ORS Week: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా

డయేరియా
    • రచయిత, శిరీష పాటిబండ్ల
    • హోదా, బీబీసీ కోసం

అతిసారం-ఓఆర్ఎస్.. ఇప్పుడు దీని కోసం మాట్లాడుకోవడం సందర్భం, అత్యవసరం కూడా.

ఏటా జులై ఆఖరు వారాన్ని(25-31వ తారీఖు వరకు) ప్రపంచ ఓఆర్ఎస్ వారోత్సవంగా నిర్వహిస్తున్నారు.

జులైలో విస్తారమైన వర్షాలు కురుస్తాయి. దానివల్ల నీరు-ఆహారం కలుషితం అవుతాయి. దీంతో పిల్లల నుండి పెద్దల వరకు చాలామందిని ఇబ్బంది పెట్టే వ్యాధి అతిసారం(డయేరియా).

ఓఆర్ఎస్ సాయంతో ఈ అతిసార వ్యాధుల్ని మెరుగ్గా ఎదుర్కోవచ్చు. అందుకే ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఓఆర్ఎస్ వారోత్సవాలను నిర్వహిస్తుంటారు.

ఈ సంవత్సరం కూడా ఒక మంచి నినాదంతో ఓఆర్ఎస్ వారోత్సవాల్ని జరుపుతున్నారు. అదే 'జోడి నంబర్-1 ORS – జింక్’.

వర్షాకాలానికి అతిసార వ్యాధులకు ఎంత దగ్గర సంబంధముందో, అతిసార చికిత్సకు- ఓఆర్ఎస్‌కు అంతే సంబంధం ఉందన్నమాట. అందుకే ఓఆర్ఎస్ వీక్ సందర్భంగా అతిసారం/డయేరియా - దానివల్ల జరిగే అనర్ధాలు గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓఆర్ఎస్ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

డయేరియా

ఫొటో సోర్స్, AFP

డయేరియా అంటే ఏమిటి?

ఉన్నట్లుండి రెండు కన్నా ఎక్కువసార్లు పెద్ద పెద్ద నీళ్ల విరోచనాలు అవ్వడాన్ని డయేరియా అంటారు. దీనితోపాటు జ్వరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కోసారి, ముందుగా పుల్ల తేన్పులు, వాంతులు, కడుపులో నొప్పిగా మొదలై, ఒకటి రెండు రోజుల తర్వాత నీళ్ల విరేచనాలు కూడా మొదలవవచ్చు.

డయేరియా ఎందుకు వస్తుంది?: చాలా వరకు వైరల్, కొంతవరకు బ్యాక్టీరియా అవి వదిలే విష పదార్థాలే డయేరియాకు కారణం. అరుదుగా కొన్ని రసాయనాలు, పాడైన నూనెలు, అతిగా మసాలాలు కూడా జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి.

వర్షాలు, ముసిరే ఈగలు- కీటకాలు మోసుకొచ్చే వైరస్‌లు డయేరియాకు ప్రధాన కారణం. అందుకే యాంటీబయాటిక్స్‌తో పెద్దగా ఉపయోగం లేదు.

డయేరియా కారక వైరస్‌ను గుర్తించడం కష్టం. యాంటీ వైరల్ మందులు ఏ వైరస్ కని ఇవ్వగలం. అందుకే డయేరియా వల్ల జరిగే అనర్ధాన్ని అరికట్టడమే మందు. అదే ఓఆర్ఎస్.

పిల్లల్లో డయేరియా మరికొంచెం ఎక్కువ ప్రమాదకరం. ఓఆర్ఎస్ విరివిగా వాడకంలోకి రాని రోజుల్లో భారత దేశంలో ఐదేళ్ల లోపు పిల్లల్లో మరణాలకు అతిపెద్ద కారణం డయేరియానే. ఓఆర్ఎస్ వాడకం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఎందరో పసిపిల్లలు మృత్యువాత పడకుండా అడ్డుకోగలుగుతున్నారు.

అయినా ఇప్పటికీ ఓఆర్ఎస్ గురించిన పూర్తి అవగాహన మన దేశంలో పదిశాతం మందికి కూడా లేదు. డయేరియాలో ఓఆర్ఎస్ వాడాలని తెలిసినా, దాని చుట్టూ సవాలక్ష అపోహలు అల్లుకుని ఉన్నాయి.

డయేరియా

ఫొటో సోర్స్, iStock

చాలామందికి ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది.అతిసారం వల్ల అంత నీరు పోతే శరీరంలోంచి, నీళ్లు తాగితే సరిపోదా అని!..

సరిపోదు. ఎందుకంటే విరోచనాల్లో శరీరం నీటితోపాటు ఎన్నో ఉప్పు కణాలను సైతం కోల్పోతుంది. ఆ హెచ్చుతగ్గుల్ని సరి చేసుకోవడం కోసం శరీర కణాలు రకరకాల మార్పులు చేసుకుంటాయి. కానీ ఒక మోతాదు మించితే ఆ అసమతుల్యతను సరి చేసుకోవడం మన శరీరం వల్ల కాని పనవుతుంది. అంతేకాకుండా పిల్లల్లో అతిసారం వల్ల ఎంతో శక్తి కూడా ఖర్చయిపోతుంది.

అందుకే నీటితోపాటు, సోడియం, పొటాషియం, లాక్టేట్ వంటి లవణాలు, గ్లూకోజ్ శరీరానికి అందాలి. అలాగే పేగుల్లోంచి వంట్లోకి తగినంత నీరు శరీరంలోకి వెళ్లాలంటే దానికి కూడా సోడియం, గ్లూకోజ్ అవసరం. కాబట్టి కేవలం నీరు సరిపోదు.

ఓఆర్ఎస్‌లో అన్ని లవణాలు సమపాళ్లలో ఉంటాయి. శరీర ఉప్పు సాంద్రత (Osmolality)కు అణుగుణంగా వీటిని రూపొందింస్తారు. అందుకే అన్ని తాగే ద్రావకాలు ఓఆర్ఎస్ కావు.

ఆసుపత్రుల్లో, మందుల షాపుల్లో దొరికే ఓఆర్ఎస్ 20 గ్రాముల పొడి ప్యాకెట్టు దాదాపుగా 245 మోల్స్ సాంద్రత కలిగి ఉంటుంది. దీన్ని ఒక లీటరు కాచి చల్లార్చిన నీటిలో కలపడానికి రూపొందిస్తారు.

డయేరియా

ఫొటో సోర్స్, Getty Images

ఓఆర్ఎస్ ఎంత తాగాలి? తాగగలిగినంత.

పిల్లలైనా, పెద్దలయినా సరే ఒక లీటరు నీటిలో ఒక ప్యాకెట్ కలిపి, తాగగలిగినంత తాగాలి. పసి పిల్లలకైతే ఉగ్గు గిన్నెతో పట్టొచ్చు. పిల్లలకు వయస్సు- బరువును బట్టి పావు లీటర్ నుండి 2-3 లీటర్ల వరకూ తాగించవచ్చు. పెద్దవాళ్లు కూడా 2-3 లీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ తాగాలి.

ఉదాహరణకు పిల్లలకు ఒకసారి నీళ్ల విరోచనం అయితే 50-100 మిల్లీ ఓఆర్ఎస్ తాగించాలి.

ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో లేకపోతే?

ఇది చాలామందికి తెలిసిందే. ఒక గ్లాసుడు కాచి చల్లార్చిన నీటిలో, చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపినా అది ఇంచుమించుగా స్టాండర్డ్ ఓఆర్ఎస్‌లా తయారవుతుంది.

డయేరియా

ఫొటో సోర్స్, Getty Images

ఓఆర్ఎస్ లాంటి ఇతర పానీయాలు

  • ఉప్పు వేసిన గంజి నీళ్లు
  • మజ్జిగ ఉప్పుతో
  • ఉప్పు వేసిన బార్లీ నీళ్లు
  • కొబ్బరి నీళ్లు
  • ఉప్పు పంచదార వేసి సగ్గుబియ్యం ఉడికించిన నీళ్లు

ఇవి కూడా డయేరియాలో శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను, సోడియం, పొటాషియంను తగు మోతాదులో అందించగలవు.

డయేరియా

ఫొటో సోర్స్, Getty Images

ఓఆర్ఎస్ విషయంలో సహజంగా చాలామంది చేసే పొరపాట్లు

  • ఒక లీటరు నీటితో కాకుండా ఎక్కువ లేదా తక్కువ నీటితో కలపడం
  • శుభ్రంగా లేని నీటితో కలపడం
  • కొంచెం నీళ్లలో కొంచెం ఓఆర్ఎస్ పొడిని కలపడం
  • కలిపి ఉంచిన ఓఆర్ఎస్ నీళ్లను తదుపరి రోజు కూడా వాడటం.
  • ఆహారం మానేసి ఇక ఎంతసేపూ ఓఆర్ఎస్‌ను తాగించడం.
వీడియో క్యాప్షన్, మనకు వచ్చిన జ్వరం డెంగీ అని ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

తరచూ చేసే మరికొన్ని తప్పులు

ఫ్యాన్సీగా, కూల్ డ్రింక్ కార్టన్ లాంటి వాటిలో లభ్యమయ్యే ఓఆర్ఎస్ మాత్రమే మంచిదనుకోవడం

కాఫీ, టీ, కోలా డ్రింక్స్ వంటివి కూడా ఓఆర్ఎస్‌లా పనిచేస్తాయని అనుకోవడం.

విరేచనాలు అవుతున్నప్పుడు పసిపిల్లలకు తల్లి పాలు ఆపడం, ఆహారం ఇవ్వకపోవడం.

ఆహార లోపం వల్ల డయేరియాతో మరింత నీరసమవడమే తప్ప ఒరిగే మంచేమీ లేదు. ఎటొచ్చీ జీర్ణకోశాన్ని తేలికపరచే ఆహారం తీసుకోవాలి. అన్నం, చప్పిడి పప్పు, అరటి పండు, పెరుగు, మజ్జిగలాంటివి మంచివి.

డయేరియా

ఫొటో సోర్స్, Getty Images

ఓఆర్ఎస్‌ను డయేరియాలోనే కాకుండా కొన్ని ఇతర అనారోగ్యాల్లో సైతం వాడొచ్చు

  • ఎండలో/వేడిలో ఎక్కువ సేపు పనిచేయడం, వడదెబ్బ కొట్టినప్పుడు
  • బాగా ఆటలాడిన తర్వాత లేదా శారీరక వ్యాయామం తర్వాత
  • కాలిన గాయాలు ఉన్నప్పుడు
  • పెద్ద పెద్ద శస్త్ర చికిత్సల తర్వాత
  • వాంతులు అవుతున్నప్పుడు

కిడ్నీ ఫెయిల్యూర్, మధుమేహం, తీవ్ర పోషకాహార లోపం ఉన్నవాళ్లు మాత్రం డాక్టరు సూచనల మేరకు ఓఆర్ఎస్ వాడాలి.

డయేరియా

ఫొటో సోర్స్, Getty Images

ఈ విధంగా తీవ్ర డీహైడ్రేషన్ స్థితిలో ప్రాణాపాయం నుండి గట్టెక్కించే సంజీవని ఓఆర్ఎస్. చౌకగానూ, సులభంగానూ దొరుకుతుంది. రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో వైరల్ డయేరియాల్లో ఏకైక ఓషధి ఓఆర్ఎస్.

ఓఆర్ఎస్, జింక్ సిరప్/టాబ్లెట్ పది నుండి ఇరవై మి. గ్రా.ల వరకు ఇవ్వడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య అదుపులో ఉంటుంది. పేగుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. డయేరియా త్వరితగతిన తగ్గుతుంది. అందుకే ఈ ఏడాది ఓఆర్ఎస్ వారోత్సవ నినాదం “జోడి నెం: 1 ORS-Zinc”.

వీడియో క్యాప్షన్, మంకీపాక్స్ ఎలా వస్తుంది, దీని లక్షణాలేంటి?

జాగ్రత్తలు తప్పనిసరి

డయేరియాలో, ఓఆర్ఎస్ తీసుకుంటున్నా, కొన్ని ప్రమాద చిహ్నాలు గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా పిల్లల్లో-

  • ఆగకుండా వాంతులవుతూ ఓఆర్ఎస్ తాగలేకపోతున్నా,
  • తీవ్ర జ్వరంతో డయేరియా ఉన్నా,
  • గుండె దడగా ఉన్నా,
  • మగతగా ఉన్నా, స్పృహ తగ్గుతుందనిపించినా
  • కాళ్లు చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉన్నా,
  • పిల్లల్లో ఫిట్స్ వస్తున్నా,
  • కళ్లు నోరు పొడిబారుతున్నా,
  • రెండు రోజులకు మించి విరేచనాలు తగ్గకపోయినా,
  • మూత్రం రావడం తగ్గినా, ఆగిపోయినా….

నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి.

వీడియో క్యాప్షన్, ‘చచ్చిపోతాననే అనుకున్నా’ - మంకీపాక్స్ నుంచి కోలుకున్న ఓ రోగి అనుభవం

డయేరియా నివారణ మార్గాలు

  • కాచి చల్లార్చిన నీటిని త్రాగండి
  • బయట తిండికి దూరంగా ఉండండి
  • కాలకృత్యాల తరువాత, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోండి
  • ప్రయాణాలు, యాత్రలకు వీలైనంతవరకూ దూరంగా ఉండండి
  • ఈగలు దోమలు రాకుండా ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత పాటించండి

బడికెళ్లే పిల్లలు తాగే నీరు, తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. రెండు పూటలో స్నానం చేయమనండి. పూర్తి రెండు నిమిషాలు చేతులు కడుక్కోవడం అలవాటు చేయండి.

(రచయిత వైద్యురాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)