షాద్‌నగర్: ‘చదువు లేకపోతే బతకలేను... అందుకే చనిపోతున్నా’ - ఐశ్యర్య

ఐశ్వర్య ఆత్మహత్య
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆ అమ్మాయికి ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌ కొనే సామర్ధ్యం లేదు. దీంతో, సోనూసూద్ అందరికీ సాయం చేస్తున్నారని వార్తల్లో చూసి ఆయనకు ఈమెయిల్ రాసింది. ట్విట్టర్‌లో కేటీఆర్‌కు రిక్వెస్ట్ పెట్టింది. ఒక ల్యాప్‌టాప్‌ కావాలని. తాను రాసింది కరెక్టా తప్పా, అందులో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని స్నేహితులకు చూపించి సరిచేసుకుంది. మన అప్పుల గురించి రాయి అందులో అంటే, ''వద్దు, ఉన్నదే రాయాలి. నాకు ల్యాప్‌టాప్‌ చాలు. నాకంటే లేని వాళ్లకు కూడా సాయం అందాలి కదా. పేద విద్యార్థులు అందరికీ హెల్ప్ రావాలి కదా. నాకు ల్యాప్‌టాప్‌ వస్తే చాలు'' - ఇది తల్లితో ఐశ్వర్య చెప్పిన మాటలు.

లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు ఫోన్‌లో వినడం కష్టంగా ఉండడంతో ల్యాప్‌టాప్‌ కోసం ఐశ్వర్య చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి. ఆమెకు అంత ఆర్థిక సమస్యలు ఉన్నా, తనకెంత అవసరమో, ఏమి అవసరమో అంత వరకే కోరింది తప్ప, అదనంగా తనకేమీ వద్దనకుంది.

డబ్బు లేకపోయినా నిజాయితీ ఉంది.. ప్రతిభకు తగ్గ ఆశయం ఉంది.. ఆశయానికి తగ్గ పట్టుదలా ఉంది.. కానీ ఎత్తుపల్లాలను తట్టుకునే గుండె నిబ్బరాన్నే… ఓ బలహీన క్షణంలో కోల్పోయింది ఐశ్వర్య.

ఐశ్వర్య ఆత్మహత్య

హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షాద్‌నగర్ పట్టణంలో నవంబర్ 2 రాత్రి తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది గంటా ఐశ్వర్యా రెడ్డి. ఆమె చనిపోయిన వారం తరువాత ఇమె మరణం వార్తల్లోకెక్కింది.

సుమారు 70-80 గజాల స్థలంలో రెండే గదులతో, బయట బాత్రూంతో ఉన్న చిన్న ఆ డాబా ఇంటి దగ్గర బాగా హడావిడి ఉంది. ఆ ఇంటివాళ్లను మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. స్వచ్ఛంద సంస్థల వారూ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి సంఘాలూ, అగ్ర కుల పేదల సంఘాలూ వచ్చి పరామర్శించి భరోసా ఇచ్చాయి. ఈమె కేసును ముందు నుంచీ ఎస్ఎఫ్ఐ వారు ప్రత్యేకంగా ఫాలో అప్ చేస్తున్నారు.

ఐశ్వర్య తండ్రి గంటా శ్రీనివాస రెడ్డి మెకానిక్. తల్లి సుమతి ఇంట్లోనే టైలరింగ్ చేస్తారు. ఐశ్వర్య చిన్నప్పటి నుంచీ బాగా చదివేది. ఇంటర్ రెండేళ్లూ పైసా తీసుకోకుండా ఉచితంగా చదివించారు స్థానిక విజ్ఞాన్ కాలేజీ వారు. ఆమె ఇంటర్ మార్కులు చూసిన మహబూబ్ అనే తెలిసిన వ్యక్తి, దిల్లీలో ప్రతిష్టాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీ గురించి చెప్పి, ఆమెను అక్కడ డిగ్రీలో చేర్పించడానికి సహకరించారు. సివిల్స్ లక్ష్యంగా దిల్లీ కేంద్రంగా తయారవాలనుకుంది ఐశ్వర్య. ఎంపీసీ చదివిన వారంతా ఇంజినీరింగ్ వైపు వెళ్తోన్న రోజుల్లో, బీఎస్సీ ఆనర్స్ మేథిమెటిక్స్ ఎంచుకుని దిల్లీ కాలేజీలో చేరింది ఐశ్యర్య.

ఐశ్వర్య ఆత్మహత్య

సివిల్స్ లక్ష్యం... కానీ, ఆర్థిక సమస్యలు

ఐశ్వర్యకు సివిల్స్ పైనే గురి ఉండేది. డిగ్రీ మొదటి ఏడాది నుంచే ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబులో సివిల్స్ మాక్ ఇంటర్వ్యూలు చూసేది. సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలు కొనడానికి డబ్బులు చూసుకోవాలంటూ ఇంట్లో చెప్పేది. డిగ్రీ వరకూ ఎంత ఖర్చు, డిగ్రీ అయ్యాక సివిల్స్ కోచింగుకు ఎంత ఖర్చు, ఆ ఖర్చు ఎలా ఏర్పాటు చేసుకోవాలంటూ లెక్కలు వేసుకునేది.

దిల్లీలో ఈమె చదువుకు ఎంతో కష్టపడి డబ్బు సమకూరుస్తున్నారు ఐశ్వర్య తల్లితండ్రులు. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌ కొనడం వారికి కష్టంగా ఉంది.

ఐశ్వర్య ఆత్మహత్య

మొదటి ఏడాది కాలేజీ హాస్టల్ దొరికింది. కానీ కాలేజీ నిబంధనల ప్రకారం రెండో ఏడాది నుంచి హాస్టల్ ఇవ్వరు. ఆ విషయం ఏడాదిన్నర క్రితం హాస్టల్‌లో చేరినప్పుడే చెప్పారు. దీంతో దిల్లీలో బయట రూములో ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఐశ్వర్య ఆలోచించేది.

తన లక్ష్యం అయిన సివిల్స్ చేరుకోవాలంటే, డిగ్రీ తరువాత కొంత కాలం పాటూ కోచింగు తీసుకోవాలి. అప్పుడు కోచింగు ఫీజు ఎలా అనే సమస్య వేధించేది ఆమెను.

''దిల్లీ పంపడానికి, ఎల్లుండి ప్రయాణం అనగా, ఒకరోజు ముందు 80 వేల రూపాయలు అప్పు తెచ్చి, బంగారం పెట్టి పంపించాను. వచ్చే ఏడాది నుంచి మరింత ఖర్చు అనే మాటలు వచ్చాయి. నేను ఎలాగోలా తెస్తాను. బంగారం ఉంది. అమ్మేసి తెస్తాను. ల్యాప్‌టాప్‌ కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. డిగ్రీ వరకూ ఏ ఇబ్బందీ లేకుండా చదివిస్తాం అని చెప్పాను'' అన్నారు ఐశ్వర్య తల్లి సుమతి.

ఐశ్వర్య ఆత్మహత్య

''ఇక డిగ్రీ తరువాత సివిల్స్ కోచింగు కోసం, ఇంటిపై అప్పు తీరింది పోగా, అవసరమైతే, ఇల్లు అమ్మేస్తాం. నువ్వు కోచింగుకు వెళ్లు. ఉద్యోగం రాకపోయినా ఫర్లేదు. ఇంటర్వ్యూలో నలుగురి ముందూ కూర్చో అని చెప్పాను. ఆమె తెలివైంది. సివిల్స్ కాకపోయినా ఏదో ఒక ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది అని నాకు తెలుసు'' అన్నారు సుమతి. ఐశ్వర్య కూడా తాను ఇంటర్వ్యూ వరకూ వెళ్లగలనని ఎంతో నమ్మకంతో చెప్పేది.

ఇల్లు మాత్రం అమ్మవద్దని తల్లితో చెప్పేది ఐశ్వర్య. ''బంగారం, ఇల్లు అమ్మవద్దు. కావాలంటే మీరే మరింత కష్టపడి, ఎక్కువ సంపాదించండి కానీ ఇల్లు అమ్మవద్దు అనేది'' అంటూ చెప్పుకొచ్చారు ఆమె తల్లి.

''ఇల్లు కచ్చితంగా అమ్ముతాను. నువ్వు ఆఫీసర్ అయ్యే కోరిక తీర్చాలి. నువ్వు ఆఫీసర్ అయితే ఇలాంటివి పది ఇళ్లు కొనుక్కోవచ్చు'' అని కూతురితో చెప్పారు సుమతి.

''ఆన్‌లైన్‌ క్లాసులు మొదలైనప్పటి నుంచీ ల్యాప్‌టాప్‌ అడుగుతోంది. డెబ్బై వేల రూపాయలు పెట్టి మంచి ల్యాప్‌టాప్‌ కొంటే ఎక్కువ కాలం మన్నుతుంది అని చెప్పంది. మంచి ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ ఎలాగోలా కొంటాను అని చెప్పాను'' అని సుమతి వివరించారు.

ఈలోపే వరంగల్ స్నేహితుల వద్దకు వెళ్లిన ఐశ్వర్యకు ఎడ్యుకేషన్‌లోన్ గురించి తెలిసింది. ఆ విషయం గురించి కూడా తల్లితో మాట్లాడింది. కానీ డబ్బు సంగతి తాను చూసుకుంటానని, తనకు వదిలేయమని అన్నారు తల్లి.

ఫీజు కట్టలేక రెండో అమ్మాయిని ప్రైవేటు స్కూలు నుంచి ప్రభుత్వ స్కూలుకు మారుద్దాం అనుకున్నారు. కానీ ఆ ప్రైవేటు స్కూల్‌లో టీసీ కోసం ఏడు వేల రూపాయలు కట్టాల్సి రావడంతో, చిన్నామెను ఆ కుటుంబం స్కూల్‌కు పంపలేదు. ఆమె 8వ తరగతి దగ్గర చదువు ఆపేసింది. ఆమెకు కూడా చదువు విషయంలో మరీ అంత పట్టుదల లేకపోవడంతో ఇబ్బంది కాలేదు. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటోంది.

ఐశ్వర్య ఆత్మహత్య

ఎలా జరిగింది?

ఐశ్వర్య ఫ్రెంచి భాష నేర్చుకుంటోంది. అందుకోసం ఫ్రెంచ్ సినిమాలు చూస్తోంది. తెల్లారి ఆలస్యంగా లేవడం అలవాటు. ఇంట్లో వాళ్లు కూడా బాగా చదివే కూతురికి ఇంటిపని ఏమీ చెప్పారు. ఆమెను వీలైనంత సౌకర్యంగా చూసుకుంటున్నారు. రోజంతా ఆ గదిలో ఆన్‌లైన్‌ క్లాసులు వినడం, వివిధ ఆన్‌లైన్‌ సెషన్లకు హాజరవడం, ఖాళీ సమయాల్లో ఫ్రెంచి భాష నేర్చుకోవడం, ఫ్రెండ్స్‌తో చాటింగ్.. ఇదే ఆమె రోజూవారీ పని.. ఇంట్లో వాళ్లు అన్నం పట్టుకెళ్లి ఇస్తే తింటూ క్లాస్ వినేది. బయట ఏం జరిగినా ఆ గది నుంచి ఆమె బయటకు వచ్చేది తక్కువ.

వరంగల్‌కు చెందిన ఒకమ్మాయి ఐశ్వర్య మంచి ఫ్రెండ్స్. అక్టోబర్ చివర్లో ఆమె ఇంటికి వరంగల్ వెళ్లి, తిరిగి నవంబర్ 1 ఆదివారం మధ్యాహ్నానికి షాద్ నగర్‌లోని తమ ఇంటికి వచ్చింది ఐశ్వర్య.

''వచ్చినప్పుడు సంతోషంగానే ఉంది. ఇంటికి వచ్చి డాన్స్ కూడా చేసింది. 'ఆంటీ (వరంగల్ ఫ్రెండ్ తల్లి) స్టడీ లోన్ గురించి చెప్పారు. తను లోన్ విషయంలో సాయం చేస్తామన్నారు. అది తీసుకుందాం. రెండు లక్షల రూపాయలు పెట్టి మన అప్పులు తీరుస్తా. మిగతా మూడు లక్షలూ చదువుకు దాచుకుంటాను అంది'' అని చెప్పారు ఐశ్వర్య తల్లి సుమతి.

ఆ తరువాత తల్లీ కూతుళ్లకూ చిన్న వాగ్వివాదం జరిగింది. తన చదువుకు ఇప్పటి వరకూ ఎంత ఖర్చు అయిందన్న లెక్కలు వచ్చాయి. దిల్లీకి ప్రయాణాలు, అడ్మిషన్ సమయంలో దిల్లీలో 15 రోజులు ఉండటం, కాలేజీ ఫీజులు, మధ్యలో ప్రయాణాలు.. ఇలా ఎంతెంత ఖర్చయిందో వివరంగా చెప్పింది తల్లి. తల్లీకూతుళ్లు ఎదురెదురుగా కూర్చుని కస్టమర్ల చీరలకు ఫాల్స్ కుడుతూనే ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఘాటైన సంభాషణ జరిగింది. తరువాత అమ్మాయి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎప్పట్లాగే సినిమాలు చూసింది. అన్నం తిన లేదు. తినమని ఇంట్లో వాళ్లూ అడగలేదు.

ఐశ్వర్య ఆత్మహత్య

మర్నాడు తల్లి లేపితే లేచింది. తల్లీకూతుళ్ల మధ్య ఇంకా సయోధ్య కుదర్లేదు. మామూలుగా తిట్టుకున్న గంటలో కలసిపోతారు. కూతురు గురించి అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఆ తల్లి. కానీ ఈసారి ఇద్దరూ పంతంతో ఉన్నారు. ఇంట్లో పెంచుకుంటోన్న కుక్కను కొట్టింది తల్లి. ఆ కుక్కను కూడా గదిలోకి తీసుకుపోయింది కూతురు. భోజనం చేయలేదు. సుమతి అడగలేదు. ఐశ్వర్య తినలేదు.

రాత్రి ఏడు గంటలు అవుతోంది. ఇంట్లో వాళ్లు అన్నం తినమంటే వద్దంది. తండ్రి వచ్చాడు. బయటి ఫుడ్ తెస్తానంటే ఐశ్వర్య వద్దంది. తండ్రికి కామెర్లు అని తెలియడంతో యూట్యూబ్ చూసి జాగ్రత్తలు, పథ్యం నియమాలూ చెప్పింది. కూతురు తినలేదు కాబట్టి, తానూ అన్నం తినబోనని కూర్చున్నాడు తండ్రి. దీంతో తనే అన్నం కలిపి తండ్రికి కొన్ని ముద్దలు తినిపించింది. తరువాత లోపలి గదిలోకి వెళ్లిపోయింది.

లోపల అలికిడి లేదు. ఎందుకో చిన్న కూతురు వైష్ణవికి సందేహం వచ్చింది. లోపలికి వెళ్లి చూడనా అని తల్లిని అడిగింది. వద్దంది తల్లి.

కింద పడుకునే చాప కోసం పది నిమిషాల తరువాత లోపలకి వెళ్లింది చిన్న కూతురు వైష్ణవి. అప్పటికి ఐశ్వర్య ఫ్యానుకు వేలాడుతోంది.

''ఆటో కోసం పరిగెట్టాం. కింద పడుకోబెట్టారు. కళ్లు తెరిచినట్టనిపించింది. చెంపలు కొట్టాం. ఇదంతా అబద్ధం అయితే బావుండు అనుకున్నాం'' అంటూ బాధపడ్డారు ఆమె తల్లి సుమతి.

ఐశ్వర్య ఆత్మహత్య

ఆత్మహత్య లేఖలో ఏముంది?

ఫోర్ రూల్ నోట్‌బుక్‌లో చాలా పొందికగా రాసింది ఐశ్వర్య.

''నేను చావడానికి ఎవరూ కారణం కాదు. నా వల్ల మా ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయి. నేను భారం వాళ్లకి. నా చదువు భారం. నేను చదువులేకపోతే బతకలేను. నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. నాకు చావే కరెక్టు అనిపించింది. నేను చచ్చినందుకు సంబంధాలు అంటగడతారు. కానీ, నేను ఏ పాపం ఎరుగను. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ కనీసం ఒక సంవత్సరానిది వచ్చేలా చూడండి. అందరూ నన్ను క్షమించండి. నేను మంచి కూతుర్ని కాదు'' అని రాసి 'ఐశ్వర్య' అని ఇంగ్లీషులో సంతకం పెట్టింది.

ఎవరిని అడగాలో తెలియలేదు: తల్లి

సాధారణంగా బాగా చదువుకునే పేద విద్యార్థులకు సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తుంటారు. కానీ ఐశ్వర్య కుటుంబం అలాంటివారెవరినీ సంప్రదించలేకపోయింది.

''మాకెవరూ తెలియదు. నలుగురు తెలిస్తే వెళ్లి అడిగేవాళ్లం. ఎవరి దగ్గరకు పోవాలి, ఎట్లా అడగాలో తెలియదు. తెలిసిన వాల్లు వాట్సప్ లో పెట్టి హెల్ప్ అడుగుతాను అంటే, మా పాప ఫోటో అందరికీ వెళ్తుంది, పరువు పోతుంది, వద్దు అన్నాను. పెద్దవాళ్ళెవరి దగ్గరకు అయినా తీసుకెళ్లి హెల్ప్ చేయించు అన్నాం'' అన్నారు ఆమె తల్లి సుమతి.

''మా అమ్మాయీ, మా అక్క. కూతురూ కలసి స్థానిక ఎమ్మల్యే దగ్గరకు వెళ్తాం అన్నారు. మనల్ని రానిస్తారా అని అన్నాను. తరువాత అమ్మాయి ట్విటర్‌లో కేటీఆర్‌కు, ఈమెయిల్ ద్వారా సోనూ సూద్‌కు ల్యాప్‌టాప్‌ కోసం రిక్వెస్టులు పంపింది. అందులో కూడా అప్పులు, కుటుంబ సమస్యలు చెప్పడం కాకుండా, కేవలం ల్యాప్‌ట్యాప్ వరకే వస్తే చాలు అనుకుంది'' అంటూ వివరించారు తల్లి.

''స్కాలర్‌షిప్ కోసం బ్యాంకు అకౌంట్ తీయాలి... ఇక రా అని ఫోన్ చేసి ఒత్తిడి చేసి పిలిపించాను. బహుశా ఆమెను వరంగల్ నుంచి పిలిపించకపోయినా బావుండేదేమో'' అంటూ బాధపడ్డారు ఐశ్వర్య తల్లి సుమతి.

అయితే, ఆ కుటుంబానికి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా, ఈమె చదువు విషయంలో ఏ లోటూ లేకుండా చూసుకుంటూ వచ్చారు. ఆమె చదువుకు డబ్బు ఎప్పుడూ ఆటంకం కాలేదు. దిల్లీ ప్రయాణాలూ, అక్కడ ఫీజులూ అన్నీ టైం ప్రకారమే జరిగిపోయాయి.

భవిష్యత్తులో కూడా ఆమె చదువుకు ఢోకా లేదన్న భరోసా కుటుంబం ఇచ్చింది. కానీ చనిపోవడానికి ముందు రోజు ఇంట్లో జరిగిన గొడవ ప్రభావం, ఆ ఇంటి కుటుంబ పరిస్థితులు ఆమెపై ఎక్కువ ప్రభావం చూపాయి. ఆమె ఎంత హడావుడిలో ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే, తన ఉరి వేసుకున్న గదిలో తలుపు గడియ కూడా పెట్టుకోలేదు. కుటుంబ సభ్యులూ ఆమెను గమనించలేదు.

line

మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యులను సంప్రదించండి. One Life +91 7893078930, Roshni Trust: +91 40 6620 2000, +91 40 6620 2001, Makro Foundation - Suicide Prevention Helpdesk +91 040 46004600లను సంప్రదించండి.

line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)