యుక్రెయిన్ సంక్షోభం: కీయెవ్ నగరాన్ని రష్యా సైన్యం ఎందుకు లొంగదీసుకోలేకపోతోంది? యుక్రెయిన్ వార్ రూమ్ నుంచి బీబీసీ కథనం...

- రచయిత, జెరెమీ బోవెన్స్
- హోదా, బీబీసీ న్యూస్, కీయెవ్
యుక్రెయిన్ మీద దండయాత్రలో కీయెవ్ నగరం మీద రష్యా ప్రధాన దృష్టిని కేంద్రీకరించింది. ఈ నగరం మీద గురిపెట్టి భారీ ఎత్తున సైనిక బలగాలు భీకరమైన విధ్వంసక ఆయుధాలతో దాడి చేస్తున్నాయి.
సోమవారం ఉదయం రష్యా క్షిపణి దాడిలో కీయెవ్‌లోని ఓ తొమ్మిదంతస్తుల అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. ఒకరు చనిపోయారు. డజన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆ భవనంలోని జనం వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుని ఉండకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది.
కానీ.. కీయెవ్ నగర నడిబొడ్డును, దాని పరిసరాల్లోని పట్టణ ప్రాంతాలను రష్యన్ ఆయుధాలు ఇంకా తాకలేదు. యుక్రెయిన్‌లోని ఇతర నగరాలపై భారీ ఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
కీయెవ్ జనాభాలో దాదాపు సగం మంది పశ్చిమ యుక్రెయిన్‌కు తరలిపోవటమో, దేశమే విడిచి వెళ్లిపోవటమో చేశారు.

నదులు, బురద నేలల సాయం
కీయెవ్ నగరాన్ని కాపాడుకోవటానికి తాము కష్టపడి పోరాడుతున్నామని ఆ బాధ్యతలు చూస్తున్న యుక్రెయిన్ సైనిక జనరళ్లు చెప్తున్నారు. కానీ తమ నగరం మిసైళ్ల దాడిని ఎదుర్కోవటం కష్టమేనని అంగీకరిస్తున్నారు.
అయితే.. నగర భౌగోళిక స్వరూప స్వభావాలు తమవైపు ఉన్నాయని జనరల్ ఆంద్రియ్ క్రిష్చెన్కో చెప్పారు. ఈ నగరం చాలా పెద్దది. విస్తారమైనది. నగరాన్ని చీల్చుకుంటూ ప్రవహించే భారీ నీపర్ నదితో పాటు దాని ఉప నదులు కూడా నగరాన్ని చిన్నచిన్న విభాగాలుగా చీల్చినట్లు ప్రవహిస్తుంటాయి.
''నగరం చాలా పెద్దది. కాబట్టి ఒకవైపు కాచుకోవటం కష్టం. కానీ అది ఒకరకంగా మాకు అనుకూలిస్తుంది కూడా. నగరానికి వచ్చే దారుల్లో నదులు, వంతెనలు ఉన్నాయి. అక్కడ మా సైనికులు రక్షణ దుర్గాలను నిర్మిస్తున్నారు'' అని ఆయన వివరించారు.
''నీపర్ నదిలోకి ప్రవహించే చాలా చిన్న చిన్న నదులు నగరం చుట్టూ ఉన్నాయి. చాలాచోట్ల చిత్తడి మడుగులున్నాయి. భారీ సంఖ్యలో సైనికులు తిరగటానికి అవి అనుకూలంగా ఉండవు'' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
కీయెవ్ నగర డిప్యూటీ మేయర్ కూడా అయిన జనరల్ క్రిష్చెంకో.. దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ తరహాలో.. సాధారణ ఆర్మీ-గ్రీన్ దుస్తులు ధరించారు.
ఆయన వివరించిన దాని ప్రకారం.. కీయెవ్‌కు కలిసొచ్చే మరో అంశం ఈ నగరం పారిశ్రామిక నగరం కావటం. చాలా వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు శత్రుదుర్భేధ్యమైన రక్షణ ఏర్పాట్లు చేసుకోవటానికి అవసరమైన కాంక్రీట్ బ్లాకులు, ఇసుకబస్తాలు, ట్యాంకులను నిలువరించే అవరోధాలను తయారు చేస్తున్నారు.
కీయెవ్ దిశగా రష్యా బలగాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించటానికి వార్ రూమ్‌లో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ ముందు క్రిష్చెన్కో, న్యాజేవ్ నిలుచుని ఉన్నారు.
రష్యా బలగాలు తూర్పు నుంచి, వాయువ్యం నుంచి చేసిన రెండు ప్రధాన దాడుల మీద తాము ఎదురుదాడి చేసి అడ్డుకున్నామని వారు వివరించారు. వాయువ్యం వైపు నుంచి 40 మైళ్ల పొడవైన రష్యా సైనిక కాన్వాయ్ కీయెవ్ దిశగా చేపట్టిన ప్రయాణం పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే.
రష్యా సైన్యం మీద తాము దాడులు చేసి, వెనక్కు తరిమికొట్టామని.. వారి నుంచి ఇక ముప్పు లేదని వీరు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యూహాత్మక వంతెనలు
రష్యా సైన్యం ప్రధానంగా కీయెవ్ నగరానికి వాయువ్యం మీద దృష్టి కేంద్రీకరించింది. రష్యా సైనిక బలగాలు నగరానికి అతి దగ్గరగా ఉన్నది అక్కడేనని న్యాజెవ్.. ఆ స్క్రీన్ మీద చూపిస్తూ చెప్పారు. కీయెవ్ నగర కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో.. ఇర్పిన్ నదికి ఆవల ఆ బలగాలు ఉన్నాయి.
యుక్రెయిన్ బలగాలు అలాంటి నదుల మీది వ్యూహాత్మక వంతెనలను కూల్చివేశాయి. ఇర్పిన్ నగరంలో నిర్వాసితులైన వేలాది మంది జనం కొన్ని వస్తువులను, కొందరు పెంపుడు జంతువులను వెంటబెట్టుకుని.. అలా కూల్చేసిన ఒక వంతెన శిథిలాల మీదుగా నడుచుకుంటూ నదిని దాటి వెళుతున్నారు.
కానీ ఆ జనాన్ని అనుసరించి రష్యా సైనికులు సాగలేకపోతున్నారని యుక్రెయిన్ జనరల్ న్యాజెవ్ చెప్పారు.
''ఇవి చాలా బురద నేలలు. వాటిలో నుంచి వారు నడిచి రాలేరు. ఒకవేళ అక్కడ యుక్రెయిన్ సైనికులెవరూ లేకపోతే.. వాళ్లు నది మీద ఒక వంతెన వేసుకుని వచ్చేస్తారు. కానీ మేం అక్కడున్నాం. వారు వేసే వంతెనలను ధ్వంసం చేస్తాం'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన మాట్లాడుతుండగానే మరో క్షిపణి పేలింది. మొదట పేలిన క్షిపణికి సమీపంలోనే ఈ పేలుడు కూడా సంభవించింది. ఆ పేలుడు శబ్దాలు వార్ రూమ్‌లో స్పష్టంగా వినిపించాయి.
''వినండి.. మరో క్షిపణిని మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేస్తున్న శబ్దమది'' అని ఒక జూనియర్ ఆఫీసర్ చెప్పారు.
కానీ ఆ క్షిపణి నగరాన్ని తాకింది. ఓ బస్సు డ్రైవరు చనిపోయాడు. మరో భవనాల వరుస ధ్వంసమైంది.
యుక్రెయిన్ సైనిక విజయం.. ఈ దేశపు మిత్రులను, శత్రువులను ఆశ్చర్యానికి గురిచేసింది. తమ సైన్యం, వేలాది మంది వలంటీర్ల పనితీరు పట్ల దేశాధ్యక్షుడు, సైనిక కమాండర్లు చాలా సంతృప్తిగా ఉన్నారు.
కానీ.. ఈ రాజధాని నగరం మీద రష్యా సైన్యం ఇంకా తన పూర్తి బలాన్ని ప్రయోగించలేదు.
ఇవి కూడా చదవండి:
- పగలు చిన్న ఉద్యోగం.. రాత్రి పార్ట్ టైమ్ వేశ్యా వృత్తి
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మ్యూచువల్ ఫండ్స్: నెలకు రూ. 5,000 మదుపు చేస్తే పదేళ్ళకు 12 లక్షలు వస్తాయా?
- #TheKashmirFiles: జమ్మూలో స్థిరపడిన కశ్మీరీ పండిట్లు ఏమంటున్నారు?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









