రష్యా విమానాలను యుక్రెయిన్ ఎలా కూల్చగలుగుతోంది, పశ్చిమ దేశాలు అందించే ఆయుధాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?

యుక్రెయిన్ సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

సర్ఫేస్-టు-ఎయిర్ మిసైళ్లతో రష్యా హెలికాప్టర్లను కూల్చివేస్తున్నట్లు చూపించే చాలా వీడియోలను యుక్రెయిన్ సైన్యం విడుదల చేసింది.

గత వారం విడుదల చేసిన ఒక వీడియోలో రష్యా హెలికాప్టర్ ఒకటి చాలా తక్కువ ఎత్తులో చెట్ల మీదుగా ఎగురుతూ వస్తోంది. ఇంతలో పొగలు చిమ్ముతూ దూసుకొచ్చిన ఒక సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్‌ను తాకింది. దాంతో రష్యా హెలికాప్టర్ అగ్నిగోళంలా మంటలు కక్కతూ కూలిపోయింది.

ఈ రష్యా హెలికాప్టర్‌ను యుక్రెయిన్ దళాలు కూల్చివేశాయి. అలాగే ఖార్కియెవ్ దగ్గర ఒక జెట్ కూలిపోయింది. పశ్చిమ దేశాలు ఇటీవల యుక్రెయిన్‌కు అందించిన ఆయుధాలను ఆ సైన్యం ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు ఆధారాలున్నాయని సైనిక విశ్లేషకులు చెబుతున్నారు.

యుక్రెయిన్ ఇప్పటివరకూ దాదాపు 20 రష్యా ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చివేసినట్లు ధ్రువీకరించే దృశ్యాలు ఉన్నాయని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎయిర్‌పవర్ రీసెర్చ్ ఫెలో జస్టిన్ బ్రాంక్ చెప్పారు. వీటిలో హెలికాప్టర్లు, జెట్స్ ఉన్నట్లు వివరించారు.

అయితే, ఈ సంఖ్య యుక్రెయిన్ రక్షణ శాఖ చెబుతున్నదానికంటే చాలా తక్కువ. తాము రష్యా ఆర్మీకి చెందిన 48 విమానాలు, 80 హెలికాప్టర్లను కూల్చివేశామని అది చెబుతోంది.

పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు అందించిన ఆయుధాలు
ఫొటో క్యాప్షన్, పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు అందించిన ఆయుధాలు

ఈ సంఖ్య తక్కువే అయినా గగనతలంలో ఆధిపత్యం కోసం రష్యా ఎంత తంటాలు పడుతోందనే విషయం ఇది స్పష్టం చేస్తోంది.

యుక్రెయిన్ కూడా నష్టాలు ఎదుర్కుంటోంది. కానీ, యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్‌ను నాశనం చేయడంలో రష్యా ఇప్పటికీ విజయవంతం కాలేకపోయిందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ బీబీసీతో అన్నారు.

యుద్ధం మొదలవక ముందు, యుక్రెయిన్ దగ్గర విమానాల సంఖ్య, ఆ సమయంలో రష్యా సరిహద్దు దగ్గర మోహరించిన వాటితో పోలిస్తే మూడు విమానాలకు, ఒకటి ఉంది.

ఇప్పటికీ చెక్కు చెదరని యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్.. తమను గుర్తించకుండా రాత్రిపూట ఎగిరే పరిస్థితిని రష్యా విమానాలకు తీసుకొచ్చిందని వాలస్ అన్నారు.

భుజం మీద నుంచి లాంచ్ చేసే మాన్‌పాడ్స్(మాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్) అనే ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాల్లో ఒక రకం.

1980లో అఫ్గానిస్తాన్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించిన సమయంలో సోవియట్ విమానాలకు చుక్కలు చూపిన అమెరికా తయారీ స్టింగర్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు కూడా యుక్రెయిన్‌కు ఇచ్చిన వాటిలో ఉన్నాయి.

ఈ ఆయుధాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ, పశ్చిమ దళాలు వేలాది యాంటీ ట్యాంక్ ఆయుధాలు, వెయ్యికి పైగా స్టింగర్ మిసైళ్లు అందించాయని గతవారం బీబీసీతో మాట్లాడిన వాలస్ చెప్పారు.

అమెరికా, నాటో దళాలు యుక్రెయిన్‌కు 17 వేల యాంటీ ట్యాంక్ ఆయుధాలు, 2 వేల స్టింగర్స్ క్షిపణులు పంపించాయని అమెరికా రక్షణ శాఖ అధికారి తమకు చెప్పినట్లు సీఎన్ఎన్ తెలిపింది.

ఫిబ్రవరి 24న రష్యా దాడికి ముందే యుక్రెయిన్‌కు బ్రిటన్, అమెరికా ఆయుధాలు అందించాయి. బ్రిటన్ 2 వేల లైట్-యాంటీ ట్యాంక్ క్షిపణులు(Nlaws) ఇచ్చింది.

రష్యా సాయుధ వాహనాలను ధ్వంసం చేయడానికి యుక్రెయిన్ వీటిని ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. దానిని నిరూపించడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని వాలస్ చెప్పారు.

ధ్వంసమైన ట్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధ్వంసమైన ట్యాంక్

రైఫిళ్లు, మందుగుండు

రష్యా దాడికి స్పందనగా మొత్తం 14 దేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. వీటిలో స్వీడన్, ఫిన్‌లాండ్ కూడా ఉన్నాయి. తటస్థ దేశాలుగా సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇవి నాటో సభ్య దేశాలు కావు. కానీ యుక్రెయిన్‌కు ఈ రెండూ కొన్ని వేల యాంటీ ట్యాంక్ ఆయుధాలు పంపించాయి.

జర్మనీ 1000 యాంటీ ట్యాంక్ ఆయుధాలు, 500 స్టింగర్ క్షిపణులు పంపించింది. బాల్టిక్ దేశాలు కూడా స్టింగర్, జావెలిన్ మిసైళ్లతోపాటూ వేలాది ఆయుధాలు పంపించాయి.

2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే జావెలిన్ మిసైళ్లతో ఇప్పటికే ఎన్నో రష్యా టి-72 ట్యాంకులను విజయవంతంగా ధ్వంసం చేశామని యుక్రెయిన్ కూడా చెప్పింది.

ఇటీవల జరిగిన ఆయుధాల సరఫరాలో లక్షల అసాల్ట్ రైఫిళ్లు, మెషిన్ గన్లు, యాంటీ ట్యాంక్ మైన్స్, వందల టన్నుల మందుగుండుతోపాటూ బాడీ ఆర్మర్స్, హెల్మెట్స్, మెడికల్ సరఫరాలు కూడా ఉన్నాయి.

ఆయుధాలు ఎలా చేరుతున్నాయి

ఈ ఆయుధాలు అందించడానికి తాము సహకరిస్తున్నామని బ్రిటన్ చెప్పింది. అయితే అవి యుక్రెయిన్‌లోకి ఎలా చేరుకుంటున్నాయనే వివరాలను మాత్రం పశ్చిమ దేశాల అధికారులు చెప్పడం లేదు.

అయితే తూర్పు యుక్రెయిన్ కేంద్రీకృతంగా రష్యా సైనిక చర్యలకు దిగుతుంటే. పశ్చిమాన పొరుగునే ఉన్న యూరోపియన్ దేశాల నుంచి ప్రజల రాకపోకలు, ఆయుధ సరఫరాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయనేది రహస్యమేమీ కాదు.

యుక్రెయిన్ సైనికులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సైనికులు

ఇదే విషయం గురించి బీబీసీ ఎస్టోనియా, స్వీడన్, డెన్మార్క్ దేశాల రక్షణ శాఖ అధికారులతో మాట్లాడింది. తమ ఆయుధాల సరఫరాలను ట్రాక్ చేశామని, అవి విజయవంతంగా యుక్రెయిన్ చేరుకున్నాయని వారు ధ్రువీకరించారు.

అయితే ఈ ఆయుధాలు ఈ యుద్ధంలో ఎంత ప్రభావం చూపించగలవు?

పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ యుద్ధంలో మార్పును తీసుకురావచ్చు. కానీ వాటిని యుక్రెయిన్ దళాలు సమర్థంగా ఉపయోగించడం కొనసాగితేనే అది సాధ్యం అవుతుంది.

యుక్రెయిన్ దళాలు సోవియట్ కాలానికి చెందిన లాంగ్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను తిరిగి ఉపయోగిస్తుండటంతో రష్యా విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరే పరిస్థితి వచ్చిందని బ్రాంక్ చెప్పారు.

కానీ, పశ్చిమ దేశాలు సరఫరా చేసిన తక్కువ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైళ్లు తక్కువ ఎత్తులో ఎగిరే వాటికి మరింత ప్రమాదకరంగా మారాయి.

యుక్రెయిన్ దగ్గర లాంగ్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేకుంటే, రష్యా విమానాలు, తక్కువ రేంజ్ ఎయిర్ డిఫెన్సెస్‌కు చిక్కనంత ఎత్తులో ఎగిరుండేవి.

మరోవైపు, అమెరికా, యూరోపియన్ మిత్ర దేశాలు యుక్రెయిన్‌కు తమ ఆయుధ సరఫరాలు పెంచాలనుకుంటున్నాయి. వీటి సరఫరాను అడ్డుకోవడానికి రష్యా ప్రయత్నించే అవకాశాలు తక్కువే ఉంటాయి.

రష్యా తయారీ మిగ్ ఫైటర్ జెట్ విమానాలను యుక్రెయిన్ ఎయిర్ ఫోర్సుకు అందించడం గురించి తను పోలండ్‌తో మాట్లాడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. కానీ అది జరిగినా, ఆ విమానాలను నడపాలంటే యుక్రెయిన్ పైలట్లకు శిక్షణ అవసరం అవుతుంది.

పశ్చిమ దేశాల ఆయుధ సరఫరా యుక్రెయిన్‌కు కచ్చితంగా సాయం చేస్తుంది. అయితే, వాటిని అసలు ఎలా ఉపయోగించాలో ముందుగా వారికి తెలియాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)