ధ్రువపు జింకలు: ఆహారం వెతుక్కుంటూ వెళ్లి దారి తప్పిన వేలాది మూగ జీవులు... దీనికి కారకులెవరు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, నవీన్ సింగ్ ఖాడ్కా
- హోదా, ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్
ధ్రువపు జింకలు మేత మేసే పచ్చిక బయళ్లను మంచు కప్పేసింది. అక్కడి వేడి వాతారణం వల్ల జరిగిన ఈ మార్పులు ఆ మూగ జీవుల పాలిట శాపంగా మారాయి.
పచ్చిక బయళ్లు కనిపించక వేలాది ధ్రువపు జింకలు (రీన్‌డీర్) ఆహారాన్ని వెదుక్కుంటూ దారితప్పి పారిపోయాయి. వాటిని వెదికి పట్టుకునేందుకు లాప్‌లాండ్‌లో పశుపోషకులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.
కొన్ని ధ్రువపు జింకలు మంచు కింద అందుకుని మేయగలిగే పచ్చగడ్డిని వెదుక్కుంటూ దక్షిణంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాయి.
వాటి ఆచూకీని కనిపెట్టటానికి ఉత్తర ఫిన్లాండ్, స్వీడన్‌లలోని అడవుల గుండా వందలాది మంది వాటి అడుగుజాడలను వెదుకుతూ వెళుతున్నారు. కొందరైతే హెలికాప్టర్లు కూడా ఉపయోగిస్తున్నారు.
వాతావరణ మార్పు ఫలితంగా మిగతా ప్రపంచం వేడెక్కుతున్న వేగానికి రెట్టింపు వేగంతో ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ, ఈ అంచనా కూడా తక్కువే కావచ్చునని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ముందుగా కురిసిన మంచు కరిగినపుడు కానీ, మంచు కురిసిన తర్వాత వర్షం పడటం వల్ల కానీ.. తడి మంచు ఏర్పడుతుందని, ఉష్ణోగ్రతలు తగ్గినపుడు అది గడ్డకట్టుకుపోయి గట్టి మంచు పొరగా ఏర్పడుతుందని చెప్తున్నారు.
‘‘ఈ మంచు పొర గట్టిగా ఉంటుంది. దీనిని ధ్రువపు జింకలు తవ్వలేవు. కాబట్టి కేవలం వదులుగా ఉండే మంచు మాత్రమే ఉండే భూభాగాన్ని వెదుక్కుంటూ వెళ్లిపోతాయి. అలాంటి ప్రదేశాల్లో గడ్డి మీద మంచును సులభంగా తొలగించి గడ్డి పరకలను తినగలవు’’ అని ఫిన్‌లాండ్‌లోని నేచరుల్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ సైంటిస్ట్ జోకో కుంపులా వివరించారు.
స్వీడన్, ఫిన్లాండ్, నార్వేలతో పాటు రష్యాలోని కోలా పెనిన్సులాల్లో గల ఆర్కిటిక్ ప్రాంతాలతో కూడిన లాప్‌లాండ్‌లో నివసించే సామి అనే ఆదివాసీ ప్రజల ప్రధాన జీవనాధారం.. ధ్రువపు జింకల పెంపకం.

ఫొటో సోర్స్, Getty Images
‘‘వీటి జాడ కనిపెట్టటానికి మేం రాత్రీ పగలూ నిర్వరామంగా పనిచేస్తున్నాం’’ అని ఈశాన్య స్వీడన్‌కు చెందిన 62 ఏళ్ల పశుపోషకుడు టామస్ సెవా చెప్పారు.
‘‘మా ధ్రువపు జింకలను వెదికి పట్టుకుని, వాటిని వెనక్కి తోలుకు వెళ్లడానికి మేం గంటల తరబడి బండ్లు నడుపుతున్నాం. ఈ చలి పరిస్థితుల్లో ఇదంతా చాలా కష్టంగా ఉంది. కాబట్టి హెలికాప్టర్లను కూడా వాడుతున్నాం. ఇది చాలా అసాధారణం. చాలా ఖర్చుతో కూడుకున్న పనికూడా’’ అని ఆయన వివరించారు.
తమ భూమి నుంచి, తమ పొరుగు గ్రామం నుంచి దాదాపు 8,000 ధ్రువపు జింకలు ఇటీవలి కాలంలో దారితప్పిపోయాయని.. వాటిలో చాలా జింకలు అసాధారణంగా సదూర ప్రాంతాలకు వెళ్లిపోయాయని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొన్ని జింకల గుంపులు ఇతర జింకల మందలతో కలిశాయి.
‘‘ఇతరుల మందలతో కలిసిన జింకలను వేరుచేసి, వెనక్కు తీసుకురావటం ఓ భారీ సవాలు. మేం చాలా ఒత్తిడికి లోనవుతున్నాం’’ అని చెప్పారాయన.
దేశంలోని ఈశాన్య ప్రాంతంలో పలు జిల్లాల్లో ఈ సమస్య తలెత్తిందని.. సరిహద్దు అవతల ఫిన్లండ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని స్వీడిష్ రీన్‌డీర్ హెర్డర్స్ అసోసియేషన్ చెప్తోంది.
‘‘మా ధ్రువపు జింకలు మా జిల్లా నుంచి అతి దూరంగా దాదాపు 100 కిలోమీటర్లు వెళ్లిపోయాయి’’ అని ఫిన్లండ్‌లోని మోనియో జిల్లాకు చెందిన పశుపోషకుడు విలి కుర్కి (28) చెప్పారు.
‘‘జిల్లాలోని మధ్య ప్రాంతానికి చెందిన ధ్రువపు జింకలు దక్షిణం వైపు వెళ్లిపోయాయి. అయితే.. ఉత్తరం నుంచి వస్తున్న ధ్రువపు జింకలు మధ్య ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇది జంతువుల ప్రవాహంలా కనిపిస్తోంది’’ అని ఆయన అభివర్ణించారు.

ఫొటో సోర్స్, MAURI KURU
కొన్ని ధ్రువపు జింకలకు జీపీఎస్ ట్రాకర్లు అమర్చి ఉన్నాయి. కానీ అవి అన్నివేళలా పనిచేయవు. పనిచేసినా కూడా.. ఆ ట్రాకర్లు ఉన్న జంతువులు మంద నుంచి వేరైపోయి ఉంటాయి.
‘‘కాబట్టి.. మంచులో జింకల అడుగుజాడలను వెదుక్కుంటూ వెళ్లటమే అత్యుత్తమమైన మార్గం. కానీ గాలి, మంచు లోతుగా ఉండటం, కొత్తగా మంచు కురుస్తుండటం వల్ల ఈ పని కూడా కష్టమవుతోంది’’ అని స్వీడిష్ రీన్‌డీర్ హెర్డర్స్ అసోసియేషన్‌కు చెందిన అన్నా-కారిన్ స్వెన్సన్ చెప్పారు.
తప్పిపోయిన ధ్రువపు జింకలన్నిటినీ వెదికిపట్టుకుని, వెనక్కు తీసుకురావటానికి వారాలు పడుతుందని విలి కుర్కి తెలిపారు.
‘‘ఇందుకోసం చాలా దూరాలు బండ్లు నడుపుతూ తిరగాలి. కానీ ఇంధనం చాలా ఖరీదు ఉండటంతో ఈ పనికి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
లాప్‌లాండ్‌లో చలికాలంలో పచ్చికబయళ్లలో మేత మేయటం కష్టమైనపుడు ధ్రువపు జింకలు దారితప్పి దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్న ఇటువంటి ఘటనలు ఇటీవలి సంవత్సరాల్లో మరింత తరచుగా జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
‘‘కేవలం రెండేళ్ల కిందటే.. మూడు నార్డిక్ దేశాల్లోని ధ్రువపు జింకలకు చలికాలం చాలా విపరీతమైన, కష్టమైన పరిస్థితులను సృష్టించింది’’ అని ఫిన్లండ్ పరిశోధకుడు జోకో కుంపులా చెప్పారు.
‘‘మామూలుగా ఈ తరహా చలికాలాలు ప్రతి 30 ఏళ్లలో ఒకసారి కనిపిస్తాయి. కానీ వాతావరణ మార్పు కారణంగా ఇవి మరింత తరచుగా సంభవిస్తున్నట్లు కనిపిస్తోంది’’ అన్నారాయన.
అప్పుడు కూడా ధ్రువపు జింకలు తప్పిపోయాయని తెలిపారు. కొన్ని జింకల ఆచూకీని కనిపెట్టేసరికి, అవి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయని, జీర్ణసంబంధిత సమస్యలకు లోనయ్యాయయని చెప్పారు.
ఈ జంతువులు దక్షిణ దిశగా వెళ్లటానికి ఒక కారణం ఉందని ఫిన్నిష్ రీన్‌డీర్ హెర్డర్స్ అసోసియేషన్‌కు చెందిన మట్టి సర్కేలా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘తొలి మంచు కురిసిన తర్వాత వాతావరణం వేడెక్కటం మొదలవగానే.. ధ్రువపు జింకలు తమ ముక్కులు పైకెత్తి వేడిగాలి ఏ దిశగా వస్తుందో కనుక్కుంటాయి.
‘‘ఆ గాలి సాధారణంగా దక్షిణం నుంచి వస్తుంది. మేం వాటిని ‘బ్రిటన్ వేడి గాలులు’ అని పిలుస్తాం. ధ్రువపు జింకలు ఆ గాలులకు ఎదురు ప్రయాణించటం మొదలుపెడతాయి. అలా అవి దక్షిణం వైపు ప్రయాణిస్తాయి’’ అని ఆయన వివరించారు.
ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో.. కొందరు లాప్‌లాండ్ పశుపోషకులు తమ ధ్రువపు జింకలకు ఎక్కువ ఆహారం ఇవ్వటం ఆరంభించారు.
‘‘అవి స్వేచ్ఛగా సంచరించే జంతువులు. కాబట్టి తమ ఆహారాన్ని తామే వెదుక్కోవటానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ వాటి చలికాలపు పచ్చికబయళ్ల మీద గట్టి మంచు పొరలు ఏర్పడటం ఎక్కువవుతుండటంతో.. పశుపోషకులు తమ జంతువులకు చలికాలపు ఆహారం ఇవ్వటం ఆరంభించారు’’ అని నర్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ ఓస్టీన్ హోలండ్ వివరించారు.
‘‘చలికాలంలో ఈ ధ్రువపు జింకలు తిండి వెదుకుతూ తప్పిపోకుండా ఉండటానికి ఎండుగడ్డి, ఇతర అనుబంధ ఆహారాలు తినిపిస్తుంటారు’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










