రక్తాన్ని దానం చేయడంలో ఈ కుక్క ‘సూపర్ స్టార్’

వుడీ

ఫొటో సోర్స్, WENDY GRAY

గ్రేహౌండ్ జాతికి చెందిన ఒక శునకం ఆరేళ్లపాటు అరుదైన రక్తాన్ని దానం చేసి 88 శునకాలను రక్షించింది. అయితే, ఈ శునకం ఇప్పుడు రిటైర్ అయింది.

లీసెస్టర్‌షైర్‌లో మెల్టన్ మోబ్రేకు చెందిన ఈ కుక్క పేరు వుడీ. దీనికి మూడేళ్లు ఉండగా మొదటసారి రక్తదానం చేసింది. ఇప్పుడు దీని వయసు 9 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఈ శునకం 22 సార్లు రక్త దానం చేసింది.

"దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఈ శునకం సహాయం చేయడం అద్భుతమైన విషయం" అని దీని యజమాని వెండీ గ్రే అన్నారు.

450 మిల్లీలీటర్ల రక్తం నాలుగు శునకాలను రక్షించడానికి సహాయపడుతుందని యూకే పెట్ బ్లడ్ బ్యాంకు తెలిపింది. వుడీని సూపర్ స్టార్ అని ప్రశంసించింది.

ఈ గ్రే హౌండ్ల రక్తం సాధారణంగా నెగిటివ్ గ్రూపుకు చెందింది కావడంతో దీనికి డిమాండు ఎక్కువగా ఉంటుంది.

వీటి రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఏ కుక్కకైనా ఇవ్వవచ్చు. కేవలం 30 శాతం శునకాలకే ఈ విధమైన రక్తం ఉంటుందని లోబరోకి చెందిన స్వచ్చంద సంస్థ చెప్పింది.

వుడీ

ఫొటో సోర్స్, WENDY GRAY

వుడీకి 9 సంవత్సరాల వయసు రావడంతో ఇక పై రక్తదానాన్ని చేయలేదు.

రక్తాన్ని 1-8 సంవత్సరాల లోపు వయసు ఉన్న శునకాల నుంచి మాత్రమే సేకరిస్తారు.

వుడీ ఎప్పుడూ రక్తాన్ని సంతోషంగా ఇచ్చేదని గ్రే చెప్పారు.

రక్త దానం చేయడానికి వెళ్ళినప్పుడు గట్టిగా అరిచి, తనను కలవడానికి వచ్చిన వ్యక్తిని కలిసేందుకు పరుగు పెడుతూ వెళ్లేదని చెప్పారు.

రక్త దానం చేస్తున్నంత సేపూ టేబుల్ మీద నిదానంగా పడుకుని ఉండేదని, పూర్తయిన వెంటనే తనంతట తానే లేచేదని చెప్పారు.

"తనకు రక్త దానం చేయడం ఇష్టం. రక్త దానం చేసిన తర్వాత ప్రతికూల ప్రభావాలేవీ ఉండేవి కావు. అంతే కాకుండా, నాలుగు నుంచి 8 గంటల పాటు నడవడానికి కూడా సిద్ధంగా ఉండేది" అని చెప్పారు.

"అన్ని విషయాలనూ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. నాకు తనని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది" అని అన్నారు.

"మీ కుక్కకు రక్తం ఎప్పుడు అవసరమొస్తుందో మీకు తెలియదు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేసి, కొన్ని జీవితాలను కాపాడటం అద్భుతమైన విషయం" అని అన్నారు.

ఆమెకు తొలి పెంపుడు కుక్క రియోతో పాటు వెటర్నరీ క్లినిక్ కి వెళ్ళినప్పుడు పెంపుడు కుక్కలు కూడా రక్త దానం చేయవచ్చనే విషయం తెలిసిందని చెప్పారు. రియో కూడా 11 సార్లు రక్తదానం చేసినట్లు చెప్పారు.

"మనం ఈ పనిని చేయగలమనే విషయాన్ని నేను ఇష్టపడతాను. మనుషులు మనుషుల కోసం రక్తదానం చేసినప్పుడు, కుక్కలెందుకు కుక్కల కోసం చేయకూడదు?" అని ప్రశ్నించారు.

వుడీ

ఫొటో సోర్స్, WENDY GRAY

"వుడీ ప్రత్యేకమైన దాత" అని పెట్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది నికోల్ ఆస్బర్న్ అన్నారు.

"మనుషుల మాదిరిగానే, పెంపుడు జంతువులకు కూడా రక్తం చాలా ముఖ్యం. వుడీ చేసిన రక్త దానం దేశంలో ఇతర కుక్కల జీవితాలను కాపాడటంపై ప్రభావాన్ని చూపింది" అని అన్నారు.

"వుడీ ఒక దాతగా ఉండటాన్ని మేము గర్వపడుతున్నాం. వుడీ ఒక సూపర్ స్టార్" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)