మందుపాతరలను పసిగట్టే 'హీరో-ఎలుక' మగావా మృతి

గోల్డ్ మెడల్‌తో మగావా

ఫొటో సోర్స్, PDSA

ఫొటో క్యాప్షన్, గోల్డ్ మెడల్‌తో మగావా

ఈ ఎలుక పేరు మగావా. మందుపాతరల వాసన పసిగట్టడంలో దీనికి తిరుగులేదు. ఈ మూషికం సాహసానికి బంగారు పతకం కూడా లభించింది. కాంబోడియాలో వందకు పైగా మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను పసిగట్టి ఎన్నో ప్రమాదాలను నివారించిన మగాబా తన ఎనిమిదవ ఏట మరణించింది.

బెల్జియం స్వచ్ఛంద సంస్థ అపోపో ఈ ఎలుకకు మందుపాతరలు గుర్తించడంలో శిక్షణ ఇచ్చింది. మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను సురక్షితంగా తొలగించడంలో మగావా విశిష్టమైన సేవలు అందించింది. ఆఫ్రికాకు చెందిన పెద్ద జాతి ఎలుక గత వారాంతంలో ప్రశాంతంగా కన్నుమూసిందని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. చనిపోయే ముందు వరకు కూడా ఈ మగావా ఎప్పట్లానే ఉత్సాహంగా ఆడుకుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే, చివరి రోజుల్లో మాత్రం నిరాసక్తంగా ఏమీ తినకుండా ఉండిపోయిందని వారు తెలిపారు.

టాంజానియాలో పెరిగిన మగావా ఏడాది పాటు పేలుడు పదార్థాల వాసను పసిగట్టడంలో శిక్షణ పొందిన తరువాత కాంబోడియాలో విధుల్లో చేరింది. ఈ ఆగ్నేయాసియా దేశంలో ఇప్పటికీ దాదాపు 60 లక్షల మందుపాతరలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాంటి చోట మగావా 1,41,000 చదరపు మీటర్ల ప్రదేశంలో, అంటే దాదాపు 20 ఫుట్ బాల్ మైదానాలంత విశాలమైన ప్రదేశంలో మందుపాతరలను గుర్తించింది.

మామూలు ఎలుకలన్నా పెద్దగా ఉండే మగావా 1.2 కిలోల బరువుతో 70 సెంటీమీటర్ల పొడవు ఉండేది. అయితే, అది మందుపాతరలను పేల్చేంత బరువేమీ కాకపోవడంతో అది చకచకా పేలుడు పదార్థాలను గుర్తిస్తూ వెళ్లేది. ఇది టెన్నిస్ కోర్టు అంత నేలను 20 నిమిషాల్లో జల్లెడ పట్టేది. అదే పని మెటల్ డిటెక్టర్‌తో ఒక మనిషి చేయాలంటే ఒకటి నుంచి నాలుగు రోజుల దాకా పడుతుందని అపోపో తెలిపింది.

"ప్రాణాలు కాపాడేందుకు అంకితమైన" ప్రాణిగా మగావాకు 2020లో పీడీఎస్ఏ గోల్డ్ మెడల్ లభించింది. 77 ఏళ్ల చరిత్రలో ఈ అవార్డు అందుకున్న తొలి ఎలుక మగావా. వయసు మీద పడడంతో గత ఏడాది అది రిటైర్ అయింది. "మగావా లేని లోటు బాధాకరం. వాసన పసిగట్టడంలో దానికున్న అద్భుతమైన శక్తి వల్ల కాంబోడియా ప్రజలు ప్రాణభయం లేకుండా జీవించారు" అని అపోపో సిబ్బంది అన్నారు. హీరో ర్యాట్స్ అని పిలిచే ఈ మూషికాలకు అపోపో 1990 నుంచి మందుపాతరలను గుర్తించే శిక్షణను ఇస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)