యుక్రెయిన్: నవ వధువు, గర్భిణి, ఎంపీ.. ఈ మహిళలంతా ఆయుధాలు పట్టి రష్యాతో యుద్ధం చేస్తున్నారు

ఫొటో సోర్స్, Yaryna Arieva
''మా ప్రస్తుత ప్రతిఘటనకు మహిళా శక్తి అండ ఉంది'' అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యుక్రెయిన్ తొలి మహిళ ఒలెనా జెలెన్‌స్కా రాసుకొచ్చారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కా. రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్‌కు అండగా నిలుస్తోన్న మహిళల ప్రయత్నాలను హైలైట్ చేసే ఫొటోలను ఆమె తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంటున్నారు.
కేవలం జెలెన్‌స్కా ఖాతాల్లో మాత్రమే కాదు. సైనిక దుస్తులు ధరించి ఆయుధాలు పట్టుకున్న మహిళల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.
యుద్ధం కారణంగా చాలా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. లక్షలాది మంది మహిళలు, చిన్నారులు శరణార్థులుగా పొరుగుదేశాలకు తరలివెళ్తుండగా... వారి కుటుంబ పెద్దలైన తండ్రులు, భర్తలు మాత్రం రష్యాపై పోరాడేందుకు యుక్రెయిన్‌లోనే ఉంటున్నారు.
యుక్రెయిన్ దేశ తొలి మహిళ జెలెన్‌స్కా తరహాలోనే తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ చాలామంది మహిళలు ఈ పోరాటంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు.
ఇలా తెగువ చూపిస్తోన్న అయిదుగురు మహిళల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Kira Rudik
1. కీరా రుదిక్: 'ఇది భయంకరమైనది, కానీ నేను చాలా కోపంగా ఉన్నా'
''యుద్ధం ప్రారంభమయ్యేవరకు నేనెప్పుడూ గన్‌ను పట్టుకోలేదు. ఆ అవసరం ఎప్పుడూ రాలేదు'' అని పార్లమెంట్ సభ్యురాలు కీరా రుదిక్ అన్నారు.
''కానీ దాడి ప్రారంభమైనప్పుడు, తుపాకీ పొందే అవకాశం ఉన్నప్పుడు నేను దాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయం తీసుకున్నందుకు తర్వాత నాకే ఆశ్చర్యంగా అనిపించింది.''
కీయెవ్‌లో ప్రతిఘటనా యూనిట్‌ను రుదిక్ సమీకరించారు. యుక్రెయిన్ రాజధానిని రక్షించడం కోసం వారంతా శిక్షణ పొందుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చంపాలనుకుంటున్న జాబితాలో తన పేరు కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించినందున కారణంగా ప్రస్తుతం తన వివరాలను ఆమె రహస్యంగా ఉంచారు.
అయినప్పటికీ యుక్రెయిన్ పార్లమెంట్ వాయిస్ పార్టీ నాయకురాలిగా ఓవైపు తన విధుల్ని నిర్వహించడంతో పాటుగా తన ప్రతిఘటనా యూనిట్‌తో కలిసి పొరుగు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు.
తుపాకీ పట్టుకున్న రుదిక్ ఫొటో ఆన్‌లైన్‌లో చాలా త్వరగా వైరల్ అయింది. మిగతా మహిళలు ఆయుధాలు పట్టుకునేందుకు ఈ ఫొటో ప్రేరణగా నిలిచిందని ఆమె చెప్పారు.
''మేం కూడా పోరాడుతున్నామని చెబుతూ చాలామంది మహిళలు నాకు సందేశాలు పంపించారు'' అని బీబీసీతో ఆమె అన్నారు.
''ఈ యుద్ధం ఎలా ఉంటుందోననే భయాలు మాకు లేవు. కానీ మన పిల్లలను, గౌరవాన్ని కాపాడుకునేందుకు అందరూ పోరాడాలనేది మాత్రం మాకు తెలుసు.''
''ఇది భయంకరమైనది. కానీ నేను చాలా కోపంగా ఉన్నా. నా దేశం కోసం పోరాటం చేయడానికి ఇదే సరైన మానసిక స్థితి' అని ఆమె చెప్పారు.
వరల్డ్ బ్యాంక్ ప్రకారం యుక్రెయిన్‌లోని 44 మిలియన్ల ప్రజల్లో 23 మిలియన్లు మహిళలే. సాయుధ దళాల్లో పనిచేస్తోన్న మహిళల శాతం కూడా ఎక్కువే.
తమ సైనికుల్లో 15.6 శాతం మహిళలు ఉన్నారని యుక్రెయిన్ ఆర్మీ చెప్పింది. 2014 నుంచి ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువే అయిందని తెలిపింది.
మిలిటరీ సర్వీసుల్లో పనిచేయడానికి ఆసక్తి ఉండి, మంచి ఆరోగ్య స్థితిలో ఉన్న18-60 వయస్సున్న మహిళలందరూ నమోదు చేసుకోవాలని డిసెంబర్‌లో ఒక ప్రకటన వెలువడింది. దీని తర్వాత మహిళల సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు.
రష్యా దాడిలో ఇప్పటివరకు ఎంతమంది సాధారణ పౌరులు మరణించారో స్పష్టంగా తెలియదు. కానీ ఫిబ్రవరి 24 నుంచి 1000కి పైగా పౌరులు మరణించినట్లు యుక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని అధికారికంగా ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
ఐక్యరాజ్య సమితి (యూఎన్) నివేదికల ప్రకారం, మార్చి 8 వరకు 516 మంది పౌరులు మృత్యువాతపడ్డారు.
యుద్ధం ప్రారంభమైన తొలి రెండు వారాల్లోనే తమ 1300 సైనికులు మరణించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.

ఫొటో సోర్స్, Marharyta Rivachenko
2. మర్హరిటా రివాచెంకో: 'నేను కదల్లేకపోయాను'
రాజకీయ నాయకులతో పాటు సాధారణ మహిళలు కూడా స్వచ్ఛందంగా యుద్ధ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడికి 2 రోజుల ముందు మర్హరిటా రివాచెంకో, హంగరీలోని బుడాపెస్ట్‌లో తన మిత్రులతో కలిసి తన 25వ జన్మదినాన్ని వేడుకగా జరుపుకొన్నారు.
''యుద్ధం ప్రారంభమైనప్పుడు నా కుటుంబం ఖార్కియెవ్‌లో ఉంది. నేను ఒక్కదాన్నే కీవ్‌లో ఉన్నాను. నేను ఎక్కడికీ వెళ్లలేకపోయాను'' అని బీబీసీతో పీఆర్ మేనేజర్ అయిన మర్హరిటా చెప్పారు.
''నేను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకోలేదు. ఏదైనా చేయాలి అనుకున్నా. అందుకే దేశ రక్షణ కోసం పనిచేసే గ్రూపు (టెరిటోరియల్ డిఫెన్స్ యూనిట్)లో చేరాలని నిర్ణయించుకున్నా'' అని రివచెంకో చెప్పారు.
తన బెటాలియన్ గ్రూపులో వైద్యసేవలు అందించేందుకు రివచెంకో ప్రాథమిక చికిత్స కోర్సులను అభ్యసించారు. ప్రస్తుతం నర్సింగ్ అసిస్టెంట్‌గా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు.
''నేను చాలా భయపడ్డాను. నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నా. నాకు బతకాలని ఉంది. కానీ నా జీవితం యుద్ధంపై ఆధారపడి ఉంది. అందుకే అది ముగిసేందుకు నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Yustyna Dusan
3. యుస్టీనా డసన్: 'జీవించడానికే నా ప్రాధాన్యం'
టెరిటోరియల్ డిఫెన్స్ యూనిట్‌లో ప్రతి ఒక్కరూ చేరలేరు. అక్కడ సురక్షితంగా సేవలు అందించేందుకు సరిపడినంత అనుభవం అందరికీ ఉండదు. మరోవైపు ఇప్పటికే అందులో చాలామంది వాలంటీర్లు ఉన్నారు.
అందుకే ఐటీ రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్ యుస్టీనా డసన్, తన దేశం కోసం మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
''నేను ఇప్పుడు రిజర్వ్ దళాల్లో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఆయుధాలు లేకుండా కార్ సహాయం లేకుండా నేను కీయెవ్‌లో ప్రభావవంతంగా పోరాడలేను. అందుకే నన్ను ఎల్వివ్ నగరానికి పంపించారు.''
''ఫ్రంట్ లైన్ బలగాలకు మానవతా సహాయం, ఆయుధాలు అందించే విషయంలో సహాయం చేయడానికి సురక్షిత ప్రాంతంలో ఉంటూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాను'' అని డసన్ ఆమె చెప్పారు.
యుద్ధానికి ముందు ఆమె జంతు హక్కుల కార్యకర్తగా పని చేశారు.
''ఇదొక విపత్తు. కానీ మనుగడ సాగించడమే నా ప్రాధాన్యత. జీవించి ఉంటేనే నేను సాయుధ దళాలకు సహాయంగా ఉండగలను.''
''యుద్ధం కారణంగా మన చిన్నారులు చనిపోతున్నారు. ప్రతీ యుక్రెనియన్‌ను చంపాలి అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం ఒంటరిగా మిగిలిపోయాం. నాకు బతకాలని ఉంది'' అని ఆమె చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Ukraine Women's Guard
4. ఒలెనా బిలెట్‌స్కీ: 'స్వేచ్ఛాయుత యుక్రెయిన్‌లో నా కూతురు జన్మించాలి'
మాజీ అటార్నీ ఒలెనా బిలెట్‌స్కీకి చెందిన కీయెవ్‌లోని ఇల్లు ప్రస్తుతం యుక్రెయిన్ మహిళా గార్డుల హెడ్‌క్వార్టర్స్‌గా మారిపోయింది.
ఆమె 6 నెలల గర్భిణి. కీయెవ్ నగరాన్ని రక్షించుకోవడానికి ఆమె తన భర్త, ఇద్దరు కూతుళ్ల (16 ఏళ్లు, 11 ఏళ్లు)తో కలిసి నగరంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
''దేశవ్యాప్తంగా ప్రతిఘటన దళాల్లో మహిళలను చేర్చుతున్నాం'' అని ఆమె వివరించారు.
''ఇక్కడే ఉండి పోరాడాలనేది మా కుటుంబ నిర్ణయం. ఎందుకంటే ఆక్రమణలో మేం బతకాలని అనుకోవట్లేదు.''
''ఇది బానిసత్వానికి, స్వేచ్ఛకు మధ్య పోరాటం. ఇదే భావన దేశంలోని మహిళలందరి మదిలో ఉంది. అందుకే వీలైనంతవరకు మేం కీయెవ్‌లోనే ఉండి పోరాడతాం'' అని ఆమె చెప్పారు.
ఆమెతో పాటు ఆమె భర్త ఒలెస్కాండర్, పౌరులను యుద్ధానికి సిద్ధం చేసే బాధ్యతలను నిర్వహించారు.
రష్యన్ మిసైల్స్, పారాట్రూపర్లకు లక్ష్యాలను ఛేదించడంలో ఉపయోగపడే అల్ట్రావయోలెట్ చిహ్నాలపై బిలెట్‌స్కీ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. స్వయంగా తన ఇంటి గార్డెన్‌లోనే వారు ఒక చిహ్నాన్ని కనుగొన్నారు.
''తొలిరోజుల్లో భయం, ఆందోళన తారా స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. కేవలం శత్రువును ఓడించాలనే కసి మాత్రమే ఉంది.''
''నేను పారిపోవాలని అనుకోవట్లేదు. నేను బతికి ఉంటానో లేదో తెలియదు. కానీ స్వేచ్ఛాయుతమైన యుక్రెయిన్‌లో నా మూడో కూతురు జన్మించాలని నేను ఆశపడుతున్నా'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Mikhail Palinchak
5. యరీనా అరీవా: 'నా గురించి నాకు భయం లేదు'
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన నాటి ఉదయం యరీనా అరీవా ఒక నిర్ణయానికి వచ్చారు. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం కీయెవ్‌ను రక్షించుకోవడానికి కొత్త దంపతులు ఇద్దరూ టెరిటోరియల్ డిఫెన్స్ యూనిట్‌లో చేరారు.
''నా దేశాన్ని, నగరాన్ని కాపాడుకోవడానికి నేను చేయగలిగనదంతా చేస్తాను'' అని ఆమె అన్నారు.
''నా తల్లిదండ్రులు, నా ఆస్తి, పెంపుడు పిల్లి అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ప్రేమించేవన్నీ ఇక్కడే ఉండగా నేను ఈ నగరాన్ని ఎలా విడిచి వెళ్తాను. అవసరమైతే నేను కూడా పోరాటంలో పాల్గొంటా'' అని ఆమె వివరించారు.
కీయెవ్ నగర కౌన్సిల్‌లో అరీవా డిప్యూటీగా ఉన్నారు. ఆమె తన భర్తతో కలిసి టెరిటోరియల్ డిఫెన్స్‌లో చేరారు. కానీ పోరాట కార్యకలాపాల్లో పాల్గొనేంత అనుభవం ఆమెకు ఇంకా రాలేదు.
కానీ ఫ్రంట్ లైన్‌లో రష్యాతో పోరాటం చేస్తోన్న తన భర్త విజయం కోసం ఆమె ప్రార్థనలు చేస్తున్నారు.
''యుద్ధం కంటే ముందు నాకు చాలా భయాలు ఉండేది. చీకటి, కుక్కలు అంటే విపరీతంగా భయపడేదాన్ని.''
'' కానీ ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క భయం ఎక్కడ నా భర్తను కోల్పోతానో అని. నా గురించి నాకు ఎలాంటి భయం లేదు'' అని 21 ఏళ్ల అరీవా చెప్పారు.

ఫొటో సోర్స్, Yaryna Arieva
ప్రమాదకరమైన పని
యుద్ధం కారణంగా చాలామంది మహిళలతో సహా వాలంటీర్లు చనిపోతున్నారు.
రష్యా ట్యాంకులు యుక్రెయిన్‌లోకి చేరిన తొలిరోజునే 52 ఏళ్ల మహిళ ఇరినా స్విలా కీయెవ్‌లో మరణించారు. ఆమెకు ఐదుగురు పిల్లలు.
తన భర్త దిమిత్రోతో కలిసి ఆమె నగరాన్ని పరిరక్షించేందుకు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అదే రోజు ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
వారం రోజుల తర్వాత కీయెవ్‌లోని జంతువుల స్థావరాలకు ఆహారాన్ని పంపిణీ చేస్తోన్న కారుపై దాడి కారణంగా 26 ఏళ్ల అనస్థాషియా యెలెన్‌స్కాయాతో పాటు మరో ఇద్దరు చనిపోయారు.
రష్యన్ ట్యాంకు కాల్చివేతలో మరో యువ వాలంటీర్ వలేరియా కన్నుమూశారు. తన తల్లికి మెడిసిన్ తీసుకురావడం కోసం బయటకు వచ్చిన ఆమె మృత్యువాతపడినట్లు ఆమె పనిచేస్తోన్న మానవతాసహాయం సంస్థ యూఎస్‌ఏఐడీ తెలిపింది.
ఆమె త్వరలోనే 32వ జన్మదినాన్ని జరుపుకోవాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- రోజువారి కూలీ యూట్యూబ్ స్టార్.. 8 లక్షల సబ్స్క్రైబర్లు, 10 కోట్లకు పైగా వ్యూస్.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు.. ఏడాది పొడవునా అమలు చేసిన వాటికంటే ఇదే ఎక్కువ
- విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ చాంబర్ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు... 99 రూపాయల హంగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












