పీటర్ ద గ్రేట్‌తో తనను పోల్చుకున్న పుతిన్.. యుక్రెయిన్ యుద్ధం ఆక్రమణే అని చాటిన రష్యా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Universal History Archive/Getty Images
- రచయిత, సారా రేన్స్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ తూర్పు యూరప్ ప్రతినిధి
పీటర్ ది గ్రేట్ పట్ల వ్లాదిమిర్ పుతిన్‌కు చాలా ఆరాధనాభిమానాలున్నాయనే విషయం తెలిసిందే. అయితే.. పుతిన్‌కు తన 'గ్రేట్'నెస్ మీద కూడా ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆయన బాహాటంగా తనను తాను 18వ శతాబ్దపు రష్యా చక్రవరి పీటర్ ది గ్రేట్‌తో పోల్చుకున్నారు. ఇప్పుడు తను యుక్రెయిన్ మీద చేస్తున్న దండయాత్రను మూడు శతాబ్దాల కిందట పీటర్ సామ్రాజ్య విస్తరణ యుద్ధాల వంటివని చెప్పుకొచ్చారు.
తద్వారా.. తను చేస్తున్న ఈ యుద్ధం భూమిని ఆక్రమించుకోవటం కోసమని అత్యంత బలంగా చాటారు.
సామ్రాజ్య నిర్మాణం పట్ల పుతిన్‌కు ఉన్నట్లుగా కనిపిస్తున్న ఆకాంక్షలు యుక్రెయిన్‌కు దుష్టంగా కనిపించాయి. ఎస్తోనియా సహా పొరుగు దేశాలకు ఆగ్రహం తెప్పించాయి. పుతిన్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఆ దేశాలు స్పందించాయి.

ఫొటో సోర్స్, EPA
యువ శాస్త్రవేత్తలు, వాణిజ్యవేత్తలతో సమావేశం సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ, టెక్నాలజీ అభివృద్ధి గురించి మాట్లాడటానికి ముందు.. రాజకీయాలు, అధికారం గురించి ఆయన మాట్లాడారు. 'భౌగోళిక రాజకీయాల్లో ఆధిపత్యం కోసం జరుగుతున్న కొత్త పోరాటం' గురించి చెప్తూ.. ఈ విషయంలో పీటర్ ది గ్రేట్ ఆదర్శనీయుడని పేర్కొన్నారు.
పీటర్ సరికొత్త రష్యా సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమంలో 18వ శతాబ్దపు ఆరంభంలో ప్రారంభించిన ఉత్తరాది యుద్దాల గురించి ప్రస్తావిస్తూ.. ''ఆయన స్వీడన్‌తో యుద్ధం చేస్తున్నాడని, వారి భూములను ఆక్రమిస్తున్నాడని మీరు భావించవచ్చు. కానీ ఆయన దేనినీ ఆక్రమించుకోలేదు. పోయిన దానిని తిరిగి తెచ్చుకున్నాడు'' అని వ్యాఖ్యానించారు.
తద్వారా స్లావ్ ప్రజలు శతాబ్దాలుగా రష్యా భూభాగంలో నివసించారని వాదించారు.
''మళ్లీ తిరిగి తెచ్చుకుని బలోపేతం చేయాల్సిన బాధ్యత మన మీద పడినట్లు కనిపిస్తింది'' అని పుతిన్ ముక్తాయించారు. ఈ మాటలు యుక్రెయిన్‌ను, అక్కడ తన లక్ష్యాల గురించే అన్నారన్నది స్పష్టం.
రష్యాను విస్తరించటం ద్వారా దేశం బలోపేతం అవుతుందనటానికి పిటర్ పరిపాలన సాక్ష్యమని పుతిన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్ ఇటీవలి కాలంలో రష్యా చరిత్ర గురించి ఉదహరించటం ఎక్కువగా జరుగుతోంది. తన ప్రస్తుత లక్ష్యాలకు అనుగుణంగా జాగ్రత్తగా వడకట్టి ఆ చరిత్రను ఉటంకిస్తున్నారు.
యుక్రెయిన్ మీద సైనిక దాడి చేయటానికి కొన్ని నెలల ముందు పుతిన్ ఓ భారీ వ్యాసం రాశారు. యుక్రెయిన్‌కు స్వతంత్ర దేశంగా మనుగడ సాగించే హక్కు లేదన్నట్టుగా అందులో వాదించారు.
రష్యా తన పొరుగుదేశమైన యుక్రెయిన్ మీద పిబ్రవరి 24వ తేదీన దండయాత్ర మొదలుపెట్టినపుడు.. యుక్రెయిన్‌ను 'నాజీరహితం' చేయటానికి, రష్యాకు ఉన్నట్లుగా భావిస్తున్న ముప్పును తగ్గించటానికి తూర్పు డోన్బాస్ ప్రాంతానికి పరిమితమయ్యే 'స్పెషల్ ఆపరేషన్' అని పుతిన్ బొంకారు.
కానీ ఆయన ఆ మాటలు చెప్తుండగానే.. ఆయన సైనిక బలగాలు కీయెవ్‌ను చుట్టుముడుతూ, పశ్చిమాన ఇంకా ఆవలి ప్రాంతం మీద కూడా బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ దండయాత్ర మొదలై 100 రోజులు దాటాక.. యుక్రెయిన్ భూభాగంలో ఐదో వంతు భాగం రష్యా సైన్యం నియంత్రణలో ఉంది. అక్కడి కీలుబొమ్మ పాలనాయంత్రంగాలు తమ ప్రాంతాలు రష్యాలో చేరే అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణలు నిర్వహిస్తామని మాట్లాడుతున్నాయి.
ఇప్పుడిక తన 'ఆపరేషన్' నిజానికి భూభాగాన్ని ఆక్రమించటమేనని పుతిన్ ధైర్యంగా అంగీకరిస్తున్నారు.
ఈ వాస్తవాన్ని పశ్చిమ దేశాలు చివరికి అంగీకరిస్తాయని ఆయన నమ్ముతున్నట్లు కూడా కనిపిస్తోంది.
''ఆ కాలంలో.. రష్యా కొత్త రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను స్థాపించిన ప్రాంతాన్ని ఏ ఒక్క యూరప్ దేశమూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు అన్ని దేశాలూ గుర్తిస్తున్నాయి'' అని పుతిన్ చెప్పుకొచ్చారు.
పుతిన్ వ్యాఖ్యలు బాల్టిక్ దేశాలను కూడా కలవరపరుస్తున్నాయి. ఎస్తోనియా విదేశాంగ మంత్రిత్వశాఖ తమ దేశంలోని రష్యా రాయబారిని పిలిపించి.. ఇప్పుడు ఎస్తోనియాలో ఉన్న నార్వా మీద పీటర్ ది గ్రేట్ చేసిన దాడిని రష్యా భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, బలోపేతం చేయటంగా పుతిన్ ప్రస్తావించటాన్ని ఖండించింది.
పుతిన్ చరిత్రను తనకు కావలసిన విధంగా కొన్న భాగాలను ఎంచుకుని ఉపయోగిస్తారు.
పుతిన్ ది గ్రేట్ క్రూరమైన నిరంకుశ పాలకుడే అయినా.. పశ్చిమ దేశాల ఆలోచనలు, సైన్స్, సంస్కృతిని చాలా అభిమానించేవాడు. సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాన్ని 'యూరప్‌కు కిటికీ'గా నిర్మించాడు. రష్యాను ఆధునికత వైపు మళ్లించటం కోసం విజ్ఞాన దాహంతో యూరప్ ఖండంలో పర్యటించాడు.
పుతిన్ పాలనలో అణచివేత అంతకంతకూ పెరుగుతూ పోతోంది. పశ్చిమ దేశాలకు ఆ కిటికీని మూసివేశారు: యుక్రెయిన్‌లో యుద్ధం దానిని మూసివేసింది. ఒకప్పుడు రష్యా జార్ చేసినట్లుగా.. స్ఫూర్తి పొందటం కోసం హాలండ్‌లో కానీ గ్రీన్‌విచ్‌లో కానీ పుతిన్ పర్యటించటమనే ఆలోచన ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తోంది.
యువ పారిశ్రామికవేత్తలకు పద్దెనిమిదో శతాబ్దపు జార్ గురించి పుతిన్ ఉపన్యాసిస్తున్నపుడు.. వారి వెనుక కొన్ని పదాలు ఫ్లాష్ అవుతూ కనిపించాయి: 'భవిష్యత్తు', 'ఆత్మవిశ్వాసం', 'విజయం'.
పశ్చిమ దేశాల ఖండనమండనలు, ఆంక్షల మధ్య.. ధిక్కార చిత్రాన్ని ప్రదర్శించటానికి పుతిన్ కంకణం కట్టుకున్నారు. ఆయన కలతకు గురైనట్లుగా కాకుండా థిలాసాగా ఉన్నట్లు కనిపించారు.
బహుశా చరిత్ర పుస్తకాల్లో మరో పాఠం ఉందేమో.
పీటర్ ది గ్రేట్ చివరికి బాల్టిక్ దేశాల నుంచి నల్ల సముద్రం వరకూ భూమిని జయించారన్నది నిజమే. కానీ రష్యా అప్పుడు మహా ఉత్తర యుద్ధాన్ని 21 ఏళ్ల పాటు సాగించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















