Panna Pramukh: బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతున్న ఈ బూత్ స్థాయి మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహం ఏంటి?

ఫొటో సోర్స్, facebook/BJP4Tripura
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
''పార్టీకి ప్రజల మద్దతు విజయవంతంగా ఎవరైనా సాధించగలరు అంటే అది కేవలం 'పన్నా ప్రముఖ్'లే. ఇంకెవరూ చేయలేరు. బీజేపీ విజయాల్లో పన్నా ప్రముఖ్‌లదే కీలక పాత్ర. మరే పార్టీలోనూ ఇలాంటి వ్యవస్థ లేదు' అని 2018 నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పన్నా ప్రముఖ్‌ల సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
''ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని కొన్ని శాంపిల్స్ చూస్తున్నా, ఏ ఒక్కరి తలపైనా 60 మంది ఓటర్ల కంటే ఎక్కువ బాధ్యతలేదు. (పన్నా ప్రముఖ్‌లకు కేటాయించిన బాధ్యతల గురించి).. నాకు (పార్టీ నాయకులపై) విశ్వాసం లేదు అనుకోకండి. నేను పనిచేసే విధానమే ఇది. ఒక్కొక్కరూ 60 మందితో ఓట్లు వేయించేలా పనిచేయాలి. అంటే 20 కుటుంబాలు. వాళ్లను కలిస్తే చాలు'' అని దిల్లీలో 2015లో నిర్వహించిన పన్నా ప్రముఖ్‌ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యానించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జనవరి 25వ తేదీన బీజేపీ పన్నా ప్రముఖ్‌లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మాట్లాడారు.
పన్నా ప్రముఖ్ ఎవరు?
ప్రతి ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంటుంది. దీనిని తరచుగా సవరిస్తుంటుంది కూడా. ఒక్కో పేజీలో ముందు, వెనుకా కలిపి 60 మంది ఓటర్ల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు ఉంటాయి.
ఒక్కో పేజీలో ఉన్న 60 మంది ఓటర్ల బాధ్యతలను భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కార్యకర్తకు అప్పగిస్తుంది. వీరినే సంస్థాగతంగా 'పన్నా ప్రముఖ్' అని పిలుస్తారు.
వీళ్లు ఏం చేస్తారు?
తమకు అప్పగించిన ఓటర్లను నేరుగా కలవడం, వారికి ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయో లేదో చూడటం. ఒకవేళ అందకపోతే పార్టీ తరపున ఏం చేయాలో నిర్ణయించి, తగినవిధంగా సహాయం చేయడం. ఓటర్లకు ఇతర సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో చూడటం.. అందుకు అనుగుణంగా పార్టీ తరపున చర్యలు తీసుకోవడం.
ఒకవేళ ఈ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా లేకపోతే.. పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి, నాయకుల గురించి చెప్పి, పార్టీకి అనుకూలతను సాధించడం.
కొన్నిచోట్ల ఓటర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా పన్నా ప్రముఖ్‌లు పరిశీలించి, ఓటర్ల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా మెలుగుతూ వారిని ఆకట్టుకుంటారు.
ఓటింగ్ తేదీ వరకూ ఆయా ఓటర్లను, వారి కుటుంబాలను ఆకట్టుకుంటూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.
దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ బూత్ స్థాయి కమిటీకి రిపోర్ట్ చేస్తుంటారు. కులం, మతం, అభిరుచులకు అనుగుణంగా కూడా ఓటర్లను ఇక్కడే విభజించి, గుర్తిస్తుంటారు.
ఓటింగ్ రోజున తమకు సంబంధించిన ఓటర్లంతా ఓట్లు వేసేలా చూస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతమంది బీజేపీకి ఓటు వేసి ఉంటారో కూడా ఒక అంచనా వేసి బూత్ స్థాయి కమిటీకి నివేదిస్తారు.
అయితే, ప్రతి బూత్‌లోనూ 60 మంది ఓటర్ల బాధ్యత ఉండదు. ఒక్కో చోట 15మంది ఓటర్ల బాధ్యతలను అప్పగిస్తే, మరో చోట 30 మంది ఓటర్ల బాధ్యతలను పన్నా ప్రముఖ్‌లకు అప్పగిస్తుంటుంది బీజేపీ.

ఫొటో సోర్స్, facebook/franklyarvind
బీజేపీలో ఈ వ్యవస్థ ఎప్పటి నుంచి ఉంది?
ఆర్ఎస్ఎస్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే పన్నా ప్రముఖ్ అని అంటుంటారు. అయితే, ఈ వ్యవస్థను గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ చాలాకాలంగా అమలు చేస్తోంది.
గుజరాత్ బయట దీనిని ప్రయోగించింది మాత్రం 2014 లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్ ప్రదేశ్‌లో.
అప్పట్లో అమిత్ షా ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. అప్పట్లో లక్షన్నరకు పైగా పన్నా ప్రముఖ్‌లను ఆయన నియమించారు. ఆయన ఎన్నికల వ్యూహాల్లో ఇదొకటని, అందుకే దీనికి ఆయన చాలా ప్రాధాన్యం ఇస్తుంటారని పార్టీ నాయకులు చెబుతుంటారు. ఆయనే స్వయంగా పన్నా ప్రముఖ్‌గా కూడా వ్యవహరిస్తుంటారు.
తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల ఇలాంటి ప్రయోగాన్ని అమలు చేసింది.

ఫొటో సోర్స్, facebook/amitshahofficial
కానీ, బీజేపీ మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఎన్నికల్లో 'పన్నా ప్రముఖ్'లను నియమిస్తోంది. ఈ వ్యవస్థ తమకు చాలా బాగా ఉపయోగపడుతుందని బీజేపీ ప్రముఖులు గర్వంగా చెబుతుంటారు. విజయమే లక్ష్యంగా పెట్టుకున్న చోట్ల దీనికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.
తెలంగాణలోని హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికలో కూడా పన్నా ప్రముఖ్‌లదే కీలక పాత్ర.
వీరికి బాధ్యతలు అప్పగించి, ఎన్నికల వరకూ ఉపయోగించుకోవడమే కాకుండా.. తరచుగా 'పన్నా ప్రముఖ్' సమావేశాలను కూడా పార్టీ ఏర్పాటు చేస్తుంటుంది. ప్రముఖ నాయకులు వచ్చి ఈ సమావేశాల్లో మాట్లాడుతుంటారు.
పన్నా ప్రముఖ్ బాధ్యతకూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతకూ సమాన హోదా ఉంటుందని పలు పన్నా ప్రముఖ్ సమావేశాల్లో బీజేపీ నాయకులు చెబుతుంటారు.
2022 డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 15 లక్షల మంది పన్నా ప్రముఖ్‌లను భారతీయ జనతా పార్టీ నియమించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా అందులో ఒకరు.
బూత్ స్థాయి కమిటీలకూ, దీనికి ఏంటి తేడా?
చాలా రాజకీయ పార్టీలకు బూత్ స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు కూడా సాధారణంగా చేసే పని ఇదే. తమతమ బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లను గుర్తించడం, వారితో మాట్లాడటం, పార్టీకి ఓటు వేసేలా చూడటమే ఈ బూత్ కమిటీల బాధ్యత. చాలా పార్టీలు ఈ బూత్ కమిటీ సభ్యులకు ఓటర్ల బాధ్యతలను కూడా అప్పగిస్తుంటాయి. అయితే, చాలాచోట్ల పార్టీకి ఓటు వేయని కుటుంబాలు, వ్యక్తులనే టార్గెట్ చేస్తుంటారు.
అయితే, పన్నా ప్రముఖ్ మాత్రం బీజేపీ వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసుకున్న బాధ్యత. వారి లక్ష్యం ఒక్కటే. ఆ లక్ష్యం కూడా చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండటమే ఈ వ్యవస్థ ప్రత్యేకత. బీజేపీ ఎన్నికల వ్యూహంలో మైక్రో మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పన్నా ప్రముఖ్, బూత్ కమిటీ, శక్తి కేంద్రాలు.. ఇవన్నీ ఈ మైక్రో మేనేజ్‌మెంట్‌లో భాగం. వీటిలో ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యతలు అప్పగించారనేది దిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచి ఆపరేట్ చేసే పోర్టల్‌లో పొందుపరుస్తుంటారు.
2019 ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వారణాసి నియోజకవర్గంలో ఒక శక్తి కేంద్రానికి ఇన్‌చార్జి. ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాని నుంచి మంత్రులు, ఎంపీల దాకా అందరూ మైక్రో మేనేజ్‌మెంట్‌లో భాగమైన శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలకు ఇన్‌చార్జులుగా, పన్నా ప్రముఖ్‌లుగా వ్యవహరిస్తూ తమకు అప్పజెప్పిన బాధ్యతల్ని పూర్తి చేస్తుంటారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 2014లో బీజేపీ ఏకంగా 71 స్థానాల్లో గెలుపొందింది. కనీవినీ ఎరుగని విజయం ఇది.
త్రిపురలో 25 ఏళ్లపాటు తిరుగులేకుండా పాలిస్తున్న కమ్యూనిస్టు కంచుకోటను 2018లో బీజేపీ బద్దలుకొట్టింటి. అంతకు ముందు ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 2018లో మాత్రం 60 సీట్లలో 34 సీట్లు గెలుచుకోవడమే కాకుండా గత ఎన్నికలతో పోలిస్తే 41.5 శాతం అధికంగా ఓట్లను సాధించుకుంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో వరుసగా నాలుగు ఎన్నికల్లో (2014 లోక్‌సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు) 40 శాతానికి పైగా ఓట్లను బీజేపీ సాధించుకుంది. ఇది కూడా ఒక రికార్డు.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి 5 కారణాలు
- ఉత్తరప్రదేశ్‌లో యోగి చారిత్రక విజయానికి 6 కారణాలు
- పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- యూపీలో 100 సీట్లలో పోటీ చేసినా ఖాతా తెరవని మజ్లిస్, అసదుద్దీన్ M-D ఫార్ములా ఎంతవరకూ ఫలించింది? పరోక్షంగా బీజేపీకి లాభించిందా?
- భగవంత్ మాన్: కమెడియన్, పొలిటీషియన్... కాబోయే పంజాబ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














