ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన, అతిపెద్ద రష్యా సైన్యం యుక్రెయిన్‌లో ఎందుకు వెనుకబడింది?

యుద్ధ ట్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జొనాథన్ బాలే
    • హోదా, బీబీసీ రక్షణ శాఖ ప్రతినిధి

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన, అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశాల్లో రష్యా ఒకటి. కానీ యుక్రెయిన్‌పై ప్రారంభ దండయాత్రలో రష్యా సాయుధ బలగాల ప్రభావం స్పష్టంగా కనిపించలేదు.

యుద్ధరంగంలో రష్యా ప్రదర్శనపై పశ్చిమ దేశాలకు చెందిన చాలామంది మిలిటరీ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. రష్యా ప్రదర్శన 'నిరుత్సాహంగా' ఉందని ఒకరు వ్యాఖ్యానించారు.

రష్యా మిలిటరీ పురోగమనం చాలావరకు నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కోల్పోయిన నష్టాల నుంచి రష్యా మిలిటరీ కోలుకోగలదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

''ఇప్పటివరకు తమ లక్ష్యాలను రష్యన్లు అందుకోలేదనేది సుస్పష్టం. బహుశా ఇకముందు కూడా ఇలాగే ఉండొచ్చు'' అని సీనియర్ నాటో మిలిటరీ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

మరి రష్యా విషయంలో తప్పు ఎక్కడ జరిగింది? రష్యా మిలిటరీ చేసిన పొరపాట్ల గురించి సీనియర్ పాశ్చాత్య మిలిటరీ అధికారులతో, నిఘా వర్గాల అధికారులతో బీబీసీ మాట్లాడింది.

వీడియో క్యాప్షన్, మీ బడ్జెట్‌పై యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇది

తప్పుడు అంచనాలు

రష్యా మొదటి తప్పు... యుక్రెయిన్ సాయుధ బలగాల సామర్థ్యాలను, ప్రతిస్పందన శక్తిని తక్కువగా అంచనా వేయడం.

సాయుధ బలగాలపై రష్యా వార్షిక బడ్జెట్ 60 బిలియన్ డాలర్ల (రూ. 4.55 లక్షల కోట్లు) కంటే ఎక్కువ కాగా, ఈ విషయంలో యుక్రెయిన్ ఏటా కేవలం 4 బిలియన్ డాలర్ల (రూ. 30.378 కోట్లు) కు పైగా ఖర్చు చేస్తుంది.

అదే సమయంలో అనేకమందితో పాటు రష్యా కూడా తమ సొంత బలగాల సామర్థ్యాన్ని అధికంగా ఊహించుకున్నట్లుగా కనిపిస్తోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, తాహతుకు మించి బలగాల ఆధునీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంపై ఆయన అధిక విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు.

యుద్ధానికి ముందు ఇరు దేశాల బలగాల సంఖ్య

రష్యా పెట్టుబడుల్లో అధిక భాగం హైపర్‌సోనిక్ క్షిపణుల వంటి కొత్త ఆయుధాలను అభివృద్ధి చేయడం, అతిపెద్ద న్యూక్లియర్ ఆయుధశాలలను ఏర్పాటు చేయడంపైనే వెచ్చించిందని బ్రిటిష్ సీనియర్ మిలిటరీ అధికారి ఒకరు అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 'టి-14 అర్మాటా' ట్యాంకును రష్యా నిర్మించింది. రెడ్ స్క్వేర్ వద్ద మాస్కో విక్టరీ డే పరేడ్‌లో కనిపించిన ఈ యుద్ధ ట్యాంకు, యుద్ధ క్షేత్రంలో కనిపించట్లేదు.

రష్యా, యుద్ధభూమిలో దింపిన వాటిలో చాలా పాత టి-72 యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాల వాహనాలు, ఫిరంగులు, రాకెట్ లాంచర్లు ఉన్నాయి.

దాడి ప్రారంభంలో యుక్రెయిన్ వైమానిక దళంపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ రష్యా యుద్ధవిమానం సరిహద్దుల వరకు వెళ్లింది. ఈ సమయంలో గగనతలంపై పట్టు సాధించేందుకు రష్యాకు మంచి అవకాశం లభించింది.

దీంతో రష్యా బలగాలు గగనతలంపై త్వరగా పట్టు సాధిస్తాయని చాలామంది మిలిటరీ విశ్లేషకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

యుక్రెయిన్ వైమానిక సేనలు ఇప్పటికీ ప్రభావవంతంగా కనిపిస్తున్నాయి. రష్యా ఎత్తులను సమర్థంగా ఎదుర్కొంటున్నాయి.

ప్రత్యర్థిని త్వరగా, నిర్ణయాత్మక దెబ్బ కొట్టడంలో తమ ప్రత్యేక బలగాలు కీలక పాత్ర పోషిస్తాయని మాస్కో అనుకొని ఉండొచ్చు.

స్పెట్స్‌నాట్జ్, వీడీవీ పారాట్రూపర్ల వంటి బలగాలను మోహరించి ప్రత్యర్థిపై పట్టు సాధించాలని తొలుత రష్యా భావించిందని బీబీసీతో ఒక సీనియర్ పాశ్చాత్య ఇంటెలిజెన్స్ అధికారి అన్నారు.

కానీ దాడి తొలిరోజుల్లో కీయెవ్‌కు వెలుపల హోస్టోమెల్ విమానాశ్రయంపై హెలికాప్టర్ దాడుల్ని యుక్రెయిన్ తిప్పికొట్టింది. దీంతో బలగాలను, పరికరాలను, యుద్ధ సామగ్రిని తీసుకురావడం రష్యాకు కష్టమైంది.

మాస్కో విక్టరీ డే పరేడ్‌లో కనిపించిన టి-14 అర్మాటా యుద్ధ ట్యాంకు, యుద్ధ క్షేత్రంలో కనిపించట్లేదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్కో విక్టరీ డే పరేడ్‌లో కనిపించిన టి-14 అర్మాటా యుద్ధ ట్యాంకు, యుద్ధ క్షేత్రంలో కనిపించట్లేదు

ఇక ఎక్కువగా రోడ్డు మార్గంలోనే రష్యా యుద్ధ పరికరాలను రవాణా చేసుకోవాల్సి వచ్చింది. ఈ రవాణా కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, చోక్ పాయింట్లు ఏర్పడ్డాయి. యుక్రెయిన్ ఆర్మీ ఆకస్మిక దాడులు చేయడానికి ఇవి సులభమైన లక్ష్యాలుగా తయారయ్యాయి.

ఇదిలా ఉండగా, ఉత్తరం నుంచి బయలుదేరిన రష్యాకు చెందిన పొడవైన ఆయుధ వాహన శ్రేణి ఇంకా కీయెవ్‌ను చుట్టుముట్టలేకపోయింది.

దక్షిణం వైపున రష్యన్ బలగాలు గణనీయ పురోగతిని సాధించాయి. అక్కడ రైలు మార్గాల ద్వారా బలగాల రవాణా జరిగింది.

''పుతిన్ సేనలు లయను కోల్పోయాయి'' అని బీబీసీతో బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వ్యాలస్ అన్నారు.

''వారు ఇరుక్కుపోయారు, నెమ్మదిగా కదులుతున్నారు. కానీ కచ్చితంగా గణనీయమైన ప్రాణనష్టాన్ని ఎదుర్కొంటున్నారు'' అని ఆయన చెప్పారు.

నష్టాలు, లోపించిన ఉత్సాహం

ఈ దండయాత్ర కోసం రష్యా సుమారు 1,90,000 బలగాలను సమకూర్చుకుంది. వీరిలో చాలామంది ఇప్పటికే యుద్ధక్షేత్రంలోనే ఉన్నారు. ఇందులో దాదాపు 10 శాతం బలగాలను రష్యా కోల్పోయింది. యుద్ధంలో రష్యా, యుక్రెయిన్ సైనికులు ఎంతమంది చనిపోయారో తెలిపే నమ్మదగిన గణాంకాలు లేవు. 14వేల మంది రష్యా బలగాలను మట్టుబెట్టినట్లు యుక్రెయిన్ చెబుతోంది. కానీ రష్యా సైనికుల మరణాల సంఖ్య యుక్రెయిన్ చెబుతోన్న దానిలో సగం ఉండొచ్చని అమెరికా అంచనా వేస్తోంది.

రష్యన్ సైనికుల్లో యుద్ధం పట్ల ఉత్సాహం, ధైర్యం తగ్గుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని పాశ్చాత్య దేశాల అధికారులు అంటున్నారు. ఇది 'చాలా చాలా నెమ్మదిగా' సాగుతుందని ఒకరు వ్యాఖ్యానించారు.

సైనికులు ''చల్లటి వాతావరణంలో, అలసిపోయి, ఆకలితో'' ఉన్నారని మరొకరు అన్నారు. యుక్రెయిన్‌పై దాడికి ఆదేశాల కోసం ఎదురుచూస్తూ వారంతా బెలారుస్, రష్యాల్లో వారాల పాటు చలిలోనే ఉన్నారని గుర్తు చేశారు.

త్వరలోనే యుద్ధంలో సిరియా నుంచి విదేశీ బలగాలతో పాటు రహస్య వాగ్నెర్ గ్రూపుకు చెందిన సైనికులు కూడా పాల్గొనే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాల అధికారులు నమ్ముతున్నారు.

సరఫరా, లాజిస్టిక్స్

రష్యా ప్రాథమిక సమస్యలతో పోరాడింది. రష్యా వాహన శ్రేణులు చమురు, ఆహారం, మందు గుండు కొరతను ఎదుర్కొన్నాయి. పాడైపోయిన వాహనాలను రోడ్ల పక్కనే వదిలివేయాల్సి వచ్చింది.

రష్యాకు యుద్ధ సామగ్రి కొరత కూడా ఉన్నట్లు పాశ్చాత్య అధికారులు నమ్ముతున్నారు. రష్యా ఇప్పటికే క్రూయిజ్‌తో కలిపి 850-900 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఆయుధాల కోసం రష్యా, చైనాను సంప్రదించిందని అమెరికా అధికారులు హెచ్చరించారు.

అమెరికా అందించే యుద్ధసామగ్రి సహాయంలో స్విచ్‌బ్లేడ్ 'కమికేజ్' డ్రోన్ కూడా ఉండొచ్చు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, అమెరికా అందించే యుద్ధసామగ్రి సహాయంలో స్విచ్‌బ్లేడ్ ‘కమికేజ్’ డ్రోన్ కూడా ఉండొచ్చు

దీనికి విరుద్ధంగా, యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలు అందుతూనే ఉన్నాయి. ఇది వారిలో మరింత ధైర్యాన్ని కలిగించింది.

యుక్రెయిన్‌కు అదనంగా 800 మిలియన్ డాలర్ల రక్షణ మద్దతును అందజేస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధ ట్యాంకులు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్‌తో పాటు స్విచ్‌బ్లేడ్ అనే కమికేజ్ డ్రోన్లను కూడా పంపించనుంది. చిన్న పరిమాణంలో ఉండే స్విచ్‌బ్లేడ్‌ను అమెరికా అభివృద్ధి చేసింది. వీటిని చిన్న చిన్న సంచుల్లో తీసుకెళ్లవచ్చు. ఇవి భూమి మీదున్న లక్ష్యాలను ఛేదిస్తాయి.

పుతిన్ ''అత్యంత క్రూరత్వంతో రెట్టించి దాడులు చేయగలరు'' అని పాశ్చాత్య దేశాల అధికారులు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్ నగరాలపై పట్టు సాధించేంతవరకు విధ్వంసం సృష్టించగల మందుగుండు సామగ్రి పుతిన్ వద్ద ఉందని వారు అంటున్నారు.

''ఆటంకాలు ఉన్నప్పటికీ పుతిన్ బెదరడు, దానికి బదులుగా ఇంకా దాడిని తీవ్రవతరం చేయొచ్చు. మిలిటరీ పరంగా యుక్రెయిన్‌ను ఓడిస్తామని ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు'' అని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు అన్నారు.

యుక్రెయిన్ బలగాలు ధీటుగా ప్రతిస్పందిస్తున్నప్పటికీ, చెప్పుకోదగిన స్థాయిలో యుద్ధసామగ్రి అందకపోతే... వారు మందుగుండు కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు కాస్త పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు, కానీ యుక్రెయిన్‌కు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంలో ఆప్తుల్ని పోగొట్టుకున్నవారి దుఃఖమిది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)