యుక్రెయిన్ యుద్ధం: రష్యాతో యుద్ధానికి రెడీ అవుతున్న యుక్రెయిన్ టీనేజర్లు

యుక్రెయిన్ విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ యువకులు మాక్సిమ్ లుత్సిక్(ఎడమ), దిమిత్రో కిసిలెంకో మూడు రోజుల శిక్షణ తర్వాత యుద్ధంలోకి అడుగుపెట్టారు.
    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, బీబీసీ న్యూస్, కీయెవ్

వారం కిందటే నేను ఒక యువకుల బృందాన్ని కలిశా. వాళ్లు యుక్రెయిన్ కోసం పోరాడడానికి కీయెవ్‌లోని ఒక కేంద్రంలో ఉన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు వారు స్వచ్ఛందంగానే ముందుకొచ్చారు.

వారిలో చాలా మంది టీనేజ్ దాటినవారు. చాలా కాలం కిందటే కాలేజ్ వదిలేసినవారు. మూడు రోజుల బేసిక్ ట్రైనింగ్ తర్వాత సరిహద్దులకు, లేదంటే ఆ సమీపానికి వెళ్తామని వాళ్లు నాతో చెప్పారు.

"నేను వారంలో ఒక సైనికుడుగా మారుతాననడంలో ఎలాంటి సందేహం లేదు. నేను మేనేజ్ చేయగలను" అని 19 ఏళ్ల బయాలజీ విద్యార్థి మాక్సిమ్ లుత్సిక్ నాకు చెప్పారు.

ఐదేళ్లు స్కౌట్స్‌లో ఉన్న అతడు చిన్న చిన్న నైపుణ్యాలతోపాటూ, కాస్త ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాడు.

2014లో యుక్రెయిన్ మాస్కో మద్దతున్న వేర్పాటువాదులతో యుద్ధం ప్రారంభించినప్పుడు అతడికి పదేళ్లు.

మాక్సిమ్ తన స్నేహితుడు, తనతో పాటు యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతున్న 18 ఏళ్ల దిమిత్రో కిసిలెంకో కలిసి సైన్యంలో చేరారు.

సైన్యంలో చేరుతున్నవారు ఇక తాము పిల్లలం కాదని అనుకున్నట్టు కనిపిస్తోంది. కొందరు తమలో ఉద్వేగాన్ని దాచుకోడానికి జోకులు చెప్పగానే అందరూ పగలబడి నవ్వుతున్నారు, లేదంటే కాస్త ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.

వారిలో కొందరు వేసుకున్న నీ పాడ్స్ మరీ చిన్నవిగా ఉన్నాయి. అవి వాళ్లకు 12 ఏళ్లున్నప్పుడు స్కేట్ బోర్డుతోపాటూ ఇచ్చిన పాడ్స్‌ అయ్యుంటాయి. వాళ్లు తమను ట్రైనింగ్ బేస్ దగ్గరకు తీసుకెళ్లే బస్సు కోసం బయట ఎదురుచూస్తున్నారు.

శిక్షణ కోసం తీసుకెళ్లే బస్సు కోసం వేచిచూస్తున్న మాక్సిమ్(ఎడమ చివర్లో) దిమిత్రో(మధ్యలో గ్రీన్ జాకెట్) మిగతా వలంటీర్లు

ఫొటో సోర్స్, JEREMY BOWEN/BBC

ఫొటో క్యాప్షన్, శిక్షణ కోసం తీసుకెళ్లే బస్సు కోసం వేచిచూస్తున్న మాక్సిమ్(ఎడమ చివర్లో) దిమిత్రో(మధ్యలో గ్రీన్ జాకెట్) మిగతా వలంటీర్లు

వాళ్ల చేతుల్లో ఉన్న తుపాకుల విషయం పక్కనపెడితే, వారంతా ఏదో పార్టీకి వెళ్తున్న స్నేహితుల బృందంలా కనిపిస్తున్నారు. వారిలో ప్రతి ఒక్కరికీ కలష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లు ఇచ్చారు.

నేను దిమిత్రో, మాస్కిమ్ మిగతా వలంటీర్లందరితో టచ్‌లోనే ఉన్నాను. ఈ వారాంతంలో నేను వారిని కలవడానికి నగరంలో తూర్పున ఉన్న వాళ్ల పోస్టుల దగ్గరకు వెళ్లాను. అక్కడ వాళ్లకు యూనిఫాం, బాడీ ఆర్మర్, సరిపోయే నీ పాడ్స్, హెల్మెట్లు ఇచ్చారు.

చెక్ పాయింట్ దగ్గర చిన్న అలికిడి అయినా ఆ వలంటీర్లు ఇసుక సంచులు, స్టీల్ టాంక్ ట్రాప్స్‌ వెనక్కు వెళ్తున్నారు. తమకు ఇచ్చిన బేసిక్ ట్రైనింగ్‌తోనే వీలైనంత గట్టిగా పోరాడాలనుకుంటున్నారు.

"నాకు తుపాకీ అలవాటైంది. ఎలా షూట్ చేయాలో, యుద్ధంలో దీనితో ఎలా పోరాడాలో నేర్చుకున్నా. రష్యన్లతో జరిగే యుద్ధంలో చాలా కీలకమైన వేరే విషయాలు కూడా ఉంటాయి" అంటూ వాటిని ఊహించలేక దిమిత్రీ నవ్వేశారు.

మాక్సిమ్ మాత్రం ఏదో అర్జెంట్ అన్నట్టు, చాలా సీరియస్‌గా కనిపించారు.

"నాకు ఇంతకు ముందుకంటే చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎందుకంటే, మాకు వ్యూహాలు, మార్షల్ ఆర్ట్స్, వ్యూహాత్మక వైద్యం, యుద్ధంలో ఏదైనా ఎలా చేయాలి అనేవాటి గురించి సరిపడా చెప్పారు. క్రెమ్లిన్ మీద యుక్రెయిన్ జెండా ఎగరడం మేం చూడాలనుకుంటున్నాం" అని నవ్వుతూ నాతో చెప్పారు.

ఇక్కడ అందరి మనసుల్లో ఈ యుద్ధం కీయెవ్ కోసం జరుగుతోందా అనే ఒకే ఒక్క ప్రశ్న ఉంది. కచ్చితంగా అది సాధ్యమేనని అంటున్నారు దిమిత్రో.

"మేం వాళ్లను ఇక్కడే అడ్డుకోవాలి, ఎందుకంటే వాళ్లు కీయెవ్‌ను చెజిక్కించుకుంటే, యుద్ధం ముగిసిపోవచ్చు" అన్నారు.

కీయెవ్‌ రోడ్ల మీద కాంక్రీట్ బ్లాకులను ట్యాంక్ ట్రాప్స్ లా ఉపయోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కీయెవ్‌ రోడ్ల మీద కాంక్రీట్ బ్లాకులను ట్యాంక్ ట్రాప్స్ లా ఉపయోగిస్తున్నారు.

'మీ అమ్మనాన్నలకు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా?' అని వాళ్లను అడిగాను.

"మా అమ్మ తనతోనే షెల్టర్‌లోనే ఉండి వంట చేసి పెట్టమని చెప్పారు. వాళ్లు కంగారు పడకూడదని నేను ఆర్మీలో చేరిన విషయం వాళ్లకు చెప్పలేదు" అని మాక్సిమ్ నవ్వుతూ చెప్పారు.

దిమిత్రో తల్లిదండ్రులకు తమ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసు. స్వచ్ఛందంగా పెట్రోల్ బాంబులు తయారు చేయడంతో దిమిత్రో ఇదంతా మొదలుపెట్టారు.

కొన్ని రోజుల తర్వాత వాళ్ల నాన్నకు ఫోన్ చేసి తాను టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సులో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. హీరో కావాలని మరీ ఎక్కువ ప్రయత్నించకు అని వాళ్ల నాన్న దిమిత్రీతో అన్నారు.

నేను ఇలా చేస్తున్నందుకు మా అమ్మనాన్నలు గర్వపడుతున్నారని దిమిత్రో సంతోషంగా చెప్పారు. ముందుముందు జరిగేది తలుచుకుంటే మీకు భయంగా అనిపిస్తోందా? అని నేను ఆయన్ను అడిగాను.

"పెద్దగా ఏం లేదు. కానీ, భయం అనేది మనిషికి సహజమే కదా. అంటే.. ఇది దేశం కోసమే అయినా చనిపోవాలని ఎవరూ కోరుకోరుగా. మనసులో లోలోపల కాస్త భయం ఉంది. అందుకే చనిపోవడం అనేది మాకు ఆప్షన్ కాదు" అని చెప్పారు.

దిమిత్రో, మాక్సిన్ తమ భవిష్యత్ కలల గురించి మాట్లాడారు. స్నేహితులతో సరదాలు, చదువు పూర్తి చేయడం, కెరీర్, చివరికి కుటుంబాల గురించి నాతో మాట్లాడారు.

మాక్సిమ్, దిమిత్రోతో మాట్లాడుతున్న జెరెమీ బోవెన్
ఫొటో క్యాప్షన్, మాక్సిమ్, దిమిత్రోతో మాట్లాడుతున్న జెరెమీ బోవెన్

యూరప్ యుద్ధాల్లో పోరాడాలని వెళ్లిన ఎన్నో తరాల యువకుల తల్లిదండ్రుల్లాగే, ఈ యువకుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు శక్తినివ్వాలని, ఈ యుద్ధంలో వాళ్లకు ఏం కాకూడదని ప్రార్థిస్తూ ఉంటారు.

వీరికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో సరిహద్దులకు అవతలివైపు ఉన్న రష్యా యువ సైనికులను కలిసే అవకాశం విదేశీ జర్నలిస్టులకు లేదు. వారిలో చాలా మందిని బలవంతంగా ఆర్మీలోకి తీసుకొచ్చారని భావిస్తున్నారు. వారి కోసం ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా వారికి సరిగా చెప్పలేదు. యుద్ధాల్లో ఎక్కువగా పోరాడేది యువకులే కదా.

దిమిత్రో, మాక్సిన్ లాగే.. చాలా మంది రష్యన్లకు కూడా ఈ యుద్ధంమీద ఎన్నో ఆశలు ఉంటాయనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ, ఒక్క తేడా వచ్చినా వారిలో పోరాడాలనే స్ఫూర్తి తగ్గిపోవచ్చు. అయినా, వారి వాదన ఏంటో సరిగా రిపోర్ట్ చేసే అవకాశం లేకుండా, దాని గురించి కచ్చితంగా చెప్పడం కష్టం.

సైనికులుగా మారిన ఆ ఇద్దరు యుక్రెయిన్ విద్యార్థులు తిరిగి చెక్ పాయింట్ దగ్గర తమ పనిలోకి వెళ్లారు. వారికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రొఫెషనల్ ఆర్మీ ఉంది. అది నేరుగా రష్యన్లతో పోరాడుతోంది.

వీడియో క్యాప్షన్, రష్యా సైన్యం ఊహించని షాక్ ఇచ్చిన యుక్రెయిన్.. యుద్ధ ట్యాంకులపై అనూహ్య దాడి

కానీ రష్యన్లు లోపలికి అడుగుపెడితే, మిగతా వలంటీర్లలాగే మాక్సిమ్, దిమిత్రో కూడా తమ కందకాల నుంచి కాల్పులు జరుపుతారు. చుట్టుపక్కల నేలను తవ్వడానికి సాయం చేస్తారు.

అక్కడే వారు తయారు చేసిన బాంబులు కూడా ఎదురుచూస్తున్నాయి. పాత సీసాల్లో పెట్రోల్, థర్మాకోల్ ముక్కలు నింపి, ట్యాంకులను కూడా తగలబెట్టాలనే ఆశతో దానికున్న గుడ్డ ముక్కకు మంట పెడతారు.

అవి సరిగా పనిచేయకపోతే, నాటో మిలిటరీ కూటమి మరింత అత్యాధునిక యాంటీ ట్యాంక్ ఆయుధాలను కుమ్మరిస్తుంది.

ఈ యుద్ధంలో కీలక పోరాటం కోసం ఇక్కడ కీయెవ్‌లో ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

యూనిఫాం ఉన్నా, లేకపోయినా సైనికులు, ప్రజలు, మాక్సిమ్, దిమిత్రో లాంటి ఎంతోమంది వలంటీర్లు రష్యన్లతో పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)