ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?

విశాఖపట్నం
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలో అనేక అందమైన లొకేషన్లు ఉన్నాయి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం...

ఈ ఇంటరాక్టివ్‌ను చూడ్డానికి జావా స్క్రిప్ట్‌తో ఆధునిక వెబ్ బ్రౌజర్, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.

''విశాఖ ఒక పెద్ద నగరం, ఆహ్లాదకరమైన సిటీ. ఇక్కడ ఒక ప్రాంతాన్ని జూబ్లీహిల్స్ తరహాలో అభివృద్ధి చేద్దాం. నెమ్మదిగా సినీ పరిశ్రమ విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖలో స్థలాలు ఇస్తా" అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల చెప్పారు.

టిక్కెట్ల రేట్లు, షోల సంఖ్య విషయంలో సినీ నటుడు చిరంజీవి నేతృత్వంలోని ఇటీవల తనను కలిసిన తెలుగు సినిమా హీరోలు, దర్శకుల బృందంతో సీఎం ఈ మాటలన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుండి వైజాగ్‌కు మారుతుందని చాలా ఊహాగానాలే సాగాయి.

అప్పటికే విశాఖలో ఉన్న రామానాయుడు స్టూడియోతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌ బాబు, అనుష్క, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్ వంటి అనేకమంది నటీనటులు, దర్శక నిర్మాతలు చిన్న తరహా నుంచి భారీ స్టూడియోలు నిర్మించబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది.

కానీ, ఇప్పటికీ ఏ ఒక్క స్టూడియోగానీ, మరే ఇతర సినీ పరిశ్రమ అనుబంధ సంస్థగానీ ఇక్కడకు రాలేదు, నిర్మాణాలు జరగలేదు.

తెలుగు సినిమా పరిశ్రమ
ఫొటో క్యాప్షన్, కెమెరాలు

'విశాఖలో సినీ స్టూడియోలు'

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు, ఆన్‌లైన్ టిక్కెట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై చర్చించేందుకు టాలీవుడ్ నుంచి కొందరు హీరోలు, దర్శకులు ఇటీవల ఏపీ సీఎంను కలిసిన సందర్భంలో, విశాఖకు సినిమా పరిశ్రమను షిష్ట్ చేయాలని సీఎం జగన్ కోరారు. దీంతో విశాఖలో సినీ స్టూడియోల అంశంపై చర్చ మళ్లీ మొదలైంది.

''విశాఖలో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి ముందు, తర్వాత కూడా చాలామంది నిర్మాతలు, హీరోలు విశాఖలో సినీ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విశాఖలో టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు భీమిలి, కాపులుప్పాడ వంటి తీర ప్రాంతాల్లో స్టూడియోలకు సరిపడా స్థలాలను ఎప్పుడో కొనుక్కున్నారు. వాటిలో కొన్ని భూములు వివాదంలో కూడా పడ్డాయి. హీరోయిన్ అనుష్క కొన్న భూమి వివాదస్పదమైంది కూడా" అని వైజాగ్ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ చెప్పారు.

"ప్రస్తుతమైతే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాజమౌళి వంటివారు విశాఖలో సినీ స్టూడియో పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రెండు, మూడేళ్ల కిందట విశాఖలో స్టూడియో కోసం చెన్నైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం సైతం దరఖాస్తు చేసుకుందని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషనే చెప్పింది. విశాఖలో స్టూడియోల నిర్మాణం అనే అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఈ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా...ఇప్పటికే విశాఖలో ఉన్న రామానాయుడు స్టూడియోని మరింత అభివృద్ధి చేసేందుకు సురేశ్ ప్రొడక్షన్ సంస్థ ప్లాన్ చేస్తోంది" అని రమణ తెలిపారు.

రామానాయుడు స్టూడియో
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో

'అన్నింటికి అనుకూలం రామానాయుడు స్టూడియో'

ప్రస్తుతం విశాఖలో ఉన్న ఏకైక సినీ స్టూడియో రామానాయుడు స్టూడియో. విశాఖ నుంచి భీమిలి వెళ్లే దారిలో తీరానికి ఆనుకుని ఉన్న తిమ్మాపురం కొండపై రామానాయుడు ఈ స్టూడియోను నిర్మించారు.

దీని నిర్మాణానికి 2008లో అప్పటి ప్రభుత్వం కొండపై దాదాపు 35 ఎకరాల స్థలం కేటాయించగా, అందులో పది ఎకరాలను చదును చేసి ఈ స్టూడియో నిర్మించారు. ఇప్పుడు ఈ స్టూడియోలో తెలుగు, బెంగాలీ, ఒడియా, కన్నడ సినిమాలు, ప్రధానంగా చిన్న సినిమాలు, ఓటీటీ మూవీస్ ఎక్కువగా షూటింగ్ జరుపుకొంటుంటాయి.

"మా స్టూడియోలో నిత్యం షూటింగులు జరుగుతూనే ఉంటాయి. సముద్రం, పచ్చదనం, డిఫరెంట్ లోకేషన్లు, ఒకవైపు సాగరం, మరోవైపు కొండలు ఇలా అన్నీ కూడా సమీపంలోనే ఉండటం రామానాయుడు స్టూడియోకు కలిసొచ్చే అంశం. ఇక్కడ నెలకు 15 వరకు వివిధ భాషా చిత్రాల షూటింగులు జరుగుతుంటాయి. ముఖ్యంగా బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి చిత్రాల షూటింగులకు కేరాఫ్ అడ్రస్ విశాఖ రామానాయుడు స్టూడియోనే'' అని విశాఖ సురేశ్ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పారు.

సినిమా ఇండస్ట్రీ
ఫొటో క్యాప్షన్, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్

'పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది'

భాషతో పని లేకుండా ఏ చిత్ర పరిశ్రమైనా విశాఖలో షూటింగులు జరుపుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖలోని అందాలతో పాటు రామానాయుడు స్టూడియో కూడా ఉండటంతో ఇక్కడ షూటింగులకు ఆసక్తి చూపించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.

"ఒకప్పుడు విశాఖలో సినిమా షూటింగ్ జరగని రోజే ఉండేది కాదు. కానీ, కరోనాతో సీన్ మారింది. షూటింగులకు బ్రేక్ పడటం, ఇతర ప్రాంతాలకు సినీ బృందాలు వెళ్లడమనేది కష్టంగా మారింది. అప్పటి వరకు భోజ్‌పురి, ఒడియాలాంటి భాషా చిత్రాలు విశాఖలో షూటింగులు పూర్తి చేసుకునేవి. కరోనా ప్రభావంతో అయా రాష్ట్రాల్లోనే మినీ స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడం, షూటింగులు అక్కడే జరుపుకోవడం ప్రారంభించారు. దాంతో విశాఖలో ఇతర భాష చిత్రాల షూటింగుల సందడి తగ్గింది" అని విశాఖకు చెందిన సినీ నటుడు బాబు దేవ్ చెప్పారు.

"రామానాయుడు స్టూడియోలో కూడా షార్ట్‌ఫిల్మ్, వెబ్ సిరీస్‌‌ల షూటింగులే ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్ద సినిమాలు షూటింగులు తగ్గిపోయాయి. ఇతర భాష చిత్రాల షూటింగులు ప్రస్తుతానికైతే తగ్గాయి. భవిష్యత్తులో మళ్లీ ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్రంలో ఎక్కడ అందమైన లొకేషన్లు ఉన్నా...అవి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత విశాఖయే షూటింగులకు కేరాఫ్ అడ్రస్ అనుకునేవారు. కానీ, ఇప్పుడలా లేదు" అని బాబు దేవ్ అన్నారు.

సినిమా స్టూడియోలు
ఫొటో క్యాప్షన్, స్డూడియో

'షూటింగులు ఒకే...స్టూడియోలు కష్టమే'

పోర్టు సిటీ విశాఖపట్నం ఎనిమిది దశాబ్ధాలకు పైగా సినీ పరిశ్రమను ఆకర్షిస్తూనే ఉంది. 1936లోనే విశాఖలో ఆంధ్రా సినీ టోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. రెండు సినిమాల షూటింగ్ తర్వాత అది మూతపడింది. ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్ల కిందట విశాఖలో రామానాయుడు స్టూడియో ఏర్పాటైంది.

''విశాఖలో సినిమా షూటింగులు జరగడం 1960ల్లోనే మొదలైంది. అప్పటి హీరో అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాలు, ప్రాణస్నేహితులు విశాఖలోనే షూటింగులు జరుపుకున్నాయి. కొండలు, సాగరం, పోర్టు ఇటువంటివన్ని ఆనాడే సినిమా పరిశ్రమను ఆకర్షించాయి. ఆ తర్వాత బాలచందర్ 'మరో చరిత్ర' సినిమాతో విశాఖలోని ప్రకృతి అందాలు సినీ పరిశ్రమని కట్టిపడేశాయి. అప్పటి నుంచి ఇక్కడ సినిమా షూటింగులు ఊపందుకున్నాయి. క్రమంగా ఇతర భాషా చిత్రాలు కూడా విశాఖలోనే షూటింగులు జరుపుకుంటున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిలిం మేకర్లకి విశాఖ బెస్ట్ ఆప్షన్" అని విశాఖకు చెందిన సినీ నిర్మాత రమణమూర్తి అన్నారు.

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

''షూటింగులు జరుపుకోవడానికి విశాఖకి మించిన మంచి ప్లేస్ మరొకటి ఉండదు. కానీ, హైదరాబాద్‌ను కాదని...విశాఖలో స్టూడియోలు కట్టేంత ఉందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే ఉన్న రామానాయుడు స్టూడియోనే సినీ పరిశ్రమ పూర్తిగా వాడుకోలేదు. అలాంటప్పుడు కొత్త స్టూడియోలు వస్తే వాటికి తగిన పని ఉంటుందా ? కరోనా తర్వాత తెలుగు సినిమా షూటింగులు ఎక్కువగా హైదరాబాద్ లేదా విదేశాల్లోనే జరుగుతున్నాయి. విశాఖలో షూటింగుల సందడి తగ్గింది" అని రమణమూర్తి అన్నారు.

వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్

ఫిల్మ్‌క్లబ్ ద్వారా ఆకర్షించే ప్రయత్నం

విశాఖలో షూటింగుల కోసం వచ్చే సినిమా బృందాలకు బస చేసేందుకు హోటల్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే షూటింగులు ఎక్కువగా జరిగే భీమిలి, కాపులుప్పాడ, యారాడ వంటి తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న తొట్ల కొండ పై ఫిల్మ్ క్లబ్ కట్టుకునేందుకు ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించింది.

సినీ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది. అయితే ఆ స్థలం వివాదస్పదమై కోర్టు కేసుల వరకు వెళ్లింది.

''సినీ పరిశ్రమ కోసం ఫిల్మ్ క్లబ్ పేరుతో ఇచ్చిన స్థలం బౌద్ధ నిర్మాణాలున్న తొట్లకొండ పై ఉంది. ఇప్పటికే అనేక ఆక్రమణలకు గురైన ఈ స్థలంలో బౌద్ధ చిహ్నలు మాయమైపోయాయి. మిగతా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయకపోగా...అక్కడే ఫిల్మ్‌క్లబ్ కు స్థలం ఇవ్వడం సరైంది కాదని మేం కోర్టును ఆశ్రయించాం. పురావస్తుశాఖ 1960 చట్టం ప్రకారం ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం, భూములను ఇతర అవసరాలకు ఉపయోగించడం నేరం. కానీ, రెవెన్యూ విభాగం ఆ ప్రాంతాన్ని సబ్‌డివిజన్‌ చేసి ఇతర అవసరాలకు ఉపయోగిస్తోంది" అని బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ అన్నారు.

ఫిల్మ్‌క్లబ్ ను భారీ ఎత్తున్న అన్నీ హంగులతో నిర్మించి...టాలీవుడ్ సినీ పరిశ్రమను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నానికి ఆదిలోనే కేసుల రూపంలో చుక్కెదురైంది. దీంతో విశాఖలో సిని పరిశ్రమకు సంబంధించి సహజ సిద్ధమైన షూటింగు స్పాట్లు కాకుండా రామానాయుడు స్టూడియో తప్పితే మరేది కనిపించదు.

తెలుగు సినిమా పరిశ్రమ

'కనీసం మినీ హాబ్‌గానైనా మార్చాలి'

ఒకప్పడు షూటింగులు హైదరాబాద్‌లో జరిగినా, విశాఖలో జరిగినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో ముఖ్యంగా రీ- రికార్డింగ్ వంటి పనుల విషయంలో చెన్నైకి వెళ్లేవారు. అక్కడ సినిమాలకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌కు అన్ని సౌకర్యాలున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే అవన్నీ జరుగుతున్నాయి.

''విశాఖలో షూటింగుల వరకు బాగానే జరుగుతున్నాయి. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇక్కడ జరిపితే బాగుంటుంది'' అని విశాఖలోని డబ్బింగ్ స్టూడియోల నిర్వాహకులు అంటున్నారు.

''సినీ ఇండస్ట్రీ వైజాగ్ వచ్చేలా కృషి చేయండని సీఎం అన్నారు. కానీ...పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖలో కనిపించవు. విశాఖలో చిన్నసినిమాలు, వెబ్ సిరీలకు సరిపడే విధంగా 12 వరకు డబ్బింగ్ స్టూడియోలు ఉన్నాయి. కరోనాతో అవి మూతపడ్డాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో విశాఖ పోటీ పడాలంటే సినీ పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయలు పెంచాలి'' అని ఎగ్జిబిటర్ జగదీశ్ అన్నారు.

సురేశ్ ప్రొడక్షన్స్

'స్టూడియోల కంటే రియల్ ఎస్టేట్ బెటర్'

విశాఖ, విజయనగరం జిల్లాలలో స్టూడియోల నిర్మాణం చేయాలనే ఆలోచనతో చాలా కాలం కిందటే అనేకమంది హీరోలు, నిర్మాతలు, ఇతర సినీ పరిశ్రమకు చెందినవారు బోయిపాలెం, కాపులుప్పాడ, భీమిలి, కొత్తవలస, భోగాపురం వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున స్థలాలు కొన్నారు.

అవి ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాలే ఖరీదైన నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్ అక్కడ ఊపందుకుంది.

టాలీవుడ్

ఫొటో సోర్స్, AP CMO

''విశాఖలో భూమి బంగారం కంటే ఎక్కువ అన్నట్లు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం కంటే రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ వంటి నిర్మాణాలవైపే ఆసక్తి చూపుతారు. విశాఖలో స్టూడియోల కోసం స్థలాలు కొన్నవారంతా కూడా భూమి ధరలు పెరగడం, సినిమాల సందడి తగ్గడంతో రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలే మేలనుకుంటున్నారు.

అయితే, కరోనా పూర్తిగా తగ్గి, కొత్త సినిమాల షూటింగులు సందడి మొదలైతే బాగుంటుంది. అప్పడు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి" అని విశాఖ సినీ ఆర్టిస్టు, షూటింగ్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఆనీ మాస్టర్: మెగాస్టార్ చిరంజీవి కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను, అది నా డ్రీమ్..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)