విశాఖ ఉక్కును వేలంలో మేమే కొంటాం: ఏపీ మంత్రి మేకపాటి

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/mekapati goutham reddy

ఫొటో క్యాప్షన్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

విశాఖ ఉక్కును ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రకటించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ వేలంలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

విభజన చట్టంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఉక్కు కర్మాగారంపై ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పందన లేదని, ఇప్పుడు ఉన్నదానిని కూడా ప్రైవేట్‌పరం చేయడమేమిటని ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో తమకంటే ఎక్కువ బాధ్యత బీజేపీపైనే ఉందని, అప్పటి ఉద్యమంలో పాల్గొన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏమి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్ర బీజేపీ నేతలు స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై నోరు తెరిచి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా డిమాండు చేశారు.

ఆర్‌బీఐ

ఫొటో సోర్స్, Reuters

100 మంది ఎగవేతదారుల రుణాలు రూ. 62,000 కోట్లు రైటాఫ్‌: రిజర్వు బ్యాంకు వెల్లడి

ఎంతకీ వసూలు కావట్లేదనే కారణంతో వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేస్తున్నాయని.. గత ఏడాది మార్చి 31 నాటికి టాప్‌-100 ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన దాదాపు రూ. 61,949 కోట్ల రుణాలను బ్యాంకులు ఖాతా పుస్తకాల్లో నుంచి తొలగించాయని నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కార్యకర్త బిశ్వంత్‌ గోస్వామికి తెలియజేసింది.

రైటాఫ్‌ రుణాల్లో వజ్రాల వ్యాపారి జతిన్‌ మెహెతానే టాప్‌. ఈ జాబితాలో లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా, మీడియా సంస్థ దక్కన్‌ క్రానికల్‌లకు చెందిన రుణాలూ ఉన్నాయి.

ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం సూత్రధారుల్లో ఒకరైన గీతాంజలి జెమ్స్‌ అధినేత మెహుల్‌ చోక్సీ మొండి బకాయి రూ. 5,071 కోట్లుగా ఉందని, ఇందులో రూ. 622 కోట్లు రైటాఫ్‌ అయ్యిందని ఆర్‌బీఐ వివరాల్లో స్పష్టమవుతున్నది.

2015లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం విదేశీ రుణ గ్రహీతల సమాచారం ఇవ్వలేమని ఈ సందర్భంగా ఆర్‌బీఐ తేల్చిచెప్పింది.

అయితే.. రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేస్తున్నప్పటికీ వాటి వసూలు అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంటాయని చెప్పింది. ఖాతా పుస్తకాల్లో మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్‌పీఏ)ల భారాన్ని తగ్గించడానికే బ్యాంకులు రైటాఫ్‌ చేస్తాయని వివరిస్తున్నది.

2019 మార్చి 31 నాటికి కూడా టాప్‌-100 ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రూ. 58,375 కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి. వీరు ఎగవేసిన మొత్తం రుణాల విలువ రూ. 84,000 కోట్లుగా ఉండటం గమనార్హం.

ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 2.38 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి. దీనివల్ల ఎన్‌పీఏలు 9.1 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గాయి.

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/telanganaCMO

బల్దియాకు ఆరేండ్లల్లో సర్కారు ఇచ్చింది రూ. 365.63 కోట్లే

'హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాం. డల్లాస్‌, ఇస్తాంబుల్‌ తరహాలో మారుస్తాం. రూ.20 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, రోడ్డు కారిడార్లు నిర్మిస్తాం. రూ.11వేల కోట్లతో డ్రెయినేజీ వ్యవస్థను ఆధునీకరిస్తాం' అంటూ సీఎం కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పలుమార్లు ప్రకటించారని.. కానీ జీహెచ్‌ఎంసీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ‘నవతెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆరేండ్లలో బడ్జెట్‌లో బల్దియాకు రూ. 365.63 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారి.. తమకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు, జీతాలివ్వలేదని ఉద్యోగులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆరేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి అతి తక్కువగా నిధులు కేటాయించాయి. వాటిల్లోనూ అరకొరగానే నిధులు విడుదల చేసింది. ఆరేండ్ల కాలంలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద రూ.1980.59 కోట్లు కేటాయించారు. విడుదల చేసింది మాత్రం రూ. 365.63 కోట్లే.

రాష్ట్రంలో విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న ఆదాయంలోనూ జీహెచ్‌ఎంసీ ఏరియాదే పైచేయి. కానీ కేటాయింపుల్లో మాత్రం భిన్నంగా ఉంది. 2016-17, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో నయాపైసా విడుదల చేయలేదు. 2018-19లో రూ.34లక్షలు విడుదల చేశారు.

దీంతోపాటు జీహెచ్‌ఎంసీకి హక్కుగా రావాల్సిన వృత్తి పన్ను బకాయిలను సైతం సర్కార్‌ ఇవ్వడం లేదు. ప్రతి ఏడాదికీ వృత్తి పన్ను కింద బల్దియాకు రూ. 250 కోట్లు కేటాయించాల్సి ఉండగా (నెలకు సగటున రూ. 30 కోట్లు) రూ.15 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. ఆస్తిపన్ను, వినోదపు పన్ను, మోటారు వాహనాల పన్నులకు సంబంధించిన జీహెచ్‌ఎంసీకి వాటాగా రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదు.

పోరంకి దక్షిణామూర్తి

ఫొటో సోర్స్, facebook/VSKChakravarti

ఫొటో క్యాప్షన్, పోరంకి దక్షిణామూర్తి

తెలుగు భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి కన్నుమూత

ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్‌ చైతన్యపురిలోని తన గృహంలో శనివారం కన్నుమూశారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ పొందిన దక్షిణామూర్తి అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు.

‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్‌ ఆటో బయోగ్రఫీ ఆఫ్‌ సెయింట్‌’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు.

తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. దక్షిణామూర్తి 1935 డిసెంబర్‌ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా చైతన్యపురి ప్రాంతంలోనే నివసిస్తున్నారు.

ఆరు నెలల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన శనివారం రాత్రి 7.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం ఉదయం వీవీ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)