మౌరీస్: కోర్టుకెక్కి కూత పెట్టే హక్కును సాధించుకున్న ఫ్రాన్స్ కోడిపుంజు మృతి

మౌరీస్ కోడిపుంజు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మౌరీస్

ఫ్రాన్స్‌లో పొద్దున్నే కూత పెట్టే హక్కును కోర్టులో కేసు నెగ్గి సాధించుకున్న కోడిపుంజు మౌరీస్ ఇటీవల చనిపోయింది. ఈ పుంజు వయసు ఆరు సంవత్సరాలు.

ఫ్రాన్స్ అట్లాంటిక్ తీరంలోని ఓలెరాన్‌ దీవిలో నివసించే ఈ కోడిపుంజు కూతతో ధ్వని కాలుష్యానికి కారణమవుతోందంటూ 2019లో నడిచిన ఆ కేసులో కేంద్ర బిందువుగా నిలిచిన మౌరీస్‌కు అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తింది.

ఫ్రాన్స్ గ్రామీణ ప్రాంతంలో సహజ ధ్వనుల సంరక్షణ ఉద్యమాలకు ఈ కోడిపుంజు ప్రతీకగా మారింది.

ఆ కేసు గెలిచిన మౌరీస్ ఓలెరాన్ దీవిలో ప్రశాంతంగా కాలం గడిపింది. అయితే ఈ కోడి పుంజు మే నెలలోనే చనిపోయిందని చెప్తున్నారు. ఆ వార్తను ప్రపంచానికి వెల్లడించటానికి దాని యజమాని ఇప్పటివరకూ నిరీక్షించారు.

‘‘లాక్‌డౌన్ వల్ల జనం ఇప్పటికే చాలా ఆందోళన పడుతున్నారు. అందుకే ఈ విషయం చెప్పి బాధపెట్టవద్దని అనుకున్నా’’ అని దాని యజమాని కోరీన్ ఫెసీ చెప్పినట్లు ఫ్రెంచ్ రేడియో నెట్‌వర్క్ ఫ్రాన్స్ బ్లూ పేర్కొంది.

‘‘మేం కొత్త కోడి పుంజును కొనుక్కున్నాం. దానికి కూడా మౌరీస్ అనే పేరు పెట్టాం. ఇది కూడా అంతే బాగా కూత పెడుతుంది. కానీ ఇది ఎన్నటికీ మా మౌరీస్ స్థానాన్ని భర్తీ చేయలేదు’’ అని ఆమె చెప్పారు.

మౌరీస్ ఆనాడు మొత్తం దేశం తరఫున కేసు గెలిచిందని యజమాని కొరీన్ దంపతులు హర్షం వ్యక్తంచేశారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మౌరీస్ ఆనాడు మొత్తం దేశం తరఫున కేసు గెలిచిందని యజమాని కొరీన్ దంపతులు హర్షం వ్యక్తంచేశారు

కోర్టులో కేసు గెలిచిందిలా...

ఓలెరాన్‌ దీవిలో సెలవులు గడపటానికి ఇల్లు కొనుక్కున్న ఒక పదవీ విరమణ చేసిన జంట.. తమ ఇంటి పక్కన నివసించే మౌరీస్ రోజూ ఉదయాన్నే కూతపెట్టటం తమకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు.

ఆ కోడి కూత వేయకుండా అదుపులో ఉంచాలని దాని యజమానులైన జాకీ ఫెసీ అతడి భార్య కోరీన్‌లను డిమాండ్ చేశారు. దీంతో మౌరీస్ పేరు ఫ్రాన్స్ అంతటా మార్మోగింది. ఫ్రాన్స్ జాతీయ చిహ్నాల్లో గ్యాలిక్ కోడి పుంజు కూడా ఒకటి.

మౌరీస్ హక్కును కాపాడాలంటూ వేలాది మంది పిటిషన్ల మీద సంతకాలు చేశారు. దీంతో ఆ పుంజు ఒక సెలబ్రిటీగా మారింది.

ఆ కేసులో కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినట్లయితే.. ఓలెరాన్‌లో 35 ఏళ్లుగా నివసిస్తున్న కోరీన్ ఫెసీ ఏదో విధంగా తన కోడి కూత పెట్టకుండా చేయటమో, అక్కడి నుంచి ఖాళీ చేయటమో చేయాల్సి వచ్చేది.

కానీ.. గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్పు చెప్పిన జడ్జి.. మౌరీస్‌, దాని యజమానుల పక్షాన నిలిచారు. మౌరీస్ యజమానులకు 1,100 డాలర్లు పరిహారం చెల్లించాలని కేసు వేసిన వారికి జరిమానా కూడా విధించారు.

‘‘ఇది నా పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరి విజయం. ఈ తీర్పు ఒక ఒరవడి సృష్టిస్తుందని నేను ఆశిస్తున్నా’’ అని కోరీన్ ఫెసీ ఆ సందర్భంగా పేర్కొన్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)