కరాటే కల్యాణి వివాదమేంటి, అసలేం జరిగింది... దత్తత చట్టాలు ఏం చెబుతున్నాయి?

కరాటే కల్యాణి
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిగ్ బాస్ షో, మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల తరువాత పెద్దగా వార్తలలో కనపడని టాలీవుడ్ కారెక్టర్ నటి కరాటే కల్యాణి, హఠాత్తుగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో రోడ్ పైన జరిగిన గొడవతో మళ్లీ వార్తలలో నిలిచారు.

అయితే ఆ గొడవ సర్దుకోకముందే మరో పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు కల్యాణి. శ్రీకాంత్‌తో గొడవ జరుగుతున్నప్పుడు కరాటే కళ్యాణి ఒక పాపను ఎత్తుకుని కనిపించారు. ఇప్పుడు ఆ పాప ఎవరు? కల్యాణి ఆ పాపను ఎక్కడ నుండి తీసుకొని వచ్చారు? దత్తత తీసుకోవడానికి తప్పనిసరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా పాపను పెంచుకుంటున్నారా? అనే టాపిక్ వైపు చర్చ మళ్లింది. ఆ ప్రశ్నకు కల్యాణి చెప్పిన పొంతనలేని సమాధానాలు అనుమానాలు పెంచాయి.

ఈ విషయంలో కరాటే కల్యాణి ఎప్పటికప్పుడు తన మాటను మారుస్తూ వచ్చారు. మొదట తాను ఆ పాపను దత్తత తీసుకున్నాను అనీ, ఆ తరువాత దత్తత తీసుకోలేదు అనీ, పాప తల్లితండ్రులు తనతోనే ఉంటారనీ, వారితో పాటూ పాప బాగోగులు చూసుకుంటున్నాను అనీ ఇలా రకరకాలుగా చెప్పారు. తాను దత్తత తీసుకున్నాను అని చెబితే చాలా మంది స్ఫూర్తి పొందుతారు అనుకొని అలా చెప్పినట్టు ఆమె వివరణ ఇచ్చారు.

అసలు దత్తత చట్టాలు ఏం చెప్తున్నాయి, విధివిధానాలు ఏమిటి అనేది తెలుసుకునే ముందు కల్యాణి కేసులో ఏం జరిగిందో చూద్దాం.

కరాటే కల్యాణి

ఫొటో సోర్స్, KarateKalyani/FB

కరాటే కల్యాణి వివాదం ఏమిటి.. అసలేం జరిగింది?

మే 12 రాత్రి శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి: కరాటే కల్యాణి గతంలో ఒక బాబుని దత్తత తీసుకున్నారు. అప్పుడు వివాదం రాలేదు. మే 12 రాత్రి జరిగిన ఘటనలో కళ్యాణి ఒక పాపను ఎత్తుకొని కనిపించారు. అయితే, ఆ రోజు ఘటనపై చర్చ నడిచింది కానీ, పాప విషయం వివాదం కాలేదు. కానీ తరువాత ఆ పాపను అంత రాత్రి సమయంలో గొడవ జరిగే ప్రదేశానికి ఎందుకు తీసుకువచ్చారు అనే దగ్గర కొత్త వివాదం మొదలైంది.

మే 15 - కల్యాణి ఇంటికి వెళ్లిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు: ఆదివారం సాయంత్రం సమయంలో 1098 కు ఒక కాల్ రావడంతో.. చైల్డ్ వెల్ఫేర్ విభాగం వారు కల్యాణి ఇంటికి చేరుకున్నారు. మే 12న సంఘటన జరిగినప్పుడు కల్యాణి దగ్గర ఉన్న పాపను చట్ట విరుద్ధంగా తన ఇంట్లో ఉంచుకుంటోంది అని కంప్లైంట్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.

అయితే ఆ రోజు కల్యాణి, ఆ పాపా ఇద్దరూ ఇంట్లో లేకపోవడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. కానీ ఆ రోజు కల్యాణి తల్లి విజయలక్ష్మి స్పందించారు. ఆ పాపను కల్యాణి దత్తత తీసుకున్నారు అని చెప్పారు.

పాపతో కలిసి ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె ఇంకా ఇంటికి రాలేదని విజయలక్ష్మి తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లి 24 గంటలు దాటినా ఆచూకీ తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తంచేవారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోందని, శ్రీకాంత్ రెడ్డి తన కూతురిపై దాడి చేస్తానని పలుమార్లు బెదిరించాడని, అతనిపైనే అనుమానం ఉందని విజయలక్ష్మి ఆరోపించారు.

మే 16 - కలెక్టర్ స్పందన.. ల్యాణి మీడియా సమావేశం: ఈ ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ మాట్లాడారు. "కరాటే కల్యాణి కేసు విషయంలో అధికారులు నోటీసు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. మరోసారి నోటీసు జారీ చేస్తాం, తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం" అన్నారు.

పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయనీ, దాని ప్రకారమే దత్తత తీసుకునే ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికి నచ్చినట్లు వారు తీసుకుంటే కుదరదని కలెక్టర్ శర్మన్ చెప్పారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.

అప్పటి వరకూ ఫోన్ స్విచాఫ్ చేసిన కల్యాణి, అదే రోజు మీడియా సమావేశం నిర్వహించారు. తాను పాపను దత్తత తీసుకోలేదని చెబుతూ పాప తల్లి తండ్రులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే పాపతో పాటు తల్లితండ్రులు కూడా తనతోనే ఉంటున్నారని చెప్పారు.

"నా గురించి తప్పు ప్రచారం జరుగుతోంది. పాపను నేను దత్తత తీసుకోలేదు. చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ నేను ఎప్పుడూ తీసుకుంటాను. ఆ రోజు రాత్రి కూడా పాప తల్లితండ్రులు అలానే నా కుంటుంబ సభ్యులు కూడా లేకపోడంతో నేను పాపను తీసుకొనివెళ్ళాను. అంతే కానీ మరో దురుద్దేశం లేదు" అని పేర్కొన్నారు.

"మాకు ముగ్గురు సంతానం. ఈ పాప పుట్టిన తరువాత నా భార్యకు ఆరోగ్యం బాగుండటం లేదు. అలానే పాప భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆలోచనతో మేము కల్యాణి అక్కకి పాపను ఇవ్వడానికి ఒప్పుకున్నాము. అయితే పాప అక్కకు అలవాటు అవుతుంది అన్న ఆలోచనతో మేము కొద్ది రోజుల క్రితం ఊరికి వెళ్ళాము. అంత లోపల ఇది అంతా జరిగిపోయింది" అని మీడియాకు చెప్పారు పాప తండ్రి.

వీడియో క్యాప్షన్, మానవ తప్పిదం వలన, ఆసుపత్రిలో ప్రసవం అవగానే, ఇద్దరు తల్లుల బిడ్డలు తారుమారైపోయారు.

మే 17 - కలెక్టర్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులను కలిసిన కల్యాణి: మే 17న కలెక్టర్‌ని, ఆ మరుసటి రోజు బుధవారం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారిని కలిశారు కరాటే కల్యాణి. మళ్లీ మీడియా ముందుకు వచ్చారు.

"నేను పాపను దత్తత తీసుకోలేదు. నేను దత్తత తీసుకుంటే లీగల్ గానే తీసుకుంటాను. నాకు అధికారులు ఎలాంటి నోటీస్‌లు ఇవ్వలేదు. నోటీస్‌లు ఇవ్వకుండా మా ఇంటిపైకి విచారణ పేరుతో వచ్చారు. నేను క్లీన్ చిట్‌తో బయటకు వచ్చాను. నాపై ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వారిని తొందరలోనే లీగల్ గానే ఎదుర్కొంటాను. నేను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తాను అని అధికారులకు చెప్పాను" అని అన్నారు.

విచారణ అనంతరం కరాటే కల్యాణి దగ్గర ఉన్న పాపను తల్లిదండ్రులకు అప్పగించారు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మెంబర్స్. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో కేసును రంగారెడ్డి అధికారులకు బదలీచేశారు.

అయితే కరాటే కల్యాణి, పాపను దత్తత తీసుకోకపోయినప్పటికీ, పాపను రాత్రి పూట తల్లితండ్రులు కూడా లేని సమయంలో అలా రోడ్లపైకి తీసుకొని తిరగడం కూడా నేరమే అని అంటున్నారు న్యాయవాది, మాజీ జడ్జి మెంబెర్ అఫ్ బార్ కౌన్సిల్ ఆయిన్ కిరణ్ పాలకుర్తి.

"పుట్టిన బిడ్డ నుండి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల వరకూ కూడా దత్తత తీసుకోవచ్చు. అయితే దానికి కూడా చట్ట పరమైన ప్రక్రియ ఉంటుంది. కరాటే కళ్యాణి విషయంలో ఆవిడ దత్తత తీసుకోలేదు అని చెబుతున్న్నప్పటికీ, తాను తల్లితండ్రులు లేకుండా పాపను చూసుకుంటున్న వ్యవహారం కూడా చట్ట విరుద్ధమే. అలానే ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. తాను ఇంకొక బాబును కూడా దత్తత తీసుకున్నారు అని అంటున్నారామె. మరి అతనిని చట్టపరంగా దత్తత తీసుకున్నారో లేదో కూడా చూడాలి" అన్నారు కిరణ్.

ముళ్ళ కంపల్లో పడేసిన బాబును తాను తీసుకొని వచ్చి పెంచుకుంటున్నానని చెప్పారు కళ్యాణి. సామాజికంగా తాను చేసిన పని మంచిదే అయినా, అది చట్ట ప్రకారం చేస్తే ఎటువంటి ఇబ్బందీ లేదనీ, ఆ ప్రక్రియ సుమారు 2 నెలల్లో పూర్తి అవుతుందనీ కిరణ్ వివరించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో శాంతి కోసం ఈ చిన్నారి పాడిన పాట కన్నీరు పెట్టిస్తోంది

దత్తత తీసుకోవడం పై చట్టాలు ఏమి చెబుతున్నాయి?

పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాలి. భారతదేశంలో జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాల కింద పిల్లలను దత్తత తీసుకోవచ్చు.

హిందూ దత్తత చట్టం ప్రకారం ఇవి పాటించాలి:

  • అయితే ఈ యాక్ట్ కేవలం హిందువులకు మాత్రమే, బంధువుల పిల్లలను దత్తత తీసుకోవడానికి వెసులుబాటు కలిపిస్తుంది.
  • ఒక పురుషుడు ఒక ఆడ పిల్లను దత్తత తీసుకోవాలని అనుకుంటే, ఇద్దరి మధ్య 21 ఏళ్ల తేడా ఉండాలి.
  • ఒక మహిళ ఒక మగ పిల్లాడిని దత్తత తీసుకోవాలని అనుకుంటే కూడా వారి మధ్య 21 ఏళ్ల తేడా ఉండాలి.
  • దత్తత తీసుకునే వారు మానసికంగానూ, ఆర్థికంగానూ బిడ్డ బాగోగులు చూసుకునే పరిస్థితిలో ఉండాలి.
  • దత్తత ఇచ్చేవారు కూడా బిడ్డ సొంత తల్లిదండ్రులు, లేక సహజ సంరక్షులు అయివుండాలి.
  • ఒక్కసారి బిడ్డను దత్తత తీసుకున్న తరువాత, ఆ బిడ్డపై దత్తత తీసుకున్న తల్లిదండ్రులకే అన్ని హక్కులు ఉంటాయి.

అయితే దత్తత తీసుకునే ముందు ఆ బిడ్డకి ఇచ్చిన ఆస్తులు లేక బహుమతులు ఎమన్నా ఉన్నా అవి ఆ బిడ్డకే చెందుతాయి.

వీడియో క్యాప్షన్, వీళ్లు నిజమైన పిల్లలు కాదు.. తల్లులను బతికిస్తున్న పిల్లల బొమ్మలు

జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు...

  • జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం.. పరిచయం లేని వారు కాకపోయినా, ఏ కులం వారు అయినా, పిల్లలని దత్తత తీసుకోవచ్చు. అయితే (కారా) సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, లేక స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నియమావళిని అనుసరించాలి.
  • జువెనైల్ జస్టిస్ యాక్ట్ చాప్టర్ 8 లోని సెక్షన్ 56 నుండి 73 వరుకు ఉన్న నిబంధనల ప్రకారం, దంపతులు మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవచ్చు. దంపతులకు కూడా ఇద్దరి సమ్మతి ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఈ యాక్ట్‌లో కూడా ఆర్థికంగా, శారరీకంగా, మానసింగా వారు బిడ్డను మంచి వాతావరణంలో పెంచగలరు అన్న నమ్మకం ఉంటేనే దత్తత తీసుకోవచ్చు.
  • ఒక్క తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఎన్‌జీవోలు కూడా దత్తత తీసుకోవచ్చు, అయితే ఇలాంటి ఎన్‌జీవోలు లేక అనాథ శరణాలయాలు అధికారికంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి.
  • ఒంటరిగా ఉండే పురుషుడు ఆడ పిల్లను దత్తత తీసుకోరాదు.

ఈ రెండింటిలో ఏ యాక్ట్ కింద అయినా పిల్లలని దత్తత తీసుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ రెండు యాక్టుల మధ్యలో ఎలాంటి వివాదం రాలేదు అని న్యాయవాది పాలకుర్తి కిరణ్ బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి?

  • ఎవరైనా ఈ చట్టాలని ఉల్లంఘిస్తే, వారికి 3 ఏళ్ల జైలు శిక్ష లేక లక్ష రూపాయలు జరిమానా ఉండవచ్చు.
  • ఎన్‌జీవో లేక అనాథ శరణాలయాలు కానీ ఈ చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తే, బాధ్యులు అయిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, లేక లక్ష రూపాయిలు జరిమానానే కాకుండా, సంవత్సరం పాటు లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
  • ఒకవేళ పిల్లల్ని దత్తత తీసుకొని, వారిని అమ్మేయడం జరిగితే, అలా చేసిన వారికి 5 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా పడవచ్చు.
  • ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లు కానీ చేపడితే, బాధ్యులు అయిన వారికి 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చు.
  • అలానే దత్తత తీసుకున్న బిడ్డపై శారీకంగాను లేక మానసికంగానూ దాడి చేస్తే వారికి కూడా 3 ఏళ్ళు జైలు శిక్ష, లక్ష రూపాయిల జరిమానా పడవచ్చు.

అయితే, ఈ నిబంధనలను కరాటే కళ్యాణి అనుసరించారా లేదా అన్న దానిపై అధికారులు ఇంకా విచారణ జరపాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో ఆ జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల్లో వెయ్యికి 928 మందికి సిజేరియన్లే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)