బీజేపీ: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ చారిత్రక విజయానికి 6 కారణాలు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''భారతీయ జనతా పార్టీ అనేక అంశాలపై పనిచేస్తోంది. కేవలం అది ఒకే అజెండాపై నడిచే పార్టీ కాదు. పాలనపై దృష్టి సారిస్తుంది. భద్రత, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలను తమ వైపు తిప్పుకుంది. వీటితో పాటు సోషల్ ఇంజినీరింగ్‌పై కూడా పనిచేస్తోంది. వీటన్నింటి ఫలితమే ఓవరాల్‌గా నాలుగోసారి (2014, 2017, 2019, 2022) బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.''
ఇదంతా బీజేపీ పనితీరును నిశితంగా పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ అభిప్రాయం.
''యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అయిదేళ్లు పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు'' అని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు చెబుతున్నారు. దీని వెనుక ఉపాధి కల్పన వంటి కీలక అంశాలు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్‌కు రెండోసారి అధికారం రావడానికి దోహదపడిన 6 కారణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. ముందస్తు వ్యూహరచన
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ గురించి నిపుణులు ఒకే మాట చెబుతున్నారు. ఎన్నికలకు చాలాకాలం ముందే బీజేపీ వాటికి సంబంధించిన సన్నాహాలు, వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందని వారు విశ్లేషిస్తున్నారు.
''ఎన్నికలకు సమీపించగానే మిగతా పార్టీలు సన్నాహకాలు మొదలుపెడుతుంటే, బీజేపీ మాత్రం అప్పటికే తమ వ్యూహాలను కొన్నింటిని అమల్లోకి తెస్తుంది. అఖిలేశ్ యాదవ్ కూడా ఆలస్యంగా ఎన్నికల బరిలో దిగారు'' అని ప్రదీప్ సింగ్ చెప్పారు.
''సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం బీజేపీకి కలిసొస్తుంది. రైతుల ఉద్యమం తమకు నష్టం కలిగించే అవకాశమున్నట్లు భావించిన వెంటనే కేంద్ర నాయకత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది.''
''కులాల మధ్య సమతుల్యాన్ని పాటించడంలో బీజేపీ ఏ అవకాశాన్ని వదల్లేదు. వారు అప్నాదళ్‌నూ వదల్లేదు. నిషద్ పార్టీని దగ్గరకు తీసుకున్నారు.''
''బీజేపీ ఎన్నికల్లో అనేక అంశాలపై పోరాడుతుంది. చివరవరకు పోరాటం ఆపదు. గెలవడం కోసమే పోరాడుతుంది. వారి పోరాటంతో సమానంగా హిందుత్వ అంశం కూడా కొనసాగుతూనే ఉంటుంది'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, PUNEET BARNALA/BBC
2. హిందుత్వ అజెండా
ఈ ఎన్నికల్లో హిందుత్వ అంశం కూడా కీలక పాత్ర పోషించింది. హిందువుల ఐక్యత, రామ మందిరం వంటి అజెండాలపై బీజేపీ ఎప్పటినుంచో పనిచేస్తోంది. హిందువులు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కూడా సంఘ్ వ్యూహాల్లో ఒకటి.
సీనియర్ జర్నలిస్ట్ పూర్ణిమా జోషి కూడా ఈ విషయంపై మాట్లాడారు. ''హిందువులు అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావాలనే తమ అజెండాకు మాయావతి పార్టీ, లోక్‌దళ్, అఖిలేశ్ యాదవ్‌లు ఆటంకం అని సంఘ్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో వారికి ఒక అడ్డంకి తొలిగిపోయింది. దళితపార్టీల అడ్డును వారు తొలిగించుకున్నారు. ఆ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో ఉదాసీననతో పోటీకి దిగాయి'' అని అన్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఒక ప్రకటన చేశారు. ఎన్నికల్లో మాయావతి పార్టీ గట్టిపోటీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఆ మాటల అర్థం ఏంటి?
దీనిపై పూర్ణిమ స్పందించారు. ''మొదట ముస్లిం ఓట్లను చీల్చాలని, తర్వాత దళితుల ఓట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి వెళ్లకుండా నిరోధించాలని ఆయన అనుకున్నారు'' అని పూర్ణిమ అభిప్రాయపడ్డారు.
''ఎస్పీ ఓట్ల శాతంలో పెరుగుదల కనిపిస్తోంది. అంటే వారు ఇతరుల ఓట్లను తమవైపు తిప్పుకున్నారు. ఓబీసీలోని ప్రముఖ కులాలను ఆకర్షించడంలో అఖిలేశ్ సఫలమైనట్లు అనిపిస్తోంది. కానీ దళితుల ఓట్లు చాలావరకు బీజేపీ వెళ్లడం గమనించాలి.''

ఫొటో సోర్స్, ANI
కానీ బీజేపీ సీట్ల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ రామ్‌దత్తా త్రిపాఠి మాట్లాడారు. ''నిజంగానే సీట్ల సంఖ్య తగ్గింది. కానీ బీజేపీ ఓటు శాతం పెరిగింది'' అని అన్నారు.
సీఎస్‌డీఎస్ ఎన్నికల విశ్లేషకులు సంజయ్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభ్యర్థుల విజయానికి, ఓట్ల శాతాన్నే తాను పరిగణలోకి తీసుకుంటానని... వాటి ప్రాతిపదికగానే తన విశ్లేషణ సాగుతుందని ఆయన చెప్పారు.
''ఎన్నికల్లో బీఎస్పీ క్రియాశీలంగా పాల్గొనలేదు. అందుకే వారి ఓట్లు చీలిపోయి, బీజేపీ లాభపడింది'' అని రామ్‌దత్త అన్నారు.
3. శాంతి భద్రతలు
అలీఘర్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ''గతంలో ఉత్తరప్రదేశ్ అంటే నేరాలమయంగా ఉండేది. మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్లకు భద్రత ఉండేది కాదు. కనీసం గేదెలు, ఎద్దులకు కూడా రక్షణ లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు'' అని ఉపన్యసించారు.
భద్రత అంశానికి బీజేపీ పెద్దపీట వేసేందుకు ప్రయత్నించింది. యూపీలో శాంతి భద్రతల గురించి స్వయంగా ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. ''ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో గూండాలు, మాఫియా పాలన నడిచింది. కానీ ఇప్పుడు వారంతా కటకటాల వెనక ఉన్నారు. అవినీతిపరులకు ప్రభుత్వాన్ని అప్పగించారు. ఈరోజు యోగి జీ సర్కారు పూర్తి నిజాయితీతో యూపీని అభివృద్ధి వైపు నడిపిస్తోంది'' అని మోదీ అన్నారు.
''నిస్సందేహంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది చాలా పెద్ద అంశం. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కే దక్కాలి. శాంతి భద్రతలతో పాటు కేంద్ర సర్కారు పథకాలు విజయంలో ముఖ్యంగా వ్యవహరించాయి'' అని సీ-ఓటర్స్ కంపెనీకి చెందిన యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
4. మహిళల ఓట్లతో పాటు శౌచాలయాల పథకం
''బుల్డోజర్ బాబా అనే ఇమేజ్ కచ్చితంగా ప్రభావం చూపించింది. అలాగే రాష్ట్రంలో శౌచాలయాల నిర్మాణం కూడా తనదైన పాత్ర పోషించింది'' అని యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.
''దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాల్లో అధిక భాగం సాయంత్రం లేదా తెల్లవారుజామున కాలకృత్యాల కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్తోన్న వారిపైనే జరుగుతున్నాయి. శౌచాలయాలను నిర్మించడం పరిశుభ్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు మహిళల పరంగా వారి భద్రతకు, గుర్తింపునకు సంబంధించిన అంశం.''
''ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకునే మహిళలు ఓట్లు వేస్తారు. వారికి ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి పురుషులా? మహిళలా? అనే దానిపై ఎలాంటి పట్టింపు ఉండదు. ఉత్తరాఖండ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే కనబడుతుంది. ఉత్తరాఖండ్‌లో ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన తర్వాత కూడా బీజేపీ ఆధిక్యమే కనబడుతోంది. కానీ స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రే ఎన్నికల్లో ఓడిపోయారు. దీని అర్థం ఏంటి?''
''ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై అక్కడి ప్రజల్లో కోపం ఉంది. అందుకే అక్కడ బీజేపీ సీట్ల సంఖ్య తగ్గిపోయింది, ఎస్పీ సీట్ల సంఖ్య పెరిగింది. ఈ అంశాన్ని పక్కనబెడితే, అక్కడ మోదీ చరిష్మాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ప్రభావం చూపించాయి.''
''ఉదాహరణకు గోవాను చూడండి. అక్కడ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మణిపుర్‌లో 5 ఏళ్ల క్రితం బీజేపీ రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు నంబర్‌వన్‌గా ఎదిగింది. బీజేపీ ఈ ప్రయాణంలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి'' అని యశ్వంత్ వివరించారు.
5. లబ్ధిదారుల పథకాలు
2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం, ఆయన ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంతో ముడిపడి ఉంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పెద్ద ప్రయోజనం కలిగింది. మోదీ ప్రభుత్వానికి మహిళల మద్దతు పెరగడానికి ఈ పథకమే కారణమని చాలామంది నిపుణులు అభిప్రాయపడతారు.
2019 ఎన్నికలతో పాటు అంతకంటే ముందు అస్సాం, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి.
''రేషన్ పథకం కారణంగా యూపీ ప్రజల్లో... ప్రధాని మోదీ ఉప్పు తింటున్నాం అనే సెంటిమెంట్ స్థిరపడిపోయింది. అలాగే ప్రచారం కూడా జరిగింది. దీనితో పాటు గ్యాస్ పథకం, ప్రధానమంత్రి గౌరవ నిధి, శౌచాలయాలు వంటి అనేక పథకాలు కలిసొచ్చాయి'' అని పూర్ణిమ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, EPA
6. హిందు-ముస్లిం అంశం
ఎన్నికల ప్రచారంలో హిందు, ముస్లిం అంశాన్ని చూపిస్తూ ఓట్లను చీల్చే ప్రయత్నాలు కూడా జరిగాయి.
''ఈ ఎన్నికల్లో హిందు-ముస్లిం అంశం అంతగా ప్రధానమైనదే కాదు. ఎందుకంటే ఇతర అంశాల ప్రాతిపదికగా ప్రజలను ఓట్లు అడగాలి. ఎలాగూ హిందువులు, ముస్లింలు కచ్చితంగా బీజేపీ లేదా సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేస్తారు. ముస్లిం ఓట్ల కారణంగానే ఎస్పీ ఓట్ల శాతం పెరిగింది'' అని దేశ్‌ముఖ్ అన్నారు.
కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మతం ప్రాతిపదికగా ఓట్లు చీల్చే వ్యూహంతో అఖిలేశ్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
''కానీ కేవలం బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతోనే ముస్లిం ఓటర్లు ఎస్పీకి ఓటు వేశారు'' అని దేశ్‌ముఖ్ చెప్పారు.
''బుల్డోజర్ బాబా అని యోగికి ఉన్న ఇమేజ్ వెనుక ఎలాంటి మతపరమైన అజెండా లేదు. కానీ మాఫియాకు వ్యతిరేకంగా ఆయన చేసే ప్రతీ ప్రచారంలో మతకోణం నిగూఢంగా ఉంటుంది'' అని ఆయన అన్నారు.
'' సమాజ్‌వాదీ పార్టీ ముస్లింలు, యాదవ్‌ల ఓట్లను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఈసారి కూడా కేవలం ముస్లిం ఓట్ల కారణంగానే వారి సీట్ల సంఖ్య పెరిగింది. బీఎస్పీ ఓట్ల సంఖ్య తగ్గడంతో బీజేపీ లాభపడింది. ఎస్పీకి ఎలాంటి లాభం చేకూరలేదు. 2024, 2027 ఎన్నికల్లో బీఎస్పీకి దక్కే జాటవ్ ఓట్లు కూడా బీజేపీ వైపుకే వెళ్లే అవకాశం ఉంది'' అని ప్రదీప్ సింగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రానున్న రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఈ విజయం అత్యంత కీలకం కానుందని రామ్‌దత్తా త్రిపాఠి అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...
- మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు ఎలా మొదలైంది
- యుక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి
- తెలంగాణ: 80,039 ఉద్యోగాల భర్తీకి నేడే నోటిఫికేషన్ - కేసీఆర్
- భారత్‌లో పెటర్నిటీ లీవ్ తీసుకునేవారు పెరుగుతున్నారా? పిల్లల పెంపకంలో తండ్రుల పాత్రను ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















