రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు... 99 రూపాయల హంగులు

ఫొటో సోర్స్, fb/prabhas
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఏ శాస్త్రమూ నూటికి నూరు పాళ్లూ కరెక్ట్ కాదు. సైన్స్‌కి, మనిషి మేధస్సుకు, ఖగోళ విజ్ఙానానికి అందని విషయాలు ఈ సృష్టిలో చాలా జరిగాయి, జరుగుతున్నాయి.
జ్యోతిష్యం కూడా ఓ శాస్త్రమే అనే నమ్మకం చుట్టూ అల్లుకున్న సినిమా ఇది. అయితే, శాస్త్రాలకు, సిద్ధాంతాలకు, నిజాలకూ అందనిది ఇంకోటుంది. అది విధి. దాన్ని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ శక్తి ప్రేమకు ఉంటే? ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రేమకథ `రాధే శ్యామ్`. విధిని ఎదిరించి, గెలిచిన ఓ ప్రేమ జంట కథ ఈ `రాధేశ్యామ్`.
దాదాపు మూడేళ్ల నుంచి `రాధేశ్యామ్` సెట్స్‌పైనే ఉంది. మధ్యలో కరోనా, లాక్‌డౌన్లు అన్ని సినిమాలతో పాటు రాధేశ్యామ్‌నీ బాగా ఇబ్బంది పెట్టాయి. అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాహుబలి తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాంతో పాటు తన సినిమాకి బడ్జెట్లూ పెరిగాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. ప్రభాస్ హీరో అవ్వడం, ఇంత పెద్ద స్కేల్‌లో సినిమా తీయడం, అన్నింటికీ మించి హస్త సాముద్రికం నేపథ్యంలో ఈ కథ పుట్టడంతో - ఆసక్తి రెట్టింపు అయ్యింది. యేడాది నుంచి ఊరిస్తూ... ఊరిస్తూ... ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రాధేశ్యామ్ ఎలా ఉందంటే...?

ఫొటో సోర్స్, fb/Pooja Hegde
'విక్రమాదిత్య మాటకు తిరుగులేదు'
విక్రమాదిత్య (ప్రభాస్) హస్త సాముద్రికంలో నిపుణుడిగా చూపించారు. ఎవరిదైనా చేయి చూసి జాతకం చెప్పాడంటే, జరిగి తీరుతుందనేలా, తన మాటకు తిరుగులేదు అనేలా ఉంటుంది కథ. దేశాధినేతలు సైతం విక్రమాదిత్య కోసం ఎదురు చూస్తుంటారు.
అలాంటి విక్రమాదిత్య జాతకంలో ప్రేమ రేఖ లేదు. అందుకే ఇష్టపడిన అమ్మాయిలతో తాత్కాలిక ప్రేమకథలు నడుపుతుంటాడు. కలవడం, ప్రేమించుకోవడం, విడిపోవడం... ఇదీ తన పద్ధతి.
భారతదేశంలో ఎమర్జెన్సీ వస్తుందని ఊహించి, ముందుగానే ప్రధానికి చెప్పి, ఇండియా నుంచి యూరప్ వస్తాడు విక్రమాదిత్య. యూరప్ లో ప్రేరణ (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. తనని ఇష్టపడతాడు. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు. కానీ తన చేతిలో ప్రేమ రేఖ లేదు కదా. అందుకే ఆ విషయమే ప్రేరణకు చెప్పి, తాత్కాలిక రిలేషన్ మొదలెడదాం అంటాడు. అందుకు ప్రేరణ ఒప్పుకోదు.
కానీ విక్రమాదిత్య హస్త సాముద్రిక నైపుణ్యం, అతని మాట తీరు, తనకిచ్చే విలువ చూసి.. ప్రేమ పెంచుకుంటుంది. అలా.. విక్రమాదిత్య, ప్రేరణల ప్రయాణం మొదలవుతుంది. అంతలోనే ప్రేరణకు సంబంధించిన ఓ నిజం.. విక్రమ్‌కి తెలుస్తుంది. అదేమిటి? అసలు తన జీవితంలో ప్రేమేలేదనుకున్న విక్రమాదిత్య ప్రేమలో పడడానికి కారణమేంటి? ప్రేరణ వెనుక ఉన్న నిజమేంటి? అనేది వెండి తెరపై చూడాలి.

ఫొటో సోర్స్, fb/prabhas
నిదానం... నీరసం... నైరాశ్యం
చాలా చిన్న కథ ఇది. ప్రభాస్ లాంటి స్టార్‌కి ఈ కథ సరిపోతుందని ఎలా అనుకున్నారా? అనే అనుమానం వస్తుంది. ప్రభాస్ కోసం రాసుకున్న కథైతే కాదనిపిస్తుంది. ప్రభాస్ లాంటి స్టార్ దొరికాడు కాబట్టి.. ఈ కథకు బడ్జెట్ వెసులుబాటు ఉంది. అందుకని భారీ సెట్లు, లావిష్ లొకేషన్లు, భాగ్యశ్రీ లాంటి స్టార్లని తీసుకొచ్చారు. స్క్రిప్టు డిమాండ్‌ని బట్టి ఖర్చు పెట్టాలి కానీ, కోట్లున్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తే ఎలా? నిజానికి యూరప్‌లో మాత్రమే తీయగదిన కథా ఇది? హైదరాబాద్‌లో తీస్తే తప్పేంటి? కథేం మారిపోదు కదా? కాకపోతే.. రూ.300 కోట్లు ఉన్నాయి, ఎంత భారీగా తీస్తే అంత మంచిది అనుకుని రంగంలోకి దిగిపోయారు.
పరమహంస (కృష్ఱంరాజు) పాత్ర ప్రవేశంతో కథ మొదలవుతుంది. సైన్స్‌కీ జ్యోతిష్యానికీ తేడా చెప్పడంతో నేరుగా దర్శకుడు ఈ సినిమా ఉద్దేశ్యమేమిటో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే... యూరప్‌లో ప్రభాస్ ఇంట్రడక్షన్. దేశ ప్రధాని చేయి చూసి జాతకం చెప్పడం, హీరో హస్త సాముద్రికంలో ఎంత నిష్టాతుడో ఎలివేట్ చేయడం ఇవన్నీ బాగున్నాయి.
అసలు హీరో జ్యోతిష్యుడు అని చెప్పడమే కొత్తగా అనిపించే పాయింట్. కాబట్టి విక్రమాదిత్యతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అయిపోతారు కానీ, ఆధునిక యుగంలో ఇంకా హస్త సాముద్రికం, జ్యోతిష్యాల చుట్టూ హీరో పాత్రను తిప్పడం వివాదాస్పద అంశమే. `నా బరువు నువ్వు మోయగలవా` అంటూ ప్రేరణ (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. ట్రైన్‌లోంచి బయటకు చూస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ హీరోయిన్‌ని ఇంట్రడ్యూస్ చేయడం, మరుసటి సీన్‌లోనే హీరో, హీరోయిన్లని ఒకే కథలోకి తీసుకురావడం.. ఇవన్నీ లవ్లీగా కుదిరాయి.
ప్రేరణ - విక్రమాదిత్య పక్క పక్క బస్సుల్లో ప్రయాణం చేస్తూ... అద్దాల్లోంచి సంకేతాలు పంపుకోవడం రొమాంటిక్‌గా అనిపిస్తుంది. గోడ మీద ప్రేరణ ఓ చిన్న బొమ్మగీయడం, ఆ తరవాత.. విక్రమాదిత్య ఆ బొమ్మని కొనసాగిస్తూ రావడం, ఆ బొమ్మలతోనే ఇద్దరూ కలిసి కలవకుండా సంభాషించుకోవడం - ఇవన్నీ మంచి థాట్స్.
అయితే... ప్రేమకథకు ఇవి మాత్రమే సరిపోవు. ఓ ఘర్షణ రావాలి. అది వచ్చేలోగా బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడు. `డెత్ ప్రాక్టీస్ యోగా` సీన్ బోర్ కొట్టిస్తుంది. ట్రైన్‌లో అందరి జాతకాలు చూడడం, ఆ ట్రైన్‌లో ఉన్నవాళ్లంతా చనిపోతారు అని ఊహించడం, ఆ ట్రైన్‌ని వెంబడించుకుంటూ వెళ్లడం.. ఇవన్నీ బాగా పరిచయం ఉన్న ఓ పాత కథని గుర్తుకు తెస్తాయి.
హస్త సాముద్రికంతో హీరో ఏమైనా అద్భుతాలు చేస్తాడా? అంటూ ప్రేక్షకులంతా ఎదురుచూస్తుంటారు. కానీ అవేం జరగవు. సీను వెంట సీను. సీను వెంట సీను వస్తున్నా - ఆ సన్నివేశాల్లో ఎమోషన్ పట్టదు. పాత్రలు గుంపు గుంపుగా ఉన్నా ఎవరూ రిజిస్టర్ అవ్వరు. ఇంట్రవెల్ బ్యాంగ్ అంతా ఊహించిందే. కాబట్టి అక్కడ ఎలాంటి కిక్ ఉండదు.

ఫొటో సోర్స్, fb/Pooja Hegde
గీతల్లో లేదు.. చేతల్లో ఉంది
జ్యోతిష్యం 99 శాతం మాత్రమే కరెక్ట్ అనేది గురువు పరమహంస మాట. కాదు. వందశాతం కరెక్ట్ అన్నది శిష్యుడు విక్రమాదిత్య నమ్మకం. ఇందులో ఏది కరెక్టో చెప్పడమే `రాధే శ్యామ్` అనుకోవాలి. తమ రాతని తామే రాసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే.. ఈ `రాధే శ్యామ్`.
జ్యోతిష్యాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో తన రాత తానే రాసుకున్న ఓ అథ్లైట్ పాత్రని చూపించారు. నిజానికి చాలా బలమైన, ముఖ్యమైన పాయింట్ అది. దాన్ని ఓ పాసింగ్ క్లౌడ్ పాత్రలా వాడడం ఏమాత్రం బాలేదు. మన భవిష్యత్తు గీతల్లో లేదు, మన చేతల్లో ఉంది అనే పాజిటీవ్‌నెస్ ఉన్న పాత్ర అది. దానిపై కొంత వర్క్ చేస్తే బాగుండేది.
విధిని ఓడించి ప్రేమ ఎలా గెలిచిందన్న పాయింట్ ఈ సినిమాకి ప్రధానమైన బలం. క్లైమాక్స్‌లో టైటానిక్‌ని గుర్తు చేసే ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అందుకోసం భారీగా ఖర్చు పెట్టినట్టు కూడా అర్థమవుతుంది. కానీ ఆయా సన్నివేశాల్ని ఇంకా బాగా తీయాల్సింది.
ప్రభాస్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఏమీ ఈ సినిమాలో లేవు. కేవలం ప్రేమకథ మాత్రమే. ప్రేమ కథ నడవడానికి హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, కాన్‌ఫ్లిక్ట్ చాలా అవసరం. ఇవి రెండూ ఈ సినిమాలో అరకొరగానే ఉన్నాయి. ప్రేమకథలకు సంగీతం సగం బలం. అదీ.. ఇందులో బలహీనంగానే వినిపించింది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కటే సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది.

ఫొటో సోర్స్, fb/prabhas
కళా విభాగమా... భళా
ఇక ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైనర్ పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ ప్రేమకథని చాలా లావీష్‌గా తీయాలనుకున్నారు నిర్మాతలు. అందుకే యూరప్‌లో ప్లాన్ చేశారు. 1980ల నాటి వాతావరణం సృష్టించడానికి, యూరప్‌లో సెట్లు హైదరాబాద్‌లో రీక్రియేట్ చేయడానికి ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా కష్టపడ్డారు. ఆయన వర్క్ ప్రతీ సన్నివేశంలో తెలుస్తూనే ఉంటుంది. ట్రైన్ సెట్, క్లైమాక్స్‌లో షిప్ సెట్, ఇళ్లు, ఆసుపత్రి, కేఫ్టీరియా... ఇలా దాదాపుగా 101 సెట్లు ఈ సినిమాలో ఉన్నాయి. అవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. పరమహంస ఫొటోగ్రఫీ చాలా నీట్‌గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని చోట్ల సీజీ అనే విషయం ఈజీగా అర్థమైపోతుంది.
ప్రభాస్ తనదైన యాక్షన్ కథలకు దూరంగా ప్రేమకథని ఎంచుకోవాలన్న ఆలోచన బాగుంది. సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి కథలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ కెరీర్ పీక్స్‌లో ఇలాంటి కథని ప్రభాస్ ఎంచుకోవడం ప్రయోగం లాంటిదే. చాలా సన్నివేశాల్లో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించాడు. కొన్ని చోట్ల మాత్రం డీఐ సరిగా కుదరలేదు. ఛేజింగుల్లో ప్రభాస్ డూప్‌ని వాడారని స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రభాస్ బలాలకు ఏమాత్రం పని పెట్టని సినిమాగా `రాధే శ్యామ్` మిగిలిపోతుంది.
పూజా మరోసారి ఆకట్టుకుంటుంది. తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం వల్ల.... నటన ఇంప్రూవ్ అయ్యింది. భాగ్యశ్రీ లాంటి స్టార్‌ని తీసుకొచ్చి, ఏమాత్రం ప్రాముఖ్యం లేని పాత్ర ఇచ్చారేమో అనిపిస్తుంది. జగపతిబాబు కూడా రెండు సీన్లకే పరిమితం అయ్యాడు. మురళీ శర్మ ఉన్నాడా, లేడా అన్నట్టుంది ఆయన స్క్రీన్ టైమ్ చూస్తే.
అన్నీ బాగున్నా... కీలకమైన స్క్రిప్టు దగ్గరే దర్శకుడికి పట్టు దక్కలేదు. చాలా చిన్న లైన్‌ని, స్టార్ హీరోకి మ్యాచ్ చేయాలని చూసి, పాన్ ఇండియా సమీకరణాలు వేసుకుని... లేని వెయిటేజీ తీసుకుని రావడానికి ప్రయత్నించాడు. సీన్లలో ఎక్కడా హై ఉండదు. స్క్రీన్ ప్లేలో మలుపులు పెద్దగా కనిపించవు. వినోదానికి స్కోప్ లేదు. ఎమోషన్ ఉన్నా అది వర్కవుట్ కాలేదు.

ఫొటో సోర్స్, fb/prabhas
తాడు దొరికింది.. గుర్రం కొనండి
ఓ పాత సామెత గుర్తొస్తుంది రాధే శ్యామ్ ని చూస్తే. ఎవడికో తాడు దొరికింది కదా అని గుర్రం కొన్నాడట. తాడు లాంటి చిన్న కథ ఇది. దానికి ప్రభాస్‌ని తీసుకొచ్చాడు. అలా. అలా.. బడ్జెట్ పెరిగిపోయింది.
రాధేశ్యామ్‌లో ఓ డైలాగ్ ఉంది. ఓ చిన్న పిన్ను ఇవ్వడానికి ఇంత దూరం వచ్చావా? అని. పిన్ను ఖరీదు రూపాయే. కానీ దాని కోసం ఏమేం చేశానో తెలుసా? అని ఓ లిస్టు చదువుతాడు విక్రమాదిత్య. రూపాయి పిన్ను `వెలకట్టలేనంతగా` ఎలా మారిపోయిందో చెప్పే డైలాగ్ అది.
ఈ సినిమా కోసం కూడా అదే చేశారు. రూపాయి కథకు.. 99 రూపాయల హంగులిచ్చారు. అయితే ఆ 99 రూపాయలు ఆ రూపాయి కథని కాపాడలేకపోవడమే అసలు విషాదం.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి 5 కారణాలు
- పన్నా ప్రముఖ్: బూత్ స్థాయిలో బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతున్న ఈ వ్యూహం ఏంటి?
- ఉత్తరప్రదేశ్‌లో యోగి చారిత్రక విజయానికి 6 కారణాలు
- బీజేపీ చరిత్రాత్మక విజయం 'మోదీ ఇండియా' గురించి ఏం చెబుతోంది?
- పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















