యుక్రెయిన్‌లో ‘యుద్ధ నేరాలకు’ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విచారించటం సాధ్యమేనా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డొమినిక్ కాసియాని
- హోదా, లీగల్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్
రష్యా - యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక నిర్వహించిన తొలి యుద్ధ నేరాల విచారణలో.. ఓ రష్యా సైనికుడు నిరాయుధుడైన పౌరుడు ఒకరిని చంపినట్లు అంగీకరించారు.
ఈ యుద్ధంలో 10,000కు పైగా యుద్ధ నేరాలను గుర్తించినట్లు యుక్రెయిన్ చెప్తోంది. ఈ ఆరోపణలను రష్యా ప్రభుత్వం తిరస్కరిస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కూడా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని యుక్రెయిన్‌కు పంపించింది.
యుద్ధ నేరం అంటే ఏమిటి?
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ చెప్పినట్లు.. అలా కనిపించకపోవచ్చును కానీ ''యుద్ధానికి కూడా నిబంధనలు ఉంటాయి''.
జెనీవా కన్వెన్షన్లు అని పిలిచే ఒడంబడికలతో పాటు పలు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల్లో ఈ నిబంధనలు ఉంటాయి.
వీటి ప్రకారం.. పౌరుల మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేయటానికి వీలు లేదు. అలాగే పౌరుల మనుగడకు కీలకమైన మౌలిక సదుపాయాల మీద కూడా ఉద్దేశపూర్వకంగా దాడి చేయరాదు.
యుద్ధాల్లో కొన్నిరకాల ఆయుధాల వినియోగం కూడా నిషిద్ధం. దాడిలో విచక్షణారహితంగా ఉండే, లేదా దారుణ బాధను కలిగించే.. మందుపాతరలు, రసాయన, జీవ ఆయుధాల వంటివి ఉపయోగించకూడదు.
గాయపడ్డ సైనికులకు యుద్ధ ఖైదీల హక్కులు ఉంటాయి. అలాంటి వారితో సహా జబ్బుపడ్డ వారికి, గాయపడ్డ వారికి సాయం అందించి తీరాలి.
హత్య, అత్యాచారం, ఒక బృందాన్ని సామూహికంగా చంపేయటం వంటి వాటిని ''మానవాళి మీద నేరాలు''గా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో 'జాతి హననం/నరమేధం'గా కూడా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా సైనికుడు ఏం చేశాడు?
రష్యా యుద్ధ ట్యాంక్ కమాండర్ వదిమ్ షిషిమారిన్ అనే ఆ 21 ఏళ్ల సైనికుడు.. యుక్రెయిన్ మీద రష్యా సైనిక దండయాత్ర మొదలైన కొద్ది రోజులకు ఓ 62 ఏళ్ల వ్యక్తిని తలలో తుపాకీతో కాల్చినట్లు అంగీకరించాడు.
నిరాయుధుడైన ఆ పౌరుడిని చంపాల్సిందిగా షిషిమారిన్‌కు ఆదేశాలిచ్చారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
అతడిని కీయెవ్ జిల్లా జైలులో విచారించారు. అతడికి యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశముంది.
''యుక్రెయిన్‌లో నేరాలకు పాల్పడేందుకు ఆదేశాలిచ్చిన లేదా సాయపడిన ప్రతి ఒక్క వ్యక్తీ, ప్రతి దురాక్రమణదారుడూ.. అందుకు బాధ్యత వహించకుండా తప్పించుకోజాలరని ఈ తొలి విచారణ ద్వారా మేం స్పష్టమైన సంకేతమిస్తున్నాం'' అని యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఐరీనా వెండిక్టోవా ట్వీట్ చేశారు.
పౌరులను హత్య చేయటం, అత్యాచారానికి పాల్పడటం, పౌర మౌలిక వసతులపై బాంబుదాడులు చేయటం, లూటీ చేయటం వంటి నేరాలకు సంబంధించి తాము 41 మంది రష్యా సైనికులపై కేసులను సిద్ధం చేస్తున్నట్లు ఆమె ఇంతకుముందు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఇతర యుద్ధ నేరాల ఆరోపణలేమిటి?
యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇరువురూ ఆరోపించారు.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగర శివార్లలో గల బుచా పట్టణంతో పాటు దాని సమీప ప్రాంతాల్లో పౌరులను ఉద్దేశపూర్వకంగా చంపినట్లు.. పరిశోధకులు, పాత్రికేయులు ఆధారాలను కనుగొన్నట్లు చెప్తున్నారు.
సామూహిక సమాధులను గుర్తించామని, పౌరులను వారి కాళ్లు, చేతులు కట్టేసిన తర్వాత చంపేసినట్లు ఆధారాలను కనుగొన్నామని యుక్రెయిన్ బలగాలు చెప్తున్నాయి.
మార్చి నెలలో మరియుపోల్‌లోని ఒక థియేటర్ మీద రష్యా దాడి చేయటం.. సామూహిక హత్యకు సంబంధించి తొలి నిర్ధారిత ప్రాంతంగా కనిపిస్తోంది. ఆ భవనం వెలుపల 'చిన్నారులు' అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది.
దానికిముందు.. మరియుపోల్‌లోని ఓ ఆస్పత్రి మీద రష్యా గగనతల దాడి చేయటాన్ని యుక్రెయిన్ యుద్ధ నేరంగా అభివర్ణించింది.
అసలు రష్యా దండయాత్రే 'దురాక్రమణ యుద్ధం' కింద ఒక యుద్ధ నేరమని చాలా మంది నిపుణులు వాదిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుమానిత యుద్ధ నేరస్తులను ఎలా విచారించవచ్చు?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పలు కోర్టులు ఏర్పాటయ్యాయి. యుగోస్లేవియా విభజన సందర్భంగా యుద్ధ నేరాలపై దర్యాప్తు చేయటానికి ఏర్పాటై ట్రైబ్యునల్ అందులో ఒకటి.
1994 రువాండా నరమేధానికి బాధ్యులను విచారించటానికి కూడా ఒక కోర్టు ఏర్పాటైంది.
ప్రస్తుతం యుద్ధ నిబంధనలను కాపాడే విషయంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ), ఇంటర్నేషన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)లు రెండిటి పాత్రా ఉంది.
దేశాల మధ్య వివాదాలపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలిస్తుంది. కానీ వ్యక్తులను విచారించజాలదు. ఈ కోర్టులో రష్యా మీద యుక్రెయిన్ కేసు వేసింది.
ఐసీజే రష్యాకు వ్యతిరేకంగా ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిది.
కానీ భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన రష్యా.. తనకు వ్యతిరేకంగా ఉండే ఏ ప్రతిపాదననైనా వీటో చేయగలదు.
ఇక ఆయా దేశాల కోర్టుల ముందు విచారణ ఎదుర్కోని.. యుద్ధ నేరాల నిందితుల మీద దర్యాప్తు చేయటం, విచారించటం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేయగలదు.
1945లో కీలకమైన నాజీ నాయకులను విచారించిన న్యూరెంబర్గ్‌కు శాశ్వత, ఆధునిక వారసత్వ రూపమే ఈ ఐసీసీ.
అంతర్జాతీయ చట్టాన్ని కాపాడటానికి దేశాలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయవచ్చనే సూత్రాన్ని న్యూరెంబర్గ్ బలోపేతం చేసింది.

ఫొటో సోర్స్, Shutterstock
యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలను ఐసీసీ విచారించగలదా?
యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని విశ్వసించటానికి గణనీయమైన ప్రాతిపదిక ఉందని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్, బ్రిటిష్ లాయర్ కరీమ్ ఖాన్ క్యూసీ భావిస్తున్నారు.
దర్యాప్తు అధికారులు గత, ప్రస్తుత ఆరోపణలను పరిశీలిస్తారు. అంటే.. యుక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా తన భూభాగంలో కలుపుకోవటానికి ముందు 2013 నుంచీ ఉన్న ఆరోపణల మీద దర్యాప్తు చేస్తారు.
ఒకవేళ ఆధారాలు ఉన్నట్లయితే.. నిందితులైన వ్యక్తులను ద హేగ్‌లో విచారణకు హాజరుపరిచేలా చేయటానికి అరెస్ట్ వారెంట్లు జారీ చేయాల్సిందిగా ఐసీసీ న్యాయమూర్తులను ప్రాసిక్యూటర్ కోరుతారు.
అయితే ఈ కోర్టుకు తన సొంత పోలీసు బలగం లేదు. కాబట్టి అనుమానితులను అరెస్ట్ చేయటానికి ఆయా దేశాల మీద ఆధారపడుతుంది. కానీ రష్యా ఈ కోర్టు సభ్య దేశం కాదు కాబట్టి.. ఆ దేశం అనుమానితులు ఎవరినైనా ఈ కోర్టుకు అప్పగించే అవకాశం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను, సైనికాధికారులను విచారించే అవకాశం ఉందా?
ఏదైనా యుద్ధ నేరాన్ని.. దానికి ఆదేశించిన నాయకుడి మీద మోపటం కన్నా, దానికి పాల్పడిన సైనికుడి మీద మోపటం చాలా సులభం.
రష్యా బలగాలు పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాయని, ఇతర భీకర అకృత్యాలకు పాల్పడ్డాయని చెప్పటానికి ఆధారాలున్నాయని.. సంఘర్షణల్లో యుద్ధ నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించటంలో విశిష్ట నైపుణ్యమున్న సంస్థ 'హ్యూమన్ రైట్స్ వాచ్' ప్రతినిధి హగ్ విలియమ్స్ అంగీకరిస్తారు.
అయితే.. ఒక నాయకుడు ఏదైనా అకృత్యానికి పాల్పడాల్సిందిగా ఆదేశాలిచ్చారని కానీ, అటువంటి పరిణామాలను చూసీచూడనట్లు వదిలేశారనే అంశాలు సహా యుద్ధ నేరాలకు సంబంధించిన భవిష్యత్ విచారణలకు.. 'చైన్ ఆఫ్ కమాండ్'ను నిరూపించటం చాలా ముఖ్యమని ఆయన చెప్తారు.
ఐసీసీ ''దురాక్రమణ యుద్ధం చేయటం'' అనే నేరం మీద కూడా విచారణ నిర్వహించవచ్చు. స్వీయ రక్షణలో భాగంగా న్యాయబద్ధమైన సైనిక చర్య కాకుండా.. అన్యాయమైన దండయాత్ర లేదా సంఘర్షణ అనే నేరం ఇది.
ఈ నిబంధన మూలాలు న్యూరెంబర్గ్‌లో ఉన్నాయి. శాంతికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు గాను నాజీలను విచారించాలంటూ రష్యా పంపించిన న్యాయమూర్తి మిత్ర పక్షాలను ఒప్పించటంతో ఈ నిబంధన రూపొందింది.
అయితే.. ఈ నిబంధన కింద రష్యా నాయకులను ఐసీసీ విచారించజాలదని, ఐసీసీ సభ్య దేశాల్లో రష్యా లేకపోవటమే దీనికి కారణమని.. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో అంతర్జాతీయ చట్టాల నిపుణుడు ప్రొఫెసర్ ఫిలిప్ సాండ్స్ పేర్కొన్నారు.
ఒకవేళ.. ఈ నేరం మీద దర్యాప్తు చేయాలని ఐసీసీని యూఎన్ భద్రతా మండలి కోరవచ్చు. కానీ దానిని రష్యా వీటో చేయగలదు.
యుక్రెయిన్ మీద దురాక్రమణ యుద్ధం అనే నేరాన్ని విచారించటానికి ప్రపంచ నాయకులు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ సాండ్స్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- పెట్రోల్-డీజిల్ ధరలు: కర్ణాటక బోర్డర్ వద్ద ఏపీ పెట్రోలు బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












