యుక్రెయిన్ నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు.. అయినా పెంపుడు కుక్కను వదలని కేరళ అమ్మాయి

ఫొటో సోర్స్, COURTESY ARYA ALDRIN
- రచయిత, శరణ్య హృషికేశ్
- హోదా, బీబీసీ న్యూస్
వార్ జోన్ నుంచి సురక్షిత ప్రదేశాలకు మనతో పాటు మన పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్లాలనుకోవడం స్వార్థంగా ఆలోచించినట్లు అవుతుందా?
భారత్‌కు చెందిన 20 ఏళ్ల ఆర్య ఆల్డ్రిన్ అలా అనుకోలేదు. ఆమె యుక్రెయిన్ నుంచి సైబీరియన్ హస్కీ జాతికి చెందిన తన పెంపుడు కుక్క జైరాను తీసుకొని భారత్‌కు వచ్చారు.
''నా హస్కీని అక్కడ వదిలి వస్తే... అప్పుడు నేను స్వార్థంగా ఆలోచించినట్లు అవుతుంది'' అని ఆమె అన్నారు.
అందుకే వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలోనూ 5 నెలల పెంపుడు కుక్కను వెంట తీసుకొని ఆమె కేరళకు చేరుకున్నారు.
యుక్రెయిన్ నుంచి చాలామంది భారతీయ విద్యార్థులు తమ పెంపుడు పిల్లులు, కుక్కలను తీసుకొని భారత్‌కు వచ్చారు. కానీ రొమేనియా సరిహద్దుకు ప్రయాణిస్తోన్న బస్సులో జైరాను భద్రంగా పట్టుకొని కూర్చొన్న ఆర్య ఫొటో వైరల్ కావడంతో ఆమె వార్తల్లో నిలిచారు.
ఈ చర్యతో ఆమెకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. మీ తల్లిదండ్రులు యుక్రెయిన్‌కు చదువుకోవడానికి పంపించారా? లేక జంతువులను సాకడానికి పంపించారా? అని కొందరు విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాలకే భద్రత లేని ఈ సమయంలో తరలింపు విమానాల్లో జంతువులకు ఎందుకు చోటిస్తున్నారు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
''విమానంలో పౌరుల కోసం కేటాయించిన ప్రదేశాన్ని జైరా కోసం వాడలేదు. విమాన కార్గో విభాగంలో ఒక బోనులో జైరా రొమేనియా నుంచి దిల్లీకి చేరుకుంది'' అని ఆర్య చెప్పారు.
''నేను వైద్య విద్యార్థిని. ఎలాంటి వివక్ష చూపకుండా ప్రాణాలను కాపాడాలని మాకు నేర్పించారు. అయినా జైరాను అక్కడే వదిలిపెట్టి వస్తే, విమానంలో మరొకరు ప్రయాణించే వీలుండేది అనే మాటకు అర్థమే లేదు'' అని అన్నారు.
మానవతా సంక్షోభ సమయంలో జంతువులను కాపాడటం చాలా క్లిష్టమైన అంశం. అఫ్గానిస్తాన్‌లో జంతు సంరక్షణా కేంద్రాన్ని నడిపే బ్రిటన్‌కు చెందిన పెన్ ఫర్థింగ్... 2021లో అఫ్గాన్‌ను తాలిబాన్లు ఆక్రమించినప్పుడు, తన దగ్గర పనిచేసే అఫ్గాన్ సిబ్బందిని అక్కడే వదిలేసి కుక్కలను, పిల్లులను సురక్షితంగా దేశాన్ని దాటించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
తాలిబాన్ల బెదిరింపుల కారణంగానే సిబ్బందిని తమతో తీసుకెళ్లలేకపోయామని ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన సిబ్బంది కూడా బ్రిటన్ చేరుకున్నారు.
ఆర్యతో పాటు పెంపుడు జంతువులతో ప్రయాణించిన ఇతరులకు మరీ ఇంతగా విమర్శలు ఎదురుకాలేదు. కానీ వారి ప్రయాణం మాత్రం చాలా భయాందోళనతో సాగింది.

ఫొటో సోర్స్, Getty Images
'నేను జైరాను వదిలిపెట్టలేను'
విన్నిస్యాలోని నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడం కోసం ఆర్య 2020లో యుక్రెయిన్ వెళ్లారు. అక్కడ ఆమెకు తన సొంత రాష్ట్రమైన కేరళ విద్యార్థులతో స్నేహం కుదిరింది.
ఆర్యకు జంతువులపై ఉన్న ఇష్టం తెలుసుకున్న ఆమె ఫ్రెండ్ ఒకరు, 2021 డిసెంబర్‌లో 2 నెలల వయస్సున్న పప్పీని బహుమతిగా ఇచ్చారు. అదే జైరా.
చాలా కొద్ది సమయంలోనే ఆర్యతో జైరా కలిసిపోయింది. ''తాను కాలేజీకి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఇంట్లోనే ఉండే జైరా సరిగ్గా ఆహారం తీసుకోకపోయేదని, తన రాక కోసం ఆత్రంగా ఎదురుచూసేదని'' ఆర్య చెప్పారు. జైరా కోసం స్నేహితుల వద్దకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్నని ఆమె అన్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పుడు... ''ఏది ఏమైనా నేను మాత్రం జైరాను వదిలివెళ్లేది లేదు'' అని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.
జైరాను అక్కడే ఎవరికైనా ఇచ్చేయమని బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహాలను కూడా ఆర్య తిరస్కరించారు.
''నేను చూసుకున్నట్లు జైరాను ఎవరూ ప్రేమించలేరని నాకు తెలుసు'' అని ఆర్య అన్నారు.
యుక్రెయిన్ నుంచి తరలిరావడం తప్ప మరో అవకాశం లేని సమయంలో జైరాను కూడా వెంట తీసుకురావాలనే ఆర్య నిర్ణయానికి ఆమె తల్లి మద్దతు ఇచ్చారు. తొలుత ఆమె తండ్రి దీనికి ఒప్పుకోలేదు కానీ తర్వాత ఆయన కూడా అంగీకరించాల్సి వచ్చింది.
పెంపుడు జంతువుల రవాణాకు అవసరమైన పాస్‌పోర్ట్, టీకా ధ్రువపత్రాలు, మైక్రోచిప్ వంటి వాటిని అధికారుల సహాయంతో ఆమె ఒకరోజులోనే సమకూర్చుకున్నారు.

ఫొటో సోర్స్, COURTESY ARYA ALDRIN
యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన 2 రోజుల తర్వాత, ఫిబ్రవరి 26న బయల్దేరిన ఒక బృందంతో కలిసి ఆర్య, జైరా, ఆమె ఫ్రెండ్ విన్నిస్యా నగరాన్ని వదిలిపెట్టారు.
మరుసటిరోజు బస్సులో రొమేనియా సరిహద్దుకు చేరుకున్నారు. బస్సులో అపరిచితులు, శబ్ధాలతో బెదిరిపోయిన జైరా.. ఈ ప్రయాణం ఆసాంతం నిశ్శబ్ధంగా, ఆర్యకు అతిదగ్గరగా కూర్చొంది.
సరిహద్దు సమీపంలో వాహనాలు భారీగా క్యూ కట్టడంతో బస్సు డ్రైవర్ వారిని సరిహద్దుకు 20 కి.మీ దూరంలోనే దిగబెట్టి వెళ్లిపోయారు.
అక్కడ నుంచి వారు నడక ప్రారంభించారు. అప్పటికే దుకాణాల్లో బ్రెడ్, నీరు దొరక్కపోడంతో ఆర్య, ఆమె ఫ్రెండ్ ఇద్దరూ జ్యూస్, బిస్కెట్ ప్యాకెట్లతో గడపాల్సి వచ్చింది. జైరా కోసం డాగ్ ఫుడ్‌ను తీసుకొచ్చారు.
దారిలో ఆర్య వెన్నునొప్పితో బాధపడ్డారు. జైరా కూడా కుంటుతూ నడవటంతో పాటు బెదిరిపోయినట్లు కనిపించింది.
ఇక అది నడవలేదని, ఎత్తుకోవాలని తాను గుర్తించినట్లు ఆర్య చెప్పారు.
''నేను ఎత్తుకోగానే, అది చిన్నపిల్లల్లా నా భుజంపై వాలిపోయింది'' అని ఆర్య గుర్తు చేసుకున్నారు. జైరా 16 కేజీల బరువు ఉంటుంది.
''దాన్ని ఎత్తుకొని నడవడం చాలా కష్టంగా మారింది. మా బృందంలోని మిగతా సభ్యులు కూడా ఈ విషయంలో సహాయం చేశారు. చేతులకు విశ్రాంతి ఇచ్చేందుకు మధ్య మధ్యలో ఆగుతూ నడిచాం'' అని ఆర్య తెలిపారు.
బరువు తగ్గించుకునేందుకు దారిలో చాలా వరకు ఆహారాన్ని, జ్యూస్ బాటిళ్లను వదిలివేసినట్లు చెప్పారు. దాదాపు 10-12 కిలోమీటర్లు జైరాను ఎత్తుకొని నడిచినట్లు అంచనా వేశారు.
రొమేనియా సరిహద్దుకు చేరుకునేసరికి ఆర్య వద్ద కేవలం డాగ్ ఫుడ్‌తో పాటు ప్రయాణ పత్రాలు మాత్రమే మిగిలాయి.

ఫొటో సోర్స్, ADHI
ప్రయాణం కోసం రొమేనియా సరిహద్దుల్లో దాదాపు 7 గంటల పాటు ఎదురు చూశారు.
గేట్లు తెరిచిన ప్రతీసారి ప్రజలంతా తోసుకోవడం, నెట్టుకోవడం చేశారు. అదే సమయంలో ఎవరో జైరాను తన్నడంతో అది బాధతో విలవిల్లాడినట్లు ఆమె చెప్పారు.
''అక్కడ నేను గంటకు పైగా ఒక్క కాలుపైనే నిలబడి ఉంటాను. జైరాను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అలాగే నిల్చున్నా. ప్రమాదకరం అయినప్పటికీ ఆ సమయంలో తిరిగి విన్నిస్యాకు వెళ్లిపోవాలని అనుకున్నా'' అని ఆమె వివరించారు.
అప్పుడే బరువును మోయడం కుదరక డాగ్ ఫుడ్‌ను కూడా బయట పడేసినట్లు తెలిపారు.
చివరకు తమ వంతు వచ్చినప్పుడు విద్యార్థులంతా ఒకరినొకరు నెట్టుకోవడంతో జైరాతో పాటు ఆర్య వెనకే ఉండిపోయారు. ఆమె ఫ్రెండ్ మాత్రం సరిహద్దు దాటగలిగారు.
జైరాను ఆర్య పైకి ఎత్తి పట్టుకోవడం చూసిన యుక్రెయిన్ సైనికుడు ఆమెను బయటకు వెళ్లేందుకు అనుమతించారు.
''సరిహద్దు దాటి బయటకు వచ్చాక కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను'' అని ఆమె అన్నారు.
భారత్‌కు ప్రయాణం
మొదట వారిని రొమేనియాలోని ఒక షెల్టర్‌కు తరలించారు. అక్కడ అందరికీ ఆహారం, నీరు అందించారు. ఆర్య బూట్లు తెగిపోవడంతో ఒక వాలంటీర్ ఆమెకు సెకండ్ హ్యాండ్ 'షూ'లను అందించారు.
ఆ తర్వాత బుచారెస్ట్‌లోని హెన్రీ కోన్‌డా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న మరో షెల్టర్‌కు వెళ్లడం కోసం అక్కడే వారు గంటల పాటు ఎదురు చూశారు.
అక్కడున్న రొమేనియన్ పోలీసులు కూడా జైరాను అభిమానించారు. దానికి మరింత ఆహారాన్ని అందించారు. ఎయిర్‌పోర్ట్ వెళ్లేందుకు ట్యాక్సీ ఏర్పాటు చేసుకోవడంలో పోలీసులు సహాయం చేశారు.
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం ఎక్కబోయే కొద్ది క్షణాల ముందు జైరాను బోనులో పెట్టాలని రొమేనియన్ అధికారులు ఆర్యకు చెప్పారు.

ఫొటో సోర్స్, COURTESY ARYA ALDRIN
దీనికి మరింత సమయం పట్టింది. కానీ ఎట్టకేలకు వారిద్దరూ దిల్లీ విమానం ఎక్కారు.
విమానంలో తనకు ఇచ్చిన ఆహారంలో కొంతభాగం విమానం దిగిన తర్వాత జైరాకు తినిపించడం కోసం పక్కన బెట్టానని ఆర్య చెప్పారు.
'ఎయిర్ ఏషియా' నిబంధనల కారణంగా కేరళ చేరుకోవడం మరింత ఆలస్యమైందని అన్నారు. దిల్లీ నుంచి కేరళకు నడుస్తోన్న ఎయిర్ ఏషియాలో జంతువులను అనుమతించకపోవడంతో మరో విమానంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
అప్పటికే ఆమె ప్రయాణం వార్తల్లో నిలిచింది. కేరళ రాష్ట్ర మంత్రి ఆమెను ప్రశంసిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.
మరుసటి రోజు ఆమె 'కొచ్చి' విమానాశ్రయాన్ని చేరుకునేసరికే ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉన్న జర్నలిస్టుల బృందం ఆమెకు స్వాగతం పలికింది.
తొలుత వైద్యపరీక్షల కోసం జైరాను తీసుకెళ్లారు. అనంతరం మున్నార్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.
భారత్‌లోని వేడి వాతావరణం జైరాకు ఇబ్బందిగా మారుతుందని ఆందోళన చెందారు.
కానీ ఇప్పుడు కేరళ వాతావరణానికి జైరా నెమ్మదిగా అలవాటు పడుతోందని ఆర్య చెప్పారు. కేరళలోని మిగతా ప్రాంతాల కంటే హిల్‌స్టేషన్ అయిన మున్నార్ ప్రాంతం మరింత చల్లగా ఉండటం అందుకు సహకరించింది.
''నిజానికి నాకు ఇప్పుడు కాస్త అసూయ కలుగుతోంది. ఎందుకంటే జైరా నాతో కంటే మా అమ్మతో ఉండటానికి ఇష్టపడుతోంది'' అని ఆర్య నవ్వుతూ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆళ్లగడ్డ పోలీసులు: ‘కేసులు పెరుగుతున్నాయని శాంతి పూజలు చేశారు, దోష నివారణకు గోమూత్రం చల్లారు’
- భారత్‌లో పెటర్నిటీ లీవ్ తీసుకునేవారు పెరుగుతున్నారా? పిల్లల పెంపకంలో తండ్రుల పాత్రను ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేనా
- అత్యంత వెనుకబడిన తెగ, అడుగడుగునా ఆటంకాలే.. అయినా, ఎవరెస్ట్ ఎక్కడమే లక్ష్యంగా ప్రయాణం
- ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో చెలగాటం ఆడుతున్నారా? ‘నా ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నంత వరకూ..’ వ్యాఖ్యలు ఎందుకు?
- యుక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఒలేనా జెలెన్స్కా: తెర వెనుక ఉండి భర్తని నడిపిస్తున్న ప్రథమ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













