యూపీలో 100 సీట్లలో పోటీ చేసినా ఖాతా తెరవని మజ్లిస్: అసదుద్దీన్ M-D ఫార్ములా ఎంతవరకూ ఫలించింది? పరోక్షంగా బీజేపీకి లాభించిందా?

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, @aimim_national

    • రచయిత, పృథ్వి రాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేసిన అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ఒక్క సీటులో కూడా ముందంజలో లేదు.

ఇప్పటికే తెలంగాణ వెలుపల మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీల్లో అడుగుపెట్టిన ఎంఐఎం.. యూపీలో కూడా ఖాతా తెరవటానికి మరోసారి ప్రయత్నించింది. పశ్చిమ యూపీలోని అజాంగ‌ఢ్‌లో సమాజ్‌వాది పార్టీ M-Y (ముస్లిం-యాదవ) ఫార్ములాతో విజయం సాధించిన నేపథ్యంలో.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కూడా అదే తరహాలో M-D (ముస్లిం-దళిత) ఫార్ములాను ప్రయత్నించినట్లు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ ఫార్ములాను 'అజాంగఢ్ ఫార్ములా'గా కూడా వారు పిలుస్తున్నారు.

యూపీలో ముస్లింలు, బీసీలు, దళితుల్లో మద్దతున్న పలు పార్టీలతో కలిసి 'భాగీదారి పరివర్తన్ మోర్చా' పేరుతో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు అసదుద్దీన్. ముస్లింలతో పాటు దళితులను కూడా ఆకట్టుకోవటానికి ప్రయత్నించారు.

బాబు సింగ్ కుష్వహా సారథ్యంలోని జన్ అధికారి పార్టీ, వామన్ మేష్రామ్ నేతృత్వంలోని భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని జనతా క్రాంతి పార్టీ, రాంప్రసాద్ కశ్యప్‌కు చెందిన భారతీయ వించిత్ సమాజ్ పార్టీలు ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, koo screen

కాల్పుల కలకలం

తమ కూటమి తరఫున ఒక దళిత సీఎం, ఒక ఓబీసీ సీఎం చొప్పున ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ముస్లిం ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని కూడా అసదుద్దీన్ ప్రకటించారు. తన ప్రచారంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను తరచుగా ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో ఆవేశంగా ప్రసంగించే అసదుద్దీన్.. హిజాబ్ తదితర వివాదాలనూ లేవనెత్తుతూ బీజేపీ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.

యూపీలోని హాపూర్ జిల్లాలో ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల ప్రచారంలో ఉండగా అసదుద్దీన్ ఒవైసీ కారు మీద జరిగిన తుపాకీ కాల్పుల ఘటన కొంత కలకలం రేపింది. ఈ కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వానిది, మోదీ ప్రభుత్వానిదేనని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో అసదుద్దీన్‌కు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. దీనిని అంగీకరించాలని పార్లమెంటులో మాట్లాడుతూ ఒవైసీని కోరారు. కానీ.. తనకు 'జడ్ కేటగిరీ' భద్రత వద్దని, తనను 'ఎ క్లాస్' సిటిజన్‌గా చూడాలని ఒవైసీ అదే పార్లమెంటులో వ్యాఖ్యానించారు. తనపై పేలిన తూటాలకు యూపీ ప్రజలు బ్యాలట్లతో బదులిస్తారని, విద్వేషానికి ప్రేమతో జవాబు చెప్తారని ఆయన పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ: ‘నాపై 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.. నా కారు పంక్చర్ అయ్యింది’

100 సీట్లు.. 0.45 శాతం ఓట్లు

ఎంఐఎం 2017లో కూడా ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసింది. అప్పుడు కూడా ఈ పార్టీకి ఎక్కడా గెలుపు వరించలేదు. నాడు 38 స్థానాల నుంచి బరిలోకి దిగిన మజ్లిస్.. 0.24 శాతం ఓట్లు సంపాదించింది. అప్పుడు 37 సీట్లలో డిపాజిట్లు కూడా లభించలేదు.

ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించినపుడు.. కనీసం పది స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని ఆశిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. బహ్రాయిచ్ జిల్లాలోని నాన్‌పారా, అయోధ్య జిల్లాలోని రౌదౌలి, సిద్దార్థ్ నగర్ జిల్లాలోని దొమరియాగంజ్, ఘజియాబాద్ జిల్లాలోని సహరాన్‌పూర్ దేహత్, సాహిబాబాద్, మీరట్ జిల్లాలోని సివాల్ తదితర నియోజకవర్గాల్లో తమ పార్టీకి చాన్స్ ఉంటుందని ఆశించారు.

ఈ పార్టీ పోటీ చేసిన అత్యధిక స్థానాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. కానీ మొత్తం 100 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. యూపీలో ఖాతా తెరవటంలో విఫలమైంది. ఏ ఒక్క స్థానంలోనూ రెండో స్థానంలో కూడా ఎంఐఎం కనిపించలేదు. మొత్తం మీద ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి 0.45% ఓట్లు లభించాయి.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, @aimim_national

'పరోక్షంగా బీజేపీకి ప్రయోజనం...'

అయితే.. అసదుద్దీన్ 'అజాంగఢ్ ఫార్ములా'.. సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలకు చెందిన ఓటు బ్యాంకులను సైతం కొంతమేర ఆకట్టుకునే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. నిజానికి మజ్లిస్ పార్టీ.. యూపీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి సాయపడినట్లు కనిపిస్తోందని సామాజిక విశ్లేషకుడు మెరుగుమాల నాంచారయ్య బీబీసీతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.

''హిందూ ఓట్లు బీజేపీకి పడేలా, ముస్లిం ఓట్లు వేరే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కాకుండా ఎంఐఎంకి పడేలా విభజించటం తెరవెనుక వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఆరోపణలు చాలా మంది చేస్తున్నారు కూడా. ఈరకమైన వ్యూహంలో బీజేపీ ప్రధానంగా లాభపడినప్పటికీ.. ఎంఐఎంకి కూడా తన ఉనికిని విస్తరించుకోవటానికి, ముస్లింలలో పట్టు పెంచుకోవటానికి ఉపయోగపడుతోంది. కాబట్టి ఇది ఉభయ ప్రయోజనకర వ్యూహమని చెప్పొచ్చు'' అని నాంచారయ్య విశ్లేషించారు.

‘‘యూపీలో ముఖ్యంగా ముస్లింల ఓట్లు సమాజ్‌వాది పార్టీకి ఎక్కువగా పడుతుంటాయి. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒవైసీ సాయంతో చీల్చాలన్నది బీజేపీ ప్రణాళిక’’ అని బీజేపీ రాజకీయాలను దగ్గరుండి పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు ప్రదీప్ సింగ్ కొద్దిరోజుల కిందట చెప్పారు.

రాష్ట్రంలో ముస్లింల ఓట్లు 19 శాతం వరకూ ఉంటాయి. 100కు పైగా స్థానాల్లో వీరు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. ఇక్కడ ముస్లిం ఓట్లు చీలిపోతే, చివరగా లబ్ధి పొందేది బీజేపీనే.

యూపీలో మజ్లిస్ అభ్యర్థులు బరిలోకి దిగిన చోట్ల బీజేపీ లబ్ధి పొందటాన్ని గమనించవచ్చని యూపీ రాజకీయాలపై చాలా ఏళ్లుగా వార్తలు రాస్తున్న సీనియర్ జర్నలిస్టు శరత్ ప్రధాన్ పేర్కొన్నారు.

''బీజేపీకి ఒవైసీ సాయం చేస్తున్నారని కొందరు అంటున్నారు. తనకు అలాంటి ఉద్దేశమేదీ లేదని ఒవైసీ చెబుతున్నారు. ఒవైసీ కావాలని చేసినా లేదా అనుకోకుండా చేసినా.. పరోక్షంగా బీజేపీకే లబ్ధి చేకూరుతోంది. ఒవైసీ ఎలా అనుకుని చేసినా ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి'' అని ఆయన విశ్లేషించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రజల మెదళ్లలోనే చిప్ వేశారు: అసదుద్దీన్ ఒవైసీ

ఈ విమర్శలపై వివరణ కోసం ఎంఐఎంను సంప్రదించటానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ అటునుంచి స్పందన రాలేదు.

కానీ, యూపీ ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని, ప్రజల తీర్పును గౌరవిస్తామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారని ఏఎన్ఐ చెప్పింది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై మాట్లాడిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఆ రాష్ట్ర ప్రజలు ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని, కానీ, మిగతాపార్టీలన్నీ తమ ఓటమిని కప్పిపుచ్చుకోడానికి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ఈవీఎంల తప్పు లేదని, జనాల మెదళ్లలోనే చిప్ వేసేశారని నేను 2019 నుంచి చెబుతున్నా, అది వాటి తప్పు కాదు" అని ఒవైసీ అన్నట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఎన్నికల్లో విజయానికి తమ పార్టీ కష్టపడిందని, కానీ ఫలితాలు తాము అనుకున్న విధంగా రాలేదని అసదుద్దీన్ చెప్పారు. "మేం రేపటి నుంచి మళ్లీ పని ప్రారంభిస్తాం. ఈసారీ మరింత మెరుగ్గా చేయగలమనే నేను అనుకుంటున్నా" అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఎంఐఎం నేత ఆరోపించారు.

"లఖీంపూర్ ఖీరీలో కూడా బీజేపీ గెలిచింది. అందుకే ఇది 80-20 విజయం అని చెబుతున్నా. ఈ 80-20 పరిస్థితి ఏళ్ల వరకూ ఉంటుంది. ప్రజలు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారని ఏఎన్ఐ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)