ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో చెలగాటం ఆడుతున్నారా? ‘నా ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నంత వరకూ..’ వ్యాఖ్యలు ఎందుకు?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, @IMRANKHANINSTA

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశంలో అమెరికా వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నారా? దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి ఇటీవల కాలంలో బహిరంగంగానే వ్యక్తమవుతోంది. ఆదివారం ఇస్లామాబాద్‌లో ఆయన పశ్చిమ దేశాల దౌత్యవేత్తలపై విరుచుకుపడ్డారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించాలని గతవారం పాశ్చాత్య దౌత్యవేత్తలు ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. ఆ మేరకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఈ లేఖపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆదివారం పంజాబ్ ప్రాంతంలోని వెహారీలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈయూ దౌత్యవేత్తలపై విరుచుకుపడ్డారు.

"నేను ఎప్పుడూ పాకిస్తాన్‌ను తలవంచనివ్వలేదు. ఈనాటి వరకు ఇమ్రాన్ ఖాన్ ఎవరి ముందూ తలవంచలేదు. ఇన్షాఅల్లా నా ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నంత వరకు నా జాతిని ఎవరి ముందూ తలదించుకోనివ్వను. రష్యాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలని కోరుతూ యూరోపియన్ యూనియన్ నుంచి పాకిస్తాన్‌కు లేఖ రాశారు. భారతదేశానికి కూడా ఇలాంటి లేఖలే రాసారా అని ఈయూ రాయబారులను అడుగుతున్నాను.

నాటోకు పాకిస్తాన్ సహాయం చేసింది. వారికి మద్దతు ఇచ్చింది. నేనైతే అలా చేయను. కానీ, అప్పటి ప్రభుత్వం వారికి మద్దతు ఇచ్చింది. దీనివల్ల పాకిస్తాన్‌ను ఏం ఒరిగింది? 80 వేల మంది పాకిస్తానీయుల ప్రాణాలు కోల్పోయారు. మా గిరిజన ప్రాంతం నాశనమైంది. కోట్ల డాలర్లు నష్టపోయాం.

మీరు మాకెప్పుడైనా కృతజ్ఞత చూపించారా అని ఈయూ నాయకులను అడగాలనుకుంటున్నాను. కృతజ్ఞతలు చెప్పడానికి బదులు, అఫ్గానిస్తాన్‌లో ఓటమికి మమ్మల్ని బాధ్యులను చేశారు. కశ్మీర్‌లో భారత్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు, మీలో ఎవరైనా భారత్‌తో సంబంధాలు తెంచుకున్నారా? మీరు మాకు ఏది చెబితే అది చేయడానికి మేం మీ బానిసలమా?" అంటూ పాక్ ప్రధాని మండిపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

యుక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఓటింగ్‌‌కు పాకిస్తాన్ దూరం

ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతుంటే ర్యాలీకి హాజరైన జనం చప్పట్లు కొట్టారు.

పారంపర్యంగా పాకిస్తాన్ పశ్చిమ దేశాలకు మిత్రదేశమే. కానీ, యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఓటింగ్‌కు పాకిస్తాన్ దూరంగా ఉంది.

అలాగే, భారత్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

భారత్‌కు ఇది కొత్త కాదు. కానీ, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పాకిస్తాన్.. అమెరికా శిబిరంలో భాగంగా ఉంది. ఇప్పుడు పార్టీ మార్చేసింది.

రష్యా, యుక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించిన రోజే ఇమ్రాన్ ఖాన్ మాస్కో చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనకు అది సరైన సమయం కాదని పలువురు పాకిస్తానీయులు అభిప్రాయపడ్డారు.

"రష్యా యుక్రెయిన్‌పై దాడి చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించింది. ప్రపంచం మొత్తం రష్యా దాడిని వ్యతిరేకించింది. అలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించి, యుక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థిస్తున్నారా?" అంటూ పాకిస్తాన్‌లోని ప్రముఖ కాలమిస్ట్ ఫరూక్ సలీమ్ ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది

ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు

శుక్రవారం, పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఈయూ రాసిన లేఖ గురించి మాట్లాడుతూ, ఈ విధంగా బహిరంగ లేఖ రాయడం మామూలు ప్రాక్టీస్ కాదని అన్నారు.

"ఇమ్రాన్ ఖాన్ కొత్తగా అమెరికా, ఈయూలపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ, పశ్చిమ దేశాలను తన కంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరని గతంలో ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఆ దేశాలతో మెరుగైన సంబంధాలు నెరపగల పాకిస్తానీ నేనొక్కడినే అని కూడా అన్నారు. క్రికెట్ ఆడడం బాగా ఆలోచించడానికి ప్రత్యామ్నాయం కాదని రుజువయింది. పాకిస్తాన్ నేతలు అమెరికా వ్యతిరేక భావాలను రెచ్చగొడతారు. మరోవైపు, అమెరికా సహాయం కోరుతారు" అంటూ అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ట్వీట్ చేశారు.

"ప్లీజ్ ప్లీజ్.. చౌక ప్రజాదరణ కోసం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవద్దు. బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, పోలండ్, పోర్చుగల్‌లకు మనం 8 బిలియన్ల డాలర్ల (సుమారు రూ. 61,511 కోట్లు) ఎగుమతులు చేస్తాం. అమెరికాకు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,747 కోట్లు), రష్యాకు 277 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,129 కోట్లు) ఎగుమతులు చేస్తాం. మన దేశంలో ఎనిమిది కోట్ల శ్రామిక శక్తి ఎగుమతులపై ఆధారపడి ఉంది" అని ఫరూక్ సలీమ్ ట్వీట్ చేశారు.

"ఇమ్రాన్ ఖాన్ చేసిన మరో ద్వేషపూరిత ప్రసంగం ఇది. ప్రధానమంత్రి కార్యాలయంలో తన చివరి రోజుల్లో విషం చిమ్ముతున్నారు. ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి, అన్ని దౌత్య నిబంధనలనూ ఉల్లంఘిస్తూ నేడు ఈయూ, నాటోలపై బహిరంగంగా దాడి చేసి పాకిస్తాన్ సిగ్గుపడేలా చేశారు" అని ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, @IMRANKHANINSTA

"ఇమ్రాన్ ఖాన్ అమెరికా, ఈయూలను బెదిరిస్తున్నారు. అప్పులు చేసి బతికే వారికి ఎలాంటి ఆత్మగౌరవం ఉండదని ఆయన అంటున్నారు. కానీ, ఆయన పాకిస్తాన్‌ను దివాలా తీయించి అప్పుల ఊబిలోకి దింపారని మర్చిపోయినట్టున్నారు" అని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్)లో సీనియర్ ఫెలో సుశాంత్ సరీన్ అన్నారు.

"ఇమ్రాన్ ఖాన్ తన అమెరికా వ్యతిరేక భావజాల మూర్ఖత్వం నుంచి బయటకు రారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్క కాల్ కూడా చేయలేదు. అమెరికా నుంచి ఇంకెంత దూరం వెళ్లాలనుకుంటున్నారు ఆయన?’’ అంటూ పాక్ జర్నలిస్ట్ సిరిల్ అల్మెయిడా విమర్శించారు.

(రిపోర్ట్ - రజనీశ్ కుమార్)

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ అమ్మాయిలు ఎవరికీ కనిపించని భాగాల్లోనే టాటూలు వేయించుకుంటున్నారు ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)