ఉత్తర్‌ప్రదేశ్: మాయావతికి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడ్డాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వాత్సల్య రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అతిపెద్ద 'లూజర్'గా మిగిలిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫలితాల ద్వారా తేలిందేంటంటే మాయావతి పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయిందని.
2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఎస్పీకి సుమారు 10 శాతం ఓట్లు తక్కువ వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఎస్పీ 22 శాతానికి పైగా ఓట్లు సాధించి, 19 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీకి 2012 ఎన్నికల్లో 80 సీట్లు, 2007 ఎన్నికల్లో 206 సీట్లు వచ్చాయి.
అయితే, 2022 ఎన్నికల ఫలితాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీఎస్పీ బీజేపీకి సహాయం చేసిందా?
ఉత్తర్‌ప్రదేశ్‌లో 'బీఎస్పీ ఓట్లు షిఫ్ట్ అయ్యాయని', ఓటర్లు బీస్పీని విడిచిపెట్టి బీజేపీ పక్షం వహించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
"బీజేపీ గెలవాలని పోరాడింది. ఎస్పీ ఓట్లు 8-10 శాతం పెరిగాయి. బీస్పీకి తగ్గిన ఓట్లు బీజేపీకి పడినట్లుగా అనిపిస్తోంది. దానికి చాలా కారణాలు చెప్పవచ్చు" అని రాజకీయ విశ్లేషకురాలు పూర్ణిమా జోషి బీబీసీతో అన్నారు.
బీఎస్పీ మద్దతుదారులకు, ఓటర్లకు కలిగిన గందరగోళం కూడా ఓట్లు షిఫ్ట్ అవ్వడానికి ఒక కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
ఈ వీడియోను మీరు కూడా చూసే ఉంటారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటనలో కొంత భాగం ఇందులో కనిపిస్తుంది.
"సమాజ్‌వాదీ పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ అభ్యర్థులకు కూడా బీఎస్పీ ఓటు వేయగలద’’ని ఆ వీడియో క్లిప్‌లో మాయావతి చెబుతుంటారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరిగింది. దానికి ముందే ఈ 30 సెకన్ల వీడియో క్లిప్ ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వైరల్ అయింది.
మొదటి దశలో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ లోని 58 స్థానాలకు పోలింగ్ జరిగింది. మాయావతికి, బహుజన్ సమాజ్ పార్టీకి కంచుకోటగా భావించే స్థానాల్లో మొదటి దశ పోలింగ్ జరిగింది. కాగా, 2017 ఎన్నికల్లో ఈ స్థానాల్లో బీజేపీ 53 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ కేవలం 2 సీట్లు మాత్రమే సాధించింది.
అయితే, ఈ వీడియో క్లిప్ ఇప్పటిది కాదని, పాతది వైరల్ అవుతోందని అప్పుడే పలు మీడియా సంస్థలు స్పష్టం చేశాయి. అది 2020 అక్టోబర్‌లో ఉత్తర్‌ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ముందు ఆమె చేసిన ప్రసంగంగా తేల్చాయి.
కానీ, ఈ విషయం క్షేత్రస్థాయిలో ఎంతమంది ఓటర్లకు, బీఎస్పీ మద్దతుదారులకు చేరిందో తెలీదు. ఈ వీడియో రేకెత్తించిన గందరగోళాన్ని తొలగించడానికి బీఎస్పీ గానీ, బీజేపీ గానీ ప్రయత్నించలేదు.

ఫొటో సోర్స్, AFP
అమిత్ షా చేసిన ప్రకటన
ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఎస్పీ గురించి చెప్పిన మాటలు మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో మూడు దశలు పూర్తయిన తరువాత, అమిత్ షా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ఒక ఛానెల్ ప్రసారం చేసింది. అందులో, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ రిలవెన్స్ గురించి అమిత్ షాను ప్రశ్నించారు.
"బీఎస్పీకి రిలవెన్స్ ఉంది. ఆ పార్టీకి ఓట్లు వస్తాయనే నా నమ్మకం. ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేనుగానీ వాళ్లకి ఓట్లు మాత్రం పడతాయి. ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తారు. పలు స్థానాల్లో ఓట్లు పడతాయి" అంటూ అమిత్ షా అన్నారు.
బీఎస్పీకి ముస్లిం ఓట్లు పెద్దగా రాలేదని ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. అయితే, అమిత్ షా జవాబు తరువాత బీస్పీని 'బీ టీమ్ ఆఫ్ బీజేపీ' అని రాజకీయ ప్రత్యర్థులు, విశ్లేషకులు పిలవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
బీఎస్పీ ట్రెండ్ ఏమయ్యింది?
బహుజన్ సమాజ్ పార్టీ గతంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంది. అయితే గత రెండున్నర దశాబ్దాలుగా బీఎస్పీ, బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది. బీజేపీ సహాయంతో మాయావతి ఉత్తర్‌ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రయత్నాల కారణంగా ఎస్పీ-బీఎస్పీ కూటమి ఏర్పడింది. ఈ కూటమి వల్ల బీఎస్పీ ఎక్కువ లాభపడింది. 2014లో ఒక్క లోక్‌సభ సీటును గెలవలేకపోయిన బీఎస్పీ, 2019లో 10 సీట్లు గెలుచుకుంది.

ఫొటో సోర్స్, UDAIVER@TWITTER
అఖిలేష్ యాదవ్‌కు షాక్
మాయావతితో చేతులు కలిపాక సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం అయిదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కన్నౌజ్ సీటులో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఓడిపోయారు. బహిరంగ సభలో డింపుల్ యాదవ్ మాయావతి పాదాలను తాకడం కూడా ఎస్పీకి ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికలలో ఓటమి తరువాత కూటమి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం ద్వారా మాయావతి, సమాజ్ వాదీ పార్టీకి మరో షాక్ ఇచ్చారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. అయితే, ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా కూడా బీఎస్పీ, బీజేపీకి ఉపయోగపడుతుందని తేలినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ల శాతం తగ్గడంతో అది నేరుగా బీజేపీ లాభదాయకంగా మారింది. ఒకవైపు, మాయావతికి ప్రత్యామ్నాయంగా ఆగ్రా దేహత్ స్థానం నుంచి బరిలోకి దిగిన మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్యను బీజేపీ నేతలు ప్రొజెక్ట్ చేస్తూనే మరోవైపు బీఎస్పీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించారు.
''బీజేపీ వ్యూహం ఫలించింది. ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ క్రియాశీలకంగా ఉండకుండా, దళితుల ఓట్లు బదిలీ అయ్యేలా బీఎస్పీని అణచివేయడానికి ఈ విధానం పనిచేసింది. దళితుల ఓట్లు చాలా వరకు బదిలీ అయ్యాయి'' అని సీనియర్ జర్నలిస్టు రామ్‌దత్ త్రిపాఠి అన్నారు.
2017తో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గినా ఓట్ల శాతం పెరిగింది. 2017లో బీజేపీకి 39 శాతం ఓట్లు రాగా, ఈసారి దాదాపు 42 శాతం ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
'ఇక మిషన్ 2024'
"బీజేపీ అనేక రంగాల్లో పనిచేస్తోంది. ఇది ఒక్క ఇష్యూ మీద వెళ్లే పార్టీ కాదు. సోషల్ ఇంజినీరింగ్ కూడా చేస్తుంది. అందుకే అనేకమార్లు విజయం సాధిస్తోంది'' అని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.
బీఎస్పీ ద్వారా బీజేపీ పరోక్షంగా లాభం పొందిందన్న సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ ఇది సమాజ్ వాదీ పార్టీకి ప్రమాదకరమని అన్నారు.
''బహుజన్ సమాజ్ పార్టీ పతనం కావడం బీజేపీకి మేలు కాగా, సమాజ్ వాదీ పార్టీకి చేటు'' అన్నారు.
2024లోనే కాదు, 2027లో కూడా ప్రధాన ఓటర్లుగా ఉండే దళితులలో బీఎస్పీ మరిన్ని చీలికలు తెస్తే వారంతా బీజేపీ వైపు వెళ్తారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యూహం మరింత పని చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- భగవంత్ మాన్: కమెడియన్, పొలిటీషియన్... కాబోయే పంజాబ్ సీఎం
- ‘కమలం అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్’ - యూపీ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











