పెట్రోల్, డీజిల్: రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటే ధరలు తగ్గుతాయా

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యా నుంచి ఇంధనం, గ్యాస్ దిగుమతులను తగ్గించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. బ్రిటన్ కూడా ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు, గ్యాస్‌పై అమెరికా కూడా నిషేధం విధించింది. సహజంగానే, ఈ యుద్ధ వాతావరణంలో ఇలాంటి నిర్ణయాల వల్ల రష్యా చాలా నష్టపోయింది.
ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రష్యా భారత్‌ను ఆశ్రయించింది.
రానున్న రోజుల్లో తమ నుంచి చమురును కొనుగోలు చేసి, ఇక్కడ పెట్టుబడులు పెంచాలని ఇండియాను రష్యా కోరింది.
మార్చి 10న రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్, భారత పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ పురితో మాట్లాడారు. వీరిద్దరి చర్చల తర్వాత రష్యా నుంచి ఒక ప్రకటన వెలువడింది.
రష్యా నుండి భారతదేశం ఏటా 100 కోట్ల డాలర్ల( సుమారు రూ. 7650 కోట్లు) విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని, భవిష్యత్తులో ఇది ఎంత పెరుగుతుందనే వివరాలతో ఈ ప్రకటన విడుదల చేశారు.
రష్యా నుంచి సబ్సిడీ ధరలకు ముడి చమురు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకునే అంశాన్ని భారతదేశం పరిశీలిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు.

ఫొటో సోర్స్, TWITTER @INDIANOILCL
ఈ నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షల నడుమ ఇండియా ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందన్నది చర్చనీయంగా మారింది.
ఇంధన నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచంలోని ఇంధనంలో 12 శాతం రష్యా నుంచి, మరో 12 శాతం సౌదీ అరేబియా నుంచి, 16-18శాతం అమెరికా నుంచి ఉత్పత్తి అవుతోంది.
ఇండియా ఉపయోగించే చమురులో 85 శాతం దిగుమతి చేసుకుంటున్నదే కాగా, అందులో 60 శాతం గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది.
సౌదీ అరేబియా, అమెరికాల నుంచి వచ్చే దిగుమతులపైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. వీటితోపాటు ఇరాక్, ఇరాన్, ఒమన్, కువైట్, రష్యాతోపాటు ఓపెన్ మార్కెట్‌లో కూడా కొంత భారత్ కొనుగోలు చేస్తోంది.
ఇండియా చమురు దిగుమతుల్లో రష్యా వాట 2 శాతమే.
మరి యూరప్ దేశాల అవసరాలను రష్యా తీరుస్తుండగా, మిత్ర దేశమైన రష్యా నుంచి భారత్ 2 శాతమే ఎందుకు దిగుమతి చేసుకుంటోంది?
''మొదటి కారణం.. రష్యా భౌగోళిక స్వరూపంతో కొంత లింకు ఉంది. రష్యా చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలు తూర్పు భాగానికి కాస్త దూరంగా ఉంటాయి. రెండోది ఉత్తరం నుంచి చమురును సరఫరా చేయడానికి కొన్ని ఇబ్బందులున్నాయి. మధ్యలో ఆర్కిటిక్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ నిత్యం మంచు ఉంటుంది. మూడోది నల్ల సముద్రం (బ్లాక్ సీ) ద్వారా సరఫరా చేయవచ్చు. కానీ ప్రస్తుతం దానిపై నిషేధం ఉంది'' అని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా వివరించారు.
గత 10 సంవత్సరాలలో చమురు దిగుమతులలో ఒకే దేశంపై ఆధారపడటాన్నితగ్గించుకోవడానికి అమెరికాతోపాటు, రష్యా, మరికొన్ని దేశాల నుంచి ఇండియా చమురును కొంటోంది.
''రష్యాలో చమురు, సహజ వాయువు రంగంలో ఇండియా 1600 కోట్ల డాలర్ల ( సుమారు రూ. 12 లక్షల 25 వేల 320కోట్లు) పెట్టుబడులు పెట్టింది. కానీ భారతదేశం ఆ చమురును కొనుగోలు చేయదు. ఇతర దేశాలకు అమ్ముతుంది'' అని తనేజా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా నుండి చమురు కొనడం ఎందుకు కష్టం?
ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధర పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు తక్కువ ధరకు చమురు విక్రయించేందుకు రష్యా సిద్ధంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
అయితే, రష్యా నుంచి చమురు దిగుమతిని పెంచడం భారతదేశానికి కష్టమేనని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.
''రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికాలోనే ఆంక్షలు ఉన్నాయి. భారత్ చమురును కొనుగోలు చేయగలదు. కానీ, రష్యా నుంచి దానిని తీసుకురావడంలో సమస్య ఉంది. ఇది కాకుండా కొనుగోలుపై చెల్లింపులో సమస్య రావచ్చు'' అని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు.
గతంలో ఆంక్షల సమయంలో ఇరాన్‌తో చేసినట్లుగా, రష్యాతో కూడా ఇండియా రూపాయలు, రూబుళ్లలో కాకుండా 'బార్టర్ సిస్టమ్'(వస్తు మార్పిడి) తరహాలో వ్యాపారం కొనసాగించవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
అయితే, అది అంత సులభం కాదని సుభాష్ గార్గ్ అన్నారు.
''ఇరాన్‌పై ఆంక్షలు విధించిన సమయంలో, రెండు దేశాలు 'బార్టర్ సిస్టమ్' వంటి విధానాన్ని అవలంబించాయి. ఇరాన్ నుంచి భారతదేశం ఎంత చమురు కొనుగోలు చేస్తుందో, అదే విలువకు గోధుమలను, ఇరాన్ కొనుగోలు చేసింది'' అని గార్గ్ వివరించారు.

ఫొటో సోర్స్, EPA
కానీ భారత్, రష్యాల మధ్య చమురు దిగుమతి విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
''రష్యా నుంచి భారత్‌కు చమురు ఎలా తీసుకురావాలన్నదే అసలు సమస్య. కాబట్టి, 'బార్టర్ సిస్టమ్' పనిచేయకపోవచ్చు. నల్ల సముద్రం మీదుగా వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. రష్యా తన సొంత వస్తువులను సైబీరియా వైపు పంపించలేక పోయింది. రెండో సమస్య రష్యా-ఇండియా మధ్య ఎగుమతులు, దిగుమతులు ఒకేలా ఉండవు. భారత్ రష్యా నుంచి ఎక్కువ కొనుగోలు చేస్తుంది, తక్కువ అమ్ముతుంది. మూడోది రష్యా రూపాయలను, ఇండియా రూబుల్స్‌ను తీసుకోవడానికి ఇష్టపడవు. కాబట్టి, ఇక్కడ ఇరాన్ మోడల్ సాధ్యం కాదు'' అన్నారు గార్గ్.
రష్యా నుంచి గ్యాస్‌ను, చమురును తెచ్చుకునేందుకు చైనా పైప్‌లైన్ వేసింది. కానీ, భారత్‌కు ఆ ఏర్పాటు లేదు.
అంతే కాకుండా యుద్ధ వాతావరణంలో రష్యా నుంచి చమురు సరఫరా చేసే ఓడలు దొరకడం కష్టం. దొరికినా వాటికి ఈ సమయంలో బీమా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.
భారత్‌కు ఉన్న ఇబ్బందులను మరో కోణంలో కూడా వివరించారు తనేజా.
''భారతదేశం ప్రతిరోజూ 52 లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు ఇండియానే. రష్యా నుండి లక్ష నుంచి రెండు లక్షల బ్యారెళ్ల చమురును ఇండియా దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల భారత్‌లో చమురు ధరలపై పెను ప్రభావాలు ఉండవు'' అని తనేజా వివరించారు.
చమురు ధరలను ఎలా నియంత్రించాలి?
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత, చమురు ధరలు త్వరలో పెరుగుతాయని, దాని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని ఊహాగానాలు వచ్చాయి.
సోమవారం రాజ్యసభలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి చమురు ధరల గురించి మాట్లాడారు. ''ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం వచ్చినప్పుడు, నవంబర్ 5న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించింది. మరిన్ని చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, 9 రాష్ట్రాలు పన్నులు తగ్గించలేదు. వస్తువుల ధరలు తగ్గించాలంటే పన్నులు తగ్గించడమొక్కటే మార్గం'' అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చమురు ధరల పెరుగుదలకు యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తాజా కారణం కావచ్చు. కానీ, కోవిడ్ మహమ్మారి, గ్లోబల్ వార్మింగ్ కారణంగా, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడులు ఎక్కువగా రాలేదు. దీనివల్ల రానున్న రోజుల్లో ధరలు పెరగడం శాశ్వత సమస్యగా మారవచ్చని చాలామంది నిపుణులు నమ్ముతున్నారు.
అటువంటి పరిస్థితిలో, పన్ను మినహాయింపులు ఇవ్వడం తప్ప భారత ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర తనేజా చెబుతున్న ప్రకారం, చమురు ధరలను నియంత్రించడానికి ప్రభుత్వానికి మూడు ఆప్షన్లు ఉన్నాయి. కానీ, అవి అంత సులభం కాదు.
మొదటిది - ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చమురు పరిరక్షణపై శ్రద్ధ పెట్టాలి.
రెండోది- వీలైనంత వరకు ఇథనాల్ కలపడానికి ప్రయత్నించాలి. కానీ, ఇది సులభం కాదు.
మూడోది- రష్యా మాకు చవకగా చమురు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి, మీరు కూడా ధర తగ్గించండని భారతదేశం సంప్రదాయ చమురు ఎగుమతిదారులను డిమాండ్ చేయగలదు. అంటే ధరల్లో బేరమాడుకోవచ్చు.
అయితే, రానున్న రోజుల్లో భారత్‌లో పెరుగుతున్న చమురు ధరలను తగ్గించడం అంత సులభం కాదని సుభాష్ గార్గ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- #TheKashmirFiles సినిమాపై సోషల్ మీడియాలో ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది?
- గుండె, కిడ్నీ మార్పిడికి ఇక వేచి చూడక్కర్లేదా? మనుషులకు పందుల అవయవాలు సెట్ అయినట్లేనా?
- యుక్రెయిన్: నవ వధువు, గర్భిణి, ఎంపీ.. ఈ మహిళలంతా ఆయుధాలు పట్టి రష్యాతో యుద్ధం చేస్తున్నారు
- యుక్రెయిన్ యుద్ధం: కాలేజ్ నుంచి కదనరంగానికి.. రష్యాతో యుద్ధానికి యుక్రెయిన్ టీనేజర్ల తహతహ
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- ఆశ్రయం ఇస్తే నెలకు 35వేలు.. ప్రభుత్వం ఆఫర్.. వివరాలు 240 పదాల్లో..
- రోజువారి కూలీ యూట్యూబ్ స్టార్.. 8 లక్షల సబ్స్క్రైబర్లు, 10 కోట్లకు పైగా వ్యూస్.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














