బీజేపీ చరిత్రాత్మక విజయం 'మోదీ ఇండియా' గురించి ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరెస్పాండెంట్
400కి పైగా సీట్లు, 15 కోట్ల మందికి పైగా ఓట్లు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి సవాల్‌గా మారుతుందని భావించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 1985 తరువాత ఏ పార్టీ కూడా తన ఆధిక్యాన్ని కాపాడుకోలేకయింది.
రాజకీయ అస్థిరతకు పేరుపడిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల సగటు పదవీ కాలం రెండేళ్ల తొమ్మిది నెలలు మాత్రమే. 1947 నుంచి ఇక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా రెండుసార్లు పదవి చేపట్టలేదు.
యోగి ఆదిత్యనాథ్ తాజా విజయంతో ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ట్రెండ్‌ను ఇప్పుడు పూర్తిగా మార్చేశారు.
కుల ప్రాతిపదికన విడిపోయిన ఈ రాష్ట్రం ఇప్పుడు మత ప్రాతిపదికనా చీలిపోయింది.
2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 403 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుని ఏర్పడిన శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇదంతా భయంకరంగా కనిపించడం ప్రారంభించింది.
ద్రవ్యోల్బనం పెరగడం, నిరుద్యోగం, కరోనా మహమ్మారిని సరైన రీతిలో ఎదుర్కోలేకపోవడం మోదీ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యాలని 2021 ఆగస్ట్‌లో ఇండియాటుడే నిర్వహించిన ఓ పోల్‌లో తేలింది.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనవరిలో బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ప్రధాన ప్రత్యర్థి అయిన సమాజ్ వాది పార్టీలోకి ఫిరాయించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరంకుశులని, కుల రాజకీయాలు చేస్తారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
కొందరు బీజేపీ మద్దతుదారులు కూడా ఊహించని రీతిలో గురువారం ఆ పార్టీ ఫలితాలు సాధించింది. మోదీ ఆకర్షణ శక్తి, వాక్చాతుర్యం బీజేపీకి తోడ్పడింది.
కులాలకు అతీతంగా హిందూ ఓటర్లలో అత్యధికులు బీజేపీకి మద్దతుగా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతి అయిదుగురు ఓటర్లలో ఒకరు ముస్లిం. బీజేపీ ఈ ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. ముస్లింలు ఈ ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీకి మద్దతిచ్చినట్లుగా భావిస్తున్నారు.
''ముస్లింల ఓట్లు ఎలా అయితే గంపగుత్తగా ఒకే వైపు పడతాయని భావిస్తారో దానికి ప్రతిగా హిందూ ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యాయి. ఇది బీజేపీకి లాభించింది'' అని 'ది న్యూ బీజేపీ' పుస్తక రచయిత నలిన్ మెహతా అభిప్రాయపడ్డారు.
ముస్లిం జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ కూడా ఉనికిలో ఉంటే అక్కడ రాజకీయాలు స్పష్టంగా చీలిపోతాయని దీని బట్టి అర్థమవుతోంది. బిహార్, పశ్చిమ బెంగాల్, ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ విషయం స్పష్టమైంది.
విస్తారమైన హిందూ కులాల మద్దతును బీజేపీ 2014లోనే సంపాదించుకోగలిగింది. దీన్ని 'భారత రాజకీయాల్లో ఇది రాజకీయ, సామాజిక పునర్‌వ్యవస్థీకరణ'గా పొలిటిలికల్ సైంటిస్ట్ రాహుల్ వర్మ అభిప్రాయపడ్డారు.
ఈ కులాలలో ఓబీసీలు, అగ్రవర్ణాలతో పోల్చినప్పుడు కొంత వెనుకబడిన మధ్యస్థాయి కులాలు ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీలో ప్రతి స్థాయిలో ఈ కులాల నుంచి నాయకులను ప్రాతినిధ్యం ఉండేలా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
2020 జూన్ నాటికి బీజేపీ ఎంపీల్లో 70 శాతం మంది హిందూ వర్ణవ్యవస్థలో దిగువ స్థాయివిగా చెప్పే కులాలకు చెందినవారే.
ఇలా చేయగలగడం ద్వారా బీజేపీ తనపై ఉన్న పట్టణ ప్రాంత అగ్రవర్ణ పార్టీ ముద్రను పోగొట్టుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన పార్టీగా గుర్తింపు సంపాదించుకోగలిగింది.
''యూపీ ఎన్నికల క్షేత్రంలో నరేంద్ర మోదీ చేసిన పనితో కొత్త నాయకత్వం ఉద్భవించింది'' అని నళిన్ మెహతా అన్నారు.
సంక్షేమ పథకాల లబ్ధి, ఇళ్లు, మరుగుదొడ్లు, వంట గ్యాస్, కరోనా మహమ్మారి సమయంలో నిత్యవసరాల పంపిణీ, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధి వంటివి యూపీ ఓటర్ల నమ్మకాన్ని చూరగొనడంతో బీజేపీకి బాగా ఉపయోగపడ్డాయి.
యోగి ఆదిత్య నాథ్ పాలనలో దూకుడు, కండబలం - భారతీయుల్లోఅత్యధికులు బలమైన నాయకులను కోరుకుంటారని సర్వేలూ చెబుతున్నాయి. తాజాగా ఎన్నికల ఫలితాలూ ఇదే విషయాన్ని నిరూపించాయి.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాలపైనా ప్రభావం చూపనున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాధించిన విజయం బీజేపీకి అధికారంపై మరింత పట్టు సాధించడానికి, వ్యతిరేకుల కూటమిని ముక్కలు చేయడానికి, 2024 లోక్‌సభ ఎన్నికలను గెలవడానికి ఉపయోగపడనుంది.
''ఈ స్థాయి మెజారిటీతో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను గెలవడమనేది బీజేపీయే ఈ దేశంలో అత్యంత బలమైన పార్టీ అనే భావనను మరింత బలపరుస్తుంది.
హిందూ జాతీయవాదం, సంక్షేమ పాలనల మేళవింపుతో ఓటర్లను ఆకట్టుకోవడమనే విజయవంతమైన వ్యూహాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విజయం బీజేపీని పురికొల్పుతుంది.
రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఆదిత్యనాథ్‌ను తిరుగులేని మాస్ లీడర్‌గా నిలిపాయి ఈ ఎన్నికలు.

ఫొటో సోర్స్, Reuters
నిజానికి 2019 నుంచి రాష్ట్రాల ఎన్నికలలో ఏమంత గొప్ప ఫలితాలు సాధించడం లేదు. దేశంలోని 29 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో సొంతంగా కానీ, సంకీర్ణంలో ప్రధాన భాగస్వామిగా గానీ ఉంటూ అధికారంలో ఉంది. మరో నాలుగు రాష్ట్రాలలోనూ ప్రభుత్వంలో ఉంది.
గురువారం నాటి ఫలితాలలో నాలుగు రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ దాదాపు పతనావస్థకు చేరగా.. ఉత్తర, పశ్చిమ భారతదేశంలో 250కి పైగా పార్లమెంటు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీ తన ఆధిపత్యం చాటుకుంటోంది. 2024లో మూడో సారి బలమైన పోటీదారుగా మోదీని నిలపడానికి ఇది చాలా కీలకం.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్‌ప్రదేశ్: మాయావతికి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడ్డాయా?
- కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి 5 కారణాలు
- యుక్రెయిన్ నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు.. అయినా పెంపుడు కుక్కను వదలని కేరళ అమ్మాయి
- యుక్రెయిన్ చేతిలో అమెరికా స్టింగర్ మిసైళ్లు.. రష్యా దాడిని ఇవి అడ్డుకోగలవా
- యుక్రెయిన్లోనే ఏపీ వైద్యుడు: జాగ్వర్, పాంథర్లతో కలిసి బేస్మెంట్లోనే జీవనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










