గుర్రంలో ప్రమాదకర బ్యాక్టీరియా... విషమిచ్చి చంపిన వైద్యులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారి పరిస్థితుల మధ్య యూపీ మేరఠ్‌లోని ఒక గుర్రానికి ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకిందని, దీంతో ఆ గుర్రానికి విషమిచ్చి చంపేశారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం ఈ గుర్రానికి గ్లాండర్స్ బ్యాక్టీరియా సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దానిని చంపడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు.
ఈ గుర్రం ఈ వ్యాధిని వ్యాప్తిచేసే అవకాశం ఉంది. అందుకే దానికి విషమిచ్చి చంపేసి, ఆ మృత కళేబరాన్ని 10 అడుగుల లోతైన గొయ్యిలో కప్పిపెట్టారు.
గుర్రానికి విషం ఇచ్చిన బృందం పీపీఈ కిట్ ధరించి ఈ పనిచేసింది. హస్తినాపూర్ ప్రాంతంలోని గణేష్‌పూర్ గ్రామంలో 12 రోజుల క్రితం ఈ గుర్రానికి గ్లాండర్స్ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
దీంతో ఆరోగ్య శాఖ ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల నుంచి గుర్రాల శాంపిల్స్ తీసుకొని పరీక్ష కోసం పంపింది. దీనిపై రిపోర్టు రావలసి ఉంది.
గ్లాండర్స్ అనేది గుర్రాలలో కనిపించే ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధిని నయం చేయడం అసాధ్యం. ఈ వ్యాధి జంతువులకు సోకితే అది ఆ తరువాత మనుషులకు, పక్షులకు సోకే అవకాశాలున్నాయి’’ అని ఆంధ్రజ్యోతి తన కథనంలో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
బిడ్డకు బీరు తాగించి.. తండ్రి జైలుపాలు..!
కేరళ కాసర్‌గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో ఓ తండ్రి తన కూతురుపై ప్రేమతో ఏకంగా బీరు తాగించాడని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
‘‘బీరు తాగిన బాలిక స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యింది. దాంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
హోస్‌దుర్గ్‌లోని తోయమ్మాల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ ఇంట్లో బీరు తాగుతూ తన ఎనిమిదేండ్ల కూతురుకు కూడా పట్టించాడు.
అయితే ఆ బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు.
బాలిక వాంగ్మూలం ఆధారంగా ఆమె తండ్రి రాధాకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి రెండు వారాల జైలుశిక్ష విధించింది. దాంతో పోలీసులు అతడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
'కరోనా వ్యాక్సీన్ కోసం వెళ్తే.. కుక్క కాటు టీకా ఇచ్చారు'
కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటు వ్యాక్సీన్ ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సీన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లారు.
పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్‌సీకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటి రేబిస్ వ్యాక్సీన్‌ను వేసిందని.. కోవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్ వ్యాక్సీన్ ఇచ్చిందని ప్రమీల ఆరోపించారు.
ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా.. ‘బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌లోకి కాకుండా, యాంటిరేబిస్ వ్యాక్సీన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు.
ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సీన్ వేయలేదు. టీటీ ఇంజక్షన్ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, EPA
ముంబయిలో వ్యాక్సీన్ పేరుతో సెలైన్ వాటర్ ఎక్కించారు
ముంబయిలోని ఓ హౌసింగ్ సొసైటీలో కరోనా వ్యాక్సీన్ పేరుతో సెలైన్ వాటర్ ఇచ్చి ఓ ముఠా ప్రజలను దోపిడీ చేసిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.
దీనికి సంబంధించి FIR నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితులందరికీ జులైలో యాంటీబాడీ పరీక్షలు చేయిస్తామని రాజేశ్ తోపే తెలిపారు. టీకా ఇవ్వలేదని తేలితే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి వారందరికీ రెండు డోసుల టీకా ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
మొత్తం 2,040 మంది ఈ కుంభకోణంలో బాధితులుగా ఉన్నారని మంత్రి తెలిపారు.
దుండగులు పక్క రాష్ట్రం నుంచి టీకా బాటిళ్లు తెప్పించి వాటిలో సెలైన్ వాటర్ నింపి ఉంటారని భావిస్తున్నామని మంత్రి చెప్పినట్లు అని వెలుగు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








