ఎంవీవీ సత్యనారాయణ: విశాఖపట్నంలో వ్యాపారాలు ఆపేస్తున్నానని వైసీపీ ఎంపీ ఎందుకు చెప్పారు?

ఎంవీవీ సత్యనారాయణ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

తనను కొందరు లక్ష్యంగా చేసుకొన్నారని, అందుకే ఇకపై తన వ్యాపారాలను విశాఖపట్నంలో క్లోజ్ చేస్తున్నానని వైసీపీ విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు. ఇకపై తన వ్యాపారం అంతా హైదరాబాద్‌లోనే చేసుకుంటానన్నారు.

అధికార పార్టీ ఎంపీ ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఏం జరిగింది?

విశాఖలోని మధురవాడ గాయత్రినగర్‌లోని సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని రోడ్డుకు అడ్డంగా ఇనుపరేకులతో ప్రహరీ గోడను కొందరు నిర్మించారు. దీనితో పాటు వాడుకలో ఉన్న ఈ రోడ్డును మూసివేసి... ప్రజలు వాడుకునేందుకు వీలుగా పక్కన ఉన్న మురుగు కాలువపై కల్వర్టు నిర్మించారు.

దీనికి ఆనుకునే విశాఖలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న మధుకు కొంత స్థలం ఉంది. ఈ స్థలంలో తాను నిర్మాణం చేపడితే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన కొందరు మనుషులు అడ్డుకున్నారంటూ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మధు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఐపీఎస్ అధికారి మధు

‘ఎస్పీని నాకే ఇలాగైతే...సామాన్యుడి పరిస్థితి ఏంటి?’

తన స్థలం విషయంలో న్యాయం కావాలని, అందుకోసమే పోలీసులకు ఫిర్యాదు చేశారనంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన మధు మార్చి 26న మీడియాతో చెప్పారు.

"నాకు గాయత్రినగర్‌ రోడ్డులో 168 గజాల స్థలం ఉంది. 2016లో నేను దానిని కొన్నాను. అందులో మా కుటుంబ సభ్యులకూ వాటా ఉంది. అక్కడ నిర్మాణం చేపట్టేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అనుమతులు కూడా ఇటీవలే పొందాను.

ఆ సందర్భంగా అందులో కొంత ప్రభుత్వ భూమి ఉందని అధికారులు చెప్తే... దానిని మినహాయించే పనులు ప్రారంభించాను. పనులు మొదలు పెట్టగానే కొందరు ఎంవీవీ సత్యనారాయణ మనుషులు వచ్చి... పని చేస్తున్న వారిని బెదిరించారు. అలాగే మా స్థలం మీదుగా వారికున్న లే అవుట్‌కు రోడ్డు వేసేందుకు యత్నిస్తున్నారు. ఎంపీ తన వెంచర్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పీని నాకే ఈ పరిస్థితి వస్తే... సామాన్యుడి పరిస్థితి ఏంటి? నా స్థలం విషయంలో నాకు న్యాయం జరగాలి” అని మధు ఆ రోజు మీడియాకు చెప్పారు.

ఎంవీవీ సత్యనారాయణ

నేనే పోలీసులకు ఫోన్ చేశా: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

ఈ స్థల వివాదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఎంపీ సత్యనారాయణ ఒక ఎస్పీ స్థలాన్ని ఆక్రమించారంటూ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. దాంతో ఈ అంశంపై సత్యనారాయణ స్పందించారు. రాత్రివేళ ఎవరో ప్రహరీ నిర్మిస్తున్నారనే స్థానికుల సమాచారం మేరకు ఆ పనులను ఆపాలని తానే పోలీసులను కోరానని చెప్పారు.

“నేను ఎవరి స్థలాన్నీ ఆక్రమించలేదు. గాయత్రినగర్‌లో రహదారికి అడ్డంగా ఎవరో ప్రహరీ నిర్మిస్తున్నారని... అది కూడా రాత్రి సమయంలో నిర్మిస్తున్నారంటూ నాకు కొందరు స్థానికులు ఫోన్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు ఫోన్ చేసి... రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మాణం వాస్తవమైతే దాన్ని ఆపించాలని కోరాను.

అక్కడ అంతకు ముందే ప్రజల సౌకర్యం కోసం ఒక కల్వర్టు కూడా నిర్మించాను. ఎందుకంటే అక్కడ మా వ్యాపార సంస్థ ఎంవీవీ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ప్రాజెక్టు జరుగుతోంది. ఆ సందర్భంలో ఏం జరుగుతుందోనని మా ప్రాజెక్టులో పని చేసే వారు కొందరు అక్కడికి వెళ్లారు. అంతే కానీ నేను ఎవరి స్థలం కబ్జా చేయలేదు” అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

‘ఎస్పీకి నాకు సంబంధం లేదు’

“నిజానికి ఇంటెలిజెన్స్ ఎస్పీ మధుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయనతో వివాదం అంతకంటే లేదు. ఆయన తనది అని చెప్తున్న భూమి, దానికి సంబంధించిన కేసు వేరు. మేం నిర్మిస్తున్న ప్రాజెక్టు వేరు. మా ప్రాజెక్టు కోసం ఆయన స్థలాన్ని కబ్జా చేస్తున్నానని పత్రికల్లో, టీవీల్లో వచ్చింది. ఇంటెలిజెన్స్ ఎస్పీ కూడా ఎంవీవీ మనుషులు వచ్చారని అన్నారే కానీ, స్థలాన్ని కబ్జా చేశారని కానీ, అక్రమించారని కానీ ఆనలేదు. అదంతా మీడియాలోనే వచ్చింది.

రాత్రి సమయంలో ప్రొక్లెయినర్స్ వచ్చి పనులు చేస్తున్నాయని నాకు ఫోన్ రావడంతోనే నేను పోలీసులను అలర్ట్ చేశాను. అంతే. ఆ భూమి ఎవరిదైనా అది వివాదాస్పద భూమి కానట్లైయినతే రాత్రిపూట పనులు ఎందుకు చేయాలి, ఉదయం చేసుకోవచ్చు కదా, ఆ విషయాన్నే పోలీసులకు చెప్పాను” అని సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

ఎంవీవీ సత్యనారాయణ

ఫొటో సోర్స్, UGC

వివాదంపై విచారణ

ఈ వివాదంపై రెవెన్యూ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) అధికారులు మార్చి 28న సంయుక్తంగా విచారణ చేపట్టారు.

“గాయత్రి నగర్ భూ వివాదంపై మీడియాలో కథనాలు వచ్చాయి. దాని ఆధారంగా జీవీఎంసీ, వీఎంఆర్ డీఏ అధికారులతో కలిసి విచారణ చేపట్టాం. రేకులతో ప్రహరీ నిర్మించిన చోట వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఉందా? ఎంపీ స్థలానికి వెళ్లే దారిలో కాల్వపై నిర్మిస్తున్న కల్వర్టు అధికారికమా? అనధికారికమా? వంటి వివరాలు తెలుసుకుంటున్నాం. ఎస్పీ మధుకు 168 గజాల స్థలాన్ని ఎవరు, ఎలా అమ్మారు? అనే వివరాలు కూడా సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే స్పష్టత వస్తుంది. వీటన్నింటితో ఒక నివేదిక రూపొందించి రెండు రోజుల్లో కలెక్టరుకు సమర్పిస్తాం” అని విశాఖ రూరల్ ఎమ్మార్వో రామారావు చెప్పారు.

ఎంవీవీ సత్యనారాయణ

ఫొటో సోర్స్, UGC

ఎంపీ ఆపమన్నారని చెప్పడం వల్లే: మధు

ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, వాదోపవాదాలు, మరొకవైపు అధికారుల విచారణ జరుగుతుండగానే మార్చి 29న ఒకే వేదికపైకి ఇంటెలిజెన్స్ ఎస్పీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వచ్చారు. ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.

“నేను నా స్థలంలో గోడ కడుతుంటే కొందరు వచ్చి... ఎంపీ గారు కట్టవద్దని చెప్పారని అడ్డుకున్నారు. దాంతో పోలీసులను ఆశ్రయించాను. అంతే కానీ ఎంపీ నా స్థలం కబ్జా చేశారని ఎక్కడా అనలేదు. 2016లో నేను ఇక్కడ 531 గజాల స్థలం కొన్నాను. 2018లో జీవీఎంసీ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే... అందులో 168 గజాలు తప్ప... మిగతాదంతా ప్రభుత్వ భూమేనని చెప్పారు. దాంతో మాకు స్థలం అమ్మిన ఎల్లపు వినోద్ అనే వ్యక్తిపై కేసు పెట్టాం. మిగిలిన 168 గజాల స్థలంలో సెఫ్టీవాల్ నిర్మిస్తున్నాను. ఆ సమయంలో కొందరు వచ్చి ఎంపీ గారు పనులు అపమన్నారని చెప్పారు. అందుకే ఎంపీ పేరు ప్రస్తావించాను. అంతే కానీ ఎంపీపై నేను ఎటువంటి ఆరోపణలు చేయలేదు” అని మధు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘చెత్త సేకరణపై రూ.100 పన్ను విధిస్తే తప్పేంటి? కట్టకుంటే మీ చెత్త మీ ఇంటి ముందే పోస్తాం’

ఇక విశాఖలో వ్యాపారం చేయను: సత్యనారాయణ

సత్యనారాయణ సినీ నిర్మాత, రియల్టర్. విశాఖలో గత 25 ఏళ్లుగా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసి ఎంపీగా గెలిచారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే వ్యాపారాల్లో ఉన్నానని, ఇకపై విశాఖలో తాను వ్యాపారం చేయబోనని ఆయన బీబీసీతో చెప్పారు.

“నేను ఎంతో కాలంగా పారదర్శకంగా వ్యాపారాలు చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఎంపీని కాబట్టి నన్ను, మా పార్టీని టార్గెట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. నా వలన పార్టీకి చెడ్డ పేరు రాకూడదని... ఇకపై విశాఖలో వ్యాపారాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పటికే విశాఖలో వంద వరకు అపార్ట్‌మెంట్లు నిర్మించాను. మరో ఐదారు ఉన్నాయి. వాటిని పూర్తి చేసి నా వ్యాపారాన్ని హైదరాబాద్‌లోనే చేసుకుంటా. నా వల్ల పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఈ నిర్ణయం” అని సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, మద్య నిషేధంపై జగన్ ఎప్పుడెప్పుడు ఏమేమన్నారు? వాస్తవాలు ఎలా ఉన్నాయి?

“వ్యక్తిగత వ్యవహారం, స్పందించలేం”

ఎంపీ ఎంవీవీ, సీనియర్ ఐపీఎస్ మధు మధ్య భూ వివాదంపై ప్రభుత్వ స్పందన కోసం ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రితో బీబీసీ మాట్లాడింది.

“ఇది వారి వ్యక్తిగత వివాదం. దానికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాట్లాడతాం కానీ, ఇలాంటి వివాదాలపై మేము స్పందించలేం” అని ఆ మంత్రి బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)