రష్యాను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్‌కు అమెరికా ఏయే ఆయుధాలు ఇచ్చింది.. కొన్ని ఆయుధాలపై మౌనం ఎందుకు?

జావెలిన్ క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బెర్నడ్ డెబుస్మాన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాలిపోయిన ఒక రష్యా ట్యాంక్ శిథిలాలు మట్టిలో ఉన్నాయి. దాని పక్కనే ఉన్న ఒక ఫొటోలో యుక్రెయిన్ సైనికుడు ఆ విధ్వంసం సృష్టించిన ఆయుధాలతో వెళ్తున్నాడు.

యుక్రెయిన్ సాయుధ దళాలు ట్విటర్లో పోస్ట్ చేసిన ఫొటోలకు "జావెలిన్లు హిట్ చేయడంతో రష్యా ట్యాంకులు ఇలా అయ్యాయి" అని కాప్షన్ పెట్టారు.

జావెలిన్ అంటే భుజం మీద పెట్టుకుని ప్రయోగించే యాంటీ-టాంక్ ఆయుధం. దాన్లోంచి దూసుకెళ్లే రాకెట్లు 4 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి.

దీనిని ఒక పోర్టబుల్ యూనిట్‌తో కంట్రోల్ చేయొచ్చు. అది ఒక వీడియో గేమ్ కన్సోల్‌లా ఉంటుంది. కానీ మీటర్ పొడవుండే ప్రొజెక్టైల్‌ను ట్యాంక్ పక్క నుంచి గానీ, దాని పైనుంచి గానీ పంపవచ్చు.

జావెలిన్ లాంటి అమెరికా తయారీ ఆయుధాలు రష్యా దళాల్లో భయం పుట్టిస్తున్నాయి. తాము ఇలాంటివి మరో 2000 పొందబోతున్నట్లు యుక్రెయిన్ సైన్యం చెప్పింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ప్రకటించిన అమెరికా కొత్త 800 మిలియన్ డాలర్ల సైనిక సాయం ప్యాకేజీలో జావెలిన్ క్షిపణులతోపాటూ, ఇతర ఆయుధాలు కూడా ఉన్నాయి.

మిగతా ఆయుధాల్లో ఎగిరే బాంబుల్లా విధ్వంసం సృష్టించే డ్రోన్లు, హెలికాప్టర్లను ఆకాశం నుంచి కూల్చేసే యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు ఉన్నాయి.

కానీ తమ కంటే ఎక్కువగా, మెరుగైన ఆయుధాలున్న రష్యా దాడిని ఎదుర్కోడానికి యుక్రెయిన్‌కు ఇవి సహాయం చేయగలవా?

ధ్వంసమైన ట్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌కు అమెరికా ఏయే ఆయుధాలు పంపింది?

యుక్రెయిన్‌కు అమెరికా కొత్తగా అందించిన సైనిక సాయంలో ఎన్నో రకాల సైనిక పరికరాలున్నాయి. వీటిలో సైనికులకు 25 వేల ఆర్మర్ సెట్లు కూడా అందిస్తున్నారు. ఈ సెట్ ఒక్కోదానిలో ఆర్మర్, హెల్మెట్, రైఫిల్, గ్రెనేడ్ లాంచర్స్ ఉంటాయి. వీటితోపాటూ వేలాది యాంటీ ట్యాంక్స్ ఆయుధాలు, 2 కోట్ల రౌండ్ల మందుగుండు అందించారు.

ఈ ఆయుధాల్లో జావెలిన్ మిసైళ్లతోపాటూ, అత్యంత శక్తివంతమైన 800 స్టింగర్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో సోవియట్ విమానాలను కూల్చడానికి వీటిని సమర్థంగా ఉపయోగించారు.

యుక్రెయిన్‌కు 100 టాక్టికల్ 'అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్' అనే చిన్న డ్రోన్లు కూడా పంపించాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. వీటిని చేత్తోనే లాంచ్ చేయవచ్చు. ఇవి ఒక బ్యాక్‌పాక్‌లో పట్టేంత చిన్నవిగా ఉంటాయి.

సైనికులు ఈ డ్రోన్లను యుద్ధభూమిని గమనించడానికి, కొన్నిసార్లు దాడుల కోసం ఉపయోగించవచ్చు. ముఖ్యంగా దూరం నుంచే వాటిని లక్ష్యాల దగ్గరకు పంపించి, ఫ్లయింగ్ బాంబ్స్‌లా పేల్చేయవచ్చు.

బుధవారం జో బైడెన్ ప్రకటనతో యుక్రెయిన్‌కు గత ఒక్క వారంలోనే వంద కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందింది.

2014 నుంచి 2022 ప్రారంభం వరకూ యుక్రెయిన్‌కు అందిన 270 కోట్ల డాలర్ల సాయంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

ఇది ముఖ్యమైన పరిణామం, ఇది ఇంతకు ముందు లోపాలను పరిష్కరిస్తుంది అని కీయెవ్‌లో అమెరికా మాజీ రాయబారిగా పనిచేసిన జాన్ హెర్బ్స్ అన్నారు.

"బైడెన్ ఆయన టీమ్ యుక్రెయిన్‌కు సాయం అందించడంలో మరీ పిరికిగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఒత్తిడికే స్పందించారు" అన్నారు.

కూలుతున్న రష్యా హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా ఆర్మీ, వైమానిక దాడులను ఇవి ఎదుర్కోగలవా?

అమెరికా సరఫరా చేసిన యాంటీ టాంక్ ఆయుధాలు యుక్రెయిన్‌లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని సైనిక నిపుణులు చెబుతున్నారు.

"దాడి చేస్తున్న రష్యా సైన్యంలో ప్రధానంగా ఆర్మీ వాహనాల్లాంటి మెకనైజ్డ్ దళాలే ఉంటాయి. మనం ఆ వాహనాలను నాశనం చేస్తే చాలు. యుక్రెయిన్‌కు చాలా దేశాల నుంచి రకరకాల యాంటీ టాంక్ సిస్టమ్స్ అందాయి. అవి రష్యా దళాలకు ప్రాణాంతకంగా మారాయి" అని అమెరికా ఆర్మీ మాజీ కల్నల్ క్రిస్టోఫర్ మాయర్ చెప్పారు.

తమ ఆయుధాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. మార్చి 16 వరకూ తాము 400కు పైగా రష్యా ట్యాంకులు, 2 వేలకు పైగా ఇతర వాహనాలను ధ్వంసం చేశామని చెప్పారు.

అయితే ఈ వాదనలను బీబీసీ స్వయంగా వెరిఫై చేయలేదు.

వీడియో క్యాప్షన్, మీ బడ్జెట్‌పై యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇది

అయితే, రష్యా వైమానిక దళాన్ని యాంటీ టాంక్ ఆయుధాలు పూర్తిస్థాయిలో ఎదుర్కోలేకపోతున్నాయి. దీంతో రష్యా విమానాలు మూడు వారాలపాటు దేశమంతటా ఉన్న లక్ష్యాలపై దాడులు చేశాయి.

అమెరికా సైనిక సాయంలో ఉన్న ఏకైక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్.. మనుషులు భుజం మీద నుంచి ఉపయోగించే స్టింగర్ సిస్టమ్. వీటిని 1981 నుంచి యుద్ధాలలో ఉపయోగిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌ను సోవియట్ ఆక్రమించుకోడానికి ప్రయత్నించినపుడు అమెరికా తన స్టింగర్ మిసైళ్లతో కొన్ని వందల రష్యా విమానాలను కూల్చేసింది.

3800 మీటర్ల ఎత్తు కంటే దిగువన ఎగిరే హెలికాప్టర్లను ఇవి సమర్థంగా కూల్చగలిగినా, అంతకంటే ఎత్తులో ఎగిరే రష్యా బాంబర్లను మాత్రం అవి ఏం చేయలేకపోతున్నాయి.

"యుక్రెయిన్‌కు అందించే సహాయ ప్యాకేజీలో స్టింగర్ క్షిపణులు భాగమని ప్రభుత్వం చెప్పడం బలహీనతకు సంకేతం" అంటారు హెర్బ్స్ .

"వారికి మరిన్ని స్టింగర్స్ కావాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, మరింత ఎత్తులో ఎగిరే విమానాలను కూల్చే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆయుధాలు కూడా వాళ్లకు అవసరం. ఇది తీవ్రమైన తప్పిదం" అన్నారు.

శిథిలమైన భవనాలు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా పంపించని ఆయుధాలు ఏమిటి?

ఎత్తులో ఎగిరే లక్ష్యాలపై ప్రయోగించే సోవియట్ కాలం నాటి ఎస్-300 యాంటీ క్రాఫ్ట్ క్షిపణులను ఇతర దేశాల ద్వారా యుక్రెయిన్‌కు అందేలా చేస్తామని చెబుతున్న అమెరికా, దాని గురించి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.

తమ మిగ్-29 ఫైటర్ జెట్లను యుక్రెయిన్‌కు పంపిస్తామన్న పోలండ్ ప్రతిపాదనలను కూడా అమెరికా తోసిపుచ్చింది.

నాటో, రష్యా మధ్య బహిరంగ యుద్ధం తలెత్తే ప్రమాదం ఉండడంతో, అది సమర్థనీయం కాదని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

కానీ, అమెరికా మిత్ర దేశాలు మిగ్-29 లేదా అలాంటి విమానాలను యుక్రెయిన్‌కు ఇవ్వడం వల్ల అది తమ గగనతలాన్ని సమర్థంగా కాపాడుకోగలదని క్రిస్టోఫర్ మాయర్ అంటున్నారు.

అప్పట్లో సోవియట్ యూనియన్ ఉత్తర వియత్నాంకు తన విమానాలు, పైలెట్లను అందించిందని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా, యుక్రెయిన్ సైన్యాల భీకర పోరు

మిగతా దేశాలు ఏం చేశాయి?

అమెరికా ఒక్కటే యుక్రెయిన్‌కు సాయం చేయడం లేదు. దాదాపు మరో 30 దేశాలు దానికి అండగా నిలుస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ ఆ దేశానికి 500 మిలియన్ల యూరోల సాయం అందించింది.

అమెరికా తన కొత్త సహాయ ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తమకు వెంటనే మరింత సాయం అవసరమని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.

"మాకు ఇప్పుడు అందే ఆయుధాల కంటే మరిన్ని కావాలి. రష్యా ఆక్రమణదారులను అడ్డుకోడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, విమానాలు, తగినన్ని ప్రాణాంతక ఆయుధాలు, మందుగుండు మాకు అవసరం" అన్నారు.

"మన దగ్గర ఉన్న ఆయుధాలు వారికి అందించడానికి మనం కచ్చితంగా మరింత దూకుడు చూపించాలి. కనీసం, మనం ఉత్తర వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు సోవియట్ యూనియన్ వారికి అందించిన అదే క్వాలిటీ, క్వాంటిటీ అయినా ఇవ్వాలి" అని అమెరికా ఆర్మీ మాజీ కల్నల్ క్రిస్టోఫర్ మాయర్ అన్నారు.

"భవిష్యత్తులో యుక్రెయిన్‌కు బహుశా అదనపు సహాయ ప్యాకేజీలు అవసరమవుతాయి. యుక్రెయిన్ సైన్యాన్ని రష్యా వైమానిక దళానికి సవాలు విసరగలిగే స్థితిలో ఉంచినప్పుడు మాత్రమే అవి ప్రభావవంతంగా ఉంటాయి" అని మాయర్ చెప్పారు.

"మనం 30 వేల అడుగులు, ఆ పైన ఎగిరే రష్యా విమానాలను ధ్వంసం చేయగలిగేలా ఏవైనా వారికి పంపిస్తున్నామా, లేదా అనేదే నాకు ముఖ్యం" అంటారాయన.

ఇప్పటివరకూ గట్టిగా ఏ ప్రకటనా చేయకపోయినా, అమెరికా యుక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తుందని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. దాని గురించి వివరాలేవీ చెప్పని ఆయన యుక్రెయిన్‌ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పొందేలా అమెరికా కృషి చేస్తోందని తెలిపారు.

"మరిన్ని వస్తున్నాయి" అని బైడెన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)