జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఎలా పసిగడతాయి? వాటి సాయంతో సునామీల నుంచి తప్పించుకోవచ్చా?

మేకలకు కాలర్

ఫొటో సోర్స్, MPI-AB

    • రచయిత, నార్మన్ మిల్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2004లో ఇండోనేషియా దగ్గర సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల సంభవించిన సునామీ... హిందూ మహాసముద్రం చుట్టూ తీర ప్రాంతాలను ముంచెత్తింది. 12 దేశాల్లో మొత్తం 2 లక్షలా 25 వేల మందిని పొట్టనపెట్టుకుంది.

చాలా ప్రాంతాల్లోవారికి అసలు ఎలాంటి హెచ్చరికలు అందకపోవడం మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కొంత వరకూ కారణమయ్యింది.

స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సునామీ గురించి అప్రమత్తం చేయడంలో విఫలమైంది.

మెయింటెనన్స్ సమస్యలతో వాటిలో చాలా సెన్సర్లు పనిచేయడం లేదు, చాలా తీర ప్రాంతాల్లో వారికి అసలు ఎలాంటి సునామీ హెచ్చరిక వ్యవస్థలూ లేవు.

ప్రమాదాల గురించి ఎస్ఎంఎస్‌లు పంపించి అప్రమత్తం చేసే సమాచార వ్యవస్థ కూడా విఫలమైంది. ముప్పు ముంచుకొచ్చే ప్రాంతాలకు పంపిన చాలా మెసేజులు వెళ్లకపోవడం, చదవకపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది.

కానీ, 30 అడుగుల ఎత్తున ఎగసిపడిన ఆ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తడానికి కొన్ని నిమిషాల ముందు, అక్కడే ఉన్న కొన్ని జంతువులు ముంచుకొచ్చే ముప్పును పసిగట్టి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

ఆ సమయంలో ఏనుగులు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశాయని, ఫ్లెమింగోలు తక్కువ ఎత్తులో ఉన్న గూళ్లు వదిలి ఆకాశంలోకి ఎగిరాయని, కుక్కలు బయటకు వెళ్లడానికి మొరాయించాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు.

ఆ సమయంలో సముద్ర తీరంలో ఉన్న ఒక గేదెల మంద హఠాత్తుగా తమ చెవులు రిక్కించిందని, సముద్రం వైపు చూసి సునామీ తీరాన్ని ముంచెత్తే కొన్ని నిమిషాల ముందు దగ్గరే ఉన్న ఒక కొండపైకి పరుగులు తీసిందని థాయ్‌లాండ్‌లోని బాంగ్‌కోయ్ గ్రామస్థులు చెప్పారు.

"ఆవులు, మేకలు, పిల్లులు, పక్షులు లాంటి జీవులు భూకంపం రాగానే, సునామీకి ముందు సముద్రానికి దూరంగా పరుగులు తీయడం తాము చూశామని కొందరు బాధితులు చెప్పారు. ఆ జంతువులతోపాటే పరుగులు తీసిన వారిలో చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు" అని ఇరినా రఫ్లియానా చెప్పారు.

ఇరినా రఫ్లియానా గతంలో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిస్క్(యుఎన్ఐఎస్‌డీఆర్)లో భాగంగా ఉన్నారు. ఇప్పుడు బాన్‌లోని జర్మన్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, CHAIDEER MAHYUDDIN/getty images

2010లో సుమత్రా దగ్గర వచ్చిన సునామీపై జరిపిన పరిశోధనల్లో కూడా ఇలాంటి ఘటనలే కనిపించినట్లు రఫ్లియానా వివరించారు. ఆ సునామీలో మెంటవాయ్ దీవుల్లో 500 మంది చనిపోయారు. ఇక్కడ కూడా ఏనుగులు లాంటి కొన్ని జంతువులు సునామీ గురించి ముందే గుర్తించినట్లు స్పందించాయని ఆమె చెప్పారు.

కొన్ని రోజుల క్రితం సముద్రంలో విడుదల చేసిన ఒక తాబేలు ఇటీవల జనవరిలో టోంగాలో అగ్నిపర్వతం పేలడానికి రెండ్రోజుల ముందు తిరిగి తీరానికి చేరుకున్నట్లు కూడా పరిశోధకులు గుర్తించారు.

తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే చాలా ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు లేవు. అలాంటి ముప్పు పొంచి ఉన్న దాదాపు 100 దేశాల్లో సహజ విపత్తులకు సంబంధించి అప్రమత్తం చేయడానికి ఎలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలూ ఏర్పాటు చేయలేదని ప్రపంచ వాతావరణ సంస్థ 2017లో హెచ్చరించింది.

కానీ, సహజ విపత్తులకు ముందు జంతువుల ప్రవర్తన గురించి చెబుతున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలను రాబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి జంతువుల్లో అంతర్లీనంగా ఒక హెచ్చరించే వ్యవస్థ ఉండవచ్చనే దానిపై పరిశోధనలకు ప్రేరేపించాయి.

సహజ విపత్తుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి జంతువులు.. మనుషులకు ఒక ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అందించగలవా అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ప్రశ్నగా మారింది.

సహజ విపత్తు సమయంలో జంతువుల అసాధారణ ప్రవర్తనకు సంబంధించిన మొట్టమొదటి ఘటన వివరణ క్రీస్తు పూర్వం 373లో ఉంది.

ఆ సమయంలో ఎలుకలు, కుక్కలు, పాములు, వీజిల్స్ లాంటి జంతువులు వినాశనం సృష్టించిన భూకంపానికి కొన్ని రోజుల ముందే హెలిస్ నగరాన్ని వదిలి వెళ్లిపోయినట్లు గ్రీకు చరిత్రకారుడు తుసిడైడెస్ రాశారు.

గుర్రాలు

ఫొటో సోర్స్, Bernard Friel/Getty

చరిత్రలో ఇలాంటి మిగతా ఘటనలు చూస్తే 1805లో నేపుల్స్ భూకంపానికి ముందు ఎద్దులు, గొర్రెలు, కుక్కలు, బాతులు ఒక్కసారిగా అందరినీ అప్రమత్తం చేస్తున్నట్టు అరవడం మొదలెట్టాయని చెప్పారు. ఇక 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో భూకంపానికి ముందు గుర్రాలన్నీ భయంతో తాళ్లు తెంచుకుని పారిపోయినట్లు రాశారు.

అత్యాధునిక సాంకేతికత సాయంతో చాలా ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించడం కష్టం. ఉదాహరణకు భూకంపాల సమయంలో, భూకంప సెన్సర్లు భూమి నిజంగా కుదుపులకు గురైనప్పుడు మాత్రమే కదులుతాయి. కానీ మనం భూకంపం గురించి నమ్మకంగా అంచనా వేయడానికి ముందస్తు సంకేతాలు అవసరం అమవుతాయి.

తీవ్ర భూకంపాలు వచ్చే ముందు స్థిరమైన సంకేతాలు ఇచ్చేలా శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలను కనుగొనలేదు. అందుకే అవి వచ్చే ముందు జంతువుల ప్రవర్తన లాంటివాటిని హెచ్చరిక వ్యవస్థలను పరిగణించాలని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ, మనం భూకంపాలను, చాలా సహజ విపత్తులను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాం" అని చార్లోటీ ఫ్రాన్సెసియాజ్ అన్నారు.

ది ఫ్రెంచ్ బయోడైవర్సిటీ ఆఫీస్(ఓఎఫ్‌బీ)లో ఆమె పక్షులపై పరిశోధనలు చేసే బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

పసిఫిక్ దాటి వలస వెళ్లే పక్షులు మహాసముద్రంలో వచ్చే తుఫానులు, ఇతర ప్రమాదాలను ఎలా తప్పించుకోగలుగుతున్నాయో పరిశోధనలు చేస్తున్న కివీ కువాకా ప్రాజెక్టులో ఈమె భాగంగా ఉన్నారు.

ఐదేళ్ల క్రితం జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బిహేవియర్‌కు చెందిన మార్టిన్ వికెలెస్కి నేతృత్వంలో వైపరీత్యాలను జంతువులు ఎలా పసిగడతాయనేదానిపై జరిగిన అత్యంత ముఖ్యమైన ఒక పరిశోధన జరిగింది.

ఆయన అధ్యయనంలో ఇటలీలో భూకంపాలు వచ్చే మార్చెస్ ప్రాంతంలో పశువుల పాకల్లో ఉన్న రకరకాల జంతువుల(ఆవులు, గొర్రెలు, కుక్కలు) కదలికలను రికార్డ్ చేయడం కూడా ఉంది. ఆ ప్రక్రియను బయోలాగింగ్ అంటారు.

కాలర్స్

ఫొటో సోర్స్, MPI-AB

ఆ పాకల్లో ఉన్న ప్రతి జంతువుకూ చిప్స్ అటాచ్ చేసిన కాలర్స్ పెట్టారు. 2016 అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ మధ్యలో ఆ కాలర్స్ ప్రతి కొన్ని నిమిషాలకూ జంతువుల కదలికల డేటాను ఒక సెంట్రల్ కంప్యూటర్‌కు పంపించేవి.

ఆ సమయంలో ఆ ప్రాంతంలో 18 వేలకు పైగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 6.6 తీవ్రతతో విధ్వంసం సృష్టించిన నోర్సియా భూకంపంతోపాటూ 0.4 తక్కువ తీవ్రత నుంచి 4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాల వరకూ ఉన్నాయి.

భూకంపం రావడానికి 20 గంటల ముందు నుంచే పశువుల పాకల్లో ఉన్న జంతువుల ప్రవర్తనలో మార్పు కనిపించడం మొదలైనట్లు పరిశోధకులకు ఆధారాలు లభించాయి.

ఈ పరిశోధనలో పశువులన్నీ ఒక్కసారిగా 45 నిమిషాలకంటే ఎక్కువ సమయం 50 శాతం ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించగానే 4.0 తీవ్రతను మించి భూకంపం వస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. ఎనిమిది భూకంపాల్లో ఏడింటిని పరిశోధకులు ఈ పద్ధతి ద్వారానే కరెక్టుగా గుర్తించగలిగారు.

"భూకంప కేంద్రానికి ఆ జంతువులు ఎంత దగ్గరగా ఉంటే రాబోయే ముప్పు గురించి వాటి ప్రవర్తనలో అంత త్వరగా మార్పు వచ్చింది" అని వికెలెస్కీ 2020లో తన అధ్యయనం విడుదలైనప్పుడు చెప్పారు.

మరో అధ్యయనంలో భాగంగా ఈయన సిసిలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం వాలులో ఉన్న మేకలకు ట్యాగింగ్ చేశారు. ఎట్నా పర్వతంలో పేలుళ్లకు ముందే అవి వాటిని గుర్తిస్తున్నట్లు అందులో తేలింది.

ఇండోనేషియా సునామీ

ఫొటో సోర్స్, ordon R. Beesley/US Navy/Getty

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియా సునామీ

బిహేవియరల్ ఎకాలజిస్ట్ రాచెల్ గ్రాంట్ కూడా దక్షిణ అమెరికాలో ఇలాంటి ఫలితాలనే కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె లండన్‌లోని సౌత్ బాంక్ యూనివర్సిటీలో ఉన్నారు.

జంతువుల కదలికలను బయోలాగింగ్ చేయడానికి పెరూలోని యాండీస్ పర్వతాలపై కొంతకాలం పాటు ఆమె జంతువుల కదలికలను పసిగట్టి రికార్డ్ చేసే కెమెరాలు బిగించారు. 2011లో 7.0 తీవ్రతతో కాంటనామా భూకంపం అదే సమయంలో వచ్చింది.

ఈ కెమెరాలు రికార్డ్ చేసిన జంతువుల సంఖ్య ఆ భూకంపానికి 23 రోజుల ముందు నుంచే తగ్గడం మొదలైంది. భూ ప్రకంపనలకు 8 రోజుల ముందు వాటి సంఖ్య వేగంగా తగ్గిపోయింది. ముఖ్యంగా 10, 6, 5, 3, 2 రోజుల్లో, భూకంపం వచ్చిన రోజు కూడా అక్కడ ఒక్క జంతువు కదలిక కూడా రికార్డ్ కాలేదు. "ఇది నిజంగా అసాధారణం" అని గ్రాంట్ తన 2015 రీసెర్చ్ పేపర్లో చెప్పారు.

భూకంపానికి రెండు వారాల ముందే ప్రతి రెండు, మూడు నిమిషాలకూ స్థానిక వాతావరణంలోని విద్యుత్ ఆవేశాల్లో వచ్చిన బలమైన అలజడులు జంతువుల ప్రవర్తనల్లో మార్పులు ప్రేరేపించగలదనడానికి గ్రాంట్ ఆధారాలను కనుగొన్నారు. ముఖ్యంగా కాంటమానా భూకంపానికి 8 రోజుల ముందు వీటిలో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.

భూకంపానికి ముందు వాతావరణంలో ఏర్పడే ఈ విద్యుతయస్కాంత అలజడుల వల్లే జంతువులు వాటిని ముందే పసిగట్టగలుగుతున్నాయా అనే విషయంలో శాస్త్రవేత్తలు ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు.

భూపంకాలు వచ్చే ముందు లోతులోని రాతిపొరలో తీవ్రమైన పీడనం ఏర్పడుతుంది. ఈ ఒత్తిడిలు పాజిటివ్ హోల్స్ అనే విద్యుత్ ఆవేశాలను సృష్టిస్తాయి. తీవ్ర కదలికలు ఉండే ఈ విద్యుత్ ఆవేశాలు లోపల రాతి పొర నుంచి భూమి ఉపరితలానికి చాలా వేగంగా ప్రవహించగలవు. అక్కడ అవి పైన గాలి అణువులను అయనీకరణం చేస్తాయి.

వీడియో క్యాప్షన్, కిర్గిజ్‌స్తాన్‌: మనుషుల వీర్య వృద్ధికి జింకల్ని వేటాడి చంపేశారు

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎన్నో భూకంపాలకు ముందు అలాంటి అయనీరణాన్ని గుర్తించారు. ఈ పాజిటివ్ హోల్స్ ప్రవహిస్తుంటే, అవి అల్ట్రా లో-ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పసిగట్టగలిగేలా ఇవి అదనపు సంకేతాలను అందిస్తాయి.

ముందస్తుగా కనిపించే ఈ భూకంప సూచనలను శాస్త్రీయంగా డాక్యుమెంట్ చేయలేదని మాథ్యూ బ్లాకెట్ చెప్పారు.

ఈయన కోవెంట్రీ యూనివర్సిటీలో ఫిజికల్ జియాగ్రఫీ అండ్ నేచురల్ హజార్డ్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

కానీ, భూకంపాలను పసిగట్టి తప్పించుకునే మెకానిజంను జంతువులు అభివృద్ధి చేసుకుని ఉండచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"బహుశా, భూకంపాలకు ముందే అవి ఆ పీడన తరంగాలను గుర్తించగలవు. రాక్ కంప్రెస్ కావడం మొదలవగానే అవి బహుశా విద్యుత్ క్షేత్రంలో మార్పులను అవి గుర్తించగలుగుతున్నాయి. జంతువుల్లో చాలా ఐరన్ కూడా ఉంటుంది. అది అయస్కాంతత్వానికి, విద్యుత్ క్షేత్రాలకు సున్నితంగా ఉంటుంది అని బ్లాకెట్ చెప్పారు.

పాజిటివ్ హోల్స్ భూకంపాలకు ముందు కొన్ని రకాల విషపూరిత రసాయనాలు వెలువడ్డానికి కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు అవి నీటికి తగిలితే బ్లీచింగ్ ఏజెంట్ హైడ్రోజెన్ పెరాక్సైడ్‌ను సృష్టించే ఆక్సిడేషన్ రియాక్షన్లను ప్రేరేపిస్తుంది. మట్టిలోని చార్జ్ కారియర్లు, సేంద్రీయ పదార్థాల వల్ల ఓజోన్ లాంటి ఇతర హానికరమైన ఉత్పత్తులు కూడా విడుదలవుతాయి.

గుజరాత్ భూకంపం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గుజరాత్ భూకంపం

మరోవైపు 2001లో భారత్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన గుజరాత్ భూకంపానికి కొన్ని రోజుల ముందు భూకంప కేంద్రంగా భావిస్తున్న ప్రాంతానికి చుట్టూ వంద చదరపు కిలోమీటర్లకు పైగా కార్బన్ మోనాక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగినట్లు శాటిలైట్లు గుర్తించాయి.

భూకంపం పీడనం పెరిగేకొద్దీ రాతి పొరలో ఒత్తిడి తీవ్రం కావడం వల్ల భూమిలోంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బలవంతంగా బయటకు వచ్చుండచ్చని శాస్త్రవేత్తలు సూచించారు.

చెప్పాలంటే, తమ ప్రాణాలు కాపాడుకోడానికి, సహజంగా ముంచుకొచ్చే ప్రమాదాల సంకేతాలను చదవగలిగేలా చాలా జంతువులకు అత్యంత అభివృద్ధి చెందిన ఇంద్రియ జ్ఞానం ఉంటుంది.

అందుకే, భూకంపాన్ని ముందే ఊహించడం, హానికరమైన రసాయనాలను పసిగట్టడం, లో-ఫ్రీక్వెన్సీ తరంగాలను గుర్తించడం, బొచ్చు, ఈకల ద్వారా గాలిలో ఆయనీకరణాన్ని గ్రహించడం లాంటి కొన్ని జంతువులు, పక్షులకు కచ్చితంగా సాధ్యమేనని అనిపిస్తుంది.

భూకంపాలను ఊహించడం చాలా కష్టం కాబట్టి, ఇలాంటి అధ్యయనాల ద్వారా జంతువులపై పరిశోధనల చేయడం వల్ల మనం భూకంపాలను ముందే అంచనా వేయవచ్చా, ముప్పు ముంచుకొస్తోందని ప్రజలను హెచ్చరించవచ్చా అనే ఒక ప్రశ్నకూడా వస్తోంది.

వికెలెస్కి ఆయన సహచరులు 2020లో చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఇటలీలో తాము చేసిన పరిశోధనల గణాంకాలు, జంతువుల ప్రవర్తనను పరిశీలనలను ఉపయోగించి భూకంపాన్ని ముందే సూచించే ఒక నమూనా హెచ్చరిక వ్యవస్థను తయారు చేశారు.

వీడియో క్యాప్షన్, పిల్లుల కోసం నెలకు రూ.1.5 లక్షలు ఖర్చు

భూకంపం కేంద్రంలో ఉన్న పాడి పశువులు దానిని గ్రహించగలిగితే, భూకంపం రావడానికి 18 గంటల ముందే వాటి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆయన అంచనా వేశారు. ఇక భూకంప కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువులు మరో 8 గంటల తర్వాత దానిని గుర్తిస్తాయని, 20 కిలోమీటర్ల దూరంలో పాకల్లో ఉన్న పశువులు మరో 8 గంటలు ఆలస్యంగా భూ ప్రకంపనలను పసిగడతాయని చెప్పారు.

"ఇదే నిజమైతే.. భూకంపం మరో రెండు గంటల్లో రాబోతోందని ఇది సూచిస్తుంది" అంటారు వికెలెస్కీ.

అంటే భూకంప కేంద్రం మీదున్న పశువులు 18 గంటల ముందే దానిని గుర్తిస్తే, అందులోంచి 16 గంటలు తీసేస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు ఆ పశువుల ప్రవర్తనను గమనించి మరో రెండు గంటల్లో భూకంపం రాబోతోందని గుర్తించవచ్చు.

శాస్త్రవేత్తలు భూకంపాలను అంచనా వేయడానికి జంతువులను ఉపయోగించే ముందు ప్రపంచవ్యాప్తంగా రకరకాల భూకంప జోన్లలో ఉన్న ఎన్నో జంతువులపై భారీ సంఖ్యలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువుల కదలికల గణాంకాలు సేకరించడానికి వికెలెస్కీ, మిగతా శాస్త్రవేత్తలు అందరూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న గ్లోబల్ అనిమల్ అబ్జర్వేషన్ సిస్టమ్ 'ఇకారస్' సాయం కోరుతున్నారు.

ఇకారస్(ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ అనిమల్ రీసెర్చ్ యూజింగ్ స్పేస్) 2002లో గ్లోబల్ కొలాబరేషన్ ఆఫ్ సైంటిస్టుల సహకారంతో ఏర్పాటైంది. భూమిపై ఉన్న ప్రాణుల జీవితం, భూభౌతిక వ్యవస్థల మధ్య పరస్పర చర్యల గురించి ఆధారాలు, డేటా అందించడానికి ట్యాగ్ చేసిన చిన్న జంతువుల( పక్షుల లాంటి) శ్రేణి కోసం ఒక కచ్చితమైన ప్రపంచ పరిశీలన వ్యవస్థను అందించడమే దీని లక్ష్యం.

పాములు

ఫొటో సోర్స్, BBC Horizon

మరోవైపు నానింగ్‌లోని ఉన్న ఎర్త్‌క్వేక్ బ్యూరో ఆధారంగా భూకంపాల నుంచి అప్రమత్తం చేసే ఒక వ్యవస్థను చైనా ఇప్పటికే తయారు చేసింది. నేలకు మరింత దగ్గరగా ఉండే జీవులు, ముఖ్యంగా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో పొలాల్లో తిరిగే పాముల ప్రవర్తనను ఇది నిశితంగా పరిశీలిస్తోంది. తమ వాతావరణంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా వాటిని గుర్తించగలిగే శక్తివంతమైన ఇంద్రియ జ్ఞానం పాములకు ఉంటుంది. భూకంపం పాములు, ఇతర జంతువుల ప్రవర్తనల్లో హఠాత్తుగా మార్పులకు కారణం అవుతుంది.

ఈ పరిశీలన 1975లో తీవ్ర భూకంపం రావడానికి ముందే హైచెంగ్ నగరాన్ని ఖాళీ చేయించడానికి, ఎంతోమంది ప్రాణాలను కాపాడ్డానికి అధికారులు ఉపయోగపడింది.

"భూమిపై ఉండే అన్ని ప్రాణులు, బహుశా పాములు భూకంపాలకు అత్యంత సున్నితంగా ఉంటాయి. భూకంపాలు సంభవించే ముందు అది ఎముకలు కొరికే చలికాలం అయినా పాములు తమ పుట్టల్లోంచి బయటకు వచ్చేస్తాయి" అని జియాంగ్ వీసాంగ్ చెప్పారు.

ఆయన నానింగ్ బ్యూరోకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో 2006లో చైనా డైలీకి ఈ విషయం చెప్పారు.

జంతువులు ముందే హెచ్చరించగలిగే సహజ విపత్తుల్లో భూకంపాలు మాత్రమే లేవు. పక్షులు కూడా కమ్ముకొస్తున్న మిగతా సహజ విపత్తుల గురించి ముందే గుర్తించి హెచ్చరించగలవని చాలా ప్రాంతాల్లో వాటి ప్రవర్తనను చూసి చెబుతున్నారు.

2014లో అమెరికాలో వార్బలెర్స్(బంగారు రంగు రెక్కలు ఉండే కోకిల లాంటి పక్షి) జాడను రికార్డ్ చేసిన శాస్త్రవేత్తలు దానిని ఆ పక్షులు ఒక చోటును ఖాళీ చేసి వలస వెళ్లిపోవడాన్ని ముంచుకొచ్చే ముప్పుకు ఒక ఉదాహరణగా గుర్తించారు.

తూర్పు టెనసీ కుంబర్లాండ్ పర్వతాల్లో తమ గూళ్లను హఠాత్తుగా వదిలిన ఆ పక్షులు 700 కిలోమీటర్లు దూరంగా ఎగిరిపోయాయి. అవి వెళ్లిన కాసేపటికే భయంకరంగా 80 టోర్నడోలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఆ విధ్వంసంలో 35 మంది ప్రాణాలు కోల్పోగా, వంద కోట్లకు పైగా నష్టం జరిగింది.

పక్షులు ట్విస్టర్లను 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడే గుర్తించగలవనేది దీని ద్వారా స్పష్టమైంది.

కివీ కువాకా ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, Kivi Kuaka

దానికి మొదట ఇన్‌ఫ్రాసౌండ్ కారణం అని శాస్త్రవేత్తలందరూ భావించారు. ఈ లో-ఫ్రీక్వెన్సీ శబ్దాలు మనుషుల చెవులకు వినిపించవు. కానీ, అవి వాతావరణం అంతటా ఉంటాయి.

"సుడిగాలులు, తుఫానుల నుంచి చాలా బలమైన ఇన్‌ఫ్రాసౌండ్ వస్తుందని, అవి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయనే విషయం వాతావరణ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలకు దశాబ్దాల నుంచీ తెలుసు" అని బర్క్‌లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలఫోర్నియాలో వన్యప్రాణుల బయాలజిస్ట్ హెన్రీ స్టెర్బీ ఆ సమయంలో చెప్పారు.

తీవ్రమైన తుపానుల నుంచి ప్రయాణించే ఆ ఇన్‌ఫ్రాసౌండ్ పక్షులు బాగా వినగలిగే ఫ్రీక్వెన్సీలో ఉంటుందని ఆయన చెప్పారు.

ఇన్‌ఫ్రాసౌండ్‌లో వైవిధ్యాలను గుర్తించగలిగే మెకానిజం ఉండడం వల్లే పక్షులు విశాలమైన మహా సముద్రాలను దాటుతూ ఆ సమయంలో ఏర్పడే తుపానులను కూడా తప్పించుకోగలుగుతున్నాయని భావిస్తున్నారు.

కివీ కువాకా ప్రాజెక్ట్ ద్వారా పసిఫిక్ మహాసముద్రంలో దీనిపై అధ్యయనం చేస్తున్నారు. ఫ్రెంచ్ నావీ అధికారి జెరోమ్ చార్డన్ 'బార్ టెయిల్డ్ గోడ్విట్' అనే పక్షి గురించి చెప్పడమే ఈ అధ్యయనానికి కారణం.

ఈ పక్షి ప్రతి ఏటా న్యూజీలాండ్ నుంచి అలస్కా మధ్య 14 వేల కిలోమీటర్లు వలస వెళ్తుంటుంది. ఆగ్నేయాసియా, ఫ్రెంచ్ పాలినేషియా అంతటా ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లు చేసిన జెరోమ్‌కు ఆ ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. పసిఫిక్, దాని చుట్టుపక్కల ఉండే దీవుల్లో ప్రజలను తుపానులు తరచూ దెబ్బతీస్తుంటాయి. కానీ, గాడ్విట్‌లు ఆ భయంకరమైన తుపాన్లు తప్పించుకుని ప్రతి ఏటా తమ ప్రయాణం ఎలా పూర్తి చేశాయి అనే ప్రశ్న వచ్చింది.

ఇక 2021 జనవరికి వస్తే, సముద్రం మీదుగా వెళ్లే పక్షులను అనుసరించడానికి ఫ్రాన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన ఒక టీమ్ ఐదు రకాలకు చెందిన 56 పక్షులకు జీపీఎస్ ట్రాకర్స్ బిగించింది.

కివీ కువాకా ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, R Lorrilliere/Kivi Kuaka

ఐఎస్ఎస్ నుంచి అందే సంకేతాల ద్వారా పక్షులు ఎగురుతున్నప్పుడు ఆ దారిలో సహజ విపత్తులకు అవి ఎలా స్పందిస్తాయో గమనించింది. పసిఫిక్ అంతటా క్లైమెట్ మోడలింగ్, వాతావరణ అంచనాలను మెరుగు పరచడానికి వారి ట్యాగ్స్ వాతావరణ గణాంకాలను కూడా సేకరిస్తాయి.

సునామీలు లాంటి ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తుల నుంచి ఒక పక్షి ప్రవర్తన హెచ్చరిస్తుందా అనేదానిపై కూడా కివీ కువా ప్రాజెక్ట్ పరిశోధనలు చేస్తోంది.

సునామీలు వాస్తవ తరంగాల కంటే ముందే విలక్షణమైన ఇన్‌ఫ్రాసౌండ్ ఉత్పత్తి చేస్తాయి. తుపాను లేదా సునామీ ముప్పు గురించి ముందే తెలియజేసే హెచ్చరిక వ్యవస్థ కోసం పక్షుల నుంచి ఏదైనా సాయం పొందవచ్చా అనేది తెలుసుకోవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఫ్రాన్సియాజ్ చెప్పారు.

ఈ టీమ్ ప్రస్తుతం ఇటీవల టోంగాలో అగ్ని పర్వతం పేలిన కొన్ని గంటల తర్వాత పసిఫిక్‌లో ఫ్రెంచ్ వాతావరణ బెలూన్స్ నమోదు చేసిన ఇన్‌ఫ్రాసౌండ్ తరంగాలకు కర్లూ(కొంగలాంటి పక్షి)లు ఎలా స్పందించాయో లేదో తెలుసుకోడానికి వాటి జీపీఎస్ ట్యాగ్స్ నుంచి సమాచారం పొందే పనిలో ఉంది.

లివర్‌పూల్ యూనివర్సిటీలో మెరైన్ బయాలజిస్ట్ సమంతా పాట్రిక్ కూడా పక్షులు సహజ విపత్తుల నుంచి తప్పించుకునే పద్ధతిగా భావించి ఇన్‌ఫ్రాసౌండ్‌పై పరిశోధనలు చేస్తున్నారు.

"ఇన్‌ఫ్రాసౌండ్‌లో మార్పులను పక్షులు గ్రహించగలవని మనం కచ్చితంగా చెప్పచ్చని నాకు అనిపిస్తోంది" అని ఆమె చెప్పారు.

సహజ విపత్తులను అంచనా వేయడానికి జంతువులను ముందస్తు హెచ్చరికల వ్యవస్థలుగా భావించడం సరైనదేనని నిపుణులందరూ భావించడం లేదు. అవి మనకు సాయం చేసినప్పటికీ, విపత్తులను గుర్తించడానికి జంతువుల కదలికలు గుర్తిస్తే మాత్రమే సరిపోదు. ప్రజలు వీటి గురించి పూర్తిగా ఒక అంచనాకు రావడానికి ముందస్తు హెచ్చరిక సంకేతాల కలయిక మీద ఆధారపడాల్సి ఉంటుంది.

మనుషులు జంతువులతో ఇంకా మాట్లాడలేకపోతున్నారు. అందుకే, మనం బహుశా జంతువులు చేసే హెచ్చరికలపై మరింత నిశితంగా దృష్టిపెట్టాల్సిన సమయంగా దీన్ని భావించవచ్చు.

ISWOTY Footer
వీడియో క్యాప్షన్, ఆపదలో ఉన్న జంతువులను వీళ్లు ఎలా కాపాడతారో చూడండి!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)