రష్యా - యుక్రెయిన్ యుద్దం: సోషల్ మీడియాలో రష్యాతో మరో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ యువత

యుక్రెయిన్
ఫొటో క్యాప్షన్, యుద్ధానికి ముందు కాట్రినా, సెలవులను ఎంజాయ్ చేస్తూ..
    • రచయిత, మరియానా స్ప్రింగ్
    • హోదా, డిస్ఇంఫర్మేషన్ స్పెషలిస్ట్

యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. మరోపక్క ఆ దేశం గురించి, యుద్ధం గురించి సోషల్ మీడియాలో గందరగోళం, తప్పుడు సమాచారం పేరుకుపోతోంది. దీనంతటినీ యుక్రెయిన్ యువత ఎలా తీసుకుంటోంది? ఈ యుద్ధం వారికి ఎలాంటి అనుభవాలను పంచుతోంది?

గత గురువారం కీయెవ్‌లో పేలుళ్ల శబ్దానికి నిద్ర లేచారు 24 ఏళ్ల కాట్రిన్. సోషల్ మీడియా తెరిచి చూస్తే, అంతటా ఆందోళన కలిగించే సమాచారమే.

"మొట్టమొదట మేం చేసిన పని, అన్నీ సర్దుకుని బేస్‌మెంట్‌కు వెళ్లిపోవడం. కిందకు వెళ్లిపోయాక నేను ఇన్‌స్టాగ్రామ్ తెరిచి చూడడం మొదలుపెట్టాను. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, పోస్టులన్నీ యుద్ధ సమాచారంతో నిండిపోయాయి" అని కాట్రిన్ బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతం ఆమె ఎల్వివ్ నగరానికి వెలువల ఉన్న తన స్వగ్రామంలో సురక్షితంగా ఉన్నారు. కాట్రిన్, ఆమె ప్రియుడు, ఇరుపొరుగు, వాళ్ల పెంపుడు కుక్కలు ఎలాగోలా కీవ్ నుంచి తప్పించుకుని ఈ గ్రామానికి చేరుకున్నారు.

సోషల్ మీడియాలో తన స్నేహితుల నుంచి కలవరపెట్టే సమాచారం, వాస్తవాలతో పాటు చాలా నకిలీ సమాచారం, తప్పుడు వార్తలు కూడా ఆమెకు కనిపించాయి.

ఈ యుద్ధం "నిజం కాదని", "అంతా బూటకమని" టిక్‌టాక్‌లో కామెంట్లు కనిపించాయి.

"ఆ అకౌంట్‌ను బ్లాక్ చేశాను. కానీ, మరో అకౌంట్‌తో ఆ వ్యక్తి ముందుకొచ్చారు. వేరే అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. నాతో రష్యన్‌లో మాట్లాడారు" అని కాట్రిన్ చెప్పారు.

సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ విపరీతంగా ఉన్నాయి. వీరంతా ఫేక్ ప్రొఫైల్స్‌తో యుక్రెయిన్‌లోని అమ్మాయిలతో మాటలు కలుపుతున్నారు.

వీడియో క్యాప్షన్, పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

టెలిగ్రామ్‌లో పుకార్లు

18 ఏళ్ల అలీనాకు కూడా ఇలాంటి పోస్టులు రష్యన్ భాషలో కనిపించాయి. జాపోరిజ్జియా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిపై బాంబు దాడి జరుగుతుందని, అన్నీ ధ్వంసమైపోతాయని రాసిన పోస్టులు చూసి ఆమె చాలా కంగారుపడ్డారు. కానీ, అవేవీ నిజం కాదు.

రాత్రిపూట వైమానిక దాడులు, షెల్టర్‌లో దాక్కోవడం, పేలుళ్లతో అలీనా బాగా విసిగిపోయారు. టెలిగ్రామ్‌లో విపరీతంగా వదంతులు వ్యాపిస్తున్నాయని, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆమె అన్నారు.

"రష్యన్లు ముఖ్యంగా మా చాట్‌లు వెతికి పట్టుకుని, ఎక్కడో ఏదో పేలుడు జరిగిందని రాస్తారు. ఫలానా ప్రాంతంలో పేలుడు జరిగే సూచన ఉందని రాస్తారు. మరి కొందరు అది అబద్దం అని రాస్తారు" అంటూ అలీనా వివరించారు.

అలీనాకు టెలిగ్రామ్‌లో ఒక వీడియో కనిపించింది. అందులో వాళ్ల ఊర్లోని ఎయిర్‌పోర్టులో పేలుడు సంభవించిందన్న వార్త ఉంది. కానీ, అది వాళ్ల ఊర్లో కాదు. పక్కనే ఉన్న మరియుపూల్‌లో జరిగిన పేలుళ్లు అవి.

పాత వీడియో ఫుటేజీలు కూడా ఇప్పుడు షేర్ అవుతున్నాయి. ఉదాహరణకు 2020లో బీరుట్‌లో జరిగిన పేలుళ్ల వీడియోలు. టిక్‌టాక్ సహా అన్ని సోషల్ మీడియాల్లో ఈ పాత వీడియోలు షేర్ అవుతూ, ప్రస్తుత యుద్ధానికి సంబంధించనవే అన్నట్లు చెలామణి అవుతున్నాయి. వాటన్నిటికీ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

యుక్రెయిన్‌కు చెందిన 20 ఏళ్ల మార్తా ప్రస్తుతం బ్రిటన్‌లో చిక్కుకుపోయారు. యుద్ధం మొదలైన సమయానికి ఆమె తన స్నేహితులను కలిసేందుకు బ్రిటన్ వెళ్లారు. సిరియా, ఇరాక్ వీడియోలు కూడా ఇప్పుడు చెలామణి అవుతున్నాయని ఆమె చెప్పారు.

"యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించినవే అంటూ పాత వీడియోలు పోస్టు చేస్తున్నారు" అని ఆమె అన్నారు.

టిక్‌టాక్‌లో వీడియోలు చూసి ఆమె చాలా భయపడ్డారు. కోపంతో రగిలిపోయారు. యుక్రెయిన్‌లో తన కుటుంబం, ఆత్మీయుల గురించి ఆందోళనపడ్డారు.

యుక్రెయిన్
ఫొటో క్యాప్షన్, అలీనా వాళ్ల ఊర్లో యుద్ధానికి సంబంధించిన నకిలీ వార్తల చాట్ స్క్రీన్‌షాట్లు

ట్రోల్స్‌తో పోరాటం

రష్యాకు మద్దతుగా పోస్టు చేస్తున్న కామెంట్లు, పోస్టులతో పోరాటం చేస్తున్నామని ఈ ముగ్గురు యువతులూ చెప్పారు.

"కొంతమంది వీడియోలు పోస్టు చేస్తూ, యుక్రెయినియన్లను అబద్ధాలకోరులని పిలవడం మొదలుపెట్టారు" అని మార్తా చెప్పారు.

ఈ యుద్ధానికి కారణం యుక్రెయినే అని కొంతమంది నిందించడం మొదలుపెట్టారు. "రష్యాని కీర్తిస్తూ" పోస్టులు పెట్టారు. ఈ యుద్ధం ఒక నాటకమని మరికొంతమంది ఆరోపించారు.

"ఆ అకౌంట్లను చూస్తే, వారికి ఫాలోవర్స్, లైక్స్ ఉండవు. రష్యా జెండా లేదా వేరే ఏదో ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటారు" అని మార్తా చెప్పారు.

ఆన్‌లైన్‌లో వేరే వాళ్ల ఫొటోలు ఎత్తుకొత్తి వాళ్ల ప్రొఫైల్‌లో పెట్టుకుంటారు. నిజం పేర్లు ఉండవు. ఈ అమ్మాయిలు బీబీసీతో షేర్ చేసిన అకౌంట్లన్నీ అలాంటివే.

కొత్తగా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎవరో షేర్ చేసిన వీడియోలను మళ్లీ షేర్ చేస్తుంటారు. అవన్నీ చూస్తే తాజాగా క్రియేట్ చేసిన ప్రొఫైల్స్ అని తెలిసిపోతుంది.

వాళ్ల అకౌంట్స్‌లో అన్నీ నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారమే ఉంటుంది. యుద్ధం జరగట్లేదని లేదా ప్రముఖ నటుడు గాయపడ్డాడని, పాత వీడియోలు తీసుకొచ్చి ప్రస్తుత యుద్ధం వీడియోలని చూపించడం.. వాళ్ల అకౌంట్ నిండా ఇవే ఉంటాయి.

టిక్‌టాక్‌లో కాట్రిన్ ఒక వ్యక్తితో వాదనకు దిగారు. ఆ ప్రొఫైల్ పిక్ పిన్‌టెరెస్ట్ నుంచి ఎత్తుకొచ్చిన కొరియన్ అమ్మాయి ఫొటో.

అలాంటప్పుడు ఈ అకౌంట్ల వెనుక ఉన్నవారెవరో కనుక్కోవడం చాలా కష్టం. ఇవి ఫేక్ అకౌంట్లు అవ్వొచ్చు. కాకపోవచ్చు కూడా. నకిలీ సమాచారాన్ని నిజమనుకుని నమ్మే వ్యక్తులు వీటిని మళ్లీ షేర్ చేస్తుండవచ్చు.

యుక్రెయిన్‌
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో గత వేసవిలో అలీనా

సోషల్ మీడియా పాలసీలు

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా సంస్థలనీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే.. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు. వీటిని నియంత్రించేందుకు కొత్త కొత్త విధానాలను అవలంబిస్తున్నాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంను సొంతం చేసుకున్న మెటా, ట్విట్టర్, గూగుల్ కూడా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన నకిలీ వార్తలను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించాయి.

కానీ, టెలిగ్రాం, టిక్‌టాక్ లాంటి యాప్‌లతోనే సమస్య. యుక్రెయిన్‌లో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వీటిల్లో నకిలీ సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది.

"నిబంధనలను ఉల్లంఘించిన కంటెంట్ తొలగించేందుకు, హింసను ప్రేరేపించేవి, హానికరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్న కంటెంట్‌ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని" టిక్‌టాక్ బీబీసీతో చెప్పింది.

బీబీసీ, టెలిగ్రాంను కూడా సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ, వారి నుంచి స్పందన లేదు.

ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాలు ప్రజల్లో మరింత భయాందోళనలను పెంచుతున్నాయని స్పష్టమవుతోంది.

"ఈ ఫేక్ సమాచారాన్ని సృష్టిస్తున్నవారంటే భయం వేస్తోంది" అని అలీనా అన్నారు.

వీడియో క్యాప్షన్, వార్తలు చూస్తూ ఆందోళన చెందుతున్నారా? అయితే ఇలా చేయండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)