ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ నేతలు చెబుతున్నట్లు 'వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా' ఎగురుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిన ప్రతిసారి, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో గెలుపు సాధించినప్పుడు, కాషాయ పార్టీ లక్ష్యం ఇక తెలుగు రాష్ట్రాలేనా అనే చర్చ తరచూ వినిపిస్తుంటుంటుంది. అందుకు అనుగుణంగానే స్థానిక నాయకత్వం నుంచి కూడా రాబోయే ఎన్నికల్లో అధికారం సంపాదిస్తామంటూ ప్రకటనలు వెలువడుతుంటాయి.
తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న చర్చ మరోసారి మొదలైంది.
మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకునే అవకాశాలున్నాయా? రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు చెబుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికార శక్తిగా మారుతుందా?
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి బీజీపీకి ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా తెలంగాణకు చెందిన వారే. ఏపీలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఉన్నారు. అయితే, టీడీపీ తరఫున ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.

ఫొటో సోర్స్, @drlaxmanbjp
తెలంగాణలో బీజేపీ బలమెంత?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి రాజాసింగ్ ఎన్నిక కాగా, దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 వార్డులలో బీజేపీ 48 వార్డులలో విజయం సాధించించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన చివరి ఎన్నికల్లో 2 సీట్లు సాధించిన బీజేపీ, 2014లో 5 సీట్లు సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తక్కువ మందే ఉన్నా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తుంటారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయం తర్వాత ఇక తమ దృష్టి తెలుగు రాష్ట్రాల మీదే అని బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని అన్నారు. ''కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ హవా కొనసాగుతుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే తెలంగాణలో కూడా పునరావృతమవుతాయి'' అని అన్నారు.
ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు.
ఇటు అధికార తెలంగాణ రాష్ట్రసమితి నేతలు కూడా తమ ప్రతిపక్షం కాంగ్రెస్ కాదని, బీజేపీయేనన్న ధోరణిలో బీజేపీ నేతల విమర్శలకు సమాధానాలు ఇస్తుంటారు.
ఇటీవల ప్రధానమంత్రి హైదరాబాద్‌లో రామానుజాచార్య విగ్రహావిష్కరణకు వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి రాకపై చేసిన ట్వీట్ సంచలనం సృష్టించించింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధం జరుగుతోందన్న భావన కల్పించింది.
సమతామూర్తి విగ్రహాన్ని, అసమతా మూర్తి ఆవిష్కరించారని తన ట్వీట్‌లో మోదీపై వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేంద్రంలో మూడో ప్రత్యామ్నాయం దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం, ప్రధానమంత్రి పైనా, కేంద్రం విధానాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆ పార్టీ సీనియర్ నేతల ప్రకటనలు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్న భావనకు బలం చేకూర్చుతోంది.
కేంద్రంలో మోదీకి విజయాలు లభిస్తున్నప్పటికీ దక్షిణాదిలో, అందులోనూ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అధికారం సాధించే స్థాయికి చేరుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
''తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అన్న భావన కలిగించడం అధికార పార్టీ టీఆర్ఎస్‌కు కూడా ఎంతో ముఖ్యం. తద్వారా కాంగ్రెస్ పార్టీని స్క్రీన్ మీద లేకుండా చేయడం ఆ పార్టీ లక్ష్యం'' అని రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు బీబీసీతో అన్నారు.
అయితే, తెలంగాణలో బీజేపీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉన్నమాట వాస్తవమే అయినా, అది చాలా కొద్ది ప్రాంతాలకు పరిమితమైందని కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు.
''తెలంగాణ మొత్తంగా హైదరాబాద్ సహా నాలుగు నుంచి ఆరు జిల్లాల్లోనే బీజేపీకి ఓటు బ్యాంకు ఉంది. అది కూడా ముస్లింలు ఎక్కువగా ఉండే పాకెట్లలోనే బీజేపీకి మద్ధతు లభిస్తుంటుంది. మతపరంగా సున్నిత ప్రాంతాలలో హిందూ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంటుంది'' అని కృష్ణాంజనేయులు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలహీనతను గుర్తించి దెబ్బతీయడం, బీజేపీని రెచ్చగొట్టడం ద్వారా కాంగ్రెస్ పై నమ్మకం వదులుకున్న ఓటర్లను బీజేపీ వైపు మళ్లించి తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహమంటారు కృష్ణాంజనేయులు.
కాంగ్రెస్ బలంగా లేకపోవడం, రైతుబంధు, దళితబంధు లాంటి ప్రభుత్వ పథకాల వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి లాభం చేకూరుస్తాయని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం మీద దూకుడు పెంచి మాట్లాడుతున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేవలం విమర్శలకే పరిమితం కాగా, ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలోని బీజేపీ కార్యకర్తలు విమర్శలు, ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
''దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెహెచ్‌ఎంసీ ఎన్నికలు బీజేపీలో ఉత్సాహం పెంచింది వాస్తవం. వారి ఓటు బ్యాంకులో కూడా పెరుగుదల ఉన్నది నిజం. కానీ, వాళ్లు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం అని చెప్పుకోవడం మాత్రం అతిశయోక్తి'' అన్నారు కృష్ణాంజనేయులు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏంటి ?
అటు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దూకుడుగా వ్యవహరించే నాయకత్వం కూడా కనిపించదు. కేంద్రంలో అధికారంలో ఉండటం, బలమైన నాయకత్వం ఉన్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోరాడటంలో బీజేపీ నేతలు చురుకుగా ఉన్నట్లు కనిపించరు.
అయినా, దేశం మొత్తం మోదీ హవా నడుస్తోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ప్రకటన చేస్తుంటారు.
''రాబోయే రోజుల్లో ఏపీలో కూడా నాలుగు రాష్ట్రాల్లో జరిగిందే ఇక్కడా జరుగుతుంది. పేదలకు బియ్యం కోసం మోదీ ముప్పై మూడు రూపాయలిస్తున్నారు. నితిన్ గడ్కరీ వేయించిన రోడ్లు రయ్ రయ్ అంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్లను పట్టించుకోదు. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇచ్చిన నిధులు, పథకాల గురించి గ్రామ సభల్లో చెబుతాం. ఓటు కుండలను పక్కకు పెట్టి ఓటు బ్యాంకు సిద్ధం చేస్తున్నాం. ఏపీలోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి'' అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల గెలుపు సందర్భంగా ఏపీ బీజేపీ కార్యాలయం దగ్గర జరిగిన సంబరాలలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెడతామని అందులో భాగంగా ప్రజలకు మేం ఏం చేస్తాం అన్నది వివరిస్తామన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలు అంగీకరించాలన్నారు సోము వీర్రాజు.

ఫొటో సోర్స్, @BJP4Andhra
అయితే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామన్న సోము వీర్రాజు వ్యాఖ్యలను వైసీపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. ఇతర రాష్ట్రాలలో విజయాలతో అత్యుత్సాహంతో బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని కర్నూలు ఎమ్మెల్యే, వైసీపీ నేత హఫీజ్ ఖాన్ అన్నారు.
''క్యాడర్‌ని ఉత్తేజపరచడానికి ఇలాంటి మాటలు చెబుతుంటారు. ఏపీ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందో చెప్తే బాగుంటుంది. సీఎం జగన్ నేతృత్వంలో చేపట్టిన, చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. 85శాతం ప్రజలు వైసీపీనే కోరుకుంటున్నారనేది మేం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. సీఎం జగన్ అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తయితే వంద శాతం ప్రజలు మా వైపే ఉంటారు. ఇక గ్యాప్‌కు అవకాశం ఎక్కడుంది?'' అని హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు.
ఒక రాజకీయ పార్టీగా, జాతీయ పార్టీగా బీజేపీ అన్నీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకోవడంలో తప్పులేదనీ, కానీ ఏపీలో అధికారంలోకి రావడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని ఖాన్ అభిప్రాయపడ్డారు.
మతపరమైన పోలరైజేషన్ మీద ఆధారపడి ఓటు బ్యాంకు సృష్టించుకుంటుందని బీజేపీపై ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తుంటాయి. అయితే, మతం ప్రభావం ఉత్తరాదిలో ఉన్నంతగా దక్షిణాదిలో ఉండదని, అందుకే దక్షిణ రాష్ట్రాలలో బీజేపీ పుంజుకోలేకపోతోందన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే, తాము అభివృద్ధి పైనే దృష్టి పెడతామని బీజేపీ నేతలు అంటున్నారు.
''ఒక వర్గానికి అన్యాయం జరిగిందని భావించినప్పుడు వారివైపు నిలవడం తప్పుకాదు. కానీ, అభివృద్ధి పథకాలలో కులం, మతం, ప్రాంతం అన్న భేదాలు చూపించం'' అని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
అయితే, తెలుగు రాష్ట్రాలను పోల్చి చూసినప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
''2019లో ఏపీలో బీజేపీ ఓటు శాతం 0.82. నోటా వారికే తక్కువ. సరైన నాయకత్వం లేదు. పట్టించుకునే వారు లేరు. ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. బీజేపీ మీద ఏపీ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది'' అని రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు అన్నారు.
రాష్ట్రాన్ని విభజించిన కారణంగా కాంగ్రెస్ పై ఎంత ఆగ్రహం ఉందో, విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ మీద కూడా ఆగ్రహం ఉందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, JANASENA PARTY/FACEBOOK
కాపుల అంశం కలిసి వస్తుందా?
ఏపీలో గణనీయంగా ఉన్న కాపు ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, తద్వారా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల పార్టీల వైపు చీలిపోయిన ఓట్లను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీకి మద్దతు తెలిపారు. ఏపీ బీజేపీకి గతంలో, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు నేతలు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే.
''జనసేన, బీజేపీలు ఎంతవరకు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయన్నది రాబోయే ఎన్నికల్లో కీలకం కావచ్చు'' అని రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు.
''ఏమైనా, ఈ విజయం తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి టానిక్‌లాంటిది. ఏపీలో మేం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల దగ్గరకు వెళతాం. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటాం'' అని ఏపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.

ఏపీలో బీజేపీకి స్పేస్ ఉందా ?
ప్రత్యేక హోదాలాంటి విభజన హామీలు నెరవేర్చడంతోపాటు రాజధాని వ్యవహారం తేల్చడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వంటి చర్యలతో ఏపీ ప్రజలకు బీజేపీ దగ్గర కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
''ప్రత్యేక హోదా అనేది టెక్నికల్‌గా చట్టంలో లేని విషయం. అయితే, వేరే పేరుతో రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది'' అని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీకి త్వరలో లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం రావచ్చంటూ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారని గుర్తు చేస్తూ, "జగన్‌కు ఇబ్బందులు సృష్టించి, వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ఏపీలో స్పేస్ సృష్టించుకోవాలని చూడవచ్చు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర నాయకత్వం ఏం చేస్తోంది?
రాష్ట్ర స్థాయి నేతలే కాకుండా, దిల్లీలోని పార్టీ అధినాయకత్వం వైఖరి కూడా అలాగే కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో విజయం తర్వాత అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కొందరు జర్నలిస్టులతో ఏర్పాటైన సమావేశంలో, తాము దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నామని, కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే (2019) ఎన్నికల నాటికి పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షిణాదిలో గణనీయమైన ఓట్లు, సీట్లు సాధించడమే లక్ష్యమని అన్నారు.
కానీ, 2019లో అటు ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలోగానీ గణనీయమైన ఫలితాలను రాబట్టలేకపోయింది బీజేపీ. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో కొంత వరకు మెరుగైన ఫలితాలు సాధించినా, అధికారం చేపట్టలేదు. కేరళలో కూడా ఆ పార్టీ సీట్లు సాధించలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
- షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్: ‘నేను వార్న్‌కు కీపింగ్ చేయలేను’ అంటూ గ్లోవ్స్ విసిరికొట్టిన కీపర్.. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు కీపర్లు
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











