యుక్రెయిన్ యుద్ధం బూటకమా? అంతా నాటకమా - వైరల్ వీడియోల్లో వాస్తవమెంత

యుక్రెయిన్ టీవీ సిరీస్ కంటామిన్ ప్రొడక్షన్ సెట్‌లో తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Artem Gvozdkov

ఫొటో క్యాప్షన్, 2020లో యుక్రెయిన్ టీవీ సిరీస్ కంటామిన్ ప్రొడక్షన్ సెట్‌లో తీసిన ఈ ఫొటోను.. యుక్రెయిన్ యుద్ధంలో నకిలీ బాధితులను నటిపంచేస్తున్నారని చెప్తూ షేర్ చేశారు
    • రచయిత, షాయాన్ సర్దారిజాదే, ఓల్గా రాబిన్సన్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలై రెండు వారాలు దాటిపోయినా.. ఈ యుద్ధానికి సంబంధించి తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం తగ్గలేదు. పైగా ఇప్పుడు మరింత బూటకపు సిద్ధాంతాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

అసలు ఈ యుద్ధమే ఒక బూటకమని.. అంతా మీడియా కట్టుకథ అని.. దీని తీవ్రతను పశ్చిమ దేశాల మీడియా గోరంతలు కొండంతలు చేసి చూపుతోందని కొందరు ప్రచారం మొదలుపెట్టారు.

వాటిలో కొన్నిటిని మేం పరిశీలించాం.

'సంక్షోభ నటులు' అంటూ తప్పుడు ప్రచారం

ఒక యువతి, ఒక యువకుడు తమ ముఖాలకు నకిలీ రక్తాన్ని పులుముకుని ఉన్న ఒక వీడియోను వివిధ సోషల్ మీడియా వేదికల మీద కోట్లాది మంది వీక్షించారు.

యుక్రెయిన్‌లో యుద్ధం బూటకమని, అక్కడ గాయపడ్డ, చనిపోయిన పౌరులు అంతా నిజానికి ఆ పాత్రల్లో నటిస్తున్న 'సంక్షోభ నటుల'ని, దాడి దృశ్యాల్లో నటించేందుకు వారిని అద్దెకు తెచ్చారని చెప్పటానికి ఈ వీడియో సాక్ష్యమని ప్రచారం జరుగుతోంది.

ఫేస్‌బుక్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, 2020 యుక్రెయిన్ టీవీ సిరీస్‌‌కు చెందిన ఈ ఫొటోకు రష్యా దండయాత్రకు సంబంధం లేదు

కానీ నిజానికి ఆ వీడియోకు, ఈ యుద్ధానికి సంబంధం లేదు. 2020 సంవత్సరంలో.. యుక్రెయిన్ టీవీ సిరీస్ కంటామిన్ ప్రొడక్షన్ సెట్‌లో చిత్రీకరించిన వీడియో అది.

ఈ వీడియోలోని నటుడిని.. 2020 డిసెంబర్‌లో ట్వీట్ చేసిన 'తెర వెనుక దృశ్యాల' ఫొటోల్లో చూడొచ్చు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

2px presentational grey line

బాడీ బ్యాగ్‌లో కదిలిన శవం

ఒక న్యూస్ రిపోర్టర్.. శవాలను చుట్టిపెట్టి వరుసలో పేర్చినట్లు కనిపించే అనేక బాడీ బ్యాగ్‌ల ముందు నిలుచుని మాట్లాడుతున్నట్లు చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్యా అనుకూల అకౌంట్ల నుంచి ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేశారు.

ఈ వీడియోలోని దృశ్యాల్లో కొన్ని సెకన్ల తర్వాత.. ఒక బాడీ బ్యాగ్ కదలుతుండటం, అందులో నుంచి ఒక పురుషుడు కవర్ పక్కకు తప్పించి బయటకు రావటం, ఒక ఫొటోగ్రాఫర్ అతడి దగ్గరకు రావటం కనిపిస్తుంది.

ఈ వీడియోను యుక్రెయిన్‌లో చిత్రీకరించారని.. ఆ యుద్ధం బూటకమని, లేదంటే పశ్చిమ దేశాలు సృష్టించిన ప్రచారమని ఇది నిరూపిస్తోందని సోషల్ మీడియా పోస్టులు వాదిస్తున్నాయి.

ట్విటర్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, వియన్నాలో వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన వీడియోను షేర్ చేస్తూ.. యుక్రెయిన్‌లో యుద్ధంలో నకిలీ మృతులను చూపుతున్నారని ప్రచారం చేస్తున్నారు

కానీ ఆ ప్రచారం అవాస్తవం. ఈ వీడియోను.. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఆరంభంలో వియెన్నాలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో చిత్రీకరించారు.

ఆస్ట్రియన్ వార్తాపత్రిక ఆస్టెరీచ్ ఈ కథనం ప్రచురించింది. 'ఫ్రైడే ఫర్ ఫ్యూచర్' అనే వాతావరణ ఉద్యమకారులు.. కర్బన ఉద్గారాల వల్ల మానవ జీవితాలకు ఉన్న ముప్పును చాటిచెప్పటం కోసం ఈ బాడీ బ్యాగ్‌లతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇదే వీడియోను.. కోవిడ్ 'సంక్షోభ నటుల'ను చూపుతోందంటూ కొన్ని కుట్రసిద్ధాంతాల గ్రూపులు గత నెలలో షేర్ చేశాయి.

చెక్క తుపాకీలంటూ తప్పుడు ప్రచారం

ఇద్దరు యుక్రెయిన్ పౌరులు చెక్క తుపాకీలుగా కనిపిస్తున్న వాటిని పట్టుకున్నట్లు చూపుతున్న ఫాక్స్ న్యూస్ చానల్ వార్తా ప్రసారానికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ కూడా వైరల్ అయింది.

యుక్రెయిన్‌లో యుద్ధం బూటకమని, ఈ స్క్రీన్‌షాట్‌లోని వారి చేతుల్లో ఉన్నవి నిజమైన తుపాకీలు కాకపోవటం దీనికి నిదర్శనమని ఆ పోస్టుతో పాటు కొందరు ప్రచారం చేశారు.

ఫేస్‌బుక్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, FACEBOOK/FOX NEWS

ఫొటో క్యాప్షన్, యుద్ధానికి ముందు.. పౌరులు తమ సమాజాలను కాపాడుకోవటానికి శిక్షణలో భాగంగా చెక్క తుపాకులు ఇచ్చారు

కానీ ఈ దృశ్యాలు యుద్ధం మొదలవటానికి ముందు ఫిబ్రవరి మధ్యలో చిత్రీకరించినవి.

ఒకవేళ రష్యా దండయాత్రకు వస్తే.. తమను, తమ సమాజాన్ని కాపాడుకోవటానికి సుముఖంగా ఉన్న పౌర వలంటీర్ల దళానికి.. యుక్రెయిన్‌లోని ఖార్కియేవ్ నగరంలో ఛాందసవాద సంస్థ అజోవ్ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రం సందర్భంగా ఈ వీడియో తీశారు.

స్టీవెన్ సీగల్ యుక్రెయిన్‌లో యుద్ధం చేయటం లేదు

సీఎన్ఎన్‌కు చెందిన వెరిఫైడ్ ట్విటర్ అకౌంట్ నుంచి షేర్ చేసినట్లు కనిపించే ఒక నకిలీ ట్వీట్‌లో.. అమెరికా నటుడు స్టీవెన్ సీగల్.. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ దగ్గర రష్యా ప్రత్యేక బలగాల్లో కనిపించినట్లు చెప్పుకొచ్చారు. సీగల్‌కు అమెరికా, రష్యా రెండు దేశాల పౌరసత్వాలూ ఉన్నాయి.

సామాన్య యూజర్లతో పాటు.. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అమెరికా పాడ్‌కాస్ట్ హోస్ట్ జో రోగన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన 1.40 కోట్ల మంది ఫాలోవర్లకు ఈ వీడియోను షేర్ చేశారు.

నకిలీ పోస్టు స్క్రీన్ షాట్
ఫొటో క్యాప్షన్, స్టీవెన్ సీగల్ యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్నాడంటూ నకిలీ ట్వీట్‌ను షేర్ చేశారు

కానీ.. స్టీవెన్ సీగల్ యుక్రెయిన్‌లో రష్యా బలగాలతో కలిసి యుద్ధం చేయటం లేదు. వెరిఫైడ్ అకౌంట్ల నుంచి చేసిన అసలు ట్వీట్ల లాగానే కనిపించేలా నకిలీ ట్వీట్లను సృష్టించటానికి అందుబాటులో ఉన్న అనేక ఉచిత ఆన్‌లైన్‌ టూల్స్ ద్వారా ఈ ట్వీట్‌ను పుట్టించినట్లు కనిపిస్తోంది.

రెండు దేశాలూ తనకు కుటుంబాల వంటివేనని, ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని.. 69 ఏళ్ల స్టీవెన్ సీగల్ గత వారంలో ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.

ఆ ఫొటో నకిలీ సృష్టి అని, అటువంటి కథనమేదీ తాను ప్రసారం చేయలేదని సీఎన్ఎన్ పేర్కొంది.

రోగన్ ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టును తొలగించారు.

నకిలీ ట్వీట్ షేర్ చేసిన రష్యా దౌత్యాధికారి

రష్యా దండయాత్ర సందర్భంగా యుక్రెయిన్‌లో ఒక జర్నలిస్టు చనిపోయినట్లు చెప్తున్న ఒక కట్టుకథ స్క్రీన్‌షాట్స్‌ను.. ఐక్యరాజ్యసమితిలో రష్యా ఉప రాయబారి దిమిత్రి పొలియాన్‌స్కీ షేర్ చేశారు.

''ఫేక్ తయారు చేయటం ఎలా... సహచరులారా జాగ్రత్త, అసలు యుద్ధం యుక్రెయిన్‌లో కాదు.. ఎంఎస్ఎం (మెయిన్ స్ట్రీమ్ మీడియా) అబద్ధాలు, నకిలీలతోనే అసలు యుద్ధం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

'బెర్నీ గోరెస్' అనే జర్నలిస్టు గత ఏడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో చనిపోయాడని చెప్పిన సీఎన్ఎన్.. ఇప్పుడు అదే వ్యక్తి యుక్రెయిన్‌లో చనిపోయాడంటూ కథనం ప్రసారం చేసిందని అని ఆరోపిస్తున్న ఒక ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు.

ట్విటర్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, యూట్యూబర్ జోర్డీ జోర్డాన్ ఫొటోను వాడుకుని, అతడికి బెర్నీ గోరెస్ అనే నకిలీ పేరు పెట్టి, అతడు యుక్రెయిన్‌లో చనిపోయినట్లు సీఎన్ఎన్ ప్రచారం చేసిందని ఫేక్ పోస్టు ప్రచారమైంది

నకిలీ వార్తలను సృష్టించారనటానికి సాక్ష్యంగా ఈ ట్వీట్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్లు.. నకిలీ సీఎన్ఎన్ అకౌంట్ల నుంచి వచ్చాయి. ఆ రెండు నకిలీ అకౌంట్లను ఆ తర్వాత ట్విటర్ సస్పెండ్ చేసింది. ఆ ఫొటోల్లో 'బెర్నీ గోరెస్'గా చూపించిన వ్యక్తి నిజానికి ఒక యూట్యూబర్. ఆయన పేరు జోర్డీ జోర్డాన్. ఆయన సజీవంగా నిక్షేపంగా ఉన్నారు.

ఆ పోస్టులు పూర్తిగా అభూత కల్పన అని సీఎన్ఎన్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.

నకిలీ వీడియో దృశ్యాలు

భారీ గుంపుగా ఉన్న జనానికి భయంతో అరుస్తూ పరుగులు తీయాలని ఒక దర్శకుడు చెప్పటం, వారు అలా చేయటం చూపుతున్న పలు వీడియోలు వివిధ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయ్యాయి.

ఈ వీడియో యుక్రెయిన్ నుంచి లీకయిందని, మీడియా సంస్థలు చూపుతున్న కొన్ని దృశ్యాలు నిజానికి ఇలా సృష్టించినవేనని ఆ వైరల్ పోస్టుల్లో ఆరోపించారు.

యూట్యూబ్ వీడియో నుంచి స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, YOUTUBE

ఫొటో క్యాప్షన్, ఇన్వేజన్ ప్లానెట్ ఎర్త్ అనే సినిమా చిత్రీకరణ సందర్భంగా తెర వెనుక దృశ్యాల వీడియోను.. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన నకిలీ వీడియోల తయారీ అని చెప్తూ షేర్ చేశారు

కానీ ఈ విడియోను నిజానికి 2013లో 'ఇన్వేజన్ ప్లానెట్ ఎర్త్' అనే సైన్స్‌ఫిక్షన్ సినిమా చిత్రీకరణ కోసం బర్మింఘామ్‌లోని విక్టోరియా స్క్వేర్‌లో చిత్రీకరించారు. అప్పుడు ఆ సినిమాకు 'కాలీడోస్కోప్ మ్యాన్' అని పేరు పెట్టారు.

ఆ సినిమా దర్శకుడు సైమన్ కాక్స్.. ''నా సినిమా వీడియో దృశ్యాలను ఇలా వాడటం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాను'' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఉపాధ్యక్షుడి భార్య సైన్యంలో చేరలేదు

యుక్రెయిన్ ఉపాధ్యక్షుడి భార్య ఒకరు.. రష్యా దండయాత్రతో పోరాడటానికి యుక్రెయిన్ సైన్యంలో చేరినట్లు చూపుతున్న ఒక ఫొటోను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.

అయితే.. యుక్రెయిన్‌కు ఉపాధ్యక్షుడు లేరు.

మిలటరీ యూనిఫాంలోని మహిళను చూపుతున్న ట్వీట్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఈ ఫొటోలోని మహిళ యుక్రెయిన్ ఉపాధ్యక్షుడి భార్య అని కొందరు ట్విటర్ యూజర్లు తప్పుగా షేర్ చేశారు

ఇంకోవైపు.. ఆ ఫొటోలోని మహిళ యుక్రెయిన్ ప్రధమ మహిళ ఒలేనా జెలెన్‌స్కా అని చెప్తూ కూడా ట్విటర్‌లో మరో వాదన ప్రచారమవుతోంది.

నిజానికి ఆ ఫొటోలో ఉన్న మహిళ.. యుక్రెయిన్ సైనికురాలని, 2021 ఆగస్టులో కీయెవ్‌లో మిలటరీ పరేడ్ రిహార్సల్ సందర్భంగా ఆ ఫొటో తీశారని.. ఫ్యాక్ట్-చెకర్లు నిగ్గుతేల్చారు.

Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)