World Allergy Day: అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు

ఫొటో సోర్స్, Thinkstock
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అలర్జీ సమస్యపై అవగాహగాన కల్పించేందుకు జులై 8 న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ అలర్జీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఏఓ)లు ప్రపంచ అలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. ఇటీవలే ప్రపంచ అలర్జీ సంస్థ (డబ్ల్యూఏఓ)... జూన్ 5 నుంచి జూన్ 11 వరకు ప్రపంచ అలర్జీ వీక్‌ను నిర్వహించింది. అలర్జీల గురించి అవగాహన కల్పించడంతో పాటు వైద్య రంగంలో జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా చర్చించింది.
ఈ ఏడాది ముఖ్యంగా ఆస్థమాపై అవగాహన కల్పించాలని భావించారు. అందుకే ఆస్థమా థీమ్‌తో ఈ వీక్‌ను నిర్వహించారు. అలర్జీలు ఎలా వస్తాయి? అవి రావడానికి కారణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి మాట్లాడేందుకు పల్మనాలజిస్ట్, అలర్జీ స్పెషలిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ వ్యాకరణం నాగేశ్వర్‌ను బీబీసీ సంప్రదించింది. అలర్జీల గురించి పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఫొటో సోర్స్, Getty Images
1. అలర్జీ అంటే ఏంటి?
అలర్జీ అంటే ఏదో పెద్ద వ్యాధి అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ, అది కరెక్ట్ ఆలోచన కాదు. అలర్జీ అంటే శరీరం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నమాట.
అంటే, మనం ఆహరం లేదా గాలిని బయట నుంచి తీసుకొని లోపలికి పంపిస్తాం. అవి శరీరంలోకి వెళ్లినప్పుడు, మన శరీరం స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా స్పందిస్తుంది. మోతాదు కంటే ఎక్కువగా స్పందిస్తే దాన్ని అలర్జీ లేదా హైపర్ సెన్సిటివిటీ అంటారు.
2. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి?
చాలామందిలో అలర్జీలు కనిపిస్తుంటాయి. ఇవి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వంశపారంపర్యం అయితే, మరొకటి పర్యావరణంలో మార్పులు, వాయు కాలుష్యం వల్ల కూడా అలర్జీలు కలుగుతాయి.
తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఉంటే పుట్టబోయే పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ అలర్జీ సమస్య ఉంటే పిల్లలు వీటి బారిన పడే అవకాశం 70 శాతం అని శాస్త్రీయంగా తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
3. ఎలాంటి అలర్జీలు ఎక్కువగా బాధిస్తాయి?
అలర్జీ అనేది రక్త కణాలు ప్రవహించే ప్రతీచోటా వ్యాపిస్తుంది. కానీ, దీని ప్రభావం మరీ ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఎక్కువగా కనబడుతుంది. ఊపిరితిత్తుల్లో అలర్జీ కేంద్రీకృతమై ఉండటం వల్ల శ్వాసగొట్టాలు మూసుకుపోయి, పొడి దగ్గు, ఆస్థమాతో ఎక్కువగా బాధ పడుతుంటారు.
ఒకవేళ ముక్కులో అలర్జీ ఏర్పడితే తరచూ తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం జరుగుతుంది. చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు సర్జరీ చేయించుకుంటారు. కానీ, కొంతకాలానికి ఇది తిరిగి వస్తుంది. దీన్నే అలర్జిక్ రైనటిస్ అంటారు.
అలర్జీ కళ్ళలోకి చేరితే కళ్లు ఎర్రబారడం, నీరు కారడం జరుగుతుంది. దీన్ని అలర్జీ కంజెక్టివైటిస్‌గా వ్యవహరిస్తారు. చర్మం మీద వ్యాప్తి చెందితే దురదలు, దద్దుర్లు వస్తాయి. కొంత మందికి సైనోసైటిస్ వస్తుంది. వీటితో పాటు పెదాలు, కళ్లు, ముక్కు వంటి అవయవాలకు వాపు రావడం కూడా చాలామందిలో కనబడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
4. ఇది ప్రమాదకరమా?
అలర్జీ మొదట ఒక అవయవంలో ప్రారంభం అవుతుంది. దాని కోసం తాత్కాలికంగా మందులు, ఇన్హేలర్లు వంటివి వాడవచ్చు. ఆ సమస్య అప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ, కొంత కాలానికి ఆ అలర్జీ మరో అవయవానికి సోకుతుంటుంది. ఉదాహరణకు ఆస్థమా ఉన్న వారికి మందులు వాడిన తరువాత ఆస్థమా తగ్గిపోయి... చర్మంపై లేదా ముక్కులో దాని ప్రభావం చూపించవచ్చు. పిల్లల్లో ఈ అలర్జీని అటోపిక్ మార్చ్‌గా పిలుస్తారు. అలర్జీలు బాగా ముదిరిపోతే వాటిని నియంత్రించలేని పరిస్థితికి చేరుకుంటాం.
5. ఎలా గుర్తించాలి?
అలర్జీలను గుర్తించడానికి గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ లేదా మాడిఫైడ్ అలెర్జిన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. నిర్ధారణ పరీక్షల ద్వారా అలర్జీ రకాన్ని గుర్తించవచ్చు. మందులు వాడినప్పుడు అలర్జీ తగ్గిపోయి తరచుగా తిరగబెడుతుంటే డాక్టర్ సలహా ప్రకారం ఈ టెస్టులకు హాజరవ్వాలి. అలర్జీ ఇమ్యునాలజీ చికిత్స కూడా అందుబాటులో ఉంది .

ఫొటో సోర్స్, Getty Images
6. ఎంతమంది అలర్జీ బారిన పడుతున్నారు?
భారత్‌లో సుమారు 25 నుంచి 30 కోట్ల మంది వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే సుమారు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది అలర్జీలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చర్మ సంబంధిత అలర్జీలు, ఈఎన్‌టీ, చెస్ట్‌కు సంబంధించిన అలర్జీలు ఎక్కువ. వంశపారంపర్యంగా అలర్జీ ఉండి దాని లక్షణాలు కనబడితే సంబంధిత డాక్టరుని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినడం తగ్గించడం, సరైన సమయంలో అలర్జీలను గుర్తించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాంతక స్థితి నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏడాదికి 10 లక్షల ఆదాయం ఉన్నా టాక్స్ 100 రూపాయలే
- కోవిడ్‌తో చనిపోయిన భర్త అస్థికలను ఆమె లాకెట్లో పెట్టుకుని బతుకుతున్నారు...
- అమెరికాలో మండిపోతున్న ధరలు... 40 ఏళ్ల గరిష్టానికి పెరిగిన ద్రవ్యోల్బణం
- పీటర్ ద గ్రేట్‌తో తనను పోల్చుకున్న పుతిన్.. యుక్రెయిన్ యుద్ధం ఆక్రమణే అని చాటిన రష్యా అధ్యక్షుడు
- కోవిడ్ వల్ల వాసన శక్తి కోల్పోయినప్పుడు ఎదురయ్యే 6 సమస్యలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













