రష్యా: అనాథ రోమన్ అబ్రమోవిచ్ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?

రోమన్ అబ్రమోవిచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోమన్ అబ్రమోవిచ్

ఆయన మూడేళ్ల వయసులో అనాథ అయ్యారు. కానీ, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు. వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయనకున్న సంబంధాలు, ఆయన వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మరెవరో కాదు పేరుమోసిన రష్యన్ ఓలిగార్క్ రోమన్ అబ్రమోవిచ్. రష్యాలో అధికార శక్తులతో సాన్నిహిత్యం కలిగిన అత్యంత సంపన్నుల కూటమికి చెందిన వ్యక్తులను ఓలిగార్క్స్ అంటారు.

2003లో చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆయన ఒకమాట అన్నారు. "ప్రజలు నా గురించి మూడు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు. తర్వాత మర్చిపోతారు."

గత కొన్నివారాలుగా జరుగుతున్న సంఘటనల తర్వాత అబ్రమోవిచ్ గురించి ప్రపంచానికి మరింతగా తెలిసింది. ఆయన వ్యాపారాలపై కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలో బ్రిటన్‌ ప్రభుత్వం ఆస్తులను సీజ్‌ చేసింది. జప్తు చేసిన ఆస్తులో అనేక ఇళ్లు, కళాఖండాలు ఉన్నాయి. చెల్సియా ఎఫ్‌సీ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు, ఆయన ప్రయాణాల పై నిషేధాన్ని విధించింది.

యుక్రెయిన్ పై దాడి విషయంలో పుతిన్ కు సహకరించారని, ప్రోత్సహించారని ఆయనపై ఆరోపణలున్నాయి.

బ్రిటీష్ ఫుట్‌బాల్‌ పై ఆధిపత్యం చెలాయించిన వ్యక్తి నుంచి పతనం వరకు అనేక వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే, జరుగుతున్న పరిణామాలపై క్రీడా అభిమానుల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆయన ఆరంభ జీవితం అనేక సవాళ్లు, కష్టాల మధ్య సాగింది.

యువకుడిగా అబ్రమోవిచ్

ఫొటో సోర్స్, EAST2WEST NEWS

ఫొటో క్యాప్షన్, యువకుడిగా అబ్రమోవిచ్

అనాథ నుంచి టైకూన్ వరకు

రోమన్ అర్కాడెవిచ్ అబ్రమోవిచ్ 1966లో యుక్రెయిన్ సరిహద్దు నుండి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న నైరుతి రష్యాలోని సరాటోవ్‌లో జన్మించారు. తల్లి ఇరినా ఆయనకు ఏడాది వయసు ఉన్నప్పుడు బ్లడ్ పాయిజన్ కారణంగా మరణించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన తండ్రి ఓ ప్రమాదంలో మరణించారు.

తర్వాత బంధువులే అబ్రమోవిచ్‌ పెంచారు. వాయువ్య రష్యాలోని కోమిలో చిన్ననాటి జీవితం గడిపారు. బాల్యమంతా పేదరికంలో గడిపారు.

‘‘నిజం చెప్పాలంటే నేను నా బాల్యాన్ని దారుణమైందిగా భావించలేను. కొందరు క్యారెట్లు తింటారు, కొందరు క్యాండీ తింటారు. రెండూ రుచిగానే ఉంటాయి'' అన్నారు.

పదహారేళ్ల వయసులో స్కూలు మానేసి మెకానిక్ వృత్తిలోకి వెళ్లి రెడ్ ఆర్మీకి సేవలందించారు. తర్వాత కొన్నాళ్లు మాస్కో వీధుల్లో ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముకుంటూ జీవించారు. వ్యాపారవేత్తలకు అవకాశాలు కల్పిస్తూ అప్పటి రష్యా అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తీసుకున్న నిర్ణయాలతో సుగంధ పరిమళాల వ్యాపారంలోకి వచ్చారు.

స్నేహితులతో అబ్రమోవిచ్

ఫొటో సోర్స్, EAST2WEST NEWS

ఫొటో క్యాప్షన్, స్నేహితులతో అబ్రమోవిచ్

పోగుపడిన సంపదలు

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, అక్కడి ఖనిజాలపై అజమాయిషీ తగ్గించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అబ్రమోవిచ్ కు అదృష్టాన్ని కలిగించింది. అప్పటికి ఆయన 20లలో ఉన్నారు.

1995లో జరిగిన ఓ వేలం పాటలో సుమారు $250 మిలియన్ల ( సుమారు రూ.1800 కోట్లు)కు రష్యా ప్రభుత్వం నుండి చమురు కంపెనీ సిబ్‌నెఫ్ట్‌ను సంపాదించారు. 2005లో దానిని 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ.98000 కోట్లు)కు తిరిగి ప్రభుత్వానికే విక్రయించారు.

అబ్రమోవిచ్ ఈ ఆస్తిని అక్రమంగా కూడబెట్టానన్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన తరఫు లాయర్లు అంటారు. అయితే, సిబ్‌నెఫ్ట్ ఒప్పందంలో కొందరికి రహస్యంగా డబ్బులు ముట్టజెప్పినట్లు 2012లో బ్రిటన్ కోర్టులో అబ్రమోవిచ్ అంగీకరించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా, యుక్రెయిన్ సైన్యాల భీకర పోరు

1990లలో ఆయన "అల్యూమినియం వార్స్" పాల్గొన్నారు. అంటే సోవియట్ పతనం తర్వాత అపారమైన సంపద, రాజకీయ శక్తిని సంపాదించిన ఓలిగార్క్‌లు, ఆయా పరిశ్రమలపై తమ పట్టును నిలుపుకోవడానికి చేసిన పోరాటాలను అల్యూమినియం వార్స్ అంటారు.

''అప్పట్లో ప్రతి మూడు రోజులకు ఒకరు హత్యకు గురయ్యేవారు'' అని అబ్రమోవిచ్ 2011లో వెల్లడించారు. తన భద్రతకు ఉన్న ముప్పు నుంచి తప్పించుకోవడానికి అయిష్టంగానే ఈ పోరాటాలలో పాల్గొనేవాడినని ఆయన చెప్పారు.

పుతిన్‌తో అబ్రమోవిచ్

ఫొటో సోర్స్, Ronald Grant

ఫొటో క్యాప్షన్, పుతిన్‌తో అబ్రమోవిచ్

రాజకీయాల్లోకి

2000 సంవత్సరానికి ముందు అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. సోవియట్ పతనం అనంతర రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 1999లో ఎల్సిన్ రాజీనామా తర్వాత ప్రధానమంత్రిగా వచ్చిన పుతిన్‌కు అబ్రమోవిచ్ మద్ధతిచ్చినట్లు చెబుతారు.

అయితే, పుతిన్ అధికారంలో స్థిరపడ్డాక ఓలిగార్క్‌లపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నించారు. దీంతో, కొందరు జైలుకు వెళ్లగా, మరికొందరు విధేయత చూపడంలో విఫలమై దేశ బహిష్కారానికి గురయ్యారు.

2000లో అబ్రమోవిచ్ రష్యా ఈశాన్య ప్రాంతంలోని చుకోట్కా ప్రాంతానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. తన ఆస్తులను ప్రజాసేవకు ఉపయోగించడం ద్వారా ఆయన ప్రజాదరణ పొందారు. కానీ 2008లో పదవి నుంచి వైదొలిగారు.

అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి వ్యాపార ప్రయోజనాలను పొందడంలో ఏమాత్రం వెనకాడ లేదు. భారీ ఎత్తున ఆస్తులు, కళాఖండాలు, గుర్రాలు, కార్లు కొన్నారు.

చెల్సియా ఎఫ్‌సీ క్లబ్ కొనుగోలుతో ఆయన పేరు మారుమోగింది

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, చెల్సియా ఎఫ్‌సీ క్లబ్ కొనుగోలుతో ఆయన పేరు మారుమోగింది

లండన్ కాలింగ్

2003లో అబ్రమోవిచ్ 140 మిలియన్ యూరో (సుమారు 1100 కోట్లు)ల విలువైన ఒప్పందం ద్వారా వెస్ట్ లండన్‌లోని అతిపెద్ద క్లబ్ చెల్సియా ఎఫ్‌సీ కొనుగోలు చేయడంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ''పూర్తిస్థాయి ప్రొఫెషనల్ టీమ్‌లను తయారు చేయడమే నా లక్ష్యం'' అని ఫైనాన్షియల్ టైమ్స్‌తో ఆయన అన్నారు.

''చుకోట్కాలో నాకు ప్రొఫెషనల్ టీమ్‌లు ఉన్నాయి. ఇక్కడ కూడా వాటిని తయారు చేస్తా'' అని అప్పట్లో చెప్పారు.

ఇటీవలి సంవత్సరాలలో ఒలిగార్క్‌లకు చెందిన డబ్బు పెద్ద మొత్తంలో లండన్‌కు వెల్లువెత్తింది. పశ్చిమ లండన్‌లోని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లో అబ్రమోవిచ్‌కు 15 బెడ్ రూమ్‌ల విలాసవంతమైన భవనం ఉన్నట్లు చెబుతారు. దీని విలువ సుమారు రూ.1200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

చెల్సియాలో ఒక ఫ్లాట్, కొలరాడోలో ఒక ర్యాంచ్, ఫ్రెంచ్ రివేరాలో హాలిడే హోమ్ కూడా ఆయన సొంతం. సోలారిస్, ఎక్లిప్స్ అనే పేరుతో రెండు విలాసవంతమైన యాట్‌లు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద యాట్‌లుగా పేరు సంపాదించాయి. మూడుసార్లు విడాకులు తీసుకున్న అబ్రమోవిచ్‌కు వ్యక్తిగత జెట్ విమానం కూడా ఉంది.

అబ్రమోవిచ్ కు ఖరీదైన యాట్ లు ఉన్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అబ్రమోవిచ్ కు ఖరీదైన యాట్ లు ఉన్నాయి

పరువు నష్టం కేసు

2006లో గార్డియన్ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. డబ్బుతో ఒక వ్యక్తి ఏం సాధించగలరని అడిగినప్పుడు '' నేను సంతోషాన్ని డబ్బుతో కొనలేను. అయితే, కొంత స్వాతంత్ర్యాన్ని కొనుక్కోగలను'' అన్నారు.

ఫైనాన్షియల్ మీడియా దిగ్గజం బ్లూమ్‌బెర్గ్ అబ్రమోవిచ్ సంపదను 1370 కోట్ల డాలర్లు (రూ.10వేల కోట్లు )గా అంచనా వేసింది, అతన్ని ప్రపంచంలోని 128వ అత్యంత సంపన్న వ్యక్తిగా పేర్కొంది. ఫోర్బ్స్ ఆయనకు 142వ స్థానాన్ని ఇచ్చింది.

అయితే, పుతిన్ నుంచి ఆయనకు ఏ మాత్రం స్వాతంత్ర్యం ఉందన్నది అసలు ప్రశ్న.

చెల్సియాను కొనుగోలు చేయాల్సిందిగా రష్యా అధ్యక్షుడు తనను ఆదేశించారంటూ ‘పుతిన్స్ పీపుల్’ అనే పుస్తకం పేర్కొనగా, దాన్ని ప్రచురించిన హార్పర్‌ కాలిన్స్‌ పబ్లిషింగ్ హౌస్ పై అబ్రమోవిచ్ పరువు నష్టం దావా వేశారు.

ఈ వివాదాన్ని ఇరు వర్గాలు కోర్టు బయట ఒప్పందంతో ముగించాయి. అయితే, పుతిన్ తో ఆయనకున్న సంబంధాలు మాత్రం నిత్య చర్చగా కొనసాగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ పై దాడిని అబ్రమోవిచ్ ప్రోత్సహించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

''ఓలిగార్క్‌లు పుతిన్ ను రెచ్చగొట్టారు. యుక్రెనియన్ల రక్తం వారి చేతికి అంటుకుంది'' అని యూకే విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, మీ బడ్జెట్‌పై యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇది

ఆంక్షలు విధించడానికి ఎనిమిది రోజుల ముందు అబ్రమోవిచ్ చెల్సియా ఎఫ్‌సీ విక్రయాన్ని ప్రకటించారు. అయితే కొందరు క్రీడాభిమానులు అబ్రమోవిచ్ పై ఆంక్షలు సరికాదని వాదించగా, కొందరు మాత్రం ఆస్తుల స్తంభింపజేయడం సబబేనన్నారు.

"మీ అందరికీ వ్యక్తిగతంగా వీడ్కోలు చెప్పడానికి నేను స్టాంఫోర్డ్ బ్రిడ్జ్‌ని చివరిసారి సందర్శించగలనని ఆశిస్తున్నాను" అని అబ్రమోవిచ్ చెల్సియా ఎఫ్‌సీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అన్నారు.

కానీ, ఆయన పశ్చిమ లండన్‌కు తిరిగి రావడం మరికొంత కాలం అసంభవంగానే కనిపిస్తోంది.

ఇక మరొక ట్విస్ట్‌లో మార్చి ప్రారంభంలో యుక్రెయిన్-బెలారస్ సరిహద్దులో జరిగిన శాంతి చర్చలలో అబ్రమోవిచ్ పై విషప్రయోగం జరిగినట్లు తాజాగా బైటపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)