వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిక్ బ్రియాంట్
    • హోదా, బీబీసీ కోసం

వ్లాదిమిర్ పుతిన్‌.. మానవ రూపంలోని ప్రాణాంతక ‘మిలీనియం బగ్’ అని తరచుగా అనిపిస్తుంటుంది.

ప్రపంచంలోని కంప్యూటర్లన్నీ 1999 నుంచి 2000 సంవత్సరంలోకి మార్పును ప్రాసెస్ చేయలేక.. 1999 డిసెంబర్ 31 అర్థరాత్రి విఫలమైపోతాయనే భయంతో ప్రపంచమంతా ఊపిరి బిగబట్టుకుని ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ లోపాన్ని మిలీనియం బగ్‌గా వ్యవహరిస్తారు. సరిగ్గా అదే 1999 డిసెంబర్ 31 నాడు పుతిన్ అధికారం చేపట్టారు.

అప్పటి నుంచి ఈ 20 ఏళ్ల కాలంగా.. మరోరకమైన ప్రపంచ వ్యవస్థ లోపాన్ని తయారు చేయటానికి.. ఉదారవాద అంతర్జాతీయ క్రమాన్ని ధ్వంసం చేయటానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మాజీ కేజీబీ గూఢచారి కాలాన్ని వెనక్కు తిప్పాలని.. రష్యా జారిస్ట్ గొప్పదనాన్ని పునరుజ్జీవింపజేయాలని, 1991 విచ్ఛిన్నానికి ముందున్న సోవియట్ యూనియన్ బలాన్ని, అదంటే ఉన్న భయాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు.

రష్యా భూభాగాలను తిరిగి కలుపుకోవాలని కాంక్షించే ఈ నాయకుడు.. 21వ శతాబ్దపు అత్యంత విధ్వంసకర అంతర్జాతీయ నేతగా మారారు. చెచెన్యా నుంచి క్రైమియా వరకూ.. సిరియా నుంచి సాలిస్‌బరీ వరకూ పెను విషాదం వెనుక మాస్టర్‌మైండ్‌గా ఉన్నారు. యూరప్ మ్యాప్‌ను పునర్లిఖించాలని ప్రయత్నించారు. కొన్నిసార్లు విజయం సాధించారు కూడా.

ఐక్యరాజ్యసమితిని నిర్వీర్యం చేయటానికి ఆయన ప్రయత్నించారు. అందులోనూ కొన్నిసార్లు సఫలమయ్యారు. అమెరికాను బలహీన పరచాలని.. దాని విభజనను, పతనాన్ని వేగవంతం చేయాలని ఆయన ప్రయత్నించారు. అక్కడా కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.

పశ్చిమ దేశాలు అతి ఆత్మవిశ్వాసంతో ఉన్నపుడు పుతిన్ అధికారంలోకి వచ్చారు. నాటి ఏకధృవ ప్రపంచంలో అమెరికా ఒక్కటే ఏకైక సూపర్‌పవర్‌గా ఉండింది. ఉదారవాద ప్రజాస్వామ్యం దిగ్విజయం సాధించిందని ప్రకటిస్తూ ఫ్రాన్సిస్ ఫుకుయామా చేసిన 'చరిత్ర అంతం' సిద్ధాంతాన్ని విస్తృతంగా అంగీకరించారు.

ఆర్థిక మాంద్యాలనేవి ఇక ఉండబోవనే సిద్ధాంతాన్ని కూడా కొందరు ఆర్థికవేత్తలు ప్రచారం చేశారు. కొత్త డిజిటల్ ఎకానమీలో ఉత్పాదకత లాభాలు దీనికి పాక్షిక కారణమని కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచీకరణ, అది తీసుకొచ్చిన పరస్పరాధీనతలు.. పెద్ద ఆర్థిక శక్తులు యుద్ధాలు చేయకుండా నిలువరిస్తాయని భావించారు.

ఇదే కాల్పనికతను ఇంటర్నెట్‌కు కూడా వర్తింపజేశారు. అది ప్రపంచ మేలుకు దోహదపడే శక్తిగా భావించారు.

2002లో మాస్కోలో అమెరికా అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ విమానానికి రష్యా సైనిక వందనం దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2002లో మాస్కోలో అమెరికా అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ విమానానికి రష్యా సైనిక వందనం దృశ్యం

తొలి రోజుల్లో ఇదే తప్పుడు ఆశావాదం, సానుకూల ఆలోచనలు.. పుతిన్ విషయంలో పశ్చిమ దేశాల చూపును కప్పేశాయి. చరిత్రను తిరస్కరించి, ప్రజాస్వామికీకరణను నిరోధించే వ్యక్తిగా, ఆ క్రమంలో ఎన్ని ప్రాణాలు పోయినా సరే పట్టింపులేని మనిషిగా ఇప్పుడు ఆయన రూపం స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షులు వరుస వెంట.. పుతిన్‌కు అనుకూలంగా, తమకు ప్రతికూలంగా వ్యవహరించారు. పుతిన్ అధికారంలోకి వచ్చినపుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్.. నాటోను రష్యా సరిహద్దుల వరకూ విస్తరించటం ద్వారా ఈ అతిజాతీయవాదికి ఓ ఆయుధాన్నిచ్చారు. అమెరికా ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహకర్త జార్జ్ ఎఫ్ కెన్నన్ ఆ సమయంలో హెచ్చరించినట్లు: ''ప్రచ్ఛన్నయుద్ధ కాలానంతర శకమంతటిలో.. నాటోను విస్తరించటం అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటు అవుతుంది.''

జార్జ్ డబ్ల్యు బుష్.. రష్యా అధ్యక్షుడిని తప్పుగా అంచనా వేశారు. 2001లో స్లొవేనియాలో పుతిన్‌తో తన తొలి భేటీ అనంతరం ''నేను అతడి కళ్లలో కళ్లు పెట్టి చూశా'' అన్న బుష్ మాట విస్తృత ప్రాచుర్యం పొందింది. ''ఆయన చాలా ముక్కుసూటి మనిషిగా, నమ్మదగినవాడుగా కనిపించాడు... అతడి ఆంతరాళాన్ని నేను పసిగట్టగలిగాను'' అని కూడా చెప్పారు. పుతిన్‌ను మెచ్చుకోవటం ద్వారా అతడిని మచ్చిక చేసుకోవచ్చునని, ప్రజాస్వామ్య పథంలో ముందుకు సాగేలా మృదువుగా బుజ్జగించగలనని బుష్ పొరపాటుగా భావించారు.

బుష్ మరే దేశానికీ వెళ్లనన్నిసార్లు రష్యాను సందర్శించారు. పుతిన్ స్వస్థలమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బుష్ 2002లో రెండు సార్లు వెళ్లివచ్చారు. అయినప్పటికీ.. ఆ రష్యా నేత అప్పటికే ప్రమాదకరమైన నిరంకుశ వైఖరులు ప్రదర్శిస్తున్నారు.

2008లో అమెరికాకు బుష్ అధ్యక్షుడిగా ఉన్న చివరి సంవత్సరంలో.. పుతిన్ జార్జియా మీద దండెత్తారు. దానికి ''శాంతి స్థాపన చర్య''గా పేరు పెట్టుకున్నారు. బుష్ ఇరాక్ మీద దండయాత్ర చేసిన తర్వాత.. తమ సైనిక చర్యను అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించటమని ఫిర్యాదు చేయటం కపటత్వమని రష్యా అప్పడు, ఇప్పుడూ వాదిస్తూనే ఉంది.

జార్జ్ బుష్ తన టెక్సాస్ నివాసంలో పుతిన్‌కు ఆతిథ్యమిచ్చారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జార్జ్ బుష్ తన టెక్సాస్ నివాసంలో పుతిన్‌కు ఆతిథ్యమిచ్చారు...
‘రష్యన్లు వస్తున్నారు’ అని ముద్రించిన టీ షర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ... అది స్థానికంగా కొంత ఉత్సాహాన్ని రేకెత్తించింది

అమెరికా - రష్యా సంబంధాలను పునర్వ్యవస్థీకరించటానికి బరాక్ ఒబామా ప్రయత్నించారు. దీనికి చిహ్నంగా.. ఆయన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కి ఒక నమూనా 'రీసెట్ బటన్' కూడా అందించారు. కానీ.. అఫ్గానిస్తాన్, ఇరాక్‌లలో సుదీర్ఘ యుద్ధాలు చేసిన తర్వాత.. ప్రపంచ పోలీసుగా వ్యవహరించాలని అమెరికా ఇక ఏమాత్రం కోరుకోవటం లేదని పుతిన్‌కు తెలుసు.

2013లో సిరియా నియంత బషర్ అల్-అసద్ తన సొంత ప్రజల మీద రసాయన ఆయుధాలు ఉపయోగించినా.. ఆయన మీద తానే జారీ చేసిన 'రెడ్ లైన్' హెచ్చరికను అమలు చేయటానికి ఒబామా తిరస్కరించినపుడు పుతిన్ ఓ గ్రీన్ లైట్ చూశారు. పశ్చిమాసియా నుంచి వైదొలగాలని అమెరికా కోరుకుంటున్న సమయంలో.. అసద్ హింసాత్మక యుద్ధం చేయటానికి సాయం చేయటం ద్వారా పుతిన్ రష్యా ప్రభావ పరిధిని పశ్చమాసియాకు విస్తరించారు. ఆ మరుసటి సంవత్సరం పుతిన్ క్రైమియాను తమ దేశంలో కలుపుకున్నారు. తూర్పు యుక్రెయిన్‌లో తన పాదం మోపారు.

ఆ పని ఆపేయాలని ఒబామా చెప్పినప్పటికీ.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి సైతం పుతిన్ ప్రయత్నించారు. తనకు దీర్ఘకాలికంగా శత్రువుగా ఉన్న హిల్లరీ క్లింటన్ ఓడిపోయేలా, తనకు సుదీర్ఘ కాలంగా అభిమానిగా ఉన్న డోనల్డ్ ట్రంప్ గెలిచేలా ఆ ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు పుతిన్.

వీడియో క్యాప్షన్, బెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు?

న్యూయార్క్ ప్రాపర్టీ టైకూన్ అయిన ట్రంప్.. పుతిన్ పట్ల తన అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. అది రష్యా అధ్యక్షుడికి మరింత ధైర్యాన్నిచ్చినట్లు కనిపిస్తోంది. రష్యాకు ఆనందం కలిగించేలా.. నాటోను ట్రంప్ బాహాటంగా విమర్శించారు. అమెరికా యుద్ధానంతర కూటమి వ్యవస్థను బలహీనం చేశారు.

రష్యా పట్ల వైఖరి విషయంలో కాలపరీక్షకు నిలిచిన అమెరికా నాయకుడెవరని చూస్తే.. 30 ఏళ్ల వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడ కూలినప్పుడు.. ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా విజయాన్ని సంబరంగా జరుపుకోవాలన్న ఆరాటాన్ని నాటి అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ నిగ్రహించుకున్నారు. నాటి అధ్యక్ష భవనపు పాత్రికేయ బృందం కూడా నిర్ఘాంతపోయింది. విజయోత్సవ పర్యటనగా బెర్లిన్‌ సందర్శించటానికి ఆయన నిరాకరించారు. అలా చేస్తే.. మిఖాయిల్ గోర్బచేవ్‌ను గద్దె దించాలని కోరుకుంటున్న రష్యా పొలిట్‌బ్యూరోలో, సైన్యంలో ఉన్న అతివాదులకు అది బలాన్నిస్తుందని ఆయనకు తెలుసు.

జర్మనీ పునరేకీకరణను సాధించటంతో ఆ విజయం ద్విగుణీకృతమైంది. బుష్ అతిగొప్ప విదేశాంగ విధాన విజయాల్లో నిస్సందేహంగా అదొకటి.

క్యూబా క్షిపణి సంక్షోభ కాలంలో సోవియట్ ప్రధానిగా ఉన్న నికితా కృశ్చేవ్ కన్నా, అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ లియోనిడ్ బ్రెజ్నేవ్ కన్నా పుతిన్ మరింత బలమైన, కఠినమైన ప్రత్యర్థి అనటంలో సందేహం లేదు. కానీ.. కొత్త శతాబ్దం మొదలైనప్పటి నుంచీ అమెరికా అధ్యక్షులెవరికీ ఆయనను లొంగదీసుకోవటం ఎలాగో నిజంగా తెలియలేదు.

కొసావాలో బిల్ క్లింటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాటో విస్తరణను బిల్ క్లింటన్ ముందకు తీసుకెళ్లారు, అలా చేయటం పొరపాటని కొందరు అంటారు

జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ తరహాలోనే జో బైడెన్ కూడా ప్రచ్ఛన్నయుద్ధ సైనికుడు. స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి తన అధ్యక్ష అధికారాన్ని అంకితం చేశారు. స్వేచ్ఛా ప్రపంచపు నాయకుడిగా.. యుద్ధానంతర అమెరికా సంప్రదాయ పాత్రను పునఃస్థాపించే ప్రయత్నంలో.. యుక్రెయిన్‌కు సైనిక సాయం అందించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా ఎన్నడూ లేనంత కఠినమైన ఆంక్షల విధానాన్ని అమలు చేస్తున్నారు.

రష్యా బలగాలు సరిహద్దు దగ్గర పోగయినపుడు.. పుతిన్ దండయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారనే అమెరికా నిఘా సమాచారాన్ని కూడా బైడెన్ బహిర్గతం చేశారు. రష్యా మామూలుగా చేసే బూటకపు ప్రచారానికి, తప్పుడు ఫ్లాగ్ ఆపరేషన్లకు విఘాతం కలిగించేలా ఈ పని చేశారు బైడెన్.

''నిరంకుశత్వం మీద స్వాతంత్ర్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది'' అని స్టేట్ ఆఫ్ ది యూనియన్‌ ప్రసంగంలో బైడెన్ అన్న మాట ఓ నినాదంగా మారింది. కెన్నడీ, రీగన్‌ల అంతటి స్పష్టతతో కానీ, శక్తిమంతంగా కానీ బైడెన్ మాట్లాడకపోయినా.. ఆ ప్రసంగం ప్రాధాన్యత ఏమాత్రం తక్కువ కాదు.

రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదేమిటంటే.. మరోచోటు నుంచి వస్తున్న బలమైన అధ్యక్ష నాయకత్వ ప్రతిఘటన. వొలదిమీర్ జెలియెన్‌స్కీ అసాధారణ వ్యక్తిగత ప్రయాణం కమెడియన్ స్థాయి నుంచి.. చర్చిల్ అంతటి హేమాహేమీల స్థాయికి కొనసాగతుంటే.. ఆయన ధీరోదాత్తుడిగా ప్రశంసలందుకుంటున్నారు.

బ్రసెల్స్‌లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియెన్.. మరో నిర్ణయాత్మక నేతగా ఉన్నారు. ఈయూ చరిత్రలో తొలిసారిగా.. దాడికి గురవుతున్న ఒక దేశానికి నిధులు అందించాలని, ఆయుధాలు కొనివ్వాలని తీసుకున్న నిర్ణయం వెనుక జర్మనీకి చెందిన ఈ మాజీ రాజకీయవేత్త చోదశక్తిగా నిలిచారు. కేవలం మందుగుండు మాత్రమే కాదు.. యుద్ధ విమానాలను కూడా అందిస్తామని ఈయూ మాట ఇచ్చింది.

ఉర్సులా వాన్ డెర్ లియెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉర్సులా వాన్ డెర్ లియెన్

ఆమె సహనాయకుడు, జర్మనీ కొత్త చాన్సలర్ ఒలాఫ్ ష్కోల్జ్ సైతం.. పుతిన్‌ను ఎదుర్కోవటంలో తనకన్నా ముందు చాన్సలర్‌గా ఉన్న ఏంజెలా మెర్కెల్ కన్నా మరింత దృఢచిత్తాన్ని ప్రదర్శించారు. ప్రచ్ఛన్నయుద్ధానంతరం, ఆచితూచి అడుగువేస్తున్నట్లుగా, రష్యా అధినేత పట్ల కొంత భయపడుతున్నట్లు ఉండే జర్మనీ విదేశాంగ విధానాన్ని ఆయన మెరుపు వేగంతో మార్చివేశారు.

క్రియాశీల యుద్ధ ప్రాంతాలకు ఆయుధాలను పంపించకూడదనే తన విధానానికి స్వస్తి పలుకుతూ.. యాంటీ-ట్యాంక్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలను యుక్రెయిన్‌కు పంపించింది జర్మనీ. నార్డ్ స్ట్రీమ్ 2 బాల్టిక్ స్టీ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును నిలిపివేసింది. స్విఫ్ట్ అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి రష్యాను కత్తిరించాలన్న ప్రతిపాదనకు తన వ్యతిరేకతను ఉపసంహరించుకుంది. చివరికి తన జీడీపీలో 2 శాతం మొత్తాన్ని రక్షణ రంగానికి ఖర్చు చేయాలని కూడా నిర్ణయించుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశం మీద అతి పెద్ద దాడి జరగటం.. యూరప్ పట్టుదలను బలోపేతం చేసింది.

అయితే.. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను, అమెరికాలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యే అవకాశాన్ని గమనంలో ఉంచుకున్న యూరప్ దేశాల నేతలు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ఇక ఏమాత్రం అమెరికా మీద ఆధారపడలేమని తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సంక్షోభంలో స్వేచ్ఛా ప్రపంచానికి నాయకత్వం వహించటం అనేది అందరి ఆకాంక్షగా మారింది.

వీడియో క్యాప్షన్, పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

ప్రచ్ఛన్నయుద్ధం ముగిసినప్పటి నుంచీ.. యూరప్ తన పొరుగుప్రాంతాలకు కాపలా కాయటానికి మరింతగా కృషి చేయాలని అమెరికా కోరుతూనే ఉంది. కానీ మాజీ యుగోస్లేవియా ముక్కలై బోస్నియా యుద్ధం రాజుకున్నపుడు యూరప్ దేశాలు ఏమీ చేయలేకపోయాయి. పుతిన్ దౌర్జన్యం, అమెరికా దౌర్బల్యం, యుక్రెయిన్ వీరోచిత పోరాటం, యుద్ధానంతర యూరప్ సుస్థిరతకు నిజంగా ముప్పుందనే భయం.. అన్నీ కలిసి చివరికి యూరప్ ఆ దిశగా అడుగేశాలా చేయగలిగాయని చరిత్రకారులు నిర్ధారించవచ్చు.

సోషల్ మీడియాలో జెలియన్‌స్కీ ప్రసంగాల రమ్యతలో కొట్టుకుపోవటం, రష్యా ప్రముఖులకు చెందిన ఖరీదైన పడవలను స్వాధీనం చేసుకున్న పోస్టులకు పడిపోవటం జరిగితే అమాయకత్వమే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు. కానీ గత వారం రష్యాకు ఒక సందేశం పంపింది, చైనాకు కూడా ఆ సందేశం అందింది: యుద్ధానంతర అంతర్జాతీయ క్రమాన్ని కూల్చివేయటానికి రష్యా యుద్ధ యంత్రాన్ని మోహరించినా కూడా.. ఆ వ్యవస్థ ఇంకా పనిచేయటం కొనసాగుతుంది. చరిత్రకు ఎప్పుడూ అంతం లేనట్లే.. ఉదారవాద ప్రజాస్వామ్యానికి కూడా అంతం లేదు.

జో బైడెన్ తన స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో చెప్పినట్లు.. ''తాను యుక్రెయిన్‌లో పాదం మోపితే.. ప్రపంచం తన పాదాక్రాంతమవుతుందని పుతిన్ భావించారు. కానీ అతడు ఎన్నడూ ఊహించని ప్రతిఘటనా కుడ్యం అతడికి ఎదురైంది''.

నిక్ బ్రియాంట్ గతంలో బీబీసీ న్యూయార్క్ ప్రతినిధిగా పనిచేశారు. 'వెన్ అమెరికా స్టాప్డ్ బీయింగ్ గ్రేట్: ఎ హిస్టరీ ఆఫ్ ద ప్రెజెంట్' పుస్తక రచయిత. ఆయన ప్రస్తుతం సిడ్నీలో నివసిస్తున్నారు.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)