ఆంధ్రప్రదేశ్: మూతపడిన సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి

పేర్ని నానితో ఆర్ నారాయణమూర్తి
ఫొటో క్యాప్షన్, పేర్ని నానితో ఆర్ నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మూతపడిన సినిమా థియేటర్లు తిరిగి తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. వివిధ కారణాలతో అధికారులు సీజ్ చేసిన థియేటర్లలో ప్రదర్శనలకు అవకాశం కల్పించింది.

అయితే నెలరోజుల్లోగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని షరతు పెట్టింది.

.తనిఖీల తర్వాత ఇచ్చిన నోటీసులలో పేర్కొన్న వాటిని సరిదిద్దుకుని అన్ని వసతులతో థియేటర్లు తెరుచుకుంటే థియేటర్ల లైసెన్సులు పునరుద్దరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది

83 థియేటర్లు సీజ్

ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో వసతుల అంశంపై ప్రభుత్వానికి థియేటర్ల యాజమాన్యాలకు మధ్య వివాదంగా మారింది.

పలు చోట్ల టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ థియేటర్లు మూతపడ్డాయి. అదే సమయంలో సినిమా థియేటర్లలో నిబంధనల విషయంపై ప్రభుత్వం పలు థియేటర్లను మూసివేసింది. 9 జిల్లాల పరిధిలో 83 థియేటర్లు సీజ్ అయ్యాయి.

సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు సదుపాయాలు, ప్రమాద నివారణకు అవసరమైన చర్యలు, క్యాంటీన్లలో పదార్థాల ధరలు సహా అనేక అంశాలలో ఇటీవల ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది.

వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా రంగంలో దిగి పరిశీలన చేశారు. దాంతో ఈ వ్యవహారం థియేటర్ల యాజమాన్యాలకు ఆగ్రహం కలిగించింది. కొన్ని చోట్ల నిరసనగా థియేటర్లు మూసివేసే ప్రయత్నం కూడా జరిగింది.

వీడియో క్యాప్షన్, అన్ని సినిమాలకు టికెట్ ధర ఒకేలా ఉంటే నష్టమేంటి?

ప్రభుత్వంతో ఎగ్జిబిటర్ల చర్చలు

చివరకు ఎగ్జిబిటర్ల తరుపున కొందరు ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చలకు ముందుగానే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పరిశీలన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని ఓ బృందం మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యింది. మచిలీపట్నంలో మంత్రిని కలిసి సినిమా థియేటర్ల అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరింది.

ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల విషయంలో తాత్కాలిక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వివిధ కారణాలతో సీజ్ చేసిన థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు అవకాశం ఇచ్చింది.

నెలరోజుల్లోగా అధికారులు సూచించిన మేరకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తిరిగి థియేటర్ తెరుచుకునేందుకు సీజ్ చేసిన థియేటర్ల యాజమాన్యాలు ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తూ చేసుకోవాలి సూచించింది.

సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు విడుదలకాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ఊరటగానే అంతా భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, సినిమా టికెట్ల రేట్లపై హీరో నాని వ్యాఖ్యలతో మళ్లీ ఈ దుమారం రాజుకున్నట్లయింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)