అవిభక్త కవలలకు వీఆర్ హెడ్‌సెట్స్ పెట్టుకుని సర్జరీ చేసిన డాక్టర్లు... ఆపరేషన్ సక్సెస్

సర్జరీ తరువాత కవల పిల్లలు బెర్నార్డో, ఆర్థర్ లీమా

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, సర్జరీ తరువాత కవల పిల్లలు బెర్నార్డో, ఆర్థర్ లీమా
    • రచయిత, షియోనా మెక్‌కల్లం
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

అవిభక్త కవలలు వీణావాణిల గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో వీరిద్దరూ మంచి మార్కులతో విజయం సాధించారు. ఇటీవలే బీబీసీ తెలుగు వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోను ఈ స్టోరీలో కింద ఇచ్చిన లింకులో చూడవచ్చు. అయితే, వారిని సర్జరీ ద్వారా వేరు చేయడం సాధ్యం కాలేదు. వారు అలాగే కలిసి పెరుగుతున్నారు.

కానీ, తాజాగా బ్రెజిల్‌లో అలాంటి అవిభక్త కవలలను డాక్టర్లు విజయవంతంగా విడదీశారు. వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీ ఈ విషయంలో వారికి బాగా ఉపయోగపడింది.

మూడేళ్ల వయసు పైబడిన బెర్నార్డో, ఆర్థర్ లీమా అనే కవలలకు రియో డి జనరేరియోలో శస్త్రచికిత్స చేశారు. ఈ సర్జరీని లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ డైరెక్షన్‌లో పూర్తి చేశారు.

సీటీ, ఎంఆర్ఐ స్కాన్స్ మీద ఆధారపడుతూ వర్చువల్ రియాలిటీ ప్రొజెక్షన్స్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై డాక్టర్ల బృందం కొన్ని నెలల పాటు ట్రయల్స్ నిర్వహించింది.

ఇప్పుడు విజయవంతంగా పూర్తయిన సర్జరీని 'స్పేస్ ఏజ్ ఘనత'గా వర్ణించారు సర్జన్లలో ఒకరైన నూర్ ఉల్ ఓవేస్ జీలానీ.

ఇది ఇంతవరకూ ఎవరూ చేయని అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అని దీనికి నిధులు అందించిన జెమిని అన్‌ట్వైన్డ్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. దీన్ని జీలాని 2018లో స్థాపించారు.

రెండు వేర్వేరు దేశాలలోని సర్జన్లు మొదటిసారిగా హెడ్ సెట్స్ ధరించి 'ఒకే వర్చువల్ రియాలిటీ రూమ్'లో కలుసుకుని ఈ సర్జరీ పూర్తి చేశారని జీలాని చెప్పారు.

ఈ కవలలకు 27 సర్జరీలు జరిగాయి. ఇక తుదిగా చేసిన ఆపరేషన్‌కు ఏకంగా 27 గంటలకు పైనే పట్టింది. దాదాపు 100 మంది వైద్య సిబ్బంది ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు.

బెర్నార్డో, లీమా

ఫొటో సోర్స్, PA Media

వీఆర్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడింది

సర్జరీలో వీఆర్ ఎలా ఉపయోగపడిందన్నది జీలాని పీఏ న్యూస్ ఏజెన్సీకి వివరిస్తూ, "ఇదొక అద్భుతం. పిల్లల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వారి శరీర నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించి శస్త్రచికిత్స చేయడం చాలా గొప్పగా ఉంది" అని అన్నారు.

అలా శరీర నిర్మాణాన్ని చూడగలగడం వల్ల సర్జన్లలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని చెబుతూ, "ఇలాంటి ఆపరేషన్లు చేయడం చాలా కఠినమైన పని. దీన్ని వర్చువల్ రియాలిటీని ఉపయోగించి చేయడం మనిషి మార్స్ మీదకు వెళ్లినట్లుగా ఉంటుంది" అని జీలాని ఉద్వేగంతో చెప్పారు.

గతంలో ఇలా సర్జరీ చేయాలని ప్రయత్నించినా అవి ఫలించలేదు. స్కార్ టిష్యూ మూలంగా ఆ మగ బిడ్డల కణజాల నిర్మాణం మరింత సంక్లిష్టంగా మారింది. దాంతో, డాక్టర్లకే సర్జరీ అంటే భయపడే పరిస్థితి ఎదురైంది.

వర్చువల్ రియాలిటీలో 27 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో జీలాని 15 నిమిషాల చొప్పును నాలుగు సార్లు మాత్రమే బ్రేక్ తీసుకున్నారు. ఏదైనా తినడానికి, కాసిన్ని మంచినీళ్లు తాగడానికే ఆయన ఈ విరామాలు తీసుకున్నారు. కానీ, సర్జరీ ముగిసిన తరువాత ఆ కుటుంబ సభ్యుల్లో కనిపించిన ఆనందం చూడడం అద్బుతంగా తోచిందని ఆయన అన్నారు.

శరీరాలు కలిసిపోయి పుట్టిన కవలలను వేరు చేసినప్పుడు వారిలో రక్తపోటు తీవ్రంగా పెరిగిపోతుంది. గుండె కొట్టుకోవడం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ పిల్లలకు కూడా సర్జరీ పూర్తయిన తరువాత అలాంటి పరిస్తితే ఎదురైంది. సర్జరీ పూర్తయిన నాలుగు రోజుల తరువాత వారిని ఒక చోట చేర్చి, చేయీ చేయీ కలిపిన తరువాత కానీ రక్తపోటు సాధారణ స్థితికి రాలేదు.

ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న ఈ కవలలను ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండే విధంగా పునరావాసం కూడా ఏర్పాటు చేశారు.

బెర్నార్డో, లీమా

ఫొటో సోర్స్, PA Media

కొత్త జీవితం

జెమిని అన్‌ట్వైన్డ్ సంస్థ ద్వారా జీలాని ఇలాంటి అవిభక్త కవలలను విడదీసే సర్జరీ చేయడం ఇది ఆరోసారి. ఆయనగతంలో పాకిస్తాన్, సూడాన్, ఇజ్రాయల్, టర్కీ దేశాలకు చెందిన జంట కవలలను శస్త్రచికిత్సతో వేరు చేశారు. బ్రెజిల్‌లోని ఎస్టాడువల్ సెరెబ్రే పాలో నీమెయర్ ఇనిస్టిట్యూట్‌లోని పీడియాటిక్ సర్జరీ అధిపతి డాక్టర్ గాబ్రియెల్ ముఫారెజ్‌తో కలిసి తాజా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ జంట కవలలకు రెండున్నరేళ్లుగా సంరక్షణ కల్పిస్తున్న ఆస్పత్రిలోనే పని చేస్తున్న ముఫారెజ్, ఈ శస్త్ర చికిత్సను 'కొత్త జీవితం' ప్రసాదించిన చర్యగా అభివర్ణించారు.

బెర్నార్డో, ఆర్థర్‌ల వయసు ఇప్పుడు దాదాపు నాలుగేళ్ళు. తల మాత్రమే కాదు, మెదడు భాగం కూడా కలిసిపోయి పుట్టిన ఈ పిల్లలు ఇప్పుడు వేరు వేరుగా ఉన్నారు. జెమిని అన్‌ట్వైన్డ్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం, 60,000 జననాల్లో ఒకసారి మాత్రమే అతుక్కుని పుట్టే కవలల జననాలు సంభవిస్తాయి, వారిలో మెదడు అంటుకుపోయి పుట్టేవారు 5 శాతం మాత్రమే ఉంటారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)