, అందులో నివసిస్తున్న వారిని నిశితంగా పరిశీలించారు. ఇంటి నిర్మాణాన్ని చెడగొట్టకుండా, ఆ ఇంట్లో నివసిస్తున్న అల్ జవహిరి కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఏ హానీ కలగకుండా ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని ఆ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
గత కొన్ని వారాల్లో అమెరికా అధ్యక్షుడు తన కీలక సలహాదారులతో, క్యాబినెట్ మంత్రులతో సమావేశమై, అల్ జవహిరిని చంపడానికి అవసరమైన ఆపరేషన్ గురించి చర్చించారు.
జూలై 1న సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్, ఇతర క్యాబినెట్ మంత్రులు కలిసి బైడెన్‌కు ఆపరేషన్ ప్రణాళికను వివరించారు.
బైడెన్, "అల్ జవహిరి గురించి ఏం తెలిసింది, ఎలా తెలిసిందనే" వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అల్ జవహిరి నివాసముంటున్న ఇంటి మోడల్‌ను బైడెన్‌కు చూపించింది.
ఆ ఇంట్లో వెలుతురు ప్రసరించే మార్గాలు, వాతావరణం, నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి, ఇతర అంశాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు బైడెన్. తమ ఆపరేషన్ విజయవంతం కాకుండా నిరోధించే అంశాలు ఉన్నాయేమో పరిశీలించారని ఆ అధికారి తెలిపారు.
అలాగే, కాబుల్‌లో ఈ ఆపరేషన్ పర్యవసానాలను కూడా అంచనా వేయమని బైడెన్ అధికారులను అడిగారు.
ఇంటర్-ఏజెన్సీ లాయర్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులను నిశితంగా పరిశీలించి, అల్ ఖైదా నాయకుడిగా వ్యవహరిస్తున్న అల్ జవహిరిని చంపడానికి చట్టపరమైన సమ్మతి ఉందని నిర్థరించారు.
జూలై 25న బైడెన్, తన క్యాబినెట్ మంత్రులతో, సలహాదారులతో సమావేశమై, ఈ ఆపరేషన్ నిర్వహిస్తే తాలిబాన్లతో అమెరికా సంబంధాలు ఎలా మారుతాయో చర్చించారని ఆ అధికారి చెప్పారు.
సభ్యుల అభిప్రాయాలు కూడా విన్న తరువాత బైడెన్, పౌరులకు ప్రాణనష్టం కలగకుండా ఆపరేషన్ నిర్వహించే షరతుపై "కచ్చితమైన వైమానిక దాడికి" ఆదేశాలిచ్చారు.
ఎట్టకేలకు జులై 30న స్థానిక సమయం ప్రకారం రాత్రి 9.48కి అమెరికా డ్రోన్ అల్ జవహిరిపై 'హెల్‌ఫైర్' అనే రెండు మిసైల్స్ ప్రయోగించిందని రాయిటర్స్ వివరించింది.
ఈ డ్రోన్ ఎటాక్‌ను సీఐఏ పర్యవేక్షించిందని, దాడి జరిగిన సమయంలో అల్ జవహిరి బాల్కనీలో ఉన్నారని, పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు వెల్లడించినట్లు అల్ జజీరా పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ‘‘రోజుకు ఒక పూటే భోజనం, పిల్లలు రెండో పూట ఆకలితో పడుకుంటున్నారు’’
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
- గే జంటల ముద్దుల పోటీ: పార్కులో ముద్దు పెట్టుకుంటే తిట్టారు... అందుకే
- అవిభక్త కవలలకు వీఆర్ హెడ్‌సెట్స్ పెట్టుకుని సర్జరీ చేసిన డాక్టర్లు... ఆపరేషన్ సక్సెస్
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









