ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపు: 'రెండు నెలల్లో పేదలు ధనికులుగా మారారా?'

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
'పేదవాడికి అందుబాటు రేటుకు వినోదం అందించాలని సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తే, ఆ నిర్ణయం మీద కూడా ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి వాళ్లు పేదల గురించి ఆలోచన చేసే వాళ్లేనా? ఇటువంటి వాళ్లు పేదల గురించి పట్టించుకునే వాళ్లేనా? ఇటువంటి వారంతా కూడా యాంటీ పూర్'
ఈ వ్యాఖ్యలు అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జనవరి 1న పింఛన్ల కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమా టికెట్ల ధరలను తగ్గించడాన్ని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు.
ఇది సుమారు రెండు నెలల కిందటి మాట.
పేదలు ధనవంతులయ్యారా?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలు పెరిగాయి. ఇందుకు సంబంధించిన జీవో నెం.13ను కూడా మార్చి 7న విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
షరతులతో అదనపు షోలకు కూడా అవకాశం ఇచ్చింది.
పేదల కోసం టికెట్ల ధరలు తగ్గించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పెంచింది? ఈ రెండు నెలల కాలంలో పేదల పరిస్థితి మెరుగుపడిందని ప్రభుత్వం భావిస్తోందా? లేక తన ఇగోను సంతృప్తి పరుచుకోవడానికే ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
'మూడు నెలల్లో పేదలు ధనవంతులయిపోవడంతో సినిమా టికెట్ల రేట్లు మళ్లీ పెంచాల్సి వచ్చినట్టుంది' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, fb/naveen

ఫొటో సోర్స్, fb/pavan
'సాఫీగా సాగుతున్న విషయంలో పుల్ల పెట్టారు. ఈ వివాదం పరిష్కరించినట్టు చెప్పుకుని, ఇగోని సంతృప్తి పరుచుకున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా తనకు కావాల్సిన వాళ్లందరినీ రప్పించుకున్నారు. అందులో ఇగో శాటిస్‌ఫెక్షన్ తప్ప ఇంకేమయినా జరిగిందా? భీమ్లా నాయక్ రిలీజ్‌కి ముందు పేదలుగా ఉన్నోళ్లు, ఆ తర్వాత ధనవంతులయిపోతారా?' అంటూ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
కనీస టికెట్ ధర గతంలో గ్రామీణ ప్రాంత థియేటర్లలో రూ.5గా ఉంటే ఇప్పుడది రూ.20 అయ్యింది. అత్యధికంగా నగరాల్లోని మల్టీఫ్లెక్స్‌లలో రూ.250గా నిర్ణయించారు. ఈ ధరలకు జీఎస్టీతో పాటుగా థియేటర్ నిర్వహణ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తారు. థియేటర్ నిర్వహణ ఛార్జీలను రూ.3 నుంచి రూ.5కి పెంచారు.

'ఎగ్జిబిటర్లకు మేలు'
ఎగ్జిబిటర్లకు మేలు చేసేలా జీవో నెం.13 ఉందని అనూశ్రీ ఫిలిమ్ప్ అధినేత, సినీ డిస్ట్రిబ్యూటర్ సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.
'జీవో నెం.35 రాకముందు మేం రూ.45, రూ.65, రూ.110 చొప్పున టికెట్లు అమ్మాం. ఆ తరువాత పేదలకు చౌకగా సినిమా చూపించడానికని టికెట్ ధరలు తగ్గించారు. ఇప్పుడు మళ్లీ కొత్త జీవో తెచ్చి రూ.100, రూ.125 చొప్పున నిర్ణయించారు. అంటే ఇప్పుడు పేదలు లేరా? ఉన్నపళంగా పేదలంతా కోటీశ్వరులయిపోయారా? ఎవరినో టార్గెట్ పెట్టుకుని చేసిన పనిలానే ఇది ఉంది. ఆ లక్ష్యం నెరవేరడంతో ఇప్పుడు ధరలు సవరించారు తప్ప ప్రజల ప్రయోజనాలు ఇందులో ఏమీ లేదన్నది స్పష్టం అయింది' అని సత్యన్నారాయణ అభిప్రాయపడ్డారు.
భీమ్లా నాయక్ సినిమా విషయంలో కచ్చితంగా జీవో-35 అమలు చేయాల్సిందేనని చెప్పడం వెనుక కారణం రాజకీయ ప్రయోజనాలేనని ఆయన అన్నారు. టికెట్ల ధరలు మళ్లీ పెంచడం వల్ల ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులకు ఉపయోగమని చెప్పుకొచ్చారు.
ఈ సినిమా వ్యవహారమంతా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుల కోసమే అన్నట్టుగా ఉందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ డీకే విశ్వనాథ్ అన్నారు.
'ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి సినిమాల విషయంలో కఠినంగా వ్యవహరించారు. సీఎం జగన్ వద్దకు వెళ్లి, సత్కరించి వచ్చిన వారికి మినహాయింపులిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. రాజకీయ లక్ష్యాల సాధనలో భాగమేనన్నది కాదనలేని వాస్తవం. ఇలాంటి ప్రయత్నాలు సినీరంగం విస్తరణ కన్నా అపోహలకే ఎక్కువ అవకాశం ఇస్తాయి' అని ఆయన అన్నారు.
హఠాత్తుగా ధరలు తగ్గించి, మళ్లీ పాత వాటికి మించి పెంచిన తీరు మీద స్పందన కోరినా ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
'ఏపీలో సినిమాలకు ప్రోత్సాహం'
'రాబోయే రోజుల్లో ఏపీలో సినిమా షూటింగులు పెరుగుతాయి. విశాఖ వంటి చోట్ల సినీ పరిశ్రమలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని సీఎం కూడా చెప్పారు. ఇక్కడ షూటింగ్ జరిపే వాళ్లకు అదనపు సదుపాయం కల్పించడాన్ని ఆహ్వానించాలి.
టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే నిర్ణయం తీసుకుంది. అన్నింటినీ రాజకీయం చేయాలనే లక్ష్యంతో కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది' అంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైన రెండు సినిమాలు రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్‌కు మాత్రమే మినహాయింపు ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం షూటింగ్ జరుపుకోనప్పటికీ కొత్త టికెట్ రేట్లు, 5 షోల పర్మిషన్ వాటికి అమలవుతుందని తెలిపారు. తదుపరి సినిమాలన్నింటికీ 20శాతం నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఏడాదిగా సినిమా టికెట్ల వివాదం
సుమారు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల చుట్టూ రాజకీయాలు, వివాదాలు నెలకొన్నాయి. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే అమ్ముతుందంటూ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు అనుగుణంగా ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో టికెట్ అమ్మకాల ప్రక్రియకు సంబంధించిన విధానాల రూపకల్పన కోసం కమిటీ కూడా వేసింది.
ఆ తరువాత సినిమా టికెట్ రేట్లు, అదనపు షోలు, టికెట్ అమ్మకాలకు సంబంధించిన అంశాలను మారుస్తూ ఏపీ సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించారు. 2021 నవంబర్ 24న ఈ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది.
పేదలకు సినిమాను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ నిర్ణయమని ఆ సందర్భంగా మంత్రి పేర్ని నాని అన్నారు. అందుకు అనుగుణంగానే టికెట్ ధరలను తగ్గిస్తూ డిసెంబర్ మొదటివారంలో జీవో నెం.35 తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతంలో కనీసం రూ.5, నగరాల్లోని మల్టీఫ్లెక్స్‌లలో అత్యధికంగా రూ.250గా నిర్ణయించారు.

ఫొటో సోర్స్, facebook/BoyapatiSrinu
థియేటర్ల సీజ్‌లు, జరిమానాలు
సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో విడుదలైన తరువాత డిసెంబర్ మొదటి వారంలో బాలకృష్ణ సినిమా అఖండ రిలీజైంది. నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు టికెట్లు అమ్మారని, నిబంధనలు ఉల్లంఘించి బెనిఫిట్ షోలు వేశారని గుంటూరు జిల్లా ఉండవల్లి, కృష్ణా జిల్లా నందిగామలో రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు.
ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ థియేటర్ల మీద రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది దాడులు చేశారు. 9 జిల్లాల పరిధిలోని 23 థియేటర్లను ఏకకాలంలో సీజ్ చేశారు అధికారులు.
జీవో నెం.35ను సస్పెండ్ చేసిన హైకోర్టు
జీవో నెం.35కి వ్యతిరేకంగా సినీ రంగానికి చెందిన వారు ఏపీ హైకోర్టులో పిటీషన్లు వేశారు. నిర్మాతలు ప్రైవేటుగా తీసే సినిమాలను ప్రైవేటు థియేటర్లలో ప్రదర్శిస్తుంటే వాటికి టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు కోర్టులో సవాల్ చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తాము థియేటర్లు నడపలేమంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేయగా ఇంకొందరు నిరసనగా థియేటర్లు మూసివేశారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన టికెట్ల విధానాన్ని తప్పు పడుతూ జీవో నెం.35ని కొట్టి వేసింది ఏపీ హైకోర్టు.

ఫొటో సోర్స్, facebook/SitharaOfficial
భీమ్లా నాయక్ థియేటర్లపై దాడులు
ఈ వివాదం సాగుతుండగానే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలయ్యింది. ప్రేక్షకుల ఆదరణ పొందింది. సంక్రాంతికి విడుదల చేసేందుకు పలు సినిమాలు సిద్ధం చేశారు. విడుదల తేదీలు కూడా ప్రకటించారు. అదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ ప్రచారం ముందుకొచ్చింది. థియేటర్లపై ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి.
ఈ తరుణంలో పలు సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా కారణం ఒకటైతే టికెట్ ధరల చుట్టూ వివాదం కూడా అందుకు తోడుకావడంతో సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేందుకు చాలా మంది దర్శక, నిర్మాతలు ముందుకు రాలేదు. నాగార్జున నటించిన బంగార్రాజు వంటి ఒకటీ అరా సినిమాలు మాత్రమే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టాయి.
సంక్రాంతికి రావాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ పిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఏపీలో అనేక చోట్ల ప్రభుత్వం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని రంగంలో దింపింది. అన్ని థియేటర్లలోనూ నిబంధనలు పాటించేలా యాజమాన్యాలపై ఒత్తిడి పెట్టారు. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమయ్యింది.
జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. అరెస్టులు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఫొటో సోర్స్, AP CMO
చిరంజీవి మధ్యవర్తిత్వం
సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల చుట్టూ వివాదం సాగుతున్న దశలోనే సినీ నటుడు చిరంజీవి జోక్యం చేసుకున్నారు. తొలుత ఆయన ఒక్కరే నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లి, ముఖ్యమంత్రి జగన్‌తో చర్చలు జరిపారు.
ఆ తర్వాత నెలరోజుల వ్యవధిలో మరోసారి సీఎంవోకి వెళ్లారు. ఈసారి ఆయన వెంట మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు, రాజమౌళి, కొరటాల శివ వంటి దర్శకులతో పాటుగా ఆర్ నారాయణ మూర్తి కూడా ఉన్నారు. వారిలో అత్యధికులు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలిసిన వారే కావడం విశేషం.
జగన్‌ను కలిసిన సమయంలో చిరంజీవి సీఎంని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపించిన వీడియోను అధికారికంగానే విడుదల చేశారు. అది ఆనాడు వైరల్ అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి పుట్టిన రోజు: ఈ నగరానికి రామానుజాచార్యులు శిలాఫలకం వేశారా, దీనిపై ఇంత చర్చ ఎందుకు
- పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













