హరియాణా: 'పెళ్ళి పేరుతో మాకు సంకెళ్లు వేయొద్దు...' ముగ్గురు చిన్నారి పెళ్ళికూతుళ్ల కథ

ప్రియాంకకు 10 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు

ఫొటో సోర్స్, RUHANI KAUR

ఫొటో క్యాప్షన్, ప్రియాంకకు 10 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు

హరియాణాకు చెందిన ముగ్గురు బాల వధువుల కల... బాగా చదువుకోవడం. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న వారి కథ గురించి ఫొటో జర్నలిస్టు రూహాని కౌర్ తెలుసుకున్నారు.

ప్రియాంక, మీనాక్షి, శివాని ముగ్గురూ డమ్‌డమా గ్రామంలో పుట్టి పెరిగారు. ఈ గ్రామం గుజ్జర్లకు నిలయం. ఇది ఒక వ్యవసాయ కమ్యూనిటీ. గుర్గావ్‌ నగరానికి కేవలం 30 నిమిషాల దూరంలో ఉంటుంది.

దాదాపు 16 ఏళ్ల వయస్సు ఉండే ఈ ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ ముగ్గురికి చిన్నతనంలోనే పెళ్లయింది. వీరిలో ఒకరికి 10 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు.

అయితే, ఈ ముగ్గురూ స్వతంత్ర జీవితాలను కోరుకుంటున్నారు. దీనికి మున్ముందు అనేక సవాళ్లు ఎదురవుతాయని వారికి తెలుసు.

భారత్‌లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధం. కానీ, దేశంలోని చాలా ప్రాంతాల్లో పితృస్వామ్యం, పేదరికం కారణంగా ఇప్పటికీ బాల్యవివాహాలు కొనసాగుతున్నాయి.

యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) ప్రకారం ప్రపంచంలోనే అధిక సంఖ్యలో బాల వధువులు ఉన్న దేశం భారత్. ప్రపంచంలో మూడో వంతు బాల వధువులు ఇక్కడే ఉన్నారు.

ప్రతీ ఏడాది 18 ఏళ్ల లోపు ఉన్న కనీసం 15 లక్షల మంది బాలికలకు భారత్‌లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని యూనిసెఫ్ అంచనా.

అమ్మాయిల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలనే బిల్లును గత ఏడాది భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ, అది ఇంకా చట్టరూపం దాల్చలేదు.

అన్షు పెళ్లి ఆల్బమ్

ఫొటో సోర్స్, RUHANI KAUR

ఫొటో క్యాప్షన్, అన్షు పెళ్లి ఆల్బమ్

'పెళ్లి పేరుతో నాకు సంకెళ్లు వేయొద్దు'

పసితనంలోనే పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రియాంకపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. అప్పుడు ఆమె వయస్సు 10 ఏళ్లు. ఇప్పుడు ఆమె 11వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.

కానీ, తన భర్తకు ఉద్యోగం వచ్చిన వెంటనే అత్తారింటికి వెళ్లాల్సి ఉంటుందని ఆమెకు చెప్పారు. ప్రస్తుతం ఆమె భర్త పోలీసు శాఖలో ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

తన భయాలు, ఆందోళన గురించి ప్రియాంక డైరీలో రాసుకుంటారు.

''పెళ్లి పేరుతో నన్ను బంధించవద్దు. నేనింకా చిన్న పిల్లనే. నాకు అత్తారింటికి వెళ్లాలని లేదు'' అని ఆమె రాసుకున్నారు.

చదువులో తాను మరీ అంత మెరుగైన విద్యార్థిని కాదని ప్రియాంక చెప్పారు. కానీ, తన సోదరుని బ్యూటీ సెలూన్‌లో పనిచేయడం తనకు ఇష్టమని అన్నారు. ఈ కారణంగానైనా మరికొంత కాలం తల్లిదండ్రుల వద్దే ఉండొచ్చనేది ఆమె ఆశ.

ప్రియాంక తోటి కోడలు కూడా బ్యూటీ పార్లర్‌కు సంబంధించిన కొంత పని నేర్చుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె దాన్ని కొనసాగించలేకపోయారు. ప్రియాంక మాత్రం తనకొక భిన్నమైన జీవితాన్ని కోరుకుంటున్నారు.

స్కూలు తొలి సైన్స్ బ్యాచ్‌లో చేరిన తొలి అమ్మాయి మీనాక్షి

ఫొటో సోర్స్, RUHANI KAUR

ఫొటో క్యాప్షన్, స్కూలు తొలి సైన్స్ బ్యాచ్‌లో చేరిన ఏకైక అమ్మాయి మీనాక్షి

'మా కలల్ని నిజం చేసుకునేంతవరకు మాకు పెళ్లి చేయొద్దు'

మీనాక్షి, గతేడాది 11వ తరగతిలో చేరారు. తన స్కూలులో సైన్స్ విభాగంలో చేరిన తొలి బాలికగా మీనాక్షి గుర్తింపు పొందారు. దీంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని ఆమె చెప్పారు.

అదే సమయంలో కరోనా, ప్రజల జీవితాలను మార్చేసింది. లాక్‌డౌన్‌ల కారణంగా లక్షలాది మంది ప్రజలు ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. చాలామంది తమ సొంత ఊర్లకు, ఇళ్లకు తిరుగుముఖం పట్టారు.

ఇంట్లో ఉన్న ఆడపిల్లల పెళ్లి గురించి ఆత్రంగా ఉన్న తల్లిదండ్రులు వారికి సంబంధాలు కుదిర్చిన సమయం కూడా ఇదే.

ఈ సమయంలోనే మీనాక్షి తరగతికి చెందిన చాలామంది అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి.

''పెళ్లికి సరైన వయస్సు ఏదో నాకు తెలియదు. కానీ మా కలలు నిజం అయ్యేంతవరకు మాకు పెళ్లి చేయకూడదు'' అని మీనాక్షి చెప్పారు.

కానీ, ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆమె కూడా వివాహితల జాబితాలో చేరారు. ఆమె భర్త వయస్సు 16 ఏళ్లు. ఆయన కూడా చదువుకుంటున్నారు. కాబట్టి మరికొంతకాలం చదువుకోవచ్చని తనకు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. తాను కోరుకున్నంత కాలం చదువుకునేందుకు తన తల్లిదండ్రులు, అత్తింటివారు అనుమతిస్తారని ఆమె ఆశిస్తున్నారు.

(వరుసగా కుడి నుంచి ఎడమకు) శివాని, అన్షు‌ల తల్లికి కూడా బాల్యంలోనే వివాహం జరిగింది.

ఫొటో సోర్స్, RUHANI KAUR

ఫొటో క్యాప్షన్, (వరుసగా కుడి నుంచి ఎడమకు) శివాని, అన్షు‌ల తల్లికి కూడా బాల్యంలోనే వివాహం జరిగింది

బ్యాంకు ఉద్యోగం చేయాలనే కల

చదువు గురించి మాట్లాడుతున్నప్పుడు శివాని ముఖంలో ఆనందం అందరికీ కనబడుతుంది. స్కూలుకు వెళ్లడం ఆమెకు చాలా ఇష్టం. బ్యాంకు ఉద్యోగం తన కల.

కానీ, కప్‌బోర్డ్ నుంచి తన పెళ్లి ఆల్బమ్‌ను ఆమె తల్లి బయటకు తీయగానే శివాని వాస్తవిక జీవితంలోకి తిరిగి వచ్చారు. 12వ తరగతి పూర్తయ్యాక తన జీవితం తన నియంత్రణలో ఉండదని శివానీకి ముందే తెలుసు.

శివానితో పాటు ఆమె అక్క అన్షుకు ఒకే రోజు వివాహం జరిగింది. వారి తండ్రి అనారోగ్యం బారిన పడటంతో వారి అంకుల్ తన కూతురితో పాటు వీరిద్దరికీ వివాహం నిశ్చయించారు.

''ఏమీ మారలేదు. నాకు 15 ఏళ్ల వయస్సులోనే పెళ్లి అయింది. అలాగే నా కూతుళ్లకు కూడా జరిగింది'' అని శివాని తల్లి అన్నారు.

12వ తరగతి అయ్యే వరకు చదివిస్తానని వారి తండ్రి హామీ ఇచ్చారు. దీంతో వారిద్దరిలో ఆశ కలిగింది.

ప్రియాంక, శివాని, మీనాక్షి, మోను అందరూ ఒకచోట కలిసినప్పుడు సరదాగా గడుపుతారు

ఫొటో సోర్స్, RUHANI KAUR

ఫొటో క్యాప్షన్, ప్రియాంక, శివాని, మీనాక్షి, మోను అందరూ ఒకచోట కలిసినప్పుడు సరదాగా గడుపుతారు

అన్షు, పరీక్షా ఫలితాలు విడుదల అవ్వకముందే తన అత్తవారింటికి వెళ్లారు. ఆమె పైచదువులు చదవాలి అనుకున్నారు. 'లా' చదవాలి అనేది ఆమె లక్ష్యం. దానికి అత్తింటివారు అంగీకరిస్తారు అని అన్షు ఆశపడ్డారు.

కానీ, కొంతకాలానికే ఆమె గర్భం దాల్చారు. ఈ ఏడాది ప్రారంభంలో బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రియాంక, శివాని, మీనాక్షి తమ స్నేహితురాలు మోనును కలుసుకున్నారు. మోనుపై ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి లేదు.

వారంతా జాయింట్ వీల్ ఎక్కిన ఉత్సాహంలో గట్టిగా అరుస్తున్నారు.

అది వేగంగా తిరిగినకొద్దీ ఈ అమ్మాయిలంతా తమ ఆందోళనను మరిచిపోయి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)